జర్నలిజం ముసుగులో రూ. 5 కోట్లు డిమాండ్‌ | Venuswamy couple released a sensational video on TV5 Murthy | Sakshi
Sakshi News home page

జర్నలిజం ముసుగులో రూ. 5 కోట్లు డిమాండ్‌

Published Tue, Aug 20 2024 4:59 AM | Last Updated on Tue, Aug 20 2024 12:29 PM

Venuswamy couple released a sensational video on TV5 Murthy

టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు

తన అనుచరుడితో మూర్తి బృందం బేరసారాలు 

అంత ఇచ్చుకోలేం... ఆత్మహత్య చేసుకుంటామన్న

ప్రముఖ జ్యోతిషుడు, ఆయన సతీమణి వీణాశ్రీవాణి

సాక్షి, హైదరాబాద్‌: మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిన టీవీ 5 మూర్తి, ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, ఆయన భార్య వీణాశ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు వారు ఇన్‌స్టా్రగామ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో టీవీ 5 మూర్తి అనుచరుడు జర్నలిస్టు అమర్, వీణాశ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణను కూడా జత చేశారు. 

రూ.5 కోట్లు ఇవ్వకపోతే మీ స్తోమత ఎంత.? ఎంతిస్తారో.? చెప్పండంటూ అమర్‌ ఆమెను ప్రశ్నించడం స్పష్టంగా రికార్డు అయ్యింది. జ్యోతిషం చెప్పుకునే వేణుస్వామికి అంతమొత్తం ఇవ్వడం సాధ్యంకాదని, ఆయన భార్య వివరిస్తున్నా.. అమర్‌ వినిపించుకోకుండా రూ. 50 లక్షలు ఇస్తారా? లేక రూ. కోటి ఇస్తారా.. ఏదో ఒకటి చెబితే వారితో సమావేశం ఏర్పాటు చేస్తానంటూ బదులివ్వడం గమనార్హం. 

రూ. 5 కోట్లలో జర్నలిస్టు ప్రేమ, రాంబాబుతోపాటు మీడియా హెడ్స్‌కు, సంస్థ అధినేత బీఆర్‌.నాయుడుకు వాటాలు ఉంటాయని అమర్‌ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మీడియా ముసుగులో తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుగోస్వామి తన సతీమణితో కలిసి ఆరోపించారు. తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి 
‘టీవీ5 జర్నలిస్ట్‌ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయతి్నంచాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్‌ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్‌ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. 

ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లాను. వారు పెడుతున్న టార్చర్‌ భరించలేకపోతున్నాను’అంటూ వేణుస్వామి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆపై మూర్తి అనుచరుడు జర్నలిస్ట్‌ (అమర్‌) ఫోన్‌ కాల్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో వేణుస్వామి షేర్‌ చేశారు. 

అందులో వారు రూ. 5 కోట్లు డిమాండ్‌ చేయడం అంత ఇవ్వకపోతే.. ఎంత ఇస్తారో చెప్పండంటూ సంభాషణ ఉంది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. చానల్‌ అధినేత బీఆర్‌.నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టు ప్రేమ, రాంబాబుకు వెళతాయని అమర్‌ ఆ ఆడియోలో వెల్లడించారు.  

టీవీ5 మూర్తి.. 5 కోట్లు డిమాండ్..వీణా శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు

మమ్మల్ని వారు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణి 
వేణుస్వామి సతీమణి వీణాశ్రీవాణి కూడా టీవీ5 సంస్థతోపాటు జర్నలిస్ట్‌ మూర్తి గురించి మాట్లాడుతూ ‘మమ్మల్ని రూ.5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతోపాటు, నా కూతురు బంగారం అమ్మినా ఐదు శాతం డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వారు తప్పుగా క్రియేట్‌ చేస్తారు. 

సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వారే వార్తలు ఇస్తారు. ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వారు (టీవీ5 మూర్తి, టీమ్‌) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. ఆడపిల్ల ప్రేమకు, రోజు నాకు మెసేజ్‌లు చేసే రాంబాబుకు వాటాలున్నాయంటే.. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమైనా పెట్టుకోండి. 

మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆడపిల్లను అనుకోండి లేదా కుటుంబం అనుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్‌ చేస్తాయా? చదువుకున్న వారు సపోర్ట్‌ చేస్తారా? పోలీసులు, లాయర్లు, సుమోటోగా తీసుకొని సపోర్ట్‌ చేస్తారా? జోతిష్యం చెప్పుకుంటే రూ.ఐదు కోట్లు డిమాండ్‌ చేస్తారా? బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారంటే ..లేనివారిని ఎలా వేధిస్తున్నారు. మమ్మల్ని కాపాడుకుంటే..మరిన్ని వీడియోలు బయటపెడతాం. లేదంటే ఇదే ఆఖరి వీడియో. ఆత్మహత్య చేసుకుంటాం.’అని ఆ వీడియోలో స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement