మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపా లన చేస్తున్న రోజులు. ప్రజల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడానికి భీమసేనుడు దేశాటనకు బయల్దేరా డట. అంతకుమునుపు తానెప్పుడూ కనీవినీ ఎరుగని వింతలూ, విడ్డూరాలు మనుషుల ప్రవర్తనలో భీమసేను డికి కనిపించాయట. ఎందుకిలా జరుగుతున్నదో తెలుసు కోగోరి అన్నగారి చెంతకు చేరుకున్నాడట. తమ్ముడి సందేహం విన్న ధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ‘నాలుగు మహాయుగాల్లో మూడవదైన ద్వాపర యుగంలో మనం జీవిస్తున్నాము. మొదటిదైన కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేది. మన యుగంలో అది రెండు పాదాల మీద నడుస్తున్నది. ఇక ఒంటిపాదంపై నడిచే కలియుగం రానున్నది. నువ్వు చూసిన వింతలన్నీ ఆ నాలుగో యుగం ప్రవేశ సంకేతాలే’నని వివరించాడట.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి ప్రజాస్వామ్య పరిపాలన చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఇప్పుడు నాలుగో తరం ప్రవేశించింది. తొలితరం రాజకీయాల్లో నాలుగు ప్రధాన లక్షణాలు కనబడేవి. ఒకటి: రాజ్యాంగ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవడం, రెండు: పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం. మూడు : ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కానీ, వారి జయాపజయాల్లో కానీ ధన ప్రమేయం లేకపో వడం. నాలుగు: పేద, దళిత, గిరిజన వెనుకబడిన వర్గా లను రాజకీయ నాయకత్వ శ్రేణిలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించడం.
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యానికి రాజ్యాంగమే సీట్లను రిజర్వు చేసింది కనుక ఆ సంఖ్య మేరకు మాత్రం ప్రజా ప్రతినిధులు ఎన్నికవుతున్నారు. తొలితరంలోనే శిఖర సమానులైన నాయకులను అందించిన దళితుల్లోంచి ఇప్పుడు ఆ స్థాయి నాయకత్వం ఎదగకపోవడానికి కారణ మేమిటో ఆలోచించాలి. చట్టసభల్లో సీట్ల రిజర్వేషన్ లేన ప్పటికీ ఆరోజుల్లోనే అగ్రశ్రేణి బీసీ నేతలు ఎదిగారు. తమి ళనాడు బీసీ నాయకుడైన కామరాజ్ నాడార్ ఒక్కముక్క ఇంగ్లీషూ, హిందీ రానప్పటికీ జాతీయ కాంగ్రెస్‌లో చక్రం తిప్పగలిగాడు. తెలుగు రాష్ట్రాల్లో తొలితరం నాయకులైన గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, ధర్మభిక్షం, ప్రగడ కోటయ్యల స్థాయిని ఆ తర్వాతి తరాల బీసీ నేతలు అందుకోలేకపోయారు.
గడిచిన నెల రోజులుగా జరుగుతున్న మహారాష్ట్ర పరిణామాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవేశించిన 4జీ (నాలుగో తరం) స్పెక్ట్రమ్ లక్షణాలకు అద్దం పడు తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రదమైన తొలి తరం నాలుగు సూత్రాలూ కరిగిపోతున్న దశ ఇది. మహా రాష్ట్ర పరిణామాలను రెండు భాగాలుగా మనం పరిశీలిం చాలి. ఒకటి: ప్రజల తీర్పులోని ఆంతర్యం. రెండు: ఎన్ని కల తర్వాత పార్టీలు వ్యవహరించిన తీరు. రాష్ట్రంలోని ప్రధానమైన నాలుగు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే రెండు కూటములుగా ఏర్పడి పోటీచేశాయి. బీజేపీ–శివసేన ఒక జట్టు. రెండు పార్టీలకూ భావసారూ ప్యత ఉంది. రెండూ హిందూత్వ ఎజెండా కలిగిన పార్టీలే. కాంగ్రెస్ – ఎన్‌సీపీలు ఒకే తాను ముక్కలు. సిద్ధాంత విభే దాలు ఏమీ లేవు. ఎన్నికల ఫలితాలు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఈ కూటమి 161 సీట్లు గెలిచి 288 మంది సభ్యులున్న సభలో అవసరమైన మెజారిటీని సంపాదించింది.
42 శాతం మంది ఈ కూట మికి ఓటేశారు. ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్‌సీపీ– కాంగ్రెస్ కూటమికి 99 సీట్లు 33 శాతం ఓట్లు లభించాయి. తీర్పు సుస్పష్టం. మరింత స్పష్టత కావా లంటే నాలుగు పార్టీలు విడివిడిగా సంపాదించిన ఓట్లను, సీట్లను పరిశీలించాలి. బీజేపీ 150 సీట్లకు పోటీచేసి 105 సీట్లు గెలిచింది. అంటే దాని స్ట్రయిక్ రేటు 70 శాతం. ఈ స్ట్రయిక్ రేటును మొత్తం అసెంబ్లీ సీట్లకు వర్తింపచేస్తే 200 సీట్లు గెలవాలి. ప్రీ పోల్, పోస్ట్–పోల్ సర్వేలన్నీ దాదాపు ఇదే సంఖ్యను కూటమి కోటాలో వేయడం గమనార్హం. 25.7 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు.
ఈ స్ట్రయిక్ రేటును మొత్తం అసెంబ్లీ సీట్లకు వర్తింపజేస్తే బీజేపీ ఓట్లు 47 శాతంగా వుండేవి. శివసేన సాధించిన సీట్లు 56. పోటీచేసిన స్థానాల్లో దాని స్ట్రయిక్ రేటు 45 శాతం. సాధించిన ఓట్ల స్ట్రయిక్ రేటు 35 శాతం. ఎన్సీపీకి లభిం చిన సీట్లు 54. ఓట్లు, సీట్లలో దాని స్ట్రయిక్ రేటు దాదాపు శివసేనతో సమానం. ఓట్లలోనూ, సీట్లలోనూ 30 శాతం స్ట్రయిక్ రేటుతో కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 50 శాతం సీట్ల స్ట్రయిక్ రేటు లేని మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 70 శాతం స్ట్రయిక్ రేటు ఉన్న బీజేపీ ప్రతిపక్షంగా మిగిలింది. ఇదో విచిత్ర పరిణామం.
ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ నాలుగు పార్టీల వ్యవహారం కూడా ప్రజాస్వామ్యాన్ని నగుబాటు చేసే దిశగానే సాగింది. శివసేన విడాకులిచ్చి పక్కకు జరిగిన తర్వాత, దొడ్డిదారిన అధికార పీఠమెక్కడానికి బీజేపీ ప్రయత్నించింది. ఇతర పార్టీలను చీల్చడానికి ప్రణాళిక వేసుకున్నది. గవర్నర్ వ్యవస్థను నగ్నంగా దుర్వినియోగ పరిచింది. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి మంత్రిమండలి సమావేశాన్ని హాజరుపర చాలని బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖా తరు చేసి రాత్రికి రాత్రే ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాలాసాహెబ్ తన జీవిత కాలంలో ఏనాడూ అధికారం కోసం అర్రులు సాచలేదు. ఆయన తనయుడు మాత్రం పదవీ వ్యామోహంతో పార్టీ మౌలిక సిద్ధాంతాలను తాకట్టుపెట్టి శత్రుపక్షాల పంచన చేరడం విలువల పతనానికి పరాకాష్ట.
ఎన్సీపీ నాయ కుడు అజిత్ పవార్ బీజేపీ చెంతకు చేరడం, తెల్లవారు ఝామున ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తనపై వున్న అవినీతి కేసులను ఎత్తివేయించు కోవడం, ఒక్కరోజు గడవగానే పిన్నిగారి పిలుపుమేరకు మళ్లీ సొంత పార్టీలో చేరడం వింతగా లేదా?. నిజంగా పార్టీని చీల్చాలని వుంటే పదిమందినైనా వెంట తీసుకుపో లేనంత అర్భకుడు కాదు అజిత్ పవార్. చిన్నాన్న ఆజ్ఞమే రకే అజిత్ పవార్ గడప దాటాడనీ, ఆ తర్వాత వ్యూహం మార్చుకున్న మరాఠా బాస్ తన అన్నకొడుకును మళ్లీ అక్కున చేర్చుకున్నాడని అభిజ్ఞులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లౌకికత్వ వలువలను పూర్తిగా విప్పేసి హిందూత్వ శివసేనతో జట్టుకట్టడానికి సిద్ధపడింది. అధికారంలో చోటిస్తానంటే బీజేపీ చంకనెక్కడానికి కూడా కాంగ్రెస్ వెనకాడదని ఈ ఉదంతం చాటిచెప్పింది.
తొలి నాటి కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో ముఖ్యమైనది సెక్యులరిజం. భారతీయ జనతా పార్టీ పునాది హిందూత్వ. దేశంలో బీజేపీ ఆదరణ కొంత పెరగగానే కాంగ్రెస్ పార్టీ తన లౌకికవాదాన్ని పక్కన పడేసి మెతక హిందూత్వను రుద్దుకునే ప్రయత్నంలో అభాసుపాలవు తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ వేసిన బ్రాహ్మణ గోత్ర యుక్త శివభక్త వేషాన్ని జనం లైట్‌గా తీసుకున్నారు. జమ్ము–కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాఖ్‌ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన గళాన్ని గట్టిగా వినిపించకపోవడాన్ని బట్టి ఇక లౌకిక వేషధారణను ఆ పార్టీ పూర్తిగా వది లేసినట్టేనని భావించవలసి ఉంటుంది. దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నిష్క్రి యాపరత్వం కూడా ఒక ఉదాహరణ.
1951 జనాభా లెక్కల ప్రకారం దేశంలో నాటి అక్ష రాస్యుల సంఖ్య 18 శాతం. 2011లో అది 75 శాతానికి చేరుకున్నది. చదువుకున్న వారి సంఖ్య ఐదింతలు పెరి గింది కనుక ఆమేరకు మన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంప్రదాయాలు బలపడి ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా దిగజారుతున్నాయి. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రజాస్వామ్య ప్రక్రి యలో క్రియాశీలక పాత్ర లేకపోవడం విలువల పతనా నికి ప్రధాన కారణం. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ఇంకా మెరుగపడని సామాజిక వెనుకబాటుతనం మెజా రిటీ ప్రజల ప్రేక్షక పాత్రకు కారణం. ఆర్థిక సరళీకరణ మొద లైన తర్వాత దేశంలో కొంతమంది సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతంలో మాదిరిగా పేదవర్గాల్లో ఇప్పుడు తిండి దొరకని దుస్థితి లేకపోవచ్చు కానీ, గతం కంటే కొన్ని వందల రెట్లు ఆర్థిక అంతరాలు పెరిగాయి. పెరిగిన శ్రీమంతుల సంపదతో లెక్కిస్తే పేదరికం గతం కంటే ఎన్నోరెట్లు పెరిగినట్టు లెక్క.
క్రెడిట్ స్విస్ అనే ప్రతిష్ఠాత్మక సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ఈ దేశ సంపదలో 51.5 శాతం కేవలం ఒక్క శాతం శ్రీమంతుల చేతిలోనే ఉంది. మరో నాలుగు శాతం మంది చేతిలో 17.1 శాతం సంపద వుంది. ఇంకో ఐదు శాతం మంది చేతిలో 8.8 శాతం సంపద పోగుబడింది. అంటే మనదేశ జనాభాలో పదిశాతం సంపన్నులు 77.4 శాతం సంప దను అనుభవిస్తున్నారు. మరోపక్క 60 శాతంమంది పేదల చేతిలో కేవలం 4.7 శాతం సంపద మాత్రమే వుంది. ఈ అరవై శాతం మంది ప్రజలకు ప్రధాన రాజ కీయ స్రవంతిలో భాగస్వామ్యం లభించనంతవరకు మన ప్రజాస్వామ్యం ధనం కొరకు, ధనం చేత, ధనవంతులు ఆడే క్రీడగానే దిగజారుతుంది. ఇప్పుడు దేశంలో నెలకొని వున్న దుస్థితి ఇదే. డబ్బున్నవాడికే రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. డబ్బు ఖర్చుపెట్టినవాడే గెలవగలు గుతున్నాడు. ధనార్జనకోసమో లేక పలుకుబడికోసమో వీరు పదవులను వాడుకుంటున్నారు. వీరికి పార్టీ సిద్ధాం తాలు, కట్టుబాట్లు ఉండే అవకాశం లేదు. అధికారంలోకి ఎవరు వస్తే వారి గూటిలోకి చేరడానికి సిద్ధంగా వుంటు న్నారు. అరవై శాతం నిరుపేదల గురించి వీరు ఆలోచిం చేది పోలింగ్ ముందురోజు మాత్రమే. ఈ 60 శాతం పేదల్లో అత్యధికులు దళితులూ, గిరిజనులూ, వెనుకబడి నవారు, అగ్రవర్ణ నిరుపేదలు.
‘‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలె పుడో... అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవయుగమ దెంత దూరం’’ అంటూ స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో మహాకవి దాశరథి ప్రశ్నించారు. ఆ దూరం ఇంకా తగ్గలేదు. దూరం తగ్గాలంటే సంపన్నులతో సమానంగా పేదలకూ అన్ని అవకాశాలు లభించాలి. సంపన్నుల బిడ్డలతో సమానమైన విద్యాబుద్ధులు పేద బిడ్డలు నేర్వాలి. డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువూ ఆగి పోగూడదు. ప్రభుత్వ వనరులూ, ప్రభుత్వం కల్పించే మర్యాదలూ సంపన్నుల సహపంక్తినే పేదలకు లభిం చాలి. డబ్బును కాకుండా సేవాతత్పరతను గుర్తించి టిక్కెట్లు ఇచ్చే రాజకీయ పార్టీలు కావాలి. అర్హతలున్న బలహీనవర్గాల నేతలను గుర్తించి ఉన్నత పదవులిచ్చి ప్రోత్సహించే గుండె కలిగిన రాజకీయ నాయకత్వం కావాలి. అప్పుడే పేదవర్గాల్లోంచి సంపన్న వర్గాలతో సమానంగా రాజకీయ నాయకత్వం ఎదుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఈ వర్గాల్లో పెరుగుతారు. అప్పుడు ఓట్ల కొనుగోలు–అమ్మకాల అంగడి ఉనికి కోల్పోతుంది.
క్రమంగా రాజకీయ విలు వలు పునఃప్రతిష్టితమవుతాయి. ఇటువంటి చర్యలు చేప ట్టడానికి రాజకీయ నాయకత్వానికి సంకల్ప బలం కావాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, పట్టుదల కావాలి. ఈ తరహా నవ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్నికలకు ముందు టిక్కెట్ల కేటాయిం పులో ధనాన్ని గీటురాయిగా తీసుకోలేదు. గెలిచిన అనం తరం మంత్రి పదవుల్లో 60 శాతం వరకు దళిత–గిరిజన –బీసీ–మైనారిటీలకు కేటాయించారు. ప్రగతిశీల పథకా లతో సామాజిక విప్లవానికి తెరతీశారు. వైఎస్ జగన్ ఆరుమాసాల పాలన దళిత–బహుజన–అగ్రవర్ణ పేదల్లో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పింది. ఈ స్ఫూర్తితో మరికొందరు నాయకులు పేదల అనుకూల విధానాలను అనుస రిస్తే నాలుగో తరం రాజకీయం ధర్మరాజు చెప్పిన కలి యుగంలాగా ముగియకుండా ఐదోతరం నాటికి కొత్త కాంతులతో ఉదయిస్తుంది.
వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment