‘రాశి చక్రగతులలో/ రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో/ప్రభవం పొందిన’ మానవాళి తన జైత్రయాత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన క్షణాలను నమోదు చేసుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతోపాటు యూరప్, కెనడా అంతరిక్ష సంస్థలు అహరహం శ్రమించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను మొన్న సోమవారం అనుకున్న సమయానికి, అనుకున్న రీతిలో, నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా వేలాదిమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సమష్టిగా కృషి చేసి సాధించిన అద్భుత విజయమిది. గత నెల 25న క్రిస్మస్‌నాడు అంతరిక్ష యాత్ర ప్రారంభించి, 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ టెలిస్కోప్ కోసం ప్రయోగించిన అంతరిక్ష నౌకకు వేయి కోట్ల డాలర్లు (సమారు రూ. 75,000 కోట్లు) వెచ్చించారు. అంతరిక్షంలో మరెక్కడయినా భూమిని పోలిన గ్రహాలున్నాయా... అక్కడ జీవరాశి ఉనికి ఉన్నదా అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాన్ని చిరకాలంగా వేధిస్తున్నాయి. మన దేశంతోపాటు చైనా, గ్రీస్, రోమ్, మధ్యప్రాచ్య అరబ్ దేశాల్లో అంతరిక్షాన్ని పరిశీలించడం, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం చరిత్రలో నమోదయ్యాయి.
సాధారణ దృష్టికి తారసపడని అంతరిక్ష వింతలూ విశేషాలూ ఇతరేతర పరికరాల సాయంతో తెలుసుకోవచ్చునన్న ఆశ టెలిస్కోప్‌లతో మొదలుపెట్టి రేడియో టెలిస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, గామా టెలిస్కోప్ తదితరాల ఆవిష్కరణలకు దారితీస్తే... ఇవి విశ్వంలో నిరంతరం ప్రసారమయ్యే అనేక రకాల తరంగాలను పసిగట్టి వాటి ఆధారంగా ఎక్కడెక్కడ ఏముందో, విశ్వంలో ఏం జరుగుతున్నదో గ్రహించడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేక విధాల ప్రత్యేకతలున్నది.
సుదూర తీరాల్లో మరెన్ని పాలపుంతలు దాగున్నాయో అన్వేషించటానికీ, మన సౌర కుటుంబానికి ఆవల గ్రహాల ఆచూకీ రాబట్టడానికీ, ఇప్పుడు విశ్వంలో ఆవరించి ఉన్న నక్షత్ర ధూళిలో భవిష్యత్తు నక్షత్రాలుగా రూపుదిద్దుకోగల అవకాశమున్నవి ఉన్నాయో లేదో తెలుసు కోవడానికీ అవసరమైన సమాచారాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎప్పటికప్పుడు భూమికి చేరేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే విశ్వం పుట్టకకు దారితీసిన పరిస్థితులేమిటో నిర్ధారణగా చెప్పడం సాధ్యమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.
విశ్వాంతరాళంలో ఇప్పుడు తిరుగాడే రకరకాల టెలిస్కోప్‌లకు ప్రధాన సమస్య సూర్యకాంతి. సూర్యుడికి అటువైపు ఏముందో చూడటానికి ఆ కాంతి ప్రధాన ఆటంకం. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతాలు అయిదున్నాయని, అక్కడికి టెలి స్కోప్‌లను చేరేస్తే తక్కువ ఇంధన వినియోగంతో దీర్ఘకాలం పని చేయించడం సులభమవుతుందని ఎన్నడో 1772 లోనే ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ, గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ కనుక్కున్నాడు. ఆ అయిదు ప్రాంతాలనూ ఆయన పేరిటే ఎల్1, ఎల్2 వగైరాలుగా పిలుస్తున్నారు. వాటిలో ఎల్2 అనేకవిధాల ప్రయోజనకరమని మూడు దశాబ్దాలక్రితం నిర్ణయించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు కాంతులు పెద్దగా విరజిమ్మని ప్రాంతమది. ఆ దట్టమైన చీకటి ప్రాంతానికి అంతరిక్ష నౌకను పంపగలిగితే అనేక ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు.
అయితే అక్కడ గురత్వాకర్షణ శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదొక పెద్ద అవరోధం. అలాంటి చోటకు సకల హంగులతో ఉన్న టెలిస్కోప్‌ను పంపడం శక్తికి మించిన పని అని కొన్నాళ్లకే అర్థమైంది. ఎందుకంటే అక్కడుండే మైనస్ 233 డిగ్రీల ఉష్ణోగ్రతలో అందులోని పరికరాలను పనిచేయించడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరకు అనేక రకాల ప్రయోగాల తర్వాత అత్యంత శీతల ప్రదేశంలో పనిచేసే పరికరాల తయారీ ఒక కొలిక్కి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే, వాటన్నిటినీ అమర్చిన టెలిస్కోప్‌ను సురక్షితంగా ఎల్ 2 వద్దకు చేరేయడం మరో పెద్ద విన్యాసం.
దాదాపు 350 రకాల ప్రక్రియలు పరస్పరం అనుసంధానించుకుంటూ సాగవలసిన ఈ ప్రయోగం విషయంలో చివరిదాకా శాస్త్రవేత్తలకు భయాందోళనలున్నాయి. మనిషి అంచనాకు అందని ఊహించని చిన్న లోపం చోటు చేసుకున్నా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోగం, మూడు దశాబ్దాల కాలం వృధా అవుతాయి. కానీ అంతా అనుకున్నట్టే పూర్తయింది. అది ఎల్2 కక్ష్యలోనే తిరుగాడటానికీ, ఎటూ జారిపోకుండా చూడటానికీ మూడు వారాలకొకసారి చిన్న చిన్న సర్దుబాట్లు చేయాల్సివస్తుంది. అంతా సవ్యంగా పూర్తయితే విశ్వరహః పేటిక తెరుచుకుని, విశ్వాంతరాళంపై మన అవగాహన కొన్ని వేల రెట్లు పెరుగుతుంది.
మనిషి రోదసిలోకి ప్రవేశించి, రకరకాల అంతరిక్ష నౌకలను ప్రవేశపెట్టి ఆరు దశాబ్దాలు దాటుతోంది. అలా చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి అపురూపమైన, సంక్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేయగలగడం ఖగోళ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో, నిరంతర అంతరిక్ష అన్వేషణలో కీలకమైన మలుపు. ఈ ప్రయోగం మున్ముందు మరిన్ని అరుదైన అద్భుతాలను ఆవిష్కరించగలదనీ, ఈ విశ్వానికి సంబంధించి మన విజ్ఞానాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనీ నిస్సం దేహంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, భిన్న రంగాలకు చెందిన నిపుణులు ప్రశంసనీయులు.
Comments
Please login to add a commentAdd a comment