ఇది భగత్ సింగ్ బలిదానం చేసిన మాసం. తమకు కంటి నిండా కునుకు లేకుండా చేసినందుకు కక్ష బూని 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈ వీరుణ్ణి పరాయి పాలకులు చిదిమేశారు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ జైల్లో గడిపినప్పుడు దేశంలో సాగుతున్న మత ఘర్షణల సంగతి విని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరూ స్మరించుకోదగ్గవి. ‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అని ఆయన అన్నాడు. మన ఇల్లు, మన చదువు మనకు వివేకం నేర్పించలేనప్పుడు కనీసం భగత్ సింగ్ వంటి నిష్కళంక దేశభక్తుల పలుకులైనా స్ఫురణకు రావాలి.
కానీ ఇతరత్రా రోజుల మాట అటుంచి ఆయన బలిదానం చేసిన మాసంలోనైనా కొందరికి యుక్తాయుక్త విచక్షణ ఉండటం లేదని కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో ఆలయ పరిసరాల్లో అన్య మతస్తుల దుకాణాలుండటానికి వీల్లేదని హిందూత్వ సంఘాలు వీరంగం వేస్తుంటే... కేరళలో ఒక దేవస్థానం బోర్డు హైందవేతర మహిళన్న కారణంతో ఒక భరతనాట్య కళాకారిణి ప్రదర్శనను అడ్డుకుంది.
దుకాణదారులను మతం ప్రాతిపదికన దూరంపెట్టే పోకడల్లో తాము జోక్యం చేసుకోలేమని సాక్షాత్తూ ప్రభుత్వమే కర్ణాటక అసెంబ్లీలో భగత్‌సింగ్ వర్ధంతి రోజున ప్రకటించింది. ఆ మర్నాటినుంచి హిందూత్వ సంస్థలు మరింతగా రెచ్చిపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మొదలైన ఈ తంతు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ సర్కారుంది. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. కానీ మత వివక్ష మాత్రం అక్కడ రాజ్య మేలుతోంది! ఈ దేశ చరిత్ర తిరగేస్తే తమ తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ సాధారణ పౌరు లంతా సామరస్యంతో, సుహృద్భావంతో మెలగడం కనబడుతుంది.
ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొనడం, ఊరేగింపులు, ఉత్సవాల్లో భాగస్తులు కావడం దర్శనమిస్తుంది. ఈ ఆచరణలో నుంచే మన రాజ్యాంగంలోని సెక్యులర్ భావనలు మొగ్గతొడిగాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలోని సభ్యుల్లో అత్యధికులు అన్ని ఒత్తిళ్లనూ అధిగమించి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ రాజకీయ పక్షాల నాయకులు, పాలకుల్లో కొందరు దీనికి తూట్లు పొడిచే దురాలోచన చేస్తున్నారు. అన్య మతస్తులపై లేనిపోని నిందలు మోపి, పరమత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను విడదీసి తమ అధికారం శాశ్వతం చేసుకోవాలని కలగంటున్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామం.
కర్ణాటకలో హిజాబ్ వివాదం రేపి నెల్నాళ్లు దాటింది. ఆ వివాదం పర్యవసానంగా వేలాదిమంది ముస్లిం బాలికల చదువులు ఆగిపోయాయి. వార్షిక పరీక్షలు రాద్దామనుకునే సమయానికి ఈ అనవసర వివాదాన్ని సృష్టించడం వల్ల వారికి ఏడాది చదువూ వృధా అయింది. తమ చర్యలు బేటీ పఢావో, బేటీ బచావో స్ఫూర్తికి విరుద్ధమైనవని కూడా అక్కడి పాలకులకు తోచలేదు. ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఇప్పుడు చిరు వ్యాపారులను మత ప్రాతిపదికన వేరు చేసి కొందరికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. కర్ణాటకలో మార్చి మొదలుకొని మే నెల వరకూ వివిధ ఆలయాల్లో జాతరలు జరుగుతాయి. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు.
అలాంటి సమ యాల్లో వివిధ రకాల వస్తువులు అమ్మి లాభపడదామని ఎవరైనా ఆశిస్తారు. కానీ చాలా ఆలయాలు ముస్లిం దుకాణదారులకు డిపాజిట్లు వెనక్కిస్తున్నాయి. హిందూత్వ సంస్థల ఒత్తిళ్లతో ఇలా చేయక తప్పడం లేదని ఆలయ నిర్వాహకులు తమకు చెబుతున్నారని ముస్లింలు అంటుండగా, వారు స్వచ్ఛందంగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని ఆలయాల బాధ్యులు చెబుతున్నారు. ఇలాంటి భయానక వాతావరణానికి దోహదపడినందుకు కాస్తయినా సిగ్గుపడాలన్న ఇంగిత జ్ఞానం పాలకు లకు లేదు. ఈ మతిమాలిన ఆలోచనలపై సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినబడటం బీజేపీలో కనిపిస్తున్న సరికొత్త పోకడ. ముస్లిం దుకాణదారులపై నిషేధం విధించడం పిచ్చితనమని పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ విశ్వనాథ్, పార్టీ శాసనసభ్యుడు అనిల్ బెనకే విమర్శించారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంతో ఇంతో మిగిలి ఉన్నదని ఇలాంటి స్వరాలు భరోసా ఇస్తాయి.
మన దేశ పౌరులు కోట్లాదిమంది తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛగా వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అసంబద్ధ ఆలోచనలు చేసేవారికి ఈ వాస్తవాలు కూడా అర్థమ వుతున్నట్టు లేదు. కేరళలో భరతనాట్య కళాకారిణి మాన్సియా జన్మతహా ముస్లిం. భరతనాట్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసిన మాన్సియా ఆ విశ్వవిద్యాలయానికే టాపర్‌గా నిలిచారు.
ఆమె, ఆమె సోదరి భరతనాట్యాన్ని అభ్యసించడం ద్వారా మత విరుద్ధమైన పోకడలు పోతున్నారని ముస్లిం మత పెద్దలు ఆగ్రహించి చాన్నాళ్ల క్రితమే ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఇన్నాళ్లకు హిందూ ఛాందసులు కూడా అదే బాటలో ఆమెకు అవకాశాన్ని నిరాకరించారు. తాను హిందువును పెళ్లాడిన వైనాన్నీ,ప్రస్తుతం హేతువాదిగా ఉంటున్న వాస్తవాన్నీ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ‘మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహా కవి గురజాడ. కానీ కాలం గడుస్తున్నకొద్దీ మన అజ్ఞానం ఊడలు వేస్తున్న ధోరణులు కనబడు తున్నాయి. ఇది ప్రమాదకరం.
Comments
Please login to add a commentAdd a comment