నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)లో ఎప్పటిలాగే తుపాకులు గర్జించాయి. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ శనివారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించాక మన సైన్యం అటువైపున్న నాలుగు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, దాదాపు 20మంది ఉగ్రవాదులను, 10మంది పాక్ సైనికులను మట్టుబెట్టిందని సైనిక దళాల ప్రధానాధికారి బీపీ రావత్ ప్రకటించారు. ఆగస్టు 5న జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, 370వ అధికరణను రద్దు చేశాక పాకిస్తాన్ వైపు నుంచి తీవ్ర పదజాలంతో ప్రకటనలు వెలువడటం అందరూ చూస్తున్నదే. వీటికితోడు గత నెలాఖరున ఐక్యరాజ్యసమితి వేదికపై నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన మరింత తీవ్రంగా ఉంది. కశ్మీర్‌లో నెత్తురుటేర్లు పారతా యంటూ ఆయన హెచ్చరించారు. అప్పటినుంచీ సరిహద్దుల్లో మన సైన్యం మరింత అప్రమ త్తంగా ఉంటున్నది. ఉగ్రవాదులను ప్రవేశపెట్టి భారీయెత్తున విధ్వంసం సృష్టించాలని పాక్ పథక రచన చేస్తున్నట్టు ఈమధ్యకాలంలో తరచుగా కథనాలు వెలువడుతున్నాయి. చివరకు శనివారం నాటి ఘటన ఆ కథనాల్లో నిజం ఉన్నదని రుజువు చేసింది.
2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందన్న మాటేగానీ ఎల్‌ఓసీ ఎప్పుడూ ప్రశాం తంగా లేదు. ఆ ప్రాంతంలో ఘర్షణలను క్రమేపీ పెంచి ఇరు దేశాల మధ్యా దాన్నొక ప్రధాన సమస్యగా మార్చి రాజకీయంగా లేదా సైనికంగా లాభపడదామన్న పాక్ ఉద్దేశం తరచు కనబడుతూనే ఉంది. 2016 డిసెంబర్ వరకూ కనీసం రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదార్లు మాట్లాడుకున్న సందర్భాలైనా ఉన్నాయి. బ్యాంకాక్‌లో ఆ ఏడాది డిసెంబర్‌లో వారిద్దరూ ఆఖరు సారి మాట్లాడుకున్నారు. అటుతర్వాత 2018 జనవరిలో కూడా ఇద్దరి సమావేశం జరిగిందన్న కథనాలొచ్చినా మన దేశం ఖండించింది. ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్ల (డీజీఎంఓ)మధ్య చర్చలు అంతకు మూడేళ్లక్రితమే ఆగిపోయాయి. వీటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనంతరకాలంలో జరిగిన ఉదంతాలను చూస్తే అర్ధమవుతుంది. 2016లో 228 కాల్పుల విరమణ ఉదంతాలు చోటుచేసుకుంటే ఆ మరుసటి ఏడాది అవి 860కి పెరిగాయి. ఆ ఏడాది ఎన్నడూలేనంత స్థాయిలో నెత్తురోడింది. మన సైన్యం 138మంది పాక్ సైనికుల్ని కాల్చిచంపగా, పాక్ కాల్పుల్లో మన సైనికులు 28మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుడు మొత్తం 1,629 ఉదంతాలు జరగ్గా...ఈ ఏడాది ఇంతవరకూ అవి 2,318కి చేరాయి.
ఇరుగుపొరుగు దేశాల మధ్య సమస్యలున్నప్పుడు సరిహద్దులు ప్రశాంతంగా ఉండవు. కనుకనే రెండు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది జరిగాక తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండా చూసుకుందామని పాకిస్తాన్ ఎప్పుడూ అనుకోలేదు. పైపెచ్చు దాన్ని అడ్డుపెట్టుకుని ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటిద్దామని ఎప్పటికప్పుడు అది ప్రయత్నిస్తూనే ఉంది. మన సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు గత మూడేళ్లుగా జరిపిన దాడులన్నీ పాక్ సైన్యం వారిని సరిహద్దులు దాటించిన పర్యవసానమే. 2016 జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిపి ఏడుగురు భద్రతా సిబ్బందిని బలి తీసుకోవడం, అదే ఏడాది ఉడి సైనిక స్థావరంపై దాడి చేసి 18మంది జవాన్ల ప్రాణాలు తీయడం, ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిపి 40 జవాన్లను పొట్టనబెట్టుకోవడం వంటి ఉగ్రవాద ఘటన లన్నీ పాక్ సైన్యం అండదండలతో సాగినవే.
గత నెలలో మొత్తం 28మంది ఉగ్రవాదుల్ని మన దేశంలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించగా 16మందిని నిలువరించగలిగామని, 12మంది మాత్రం సరిహద్దులు దాటారని ఈ నెల మొదట్లో నిఘా విభాగం ప్రకటించింది. అంతర్జాతీయ వేదికపై నుంచి కశ్మీర్‌లో నెత్తురుటేర్లు పారతాయని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలోని అంతరార్థాన్ని మన దేశం సులభంగానే గ్రహించగలిగింది. సరిహద్దుల్లో అప్రమత్తతను మరింత పెంచింది. ఈ ఉల్లంఘనల సమయంలో పాక్ సైనికులు తరచుగా పౌర ప్రాంతాలపై కూడా గురిపెడుతున్నారు. గత నెల 14న పాక్ సైన్యం బాలాకోట్, సందోత్ సెక్టార్లలో పాఠశాలలపై తుపాకులు ఎక్కు పెట్టడం వల్ల విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఈ నెల 1న ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు మాట్లాడుకున్నప్పుడు ఈ ఉదంతాన్ని మన దేశం ప్రత్యేకించి ప్రస్తావించింది.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకూ, ఉగ్రవాదుల చొరబాటుకూ మధ్య సంబం ధమేమిటో ఈ ఘటనలన్నీ వెల్లడిస్తున్నాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఘర్షణలు అధీన రేఖకే పరిమితమవుతాయని చెప్పలేం. తాజా ఉదంతమే అందుకు ఉదాహరణ. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగానే మన సైనికులు కేవలం వాటికి జవాబివ్వడంతో సరిపెట్టలేదు. పాక్ సైనిక పోస్టులపై దాడి చేయడమే కాదు... ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న మూడు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయడంతోపాటు, మరో ఉగ్ర శిబిరాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కనుక తన ప్రయత్నాల్లోని నిరర్థకతను మాత్రమే కాదు... పర్యవసానాల తీవ్రతను పాక్ గుర్తించడం అవసరం. ఒకపక్క ఉగ్ర వాదులకు ఆర్థికంగా అండదండలందిస్తున్నందుకు పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా చీవాట్లు పడు తున్నాయి. ఈ ధోరణి మార్చుకోనట్టయితే పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెడతామని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ రెండు నెలల క్రితమే పాక్‌ను హెచ్చరించింది. మొన్నీమధ్యే జరిగిన సమా వేశంలో పాకిస్తాన్‌కు మరో నాలుగు నెలలు...అంటే వచ్చే ఫిబ్రవరి వరకూ గడువు విధించాలని నిర్ణయించింది. మొత్తం 27 అంశాల్లో సరిదిద్దుకోవాలని సూచించగా కేవలం అయిదింట్లో మాత్రమే పాక్ చర్యలు తీసుకుందని తెలిపింది. ధోరణి మారనట్లయితే మరికొన్నాళ్లకైనా అంత ర్జాతీయంగా తాను ఏకాకి కాక తప్పదని పాకిస్తాన్ ఇప్పటికైనా గ్రహిస్తే మేలు.
Comments
Please login to add a commentAdd a comment