మూడున్నరేళ్లుగా ఎడమొహం, పెడమొహంగా వున్న సౌదీ అరేబియా, ఖతార్‌లు చేయి కలిపాయి. గత కొన్నాళ్లుగా సాగుతున్న కువైట్ రాయబారాలు ఫలించాయి. దాంతో ఈ నెల 5న జరిగిన గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) శిఖరాగ్ర సమావేశానికి ఖతార్ హాజరైంది. సౌదీ మాటతో యూఏఈ, ఈజిప్టు, బహ్రైన్‌లు సైతం ఆ దేశాన్ని అక్కున చేర్చుకున్నాయి. ఖతార్ పాలకుడు తమిమ్ అల్ థానీకి జీసీసీలో ఘనస్వాగతం లభించింది. అమెరికాలో జరిగే పరిణామాలు గల్ఫ్ పాలకులనూ, అక్కడి విధానాలనూ... ముఖ్యంగా పశ్చిమాసియా తీరుతెన్నులనూ ఎంతగా నిర్దేశిస్తాయో తెలియడానికి ఈ వివాదం పుట్టి గిట్టిన తీరే ఉదాహరణ. జీసీసీ తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఖతార్ పెద్దగా ఇబ్బందులు పడకుండానే అధిగమించగలిగింది. సౌదీ, ఖతార్‌ల మధ్య చిచ్చు రగలడానికి మూల కారణం చాలా చిన్నది. ఖతర్ పాలకుడు తమిమ్ బిన్ హమద్ అల్ థానీ ఇరాన్‌ను ప్రశంసించినట్టు, ఆ దేశంపై అమెరికా చర్యలు సరికాదని అన్నట్టు ఖతార్ అధికారిక వార్తా సంస్థ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తే దానికి మూలం. ఇరాన్‌తో లడాయి వున్న సౌదీకి ఈ వార్త ఆగ్రహం తెప్పించింది. గల్ఫ్‌లో సాగుతున్న తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఖతార్ తీరు వున్నదని, పైగా తన బద్ధ శత్రువు ఇరాన్‌కు అది వంతపాడుతున్నదని అది కత్తులు నూరింది. వాస్తవానికి తమ వెబ్‌సైట్‌ను ఎవరో ఆకతాయిలు హ్యాక్ చేసి, దాన్ని సృష్టించారని ఆ వార్తా సంస్థ సంజాయిషీ ఇచ్చింది.
తమిమ్ కూడా ఖండించారు. కానీ సౌదీ చల్లారలేదు. ఇదే అదునుగా ఖతార్‌పై చర్యలకు సిద్ధపడింది. వాస్తవానికి ఇది సాకు మాత్రమే. గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఖతార్‌పై చర్య తీసుకుంటే అది అమెరికాకు సంతోషం కలిగిస్తుందని, ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవటానికి తోడ్పాటునందిస్తుందని సౌదీ భావించింది. ఖతార్‌పై ఈ చర్య తీసుకోవటానికి నెలరోజుల ముందు ట్రంప్ సౌదీ అరేబియా పర్యటించారు. ఉగ్రవాదంపై సమష్టి పోరు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా తన వెనక దృఢంగా నిలబడుతుందని సౌదీ అంచనా వేసింది. అయితే ఆ లెక్కలు తప్పాయి. ఎందుకంటే ఖతార్‌తోనూ అమెరికాకు మంచి సంబంధాలే వున్నాయి. పైగా ఖతార్‌లో దానికి అతి పెద్ద సైనిక స్థావరం వుంది.
ఖతార్‌ను వెలేసినప్పుడు జీసీసీ తరఫున 13 డిమాండ్లు పెట్టారు. సిరియాలోని అల్ కాయిదాతో, ఈజిప్టులోని ముస్లింబ్రదర్‌హుడ్‌తో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని, ఇరాన్‌తో సాన్నిహి త్యాన్ని వదులుకోవాలని, ఖతార్ ఆధ్వర్యంలో నడుస్తున్న అల్ జజీరా చానెల్‌నూ, ఇతర వార్తా సంస్థలనూ నిలిపివేయాలని, టర్కీతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని ఆ డిమాండ్లలో హుకుం జారీ చేశారు. పదిరోజుల్లో వీటి సంగతి తేల్చకపోతే డిమాండ్ల చిట్టా మరింత పెరుగు తుందని కూడా హెచ్చరించారు. కానీ ఖతార్ ఆ చిట్టాను కాస్తయినా ఖాతరు చేసిన జాడ లేదు. సరికదా టర్కీతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఇరాన్‌తోనూ యధావిధిగా సంబంధాలు కొనసాగిస్తోంది. జీసీసీ ఖతార్‌తో తెగదెంపులు చేసుకున్న 2017లోనే ఆ దేశానికి టర్కీ సేనలు మరిన్ని వచ్చాయి. ఇరాన్‌నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. మరి ఎందుకని జీసీసీ వెనక్కి తగ్గింది? అమెరికాలో ట్రంప్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలోనే ఇలా ఎందుకు జరిగింది? ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం వల్ల అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ వచ్చాక అవి మళ్లీ యధాతథ స్థితికొచ్చాయి.
ఆయన చొరవతో గల్ఫ్ దేశాలకూ, ఇజ్రాయెల్‌కూ మధ్య అనుబంధం ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మొన్న నవంబర్‌లో సౌదీలో రహస్యంగా పర్యటించారు. అంతేగాక యూఏఈ, బహ్రైన్, సూడాన్, మొరాకోలతో సైతం ఇజ్రాయెల్ చెలిమి చేస్తోంది. కానీ బైడెన్ రాకతో అమెరికా–ఇరాన్ సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయి. ఆ మేరకు అమెరికా–ఇజ్రాయెల్ మధ్య పొరపొచ్చాలు పెరుగుతాయి. ఈ పరిణామాలు సౌదీ అరేబియాకు ఏమాత్రం ఉపయోగపడేవి కాదు. అమెరికాను కాదని గల్ఫ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించటం సౌదీకి అసాధ్యం. అటు ట్రంప్ సలహాదారు కుష్నర్ కూడా ఖతార్‌తో వైషమ్యం కొనసాగించటం మంచిది కాదని సౌదీకి సూచించినట్టు ఇటీవలే వార్తలొచ్చాయి. కనుకనే ఇరాన్, టర్కీలతో ఖతార్ మునుపటికన్నా ఎక్కువగా సంబంధాలు మెరుగుపరుచుకున్నా జీసీసీకి గానీ, సౌదీకి గానీ అభ్యంతరం కనబడలేదు. సౌదీ యువరాజు మునుపటితో పోలిస్తే దూకుడు తగ్గించుకున్నారు. తన మాటే నెగ్గి తీరాలన్న పట్టుదలకు బదులు ఇప్పుడు అన్ని కోణాలనుంచే ఆలోచించే తత్వాన్ని అలవర్చుకున్నారు. అందుకే అన్నీ దిగమింగుకుని రాజీకి వచ్చారు.
గల్ఫ్ తాజా పరిణామాలు ఆ ప్రాంతానికే కాకుండా భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నిటికీ ఏదోమేరకు తోడ్పడేవే. ఖతార్‌పై అమలవుతున్న ఆంక్షల వల్ల ఆ ప్రాంతంలో వ్యాపార వ్యవహారాలు కుంటుపడ్డాయి. యూఏఈలో భాగమైన దుబాయ్‌కిది పెను సమస్యగా మారింది. దానికి ఖతార్ పెట్టుబడులు నిలిచిపోవడంతో వ్యాపారం దెబ్బతింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది. ఈ స్థితిలో ఖతార్‌పై ఆంక్షలు తొలగటం దుబాయ్‌కి కలిసొచ్చే అంశం. అలాగే మన దేశానికి చెందిన అశోక్ లేలాండ్, డాబర్ వంటి వ్యాపార సంస్థలకు మూడేళ్లుగా ఎదురవుతున్న చికాకులు పోతాయి.
యూఏఈలో వున్న అశోక్ లేలాండ్ బస్సు యూనిట్‌కు ఖతార్ నుంచి రావలసిన ఆర్డర్లు ఆంక్షలతో నిలిచిపోయాయి. అలాగే యూఏఈలో వున్న డాబర్ కర్మాగారం ఉత్పత్తులు ఖతార్‌కు వెళ్లటం లేదు. విమాన ప్రయాణికుల సమస్యలు సరేసరి. ఇవన్నీ ఇప్పుడు దారిలో పడతాయి. గల్ఫ్ దేశాల మధ్య మళ్లీ మునుపటిలా సాన్నిహిత్యం ఏర్పడటం స్వాగతించదగ్గదే అయినా ఆ దేశాలు తమ ప్రయోజనా లను బట్టికాక, అమెరికా పరిణామాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్థితి ఉండటం విచారించ దగ్గదే. ఇక నుంచి అయినా ఇలాంటి ధోరణి మారాలి. సమష్టి తత్వాన్ని అలవరుచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment