ఆ ‘దుర్మార్గుల’ శరీరాల్లో మొత్తం 11 బుల్లెట్లు దిగ బడ్డాయి. ‘ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది. ఆ తుపా కులను ముద్దాడాలని ఉంది’ అంటున్నారు సెలబ్రిటీలు.తనదైన ఒక అందమైన నవజీవితాన్ని అప్పుడప్పుడే నిర్మించుకోవడం మొదలుపెట్టిన ఆ యువ డాక్టర్‌ను అతిదారుణంగా చిదిమేసిన ‘మానవమృగాలు’ పోలీసులపై కూడా తిరగబడ్డాయట. రాళ్లతో దాడి చేశాయట. వారి పిస్తోళ్లను కూడా లాక్కొని కాల్పులు జరిపాయట. గత్యంతరం లేని స్థితిలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పులకు హతమైపోయాయి.
ఇటువంటి ఎన్‌కౌంటర్ కథనాలు మనదేశంలో కొత్తకాదు. కొన్నివేల ఎన్‌కౌంటర్లు జరిగి వుంటాయి. అవన్నీ వేరు. ఈ ఎన్‌కౌంటర్ వేరు. ఈ వార్త కీచకవధ వార్తలాగా క్షణాల్లో దేశాన్ని చుట్టేసి జనాన్ని ఉత్తేజితం చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పండితులూ, పామరులూ అందరూ ముక్తకంఠంతో శభాష్ అన్నారు. ఈరోజే కదా నిజమైన దీపావళి అని కూడా వ్యాఖ్యానిం చారు. విద్యార్థినులు, యువతులూ డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ‘ఊరికి ఒకడే రౌడీ వుండాల. ఆడు పోలీసోడే అయివుండాల’ వగైరా ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ‘సింగం.. సింగం..’ అనే ట్యూన్లు న్యూస్ చానెళ్లలో విని పించాయి. చివరికి, సర్వోన్నత చట్టసభైన పార్లమెంట్‌లో సైతం ఎన్‌కౌంటర్‌కు సమర్థనగా ప్రసంగాలు సాగాయి.
అదేమిటి? పోలీసులే తీర్పు చెప్పేసి శిక్షలు వేస్తూ పోతే ఇక న్యాయవ్యవస్థ దేనికి? కోర్టులు – జడ్జీలు ఎందుకు? అంటూ అక్కడక్కడా కొన్ని స్వరాలు వినిపించాయి. బహుశా రోజులు గడిచేకొద్దీ ఈ స్వరాలు ఇంకొంచెం బలం పుంజుకోవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం పోలీసు తీర్పు సమర్థించారు.ఇదొక కఠిన వాస్తవం. ఈ కఠిన వాస్తవానికి వెనుక కచ్చితమైన కారణాలు ఉన్నాయి. సంస్థాగతమైన లోపాలతో మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కునారిల్లుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాల సంఖ్య, జడ్జీల సంఖ్య పెరిగి ఉండాల్సింది. పెరగకపోగా జడ్జీ పోస్టుల్లో ఎప్పుడూ చాలా భాగం భర్తీ కాకుండా ఖాళీగానే వుంటున్నాయి.
దేశంలోని వివిధ కోర్టుల్లో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. క్రిమినల్ కేసులే రెండు కోట్లు. ఇందులో పదోవంతు కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో వున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్‌సీ ఆర్‌బీ) లెక్కల ప్రకారం 2017లో 32,500 అత్యా చారం కేసులు నమోదయ్యాయి. అప్పటికే పెండింగ్‌లో వున్న వాటితో కలిపి ఈ సంఖ్య లక్షా 46 వేలకు చేరింది. వాటిలో ఆ సంవత్సరం వివిధ కోర్టుల్లో పరిష్కారమైన రేప్ కేసుల సంఖ్య 18,300 మాత్రమే. అంటే ఏటా పదిశాతం కేసులు పరిష్కారమవుతుంటే 30 శాతం కేసులు పెండింగ్ జాబితాకు అదనంగా తోడవుతున్నాయి.
భారతదేశంలో వున్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలంటే 70 వేలమంది అదనపు జడ్జీలు అవసరమవుతారని మూడేళ్ల కింద అప్పటి ప్రధాన న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ పరిస్థితి కూడా అదేవిధంగా వున్నది. సాధారణ స్థాయిలో నేరాలు జరిగే దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు 225 మంది పోలీసులుం డాలని ఒక లెక్క వుంది. నేరాలు ఎక్కువగా జరిగే భారతదేశంలో మాత్రం లక్షకు 138 మంది పోలీసులు న్నారు. ఈ సంఖ్యలో 25 శాతం పోస్టులు ఎప్పుడూ ఖాళీగానే వుంటాయట.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన పోలీసుల సంఖ్యలో సగానికంటే తక్కువమందితో మన పోలీసు వ్యవస్థ నెట్టుకొస్తున్నది. ఇంత పెద్ద దేశంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు మూడో నాలుగో వున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్టు రావాలంటే నెలలపాటు వేచి వుండాల్సిన దుస్థితి. మన మార్చురీల నిర్వహణ ప్రపంచంలో ఎక్కడా లేనంత దారుణంగా వుంది. ఈ కారణాలు కూడా నేర పరిశోధనకు సవాల్ విసురుతు న్నాయి. అనేక కేసుల్లో నేర నిరూపణలో వైఫల్యాలకు ఇవి కూడా కారణాలే.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వచ్చిన స్పందనను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషులకు మరణశిక్ష పడి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ అమలు జరగలేదు. తొమ్మిదేళ్ల పసి బాలికపై అత్యాచారం కేసులో కింద కోర్టు విధించిన మరణశిక్షను పైకోర్టు యావజ్జీవ శిక్షగా సవరిం చింది. అత్యాచారాలకు, హత్యలకు బలైన బిడ్డల తల్లి దండ్రులు తీరని కడుపుకోత వేదనను అనుభవిస్తుంటే, నేరస్తులు మాత్రం నిర్భయంగా సంచరిస్తున్న ఘటనలు జనంలో న్యాయస్థానాల తీర్పుపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి.
ఇటువంటి పరిస్థితుల్లో దిశ ఉదంతం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతంలో, దేశంలోనే అతిపెద్ద జాతీయ రహ దారి పక్కన, నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో ఒక యువ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన మీడియాలో విస్తృతంగా ప్రచార మైంది. ‘నాకు భయమేస్తున్నది పాప’ అన్న దిశ గొంతుక ప్రతి గుండెను తాకింది. ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెరిగింది.
జాతీయ మీడియాలో పూనకాల స్వాములు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఒక ఉద్యమ నాయ కుడు, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకునిపట్ల కనీస గౌరవం లేకుండా ఆయన మౌనంపై పూనకాల స్వాములు ప్రశ్నల వర్షం కురిపించారు. మౌనా నికి అర్థం మూగ తనం కాదు. పోలీసు భుజంమీద వేలా డుతున్న తుపాకీ కూడా మౌనంగానే వుంటుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు వచ్చిన శబ్దానికి ప్రపంచమే ఉలిక్కి పడింది. భుజం మాత్రం పోలీసులదే.
ఇప్పుడిక్కడ కలవరం కలిగించే మరో అంశం ముందుకొచ్చింది. దిశపై అత్యాచారం జరగడానికి మూడు రోజుల ముందు అసిఫాబాద్ జిల్లాలో ఒక ముప్పయ్యేళ్ల వివాహిత, దళిత యువతిపై కూడా గ్యాంగ్‌రేప్ జరిగింది. పరమ కిరాతకంగా ఆ యువతి చేతివేళ్లను, గొంతునూ కోసి చంపి, అడవిలో శవాన్ని పారేశారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు మీడియాలో అరకొర ప్రాధాన్యతే లభించింది. దిశ కేసులో చెప్పినట్టు, బాధిత మహిళ పేరు గోప్యంగా ఉంచాలని మీడియాకు ఈ యువతి కేసులో ఏ అధికారి సలహా ఇవ్వలేదు.
మా మాన ప్రాణా లకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ దళిత సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. మరొక వైరుధ్యాన్ని కూడా ప్రజలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతున్నారు. దిశ కేసులో నిందితులు నిరుపేదలు. దిశను బలితీసు కున్న పదో రోజున ఆ నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితులు బడాబాబులు. ఘోరం జరిగి సరిగ్గా ఏడాది నిండగానే ఆ బాధితురాలిని బడాబా బులు నడిరోడ్డుపై నిప్పుపెట్టి చంపేశారు. ఇక్కడ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన రోజే అక్కడ బాధితు రాలి హత్య జరగడం కేవలం కాకతాళీయమే కావచ్చు. కానీ పోలీసు తూటాలు చెప్పే తీర్పులో ధనిక – పేద వివక్ష ఉండితీరుతుందని ఈ ఘటనలు స్పష్టం చేశాయి. ఎందుకంటే బాధితురాలిపై దాడులు జరుగుతాయని తెలిసినా పోలీసులు ఆమెకు రక్షణ ఇవ్వలేదు.
ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటిరోజు తెలుగు టెలివి జన్ చానళ్లలో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. చర్చల్లో పాల్గొన్న విశ్లేషకులతోపాటు ఫోన్ కాలర్స్ సైతం న్యాయవ్యవస్థ వ్యవహారశైలిలోని వైరుధ్యాలను ఎత్తి చూపారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో ఆధారాలతో చంద్రబాబునాయుడు దొరికిపోయినా, ఆ కేసును స్వీకరించడానికి న్యాయస్థానాలు నేటివరకు అంగీకరించకపోవడానికి కారణమేమిటని ఒక విశ్లేష కుడు ప్రశ్నించాడు.
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణపై ఉన్న స్టేను ఎత్తివేయడానికి 14 సంవత్సరాలు పట్టిం దని, ఇక విచారణ జరిగి తీర్పు రావడానికి ఇంకెన్నేళ్లు పడతాయని ఒక కాలర్ ఆవేదనతో ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ – తెలుగుదేశం కలిసి రాజకీయ కక్షతో వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిపై ఎటువంటి ఆధారాలు లేకుండా సాదాసీదా పిటిషన్ వేస్తే న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. సదరు న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం మరో ఉన్నత పదవి లభించింది.
చంద్రబాబుపై డాక్యుమెంటరీ ఆధారాలతో సహా వైఎస్ విజయమ్మ దాఖలుచేసిన పిటిషన్‌ను అదే న్యాయస్థానం సీబీఐ దగ్గర సిబ్బంది లేరనే సాకుతో తిరస్కరించింది. ఈ వైరుధ్యాలను మరో కాలర్ గుర్తుచేశాడు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతున్నదనే ఆందోళనకర మైన అంశం ఈ చర్చల్లో ప్రతిఫలించిన కారణంగానే ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితి లోనే ఎన్‌కౌంటర్ రూపంలో దొరికిన సత్వర పరిష్కా రాన్ని ప్రజలు ఆమోదించినట్టు కనిపిస్తున్నది.
ఆడపిల్లల మీద అత్యాచార ఘటనలను సంపూ ర్ణంగా అరికట్టాలంటే చేపట్టవలసిన చర్యలు చాలానే ఉన్నాయి. తొలుత న్యాయ – పోలీస్ వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగేలా రూపొందించాలి. మారిన అవసరాలకు అనుగుణంగా వాటిని పటిష్టం చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించేలా చట్టాలను సవరించుకో వాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ చెబుతున్నట్టు విచ్చలవిడి మద్యం విక్రయాలపై నియం త్రణ విధించాలి.
మొబైల్ ఫోన్లలో అశ్లీల వరద ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఒక భాగం మాత్రమే. ప్రధానంగా జరగాల్సింది సాంస్కృతిక ప్రక్షాళన. ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెప్పిన మను ధర్మశాస్త్ర వారసత్వం మన నడవడిలో, మన ఆలోచ నలో, మన అంతరంగాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తూనే వున్నది. అభ్యుదయ వాదులమని చెప్పుకునే వాళ్లు కూడా ‘పురుషులు కొంచెం ఎక్కువ సమానం – స్త్రీలు కొంచెం తక్కువ సమానం’ అనే భ్రష్ట సమానత్వ భావనతో వ్యవహరిస్తుంటారు.
చిన్నతనం నుంచే మగ పిల్లవాడెక్కువ, ఆడపిల్ల కొంచెం తక్కువ అనే ఆలోచనా ధోరణికి ప్రయత్నపూర్వకంగా వీడ్కోలు చెప్పాలి. ‘నీవలెనే, నావలెనే... నీ అక్కా, నా చెల్లీ’ అనే భావం చిట్టి మెదళ్లలో ఎక్కాలి. అతడు – ఆమె ఈ ప్రపంచానికి సమాన పట్టాదారులని చెప్పాలి. ఆశలు ఇద్దరివీ, ఆశ యాలు ఇద్దరివీ, అవకాశాలు ఇద్దరివీ, ఆకాశం ఇద్దరిదీ, అంతరిక్షం ఇద్దరిదీ, అనంతకోటి నక్షత్రాలు ఇద్దరివీ అనే సమభావం చిన్నవయసులో నాటగలిగితే స్త్రీని భోగ వస్తువుగా చూసే మనస్తత్వం అలవడదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కారణంగానే స్త్రీల మీద విచ్చలవిడి అత్యాచారాలు కనిపించవు.
ఆ స్థితికి చేరుకోవడం అనేది అత్యున్నత నాగరిక దశ. అప్పటివరకు కనీసం దోషు లకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అందుకు రాజకీయ నాయకత్వానికి స్థిరచిత్తం ఉండాలి. కానీ, దురదృష్టవ శాత్తు స్త్రీలను కించపరిచే ధోరణి మన నాయకత్వంలోనే ఉన్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా’ అని పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి బహిరంగంగా సామెతను విసరడం మూర్తీభవించిన ఆయన పురుషా ధిక్య భావజాలానికి బండగుర్తు.
ఈ అహంభావం వల్లనే మహిళా అధికారిని అవమానించిన ఒక మాజీ ఎమ్మె ల్యేను ఇప్పటికీ చంద్రబాబు తనకు ఆదర్శం అని చెబుతున్నాడు. ఈ అహంభావం వల్లనే నిస్సహాయ మహిళల పరువును దోచేసే ‘కాల్‌మనీ’ ముఠాను పార్టీలో ప్రోత్సహించాడు. ఇటువంటి రాజకీయ నాయక త్వాన్ని ఎండగట్టాలి. అప్పటివరకూ పోలీసులు వెయ్యి అత్యాచారాలకు ఒక ఎన్‌కౌంటర్ చేస్తారు. అలా చేసిన ప్పుడల్లా ఆడబిడ్డలతోటి ఆ పోలీసుల తుపాకీ గొట్టాలకు రాఖీలను కట్టిద్దాం. వారు పేల్చే తూటాలను ఏరుకొచ్చి వీరతిలకం దిద్దిద్దాం. పోలీసువారికి విన్నపం... మరో సారి ఇటువంటి సందర్భంలో సీన్ రీ–కన్‌స్ట్రక్షన్ చేయ డానికి వెళ్లినప్పుడు ఇప్పటి మాదిరిగానే బలహీనులైన పోలీసులను తీసుకొని వెళ్లాలి. ఎందుకంటే నిందితులు తిరగబడి పోలీసుల తుపాకులు లాక్కోవాలి కదా. అప్పుడే కదా ఎన్‌కౌంటర్ జరిగేది.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment