పాకిస్తాన్ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం చేసుకున్న విమర్శలు, ఆరోపణలు ఆ దేశంలో మాత్రమే కాదు... మన దేశంలో కూడా వాగ్యుద్ధానికి దారితీశాయి. ఇదేమీ కొత్తగాదు. తమ పాలకుల్ని విమర్శించాలంటే రెండు దేశాల్లోనూ విపక్షాలకు దొరికే మొదటి ఆయుధం పొరుగు దేశమే. అవతలి దేశం ముందు మోకరిల్లారని పాలకులపై ఆరోపణ చేస్తే రాజ కీయంగా వారిని దెబ్బతీసినట్టవుతుందని విపక్షాలు అనుకుంటాయి. విపక్షాలను అవతలి దేశానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తే, వారికి రాజకీయంగా పుట్టగతులుండవని పాలకపక్షం విశ్వసి స్తుంది. తాజాగా మొన్న బుధవారం జాతీయ అసెంబ్లీలో విపక్ష పీఎంఎల్(ఎన్) నాయకుడు ఆయాజ్ సాదిక్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ క్రమంలో ఆయన పాక్ సైన్యానికి బందీగా పట్టుబడిన మన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఉదం తాన్ని కూడా ప్రస్తావించారు. నిరుడు ఫిబ్రవరిలో పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 43మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉదంతం తర్వాత భారత్ విమానాలు చేసిన దాడులతో పాక్ పాలకులు, సైనిక దళాల చీఫ్ వణికారని సాదిక్ విమర్శించారు.
అభినందన్ బందీగా చిక్కితే, ఆయన్ను భారత్‌కు అప్పగించేవరకూ పాలకులకు నిద్రపట్టలేదని అన్నారు. ఆరోజు విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ అఖిలపక్ష సమావేశం పెట్టి అభినందన్‌ను వెంటనే విడుదల చేయకుంటే ఆ రాత్రికి భారత్ మనపై దాడి చేసే ప్రమాదమున్నదని చెప్పారని వెల్లడించారు. ఆ భేటీకి రావాల్సిన ఇమ్రాన్ మొహం చాటేయగా, వచ్చిన విదేశాంగమంత్రి వదిలేద్దామంటూ బేరం పెట్టారని, ఇక ఆర్మీ చీఫ్ కమార్ జావేద్ బజ్వాకైతే కాళ్లు వణుకుతూనే వున్నాయని ఆయాజ్ ఎద్దేవా చేశారు. సాదిక్ చేసిన ఈ దాడితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ సర్కారు సీనియర్ మంత్రి ఫవాద్ చౌధరిని రంగంలోకి దించింది. ఆయన గురువారం జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఘనత ఎలాంటిదో ఏకరువు పెట్టారు. ‘పుల్వామాలోకి ప్రవేశించి మరీ మనం భారత్‌పై దాడి చేశామ’ని చెప్పారు. పుల్వామా విజయం ఈ దేశ విజయమని ఫవాద్ చెప్పుకొచ్చారు. సహ ఎంపీలే ఇందుకు అభ్యంతరం చెప్పడంతో ఆయన వెంటనే స్వరం మార్చి, పుల్వామా దాడి అనంతరం పాక్ సైన్యం భారత్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేశాయని సవరించుకున్నారు. అయితే పుల్వామాలో విజయం సాధించా మన్న వ్యాఖ్యను వెనక్కి తీసుకోలేదు. పైగా అఖిలపక్ష సమావేశంలో జరిగినదాన్ని వెల్లడించి సాదిక్ జాతిని అవమానించారంటూ చెప్పారు.
ఇప్పుడు ఎవరేమి చెప్పుకుంటున్నా పుల్వామా ఉగ్ర దాడి పాక్ పనేనని అప్పట్లోనే మన దేశం స్పష్టంగా ప్రకటించింది. జైషే మొహమ్మద్ పాక్ సైన్యం ప్రాపకంతో పనిచేస్తున్న సంగతి అంతర్జాతీ యంగా అందరికీ తెలుసు. దాని అధిపతి మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి నిరుడు ఉగ్రవాదిగా ప్రకటించింది. కనుక పుల్వామా దాడి తమ పనే అని ఫవాద్ చెప్పడం ద్వారా కొత్తగా ఆయన వెల్లడిం చిందేమీ లేదు. దాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించారంతే. సాదిక్ మాటలతో జాతికి అవ మానం జరిగిందని ఫవాద్ అనడం సిగ్గు చేటు. అంతకన్నా పొరుగు దేశంపై ఉగ్రవాద దాడి ఘటన తమ ఘనతగా చెప్పడమే జాతికి అవమానకరమైనది. దేశాల మధ్య విభేదాలొచ్చినప్పుడు దౌత్య పరంగా చర్చించుకోవడం ఏ దేశమైనా చేయాల్సిన పని. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో వుంటే ఎంతటి క్లిష్ట సమస్య అయినా పరిష్కారమవుతుంది. యుద్ధం సరేసరి. కానీ దొంగచాటుగా ఒక కిరాయి మనిషిని ప్రవేశపెట్టి ఆత్మాహుతి దాడి చేయించి, అదేదో ఘనకార్యంగా చెప్పుకోవడం వల్ల ఒరిగేదే మిటి? నిజంగా అది ఘనకార్యమనుకుంటే అప్పుడే ఆ మాట ప్రపంచానికి ధైర్యంగా వెల్లడించ వలసింది. పర్యవసానాలకు సిద్ధపడవలసింది. పుల్వామా దాడికి తెగించినవారు అఖిలపక్ష సమా వేశం సమయానికి ఎందుకంత నీరుగారి పోయారు? ఎందుకా ముచ్చెమటలు?
దేశంలో ఇమ్రాన్ సర్కార్ అన్నివిధాలా విఫలమై, విపక్షాలు బలపడుతున్నాయి. ఉపాధి లేమి, అధిక ధరలు, అవినీతి తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమవుతున్న తీరుతో జనంలో అసంతృప్తి పెరిగింది. ఇటీవల విపక్షాలు పెట్టిన సభ విజయవంతం కావడం ఇందుకు తార్కాణం. వీటికితోడు భారత్ దాడి చేస్తుందని పాలకులు వణికారని పీఎంఎల్(ఎన్) వెల్లడించడంతో ఏదోరకంగా తమ గొప్పతనాన్ని చాటుకునే క్రమంలో పుల్వామా దాడిపై ఫవాద్ నిజం చెప్పివుండొచ్చు. ఉగ్రవాదులకు నిధులందించే అనుమానిత దేశాల జాబితానుంచి పాక్‌ను తొలగించడానికి రెండురోజులక్రితమే 39మంది సభ్యుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) నిరాకరించింది. ఉగ్రవాదులకు తోడ్పడుతున్నదని నిర్ధారణైతే ఆ సంస్థ పాక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం వుంది. అదే జరిగితే ఆర్థికంగా పాకిస్తాన్ మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసివుంటుంది. స్వయంగా మంత్రే పుల్వా మాలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు గనుక మున్ముందు ఎఫ్‌ఏటీఎఫ్ ఏం చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment