జనతంత్రం
ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ శిబిరం రూపొందించిన ఒక పాట బాగా పాపులరయింది. ‘జెండలు జతకట్టడమే మీ ఎజెండా... జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. ‘నల్లగొండ గద్దర్’గా పేరు గాంచిన నర్సిరెడ్డి గొంతుక ఈ పాటకు ప్రాణం పోసింది. వైసీపీ అభిమానులకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి వేడుక జరిగినా ఈ పాటకు స్టెప్స్ వేయడం ఓ కార్యక్రమంగా మారింది. నాలుగు పార్టీలను కూడగట్టి అతుకుల బొంత అలయెన్స్‌లను కుట్టుకోవడం తప్ప ప్రజా సంబంధమైన ఎజెండా ప్రతిపక్షాలకు లేనేలేదని ఈ పాట ఎద్దేవా చేస్తుంది.
అదే సందర్భంలో ప్రజలకు అండదండగా నిలబడుతూ వారి ఆద రణను జగన్ చూరగొంటున్నారనేది ఈ పల్లవి భావన.ఈ అభిప్రాయాన్ని ప్రతిపక్ష శిబిరం కూడా నిర్ధారిస్తున్నది. తాడేపల్లిగూడెం సమీపాన మొన్న తెలుగుదేశం–జనసేన పార్టీలు ఉమ్మడిగా జరిపిన సభకు కూడా ‘జెండా’ అనే నామ కరణాన్నే కూటమి వారు ఎంపిక చేసుకున్నారు. ‘తెలుగు–జన విజయకేతన’ జెండా అనే పేరుతో వేదికను అలంకరించారు.
‘తెలుగు జన’ అనే రెండు పదాలు రెండు పార్టీ పేర్లకు గుర్తనేది కవి హృదయం. కేతనం అన్నా కూడా జెండా అనే అర్థం. మరి కేతన జెండా అంటే? నొక్కి చెప్పడం కావచ్చు. లేదా ఒకరిది కేతనం, ఒకరిది జెండా అని కావచ్చు. అర్థం ఏమైనప్పటికీ‘జెండాలు జతకట్టడమే మా ఎజెండా’ అని వారు కూడా నర్సిరెడ్డి పాటకు కోరస్ పాడినట్టు కనిపించింది. రెండు పార్టీల అగ్రనాయకులిద్దరూ ఒకరి జెండా కర్రను మరొకరు చేత పుచ్చుకొని అటూ ఇటూ ఊపుతూ కార్యక్రమాన్ని లయబద్ధం చేశారు. మూడో జెండాను కూడా ఊపడానికి చాలాకాలం ఎదురు చూశారు కానీ ఎందుకో బీజేపీ వాళ్లు కనికరించలేదు.
సభలో ప్రజలు కూర్చోవడానికి కేటాయించిన పదిహేను ఎకరాల్లోకి ఆరు లక్షలమందిని సమీకరిద్దామని సంకల్పం చెప్పుకున్నారు. పదిహేను ఎకరాల్లో ఆరు లక్షల మంది ఎలా కూర్చుంటారని ప్రశ్నించవద్దు. అగస్త్య మహాముని సప్త సముద్రాలను పుక్కిట పట్టలేదా? అలాంటి విద్యనే ప్రదర్శించి వుండేవాళ్లం, కానీ ఆర్టీసీ సహకరించనందు వల్ల అంతమంది రాలేదని సర్ది చెప్పుకున్నారు. టార్గెట్‌లో పదోవంతు మందిని సమీకరించగలిగినందుకు యెల్లో మీడియా ఆ పార్టీలను అభినందనల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పదోవంతు సీట్లు గెలిచినా కూడా యెల్లో మీడియా అభినందిస్తుందేమో చూడాలి.
జనసమీకరణ దృష్ట్యా చూస్తే ‘సిద్ధం’ సభలు గోదావరి ప్రవాహాలైతే ‘తెలుగు జన’ సభ పిల్లవాగులా తోచింది. ఎన్ని పిల్లవాగులైతే ఒక గోదావరి కావాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌జన సామాన్యంలో వైసీపీ ప్రభావాన్ని గోదావరితో పోల్చితేఈ రెండు పార్టీలను పిల్లవాగుతో పోల్చాలి. ఇది నేటి యథార్థ దృశ్యం.ఈ దృశ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి కష్టపడి సర్వేలు కూడా చేయనవసరం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటిస్తూ జనంతో ముచ్చటిస్తే చాలు నాడి తెలిసిపోతున్నది. పేద వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుక సమీకృతమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అయిదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వారి జీవితాలు స్పష్టమైన మార్పుకు లోనయ్యాయని ఈ ప్రాంత మేధావులు చెబుతున్నారు.
ఈ మార్పు పట్ల మధ్య తరగతి మేధావి వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి మార్పుకోసమే గదా... పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానావకాశాలు లభ్యం కావాలన్న ఆశ యంతోనే కదా... చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగిందీ, ఎన్నో విప్లవాలు చెలరేగిందీ! అటువంటి విప్లవం నిశ్శబ్దంగా ఇప్పుడు పేదవాడల్లోకి ప్రవేశిస్తున్నది. ఈ అద్భుతాన్ని కులమతాలకు అతీతంగా అభ్యుదయ కాముకులందరూ నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇందుకు కారణమైన జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఒక డజన్‌కు పైగా స్వతంత్ర సర్వేలు బయటకు వచ్చాయి. వాళ్లంతా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి శాంపిల్ సైజ్ పరిమితుల వల్ల జనంలో జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న మద్దతును పూర్తిగా అంచనా వేయలేకపోతున్నామనే అభిప్రాయం సర్వే సంస్థల్లో పని చేసే వారిలోనే ఉన్నది. వైసీపీకి పురుష ఓటర్లలో ఉన్న ఆధిక్యత కంటే మహిళా ఓటర్లలో ఎక్కువ ఆధిక్యత కనిపిస్తున్నది. ఇది అన్ని సర్వేల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. కానీ సర్వే సంస్థల శాంపిల్స్‌లో చాలావరకు పురుష ఓటర్లే ఎక్కువగా ఉంటున్నారు.
శాంపిల్స్ జనాభా ప్రాతిపదిక మీద, వర్గాల నిష్పత్తి ప్రకారం కచ్చితంగా లెక్కగట్టి తీసుకోగలిగితే వైసీపీకి ఉన్న ఆధిక్యతను సరిగ్గా అర్థం చేసు కోగలుగుతాము. ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సంస్థ తరఫున సర్వే పర్యవేక్షణకు వచ్చిన ఒక కీలక వ్యక్తి అంచనా ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, వైసీపీ ఓటు షేర్ 50 శాతానికి పైగానే ఉన్నది. వందకు పైగా నియోజక వర్గాల్లో 55 శాతంకంటే ఎక్కువ ఓటర్ల మద్దతు వైసీపీకి లభించే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లూ వైసీపీకే దక్కుతాయనీ, అసెంబ్లీ సీట్లు కూడా గతం కంటే ఒక్కటి కూడా తగ్గబోదనీ ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్య క్రమాలను ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితేనే పేదవర్గాల నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జనం నమ్ముతున్నారు కనుకనే క్షేత్ర స్థాయిలో వైసీపీ పటిష్ఠంగా ఉన్నది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. కిందటిసారి గెలిచినప్పుడు హామీలను అమలు చేయలేక మేనిఫెస్టోను మార్కెట్ నుంచి కనుమరుగు చేయడం కూడా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిపోలేదు.రెండు ప్రభుత్వాలనూ జనం బేరీజు వేసుకుంటున్నారు.
సహ జంగానే మార్కులు జగన్ ప్రభుత్వానికే పడుతున్నాయి. తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తు మీద కొండంత విశ్వాసాన్ని నింపుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగాఎందుకు ఓటేయాలని జనసామాన్యం ప్రశ్నిస్తున్నారు. ఇదిగో ఈ సింపుల్ లాజిక్ వచ్చే ఎన్నికల్లో మరో సునామీని సృష్టించ బోతున్నది.జనం గుండెల్లో గుడి కట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదు. ఆయనకో జీవితకాలం ఆలస్యమైపోయింది. అందుకే జెండాలు జతకట్టుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం మీద అపోహలు సృష్టించడానికి, దుమ్మెత్తిపోయడానికి రక రకాల కుట్రలకు తెరతీస్తున్నారు. యెల్లో మీడియా ప్రాపగాండా సరిపోవడం లేదని సరికొత్త ప్యాకేజీ స్టార్లను ప్రయోగిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు కనిపించిన ప్రతి గడ్డిపోచ మీద కూడా ఆశ పెట్టుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి సరిగ్గా అదే! జగన్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వివిధ టాస్క్‌లను తెలుగుదేశం డిజైన్ చేసింది. ఒక్కో టాస్క్‌కు ఒక్కో ప్యాకేజి స్టార్. వాళ్లందరికీ వెలకట్టాలి. ఎన్నికల్లో వెదజల్లాలి.
అందుకు డబ్బు కావాలి. సొంత ముల్లెను విప్పడానికి ఇంట్లో వాళ్లు చస్తే ఒప్పుకోరు.అందుకని పెత్తందారీ మనస్తత్వం కలిగిన డబ్బున్న వారి మీద వలలు విసిరారు. బాబు గెలిస్తే ఇష్టారాజ్యంగా దండు కోవచ్చన్న కక్కుర్తితో చాలామంది రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, అధిక వడ్డీల పేరుతో 650 కోట్లు సేకరించి ఎన్నికల గమ్యస్థానాలకు చేర్చారని వినిపించింది. గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తాడని భావిస్తున్న ఒకాయన 800 కోట్లను ఇప్పటికే సిద్ధం చేశాడట. వాటిని గమ్యస్థానాలకు చేర్చడమెట్లా అని మల్లగుల్లాలు పడు తున్నట్టు సమాచారం. ఇటువంటి పెత్తందార్లు గెలిస్తే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే!
పవన్ కల్యాణ్‌కు వైసీపీ వాళ్లు ‘ప్యాకేజి స్టార్’ అనే టైటిల్‌ను తగిలించారు. ఈ మాట అన్నందుకు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఒక సభలోనైతే ఈ ఆరోపణపై పాదరక్షలను సంధించారు. కానీ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కని పిస్తున్నది. మొన్నటి తెలుగు – జనసభలోనైతే తనను తాను అవమానించుకొని, తన పార్టీనీ తానే అవమానించి చంద్ర బాబుకు జైకొట్టారు. ఈ విపరీత ప్రవర్తనకు జనసైనికులే విస్తుపోతున్నారు. తాను స్వతంత్రంగా నిలబడి తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగుదేశంతో బేరమాడి ఉంటే పవన్ కల్యాణ్ తనపై పడ్డ మచ్చను తొలగించుకోగలిగి ఉండే వాడు. కానీ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడు. ఇంకో సారి ఆరోపణలపై విరుచుకుపడే నైతిక బలాన్ని ఆయన కోల్పోయాడు.
తెలంగాణ తన మెట్టినిల్లనీ, కర్మభూమనీ నమ్మబలికిన షర్మిల హఠాత్తుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రాయబారం నడిపిందెవరు? షర్మిల పర్యటనల కోసం విమాన సౌకర్యాల కల్పన వెనుకనున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? వైఎస్ జగన్ వ్యతిరేక శక్తులతో ఆమెకు సమన్వయాన్ని ఏర్పాటుచేసిన వారెవరు? ఆమె ఉపన్యాసాల్లో చెప్పవలసిన అంశాలను, జగన్‌పై చేయాల్సిన ఆరోపణలను అందిస్తున్నదెవరు? ఆమె సభలకు కమ్యూనిస్టు నాయకులను కూడా జతచేసి పంపిస్తున్న వారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లాడికి కూడా తెలుసు!
చంద్రబాబు విజయావకాశాలు రోజురోజుకూ కొడిగట్టి పోతున్న స్థితిలో ఇప్పుడు నర్రెడ్డి సునీత ముసుగును తొలగించారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తూ చంద్ర బాబు మహానుభావుడని ఆమె సర్టిఫికేట్ ఇచ్చేశారు. గతంలో తన తండ్రి హత్యకు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలే కారణ మని చెప్పిన సునీత ఇలా ‘చంద్ర’ముఖిలా ఎందుకు మారి పోయారు. తన తండ్రికి రెండో వివాహం ద్వారా కలిగిన కుమా రునికి ఆస్తిలో హక్కు దక్కకుండా చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వివేకా రక్తపు మడుగులో ఉన్న ఫోటోలను పీఏ కృష్ణారెడ్డి పంపించింది సునీత దంపతులకే గదా! అయినా గుండెపోటు థియరీని ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి ఎందుకు ప్రచారంలో పెట్టినట్టు? హత్య సమ యంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆమె భర్తకూ, ఆయన సోదరుడికీ సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు.
అప్పుడు చూపుడు వేలు ఎటువైపు చూపెడుతుంది? హంతకులు వివేకాతో లేఖ రాయించిన విషయాన్నిగోప్యంగా ఉంచాలని సునీత ఎందుకు ఆదేశించినట్టు? హత్య తరువాత హంతకులు వివేకా రెండో భార్యకు రాసిన ఆస్తి పత్రాలను తస్కరించే అవకాశం ఎవరికి ఉన్నది? అసలు దోషులను రక్షించి పరులపై నింద వేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వారి అవసరంతో రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉన్న పెద్దమనిషి ఎవరు? ఇప్పుడు సునీతను ‘చంద్ర’ ముఖిగా మార్చి చిలక పలుకులు చెప్పిస్తున్న నాయకుడెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేసి ప్రభు త్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించిన హనుమ విహారి వెనుక కూడా ప్యాకేజీ ట్రాప్ ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెంతమంది ప్యాకేజీ స్టార్స్ రంగంలోకి వస్తారో చూడాలి. ప్యాకేజీ దండగే తప్ప ఇటువంటి ప్రయోగాలకు విలువ ఉంటుందా? పండగ లప్పుడు వచ్చిపోయే పిట్టల దొరల ప్రగల్భాలకు జనం నవ్వు కుంటారు తప్ప సీరియస్‌గా తీసుకుంటారా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment