ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర
- తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనండి
- హోంమంత్రి నాయిని పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఆదివారం పీర్జాదిగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్రికేయులు తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 1969 నాటి ఉద్యమంలో తాను 30 సార్లు జైలుకెళ్లానని, అప్పుడు 369 మంది విద్యార్థులు అమరులయ్యారని తెలిపారు. చంద్రబాబు సీమాంధ్రలో సీఎం అయినందుకే వర్షాలు పడడం లేదని, ఆ గాలి తెలంగాణకు కూడా సోకి ఇక్కడా అదే పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల కోసం ఓ భవనం నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణపై విషపు వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. ప్రతి జర్నలిస్టుకు 250 గజాల స్థలం కేటాయించాలని, డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
అలాగే అర్థాంతరంగా మృత్యువాత పడిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ తరువాత జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఘట్‌కేసర్ జడ్‌పీటీసీ సభ్యుడు మంద సంజీవ్‌రెడ్డి, జర్నలిస్టుల నాయకులు పల్లె రవి, క్రాంతి కిరణ్, ఎం.వి. రమణ , బాలసాగర్, శైలేష్‌రెడ్డి, శేఖర్‌సాగర్, వెల్లంకి జయపాల్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.