హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న డబుల్ బెడ్‌రూమ్, హెల్త్‌కార్డులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాలను జర్నలిస్టు కుటుంబాలకు సైతం వర్తింపజేస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత పోషించిన జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. జర్నలిస్టులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండడంతోనే ఆలస్యం జరుగుతోందని, దీని వెనక ఇతర ఉద్దేశమేమీ లేదన్నారు.
నగరంలోని లళిత కళాతోరణంలో ఆదివారం జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) ప్రథమ మహాసభలో మంత్రులిద్దరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై పలు హామీలు ఇచ్చారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టులకు రూ.2లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు రూ.4లక్షలతో డబుల్ బెడ్ రూమ్ గహాలను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో వ్యక్తి గృహాలు, పట్టణాల్లో ఒక అంతస్తు(జీ+1) పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు.