దేశవ్యాప్తంగా వేలాది శాఖలు, లక్షలాదిమంది డిపాజిటర్లు ఉన్న యస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయింది. పర్యవసానంగా ఆ సంస్థ బోర్డును రద్దు చేయడంతోపాటు ఖాతాదారులు బ్యాంకు నుంచి తీసుకునే సొమ్మును రూ. 50,000కు పరిమితం చేస్తూ రిజర్వ్‌బ్యాంకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికైతే ఇది నెలరోజులు అమల్లో వుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాతైనా పరిస్థితి చక్కబడుతుందో లేదో చూడాల్సివుంది. భారీ స్కాంతో పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ)బ్యాంకు కుప్పకూలి ఆర్నెల్లు దాటకుండానే ఒక పెద్ద బ్యాంకు చతికిలబడటం సాధారణ పౌరులకు బ్యాంకింగ్ రంగంపైనే సందేహాలు తలెత్తేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రకటన వెలువడింది మొదలుకొని దేశవ్యాప్తంగా యస్ బ్యాంకు శాఖల ముందు వేలాదిమంది క్యూ కట్టారు. నెలంతా శ్రమించి, బ్యాంకులో పడే జీతం డబ్బులు అందుకోవడానికి సిద్ధపడుతున్న వేతన జీవులకు ఇదొక షాక్. ప్రాణావసరమైన వైద్యం కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో, బిడ్డ పెళ్లి చేయడానికో బ్యాంకులో పొదుపు చేసుకుంటూ వస్తున్న మధ్య తరగతి డిపాజిటర్లందరికీ ఇది ఊహించని పరిణామం.
ఏ రంగంలోనైనా ప్రైవేటు నిర్వహణలో వుండే సంస్థలు సమర్థ వంతంగా పనిచేస్తాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో అసమర్థత రాజ్యమేలుతుందని కొందరు నిపుణులు చేసే వాదనల్లో హేతుబద్ధత లేదని తాజా సంక్షోభం మరోసారి నిరూపించింది. యస్ బ్యాంకు సంక్షోభాన్ని గమనించి, అందులోని డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు చర్యలు మొదలుపెట్టడం సంతోషించదగ్గదే అయినా, పరిస్థితి ఇంతగా దిగజారేవరకూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతుంది. పీఎంసీ సంక్షోభంతో ఖాతాదారులు రూ. 11,617 మేర డిపాజిట్లు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కానీ దాంతో పోలిస్తే యస్ బ్యాంకు విస్తృతి చాలా ఎక్కువ. ఇంత పెద్ద బ్యాంకు ఉన్నట్టుండి చేతులెత్తేస్తే వ్యక్తులు మాత్రమే కాదు... దాంతో ఆర్థిక లావాదేవీలు సాగిస్తున్న అనేకానేక బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా సంక్షోభంలో పడతాయి.
కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆదేశాలతో ఈ నష్టజాతక బ్యాంకును ఆదుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)లు రంగంలోకి దిగుతున్నాయంటున్నారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరమే. అటు ఎస్‌బీఐ, ఇటు ఎల్‌ఐసీ పచ్చగా కళకళ్లాడుతున్నాయి గనుక ఈ బాపతు సంస్థల్ని ఆదుకోవడం వాటికి పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. యస్ బ్యాంకు చిక్కుల్లో పడింది కార్పొరేట్ నిర్వహణ సక్రమంగా లేకేనని, దాన్ని సరిచేస్తే చక్కబడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అది మళ్లీ పట్టాలెక్కితే ఇప్పుడు పెట్టుబడిపెట్టే సంస్థలకు లాభాల పంట పండుతుందంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ అసలే అంతంత మాత్రంగా ఉన్న వర్తమాన ఆర్థిక మందగమనంలో అనుకోనిదేమైనా జరిగి, ఆ పెట్టుబడులు కాస్తా ఆవిరైతే? ఆ సంస్థలు పెట్టే పెట్టుబడులు కూడా ఎక్కడినుంచో ఊడిపడవు. సాధారణ డిపాజిటర్లు, పాలసీదారులు పొదుపు చేసే సొమ్ము నుంచే అవి పెట్టుబడులు పెట్టాలి.
నష్టపోతే ఆ డిపాజిటర్ల, పాలసీదారుల హక్కుల్ని రక్షించేదెవరు? కనుకనే పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని రకాల ఆర్థిక సంస్థలపైనా పటిష్టమైన నిఘా వుండాలి. నిర్వాహకులు వాటిని సమర్థవంతంగా నడుపుతున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు కనిపెడుతూ వుండాలి. యస్ బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో ఆర్‌బీఐ ప్రతినిధి కూడా వుంటారు. ఆ బ్యాంకు నిర్వహణ సక్రమంగా లేదని రెండేళ్లక్రితమే బయటపడినప్పుడు, సంస్థలో వరస రాజీ నామాలు జరుగుతున్నప్పుడు ఆర్‌బీఐ నిర్ణయాత్మకంగా ఎందుకు వ్యవహరించలేకపోయింది? దాన్ని పట్టాలెక్కించడానికి ఇన్నాళ్లుగా అది తీసుకున్న చర్యలేమిటి? విఫలమైవుంటే అందుకు బాధ్యులెవరు? రుణ వసూళ్లలో యస్ బ్యాంకు విఫలమవుతున్నదని, అందులో నిర్వహణపరమైన లోపాలు కొల్లలుగా వున్నాయని తేలినా, అది కొత్తగా రుణాలివ్వడాన్ని ఆర్‌బీఐ ఎందుకు నివారించ లేకపోయింది? గత నాలుగైదేళ్లుగా బ్యాంకులిచ్చే రుణాలపై ఆర్‌బీఐ కఠినమైన నిబంధనలు విధించింది.
సక్రమంగా, సమర్థవంతంగా బకాయిలను వసూలు చేయగలిగితేనే కొత్త రుణాల మంజూరుకు అనుమతినిస్తామని చెప్పింది. ఆ నిబంధనలతో ఇతర బ్యాంకులన్నీ సగటున 9 శాతం మించి కొత్త రుణాలివ్వలేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ యస్ బ్యాంకు మాత్రం 30 శాతం మేర రుణాలెలా ఇవ్వగలిగిందన్నది కీలకమైన ప్రశ్న. ఈ బ్యాంకు సంక్షోభం మూలాలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట వాస్త వమే కావొచ్చు. కానీ తర్వాతైనా యస్ బ్యాంకుపై పర్యవేక్షణలో లోపాలెందుకు చోటుచేసుకు న్నాయో, అందుకు బాధ్యులెవరో ప్రభుత్వం తేల్చాలి.
యస్ బ్యాంకు సంక్షోభం పర్యవసానంగానైనా మన ఆర్థిర రంగ సంస్కరణలకు చర్యలు ప్రారంభించాలి. ఇంతక్రితం గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుతో మొదలెట్టి పలు బ్యాంకులు ఈ మాదిరిగానే సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయినా వాటినుంచి మనం గుణపాఠాలు నేర్వలేదు. దానికి బదులు లాభాల్లో నడిచే సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కే మార్గాలు వెదకడం అలవాటైంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమకేది ప్రయోజనమో, ఎక్కడ లాభా లొస్తాయో తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం కాక, ఇలా పాలకులు చెప్పినట్టు చేయాల్సివస్తే అవి కూడా క్రమేపీ చిక్కుల్లో పడటం ఖాయం. సాధారణ పౌరుల్లో బ్యాంకింగ్ రంగంపై అవిశ్వాసం తలెత్తితే వాటిల్లో పొదుపు చేయడానికి వెనకాడతారు. అంతిమంగా ఇది ఆర్థికరంగ అవ్యవస్థకు దారితీస్తుంది. కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment