వర్ధెల్లి మురళిని అరుణ్‌సాగర్ విశిష్ట పాత్రికేయ పురస్కారంతో సత్కరిస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: సామాజిక ధృక్పథం కలిగిన జర్నలిస్టులు ప్రస్తుతం అరుదైపోతున్నారని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాల ప్రదాన కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళిని విశిష్ట పాత్రికేయ పురస్కారంతో సన్మానించారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న వామపక్ష భావజాలంతో సామాజిక ధృక్పథం ఉన్న పాత్రికేయుడిగా ఆయన కొనసాగుతున్నారని పలువురు పాత్రికేయులు ఆయన్ను కొనియాడారు.
అనంతరం మురళి మాట్లాడుతూ.. దివంగత పాత్రికేయుడు అరుణ్‌సా గర్‌ది, తనది కుటుంబ, రాజకీయ నేపథ్యాలు ఒకటేనన్నారు. ప్రత్యేకమైన ఆలోచనలు, రచనాశైలితో అరుణ్‌సాగర్ ఒక తరం ముందే పుట్టా రని కొనియాడారు. అటువంటి మిత్రుడి పేరుతో నెలకొల్పిన అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక విశిష్ట సాహితీ పురస్కారం అందుకున్న కవి, అధ్యాపకుడు ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ ఆదివాసీల జీవన వైవిధ్యానికి అద్దం పట్టారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అరుణ్‌సాగర్ రాసిన కొన్ని కవితలను ఆయన చదివి వినిపించారు.
తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, కవి, సరస్వతీ సమ్మాళ్ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ సమాచార కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సినీ దర్శకుడు శంకర్, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు అరుణ్‌సాగర్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా–ఫేక్ న్యూస్ అంశంపై న్యాయ నిపుణుడు, రిటైర్డ్ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న ఫేక్‌న్యూస్ అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన మీడియాలో పెయిడ్ న్యూస్ వంటి అవాంచిత ధోరణులు ఉంటుండగా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ దాన్ని మించిన ప్రమాదకారిగా తయారైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment