స్వప్నభంగ సందర్భం! | Vardelli Murali Article On India China Border Tensions | Sakshi
Sakshi News home page

స్వప్నభంగ సందర్భం!

Published Sun, Jun 7 2020 1:51 AM | Last Updated on Sun, Jun 7 2020 1:51 AM

Vardelli Murali Article On India China Border Tensions - Sakshi

త్రీ ఇడియట్స్‌ అనే బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సినిమా గుర్తు కొస్తున్నది. టీవీల పుణ్యాన రెండు మూడుసార్లయినా చూసి వుంటాము కనుక సినిమాలోని సీన్లన్నీ గుర్తే. ముఖ్యంగా క్లైమాక్స్‌. ఆ సన్నివేశంలో నడిచే డ్రామాను మించి నేపథ్య దృశ్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సువిశాలమైన నీలిరంగు సరస్సు, దాని వెనుక హిమగిరులు, పైన స్వచ్ఛమైన నీలాకాశం. ఆ సరస్సు పేరు ప్యాంగాంగ్‌ సో. ఆసియాలోని అతిపెద్ద సరస్సు లలో ఒకటి. నూటా యాభై కిలోమీటర్ల పొడవు. కాలుష్యం కన్నుపడని నీలాల జలసుందరి. లదాఖ్‌లో వున్న ఈ సరస్సు వెంట గడిచిన నెలరోజులుగా యాత్రికులకు బదులు చైనా పీపుల్స్‌ ఆర్మీ జవాన్లు తిరుగుతున్నారు. సరస్సు ఉత్తరభాగం నుంచి ఇప్పటికే చైనా ఆక్రమణలో వున్న ఆక్సాయిచిన్‌ వరకు వందల కిలోమీటర్ల మేర భారత భూభాగంలో చైనా సైనికుల సందడి కనిపిస్తున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన చాలారోజుల వరకు రెండు దేశాలు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కొంతకాలం తర్వాత భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ సరిహద్దుల వెంట చైనా సైనిక మోహరింపు వాస్తవమేనని అంగీకరించారు. సరిహద్దుల వెంట అన్నారే కానీ, మన భూభాగంలోకి వారు చొచ్చుకుని వచ్చారని మాత్రం రాజ్‌నాథ్‌ చెప్పలేదు. ఆ తర్వాత చైనా అధికారిక స్పందనగా ‘పరిస్థితి సాధారణంగానూ, నియంత్రణలోనూ ఉంద’ని ఒక యాంత్రికమైన ప్రకటన వచ్చింది. చివరికి నెలరోజుల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చర్చలు ప్రారంభిస్తున్నట్టు శనివారం నాడు రెండు దేశాలు ప్రకటించాయి.

హఠాత్తుగా ఇప్పుడు చైనా ఎందుకని ఈ చొరబాటు చర్యకు దిగింది? మనదేశం ఎందుకని ఇన్నాళ్లు మౌనంగా ఉండిపో యింది? పాకిస్తాన్‌ మన భూభాగంలోకి ఉగ్రవాదులను పంపించినప్పుడు ప్రతిగా మనం వారి భూభాగంలోకి యుద్ధ విమానాల్ని పంపించి ‘సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ నిర్వహించాం. పాక్‌ ప్రభుత్వం మింగలేక కక్కలేక మౌనం పాటిస్తుంటే, మనవాళ్లు చిద్విలాసంగా మీసం తిప్పినట్టు గుర్తు. ఇప్పుడు చైనా చొరబాటు విషయంలో మనం ఎందుకు మౌనం పాటిస్తున్నట్టు? వారిమీద ఎందుకని మీసం తిప్పడం లేదు? బహుశా, చైనా వాళ్లకు మూతిమీద మీసా లుండవు కనుక, ఆ తిప్పుడు లాంగ్వేజ్‌ వారికి అర్థం కాదని కాబోలు. లేదంటే ఇంకేదైనా దేవరహస్యం ఉండి ఉండవచ్చు.

జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ గొంతు మీద ఒక శ్వేత దురహంకార పోలీసు అధికారి మోకాలు పెట్టి ఊపిరాడ కుండా చేసి చంపేసిన వీడియో ఇప్పుడు అమెరికాను ఊపేస్తు న్నది. ఆ వీడియో చూస్తుంటే కుంటా కింటే గుర్తుకొస్తున్నాడు. సుమారు రెండొందల యేళ్లకింద అమెరికన్లు ఆఫ్రికా దేశాల మీద పడి దొరికిన వారందరినీ బంధించి, ఓడల్లో వేసుకుని అమె రికాకు తీసుకొనిపోయిన లక్షలాదిమంది బానిసల్లో ఒక బానిస కుంటా కింటే. చేతులకు గొలుసులు వేసి చిత్రహింసలు పెట్టి ఒక మూలన పడేసినప్పుడు కుంటా కింటే కూడా బహుశా అస్ప ష్టంగానైనా ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అని తన సొంత భాషలో గొణిగే వుంటాడు. అలెక్స్‌ హేలీ అనే ఆఫ్రో అమెరికన్‌ రచయిత తన ఆఫ్రికన్‌ మూలాలను వెతుక్కుంటూ చేసిన పరిశోధన ఫలితంగా ‘రూట్స్‌’ అనే అద్భుతమైన నిజజీవిత నవల వెలువడింది.

ఆఫ్రికా తల్లి వేరు నుంచి తెగిపోయిన కుంటా కింటే తర్వాత ఏడోతరం వాడు అలెక్స్‌ హేలీ. అమెరికాలోని ఆఫ్రికన్‌ ప్రజల పౌరహక్కులకోసం మహాత్ముని స్ఫూర్తితో అహింసాయుత పోరాటం చేసిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ హత్యకు గురైన ఎనిమిదే ళ్లకు (1976) రూట్స్‌ పుస్తకం వెలువడింది. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు ఇండియాలో పర్యటించి గాంధీజీ సిద్ధాంతాలను, అహింసాయుత పోరాట పద్ధతులను ఆకళింపు చేసుకుని వెళ్లాడు. కుంటా కింటే తర్వాత ఆరోతరం ఏడో తరం ఆఫ్రో అమెరికన్లకు ఆదర్శప్రాయుడైన మహాత్మాగాంధీపై పదో తరం వచ్చేసరికి ఎందుకు ఆగ్రహం కలి గించింది? వాషింగ్టన్‌ డీసీలోని ఇండియన్‌ ఎంబసీ ఎదురుగా ఉన్న మహాత్ముని విగ్రహాన్ని ఫ్లాయిడ్‌ తరం వాళ్లు ఎందుకు ధ్వంసం చేశారు? లదాఖ్‌లోని చైనా పీపుల్స్‌ ఆర్మీ చొరబాట్లు అలవాటుగా జరిగే ‘సాధారణ’ చర్యేమీ కాదు. ఇంకేదో వుంది. వాషింగ్టన్‌ డీసీలోని మహాత్ముని విగ్రహ ధ్వంసం కేవలం ఆక తాయితనం వల్ల కాదు. ఇంకేదో ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రెండు ప్రాంతాల్లోని రెండు ఘటనల తాలూకు తీగలను వెంబడిస్తూ పోతే వాటి మూలాలు ఢిల్లీ సెక్ర టేరియట్‌ సౌత్‌ బ్లాక్‌లో మనకు దొరుకుతాయి. 

సౌత్‌ బ్లాక్‌లో భారత విదేశాంగ శాఖ కార్యాలయం ఉంటుంది. సమయానుకూలంగా మనదేశం అనుసరించవల సిన విదేశాంగ విధానానికి సంబంధించిన ప్రణాళికలు ఇక్కడ తయారవుతుంటాయి. సంప్రదాయకంగా మనదేశం ఏరకమైన సైనిక కూటములతో సంబంధం లేకుండా తటస్థురాలిగా కొన సాగుతూ వస్తున్నది. అమెరికా–రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచిన సుదీర్ఘ కాలంలో కూడా ఇండియా వర్థమాన స్వతంత్ర దేశాలను సమీకరించి అలీనోద్యమాన్ని నిర్మించిందే తప్ప అటు నాటో కూటమికో, ఇటు వార్సా ప్యాక్ట్‌ కూటమికో చేరువయ్యే ప్రయత్నాలు చేయలేదు. అలీనోద్యమంలో శిఖర సమాన నాయ కులైన మార్షల్‌ టిటో (యుగోస్లావియా), గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌ (ఈజిప్టు), సుకర్ణో (ఇండోనేషియా), ఎన్‌క్రూమా (ఘనా)ల మధ్య శిఖరాగ్ర తారగా పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నిలవగలిగాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధ సమయంలో రష్యాకు కొంత దగ్గరయినట్టు కనిపించినా, ఆమె పదవీకాలం చివరి రోజుల్లో అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకోగలిగారు. రష్యా కూటమి పతనం తర్వాత ఇరవై, పాతికేళ్లపాటు అమెరికా నేతృత్వంలో ఏకధృవ వ్యవస్థ గానే ప్రపంచ వ్యవహారాలు నడిచాయి. ఈ పాతికేళ్లపాటు తన దేశ ఆర్థికాభివృద్ధిపై ఫోకస్‌ చేసిన చైనా పదేళ్ల కింద తన ఆర్థిక లక్ష్యాలను సాధించగలిగింది. ఇప్పుడిక గ్లోబల్‌ పవర్‌గా తన పాత్రను పోషించడానికి పదేళ్ల నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక బృహత్తరమైన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ) కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. సముద్రమార్గ స్థావరాల ద్వారా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లోని తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షి ణాసియాలను అదుపు చేస్తూ, సిల్క్‌ రోడ్డు ద్వారా సెంట్రల్‌ ఆసియా, పశ్చిమాసియాలపై పట్టు సాధించే వ్యూహాన్ని చైనా అమలుచేయడం ప్రారంభించింది. ప్రపంచ సముద్ర వాణి జ్యంలో మూడింట రెండొంతుల భాగం వాటా ఇండో–పసిఫిక్‌ ప్రాంతానిదే. ఇటువంటి కీలక ప్రాంతంపై చైనా ఆధిపత్యం సాధించడం సహజంగానే అమెరికాకు ఇష్టం ఉండదు కనుక అది విరుగుడు చర్యలను ప్రారంభించింది. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడే ‘ఆసియా పసిఫిక్‌ రీబ్యాలెన్స్‌’ పేరుతో ప్రారంభమైన ప్రయత్నాలు ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత ‘ఇండో–పసిఫిక్‌ వ్యూహం’ పేరుతో ఊపందుకున్నాయి. ఈ వ్యూహంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు నాలుగు. అవి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ నాలుగు దేశాల కూటమి తనకు ఇబ్బం దులు కలిగించేటందుకే ఏర్పాటయిందనే ఉద్దేశం చైనాకు ఉన్న ప్పటికీ, దాని అంచనాలు వేరే ఉన్నాయి. ఈ నాలుగు దేశాలు ఒక కూటమిగా ఒక్కతాటిపై వ్యవహారం చేయడం సాధ్యంకా దనీ, దేని ప్రయోజనాలు దానికి వేరే ఉన్నాయనే అభిప్రాయం చైనాకు ఉన్నది.

ముఖ్యంగా ఈ ప్రాంతంలో కీలక స్థానంలో ఉన్న ఇండియా పోషించబోయే పాత్ర చైనాకు ప్రధానం. గత చరిత్ర అనుభవాల దృష్ట్యా అమెరికా అడుగులకు మడుగులొత్తే విధంగా ఇండియా వ్యవహరించకపోవచ్చుననే విశ్వాసం చైనాకు ఉంది. అందువల్లనే ఈ నాలుగు దేశాల కూటమి ముందుకు వచ్చిన తర్వాత కూడా డోక్లామ్‌ వద్ద తలెత్తిన ఇండియా–చైనా సరిహద్దు వివాదం సందర్భంగా చైనా సంయ మనంతో వ్యవహరించింది. ఈ సంయమనానికి కారణం పెరి గిన మన బలాన్ని చైనా గుర్తించడమేనని భారతీయులుగా మనం గర్వపడ్డాంగానీ, అంతర్జాతీయ వ్యూహంలో భాగంగానే చైనా అలా వ్యవహరించిందని అర్థం చేసుకోలేకపోయాము. డోక్లామ్‌ ఘటన తర్వాత అమెరికా–భారత సంబంధాలు మరింత పటిష్టమయ్యాయి. ట్రంప్‌–మోదీల స్నేహబంధం బలంగా పెనవేసుకుంటున్నది. అమెరికాలో జరిగిన హౌడీమోదీ కార్యక్రమంలో ‘ట్రంప్‌ గారికే మన ఓటు’, ‘ఏనుగు గుర్తుకే మన ఓటు’ అనే మాటలు వాడనప్పటికీ దాదాపు ఆ అర్థమొచ్చేలాగా ట్రంప్‌కు మోదీ ప్రచారం చేసిపెట్టారు. వారి మైత్రీ బంధం ముదురుతున్నకొద్దీ చైనా వైఖరిలో మార్పు కనిపించడం మొద లైంది. ఆ మార్పుకు సంకేతమే లదాఖ్‌లోని చైనా చొరబాటు. మూర్తీభవించిన శ్వేతజాతి దురహంకారంగా ఆఫ్రో అమెరికన్లు భావించే ట్రంప్‌కు భారత ప్రధాని మద్దతు పలకడానికి నిరసన గానే వారు భారతీయతకు ప్రతీకగా భావించే మహాత్ముని విగ్ర హంపై దాడిచేశారన్న ఒక అభిప్రాయం బలపడుతున్నది.

ఇరవై సంవత్సరాల క్రితం... సరిగ్గా సహస్రాబ్ది సూర్యుడు తొలి వెలుగు రేకలను ప్రసారం చేయడం మొదలుపెట్టిన పుణ్య కాలం నుంచీ, దేశం యువతరం ఆలోచనల్లో మార్పులు మొద లయ్యాయి. ఇంజనీరింగ్‌ చదివిన ప్రతివాడికీ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతున్న రోజులు కనుక సహజంగానే వారిలో ఆత్మవిశ్వాసం అతిశయించడం మొదలైంది. పైగా అబ్దుల్‌ కలామ్‌ ‘కలలు కనండీ, కనండీ’ అని యువతరానికి బోధిస్తున్న కాలం. దాంతో మనవాళ్లు రెచ్చిపోయారు. తిలక్‌ చెప్పినట్టు కలల పట్టు కుచ్చులూగుతున్న కిరీటాలు ధరించి, కళ్ల చివర కాంతి సంగీత గీతాలు రచించడం మొదలుపెట్టారు. ఇదే సమ యంలో కార్గిల్‌ యుద్ధం దేశభక్తిని రగిలించింది. వారి సైబర్‌ స్పేస్‌లో ‘మేరా భారత్‌ మహాన్‌’ అనే నినాదం ప్రతిధ్వనిం చింది. ఈ తరం ప్రపంచమే వేరు. సిటిజన్ల యందు నెటిజెన్లు వేరయా అన్నట్టుగా ఇదో నెటిజన్‌ వరల్డ్‌. మోదీ హయాం వచ్చే సరికి ఈ ‘ప్రపంచం’లో ఈ శతాబ్దం భారత్‌దే అన్న నమ్మకం బలపడిపోయింది. ఇలా సాగుతున్న నెటిజన్ల ఆలోచనా స్రవంతికి ఒకటి, రెండు గట్టి షాక్‌లు తగిలాయి. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన తొలినాళ్లలో చప్పట్లు కొట్టి అదిలించడం, దీపాలు పెట్టి కరోనాను బెదిరించడం వంటి కార్యక్రమా లను నిష్టతో చేశారు.

కొద్దిరోజులు గడిచేసరికి భారతదేశంలోని రహదారుల మీద నిఖిల ప్రపంచం నివ్వెరపోయే హృదయ విదారక దృశ్యాలు. తెల్లారేసరికి ఎనిమిదిన్నర కోట్లమంది (ప్రభుత్వ లెక్కల ప్రకారం. స్వతంత్ర సంస్థల అంచనా 14 కోట్లు) వలస కార్మికులు నిరాశ్రయులయ్యారు. తిండీ తిప్పలు లేకుండా కన్న ఊరును వెతుక్కుంటూ కాలినడకన బయల్దేరారు. 500 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ సొంత ఊరికి 50 కిలోమీటర్ల చేరువలో కన్నుమూత. చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు అటకాయించడంతో ముందుకు వెళ్లలేక కొడుకు మరణవార్తను సెల్‌ఫోన్‌లో వింటూ జుట్టు పీక్కుని రోదిస్తున్న ఒక కన్నతండ్రి దృశ్యం. గాయపడిన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలో మీటర్ల దూరాన్ని పంటి బిగువున పూర్తిచేసిన పదమూడేళ్ల బాలిక. చంకన బిడ్డలతో నెత్తిన మూటలతో మండుటెండలో నడుస్తున్న తల్లులు, పదహారు కోట్ల పాదాలపై పూచిన వ్రణాలు. నరజాతి చరిత్రలో ఒక విషాద ప్రస్థానం. ఈ సంఘ టన మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని పటాపంచలు చేసింది. లదాఖ్‌లోకి చైనా సైన్యం చొరబడి కవాతులు చేస్తుంటే నెలరోజులకు గానీ నోరువిప్పలేని మన దురవస్థ మన సైనిక పాటవంపై అతి అంచనాలకు కళ్లెం వేసింది. నెటిజనుల కలలు కరుగుతున్నాయి. మరి ఈ శతాబ్దం మనది కాదా? అంతా భ్రాంతియేనా? ఔను. మన యువతరాన్ని కలల్లో విహరింప జేసినంతకాలం, భ్రమల్లో ముంచినంత కాలం అంతే. వాస్తవా లను వారి ముందు ఉంచి, వారి శక్తిసామర్థ్యాలకు సానబట్టి అవకాశాలను ఆసరాగా ఇస్తే, జీవించడం కోసం పోరాడటాన్ని నేర్పిస్తే మన యువతరం తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధిస్తుంది. ఈ శతాబ్దపు నొసటిపై భారత మాతను తిలకంగా దిద్ద గలుగుతుంది.


వర్ధెల్లి మురళి

(muralivardelli@yahoo.co.in)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement