జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌ | CM Revanth Speech at Land Allotment to Journalists hyderabad | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌

Published Sun, Sep 8 2024 4:50 PM | Last Updated on Sun, Sep 8 2024 5:11 PM

CM Revanth Speech at Land Allotment to Journalists hyderabad

హైదరాబాద్‌, సాక్షి: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ  ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిందని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హౌసింగ్‌ సొసైటీకి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సీఎం పాల్లొని లబ్దిదారులకు  భూమి స్వాధీన పత్రాల అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడారు.  

‘‘ జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు. వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్సార్‌ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. 

ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. 

వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నా. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం’’ అని అన్నారు.  

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement