బ్రేకింగ్ న్యూస్...
‘ద్రౌపది తలబిరుసుతనం’
‘రాజాజ్ఞమేరకు ద్రౌపదిని కొలువు కూటానికి తోడ్కొని రావ డానికి వినమ్రంగా అంతఃపురంలో ప్రవేశించిన దుశ్శాసనుడు’
‘ద్రౌపది మొండితనం’, ‘దుశ్శాసనుడితో ద్రౌపది దురుసు ప్రవర్తన’
‘చాకచక్యంగా ద్రౌపదిని సభకు తీసుకుపోతున్న దుశ్శా సనుడు’
బ్రేకింగ్ న్యూస్...
‘భీముడి కండకావరం’
‘ద్రౌపదిని జుట్టుపట్టి లాక్కొని రావడం కూడా తప్పేనట’ ‘దుశ్శాసనునిపై భీముని అవాకులుచెవాకులు’
‘పేగులు తీసి మెడలో వేసుకుంటాడట’
‘దుశ్శాసనుని రక్తంతో ద్రౌపది జట్టును అలంకరిస్తాడట’
‘నిండు సభలో కారుకూతలు’
బ్రేకింగ్ న్యూస్...
‘బరితెగించిన భీముడు’
‘దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాడట’
‘రాజసభలోనే రారాజుపై రంకెలు’
బ్రేకింగ్ న్యూస్...
కర్తవ్యపాలన కోసం ద్రౌపదిని వివస్త్రను చేయడానికి మృదువుగా ప్రయత్నిస్తున్న దుశ్శాసనుడు
బ్రేకింగ్ న్యూస్...
‘ఎంటర్ ది శ్రీకృష్ణ.’
‘దుశ్శాసనుణ్ణి అడ్డుకున్న మాయావి కృష్ణుడు’
‘మాయోపాయాలతో ద్రౌపదికి శిక్షపడకుండా తప్పించిన దారుణం’
మహాభారత కాలంలో ఎల్లో మీడియా కూడా ఉండి ఉంటే ఆ మహాకావ్యాన్ని పైవిధంగా చదువుకోవలసిన దుస్థితి దాపురించి వుండేది. భగవంతుడు కరుణామయుడు. అప్పుడు ఎల్లో మీడియా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎల్లో మీడియా రిపోర్టింగును అర్థం చేసుకోవడానికి పనికివచ్చే కిటుకు ఆ బ్రేకింగ్ న్యూస్‌లో వుంది. ఎల్లో మీడియా వార్తలను పూర్తిగా వ్యతిరేకార్థంలో అన్వయించుకుంటే వాస్తవం బోధ పడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అంటే లోక్ సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి కూడా. ఆయన పార్లమెంట్‌లో అంతర్భాగం. ఆవిధంగానే ఎల్లో మీడియా అంటే కొన్ని పత్రికలు, కొన్ని చానళ్లతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా. రాజ్యాంగం ప్రకారం లెజిస్లేచర్ విభాగానికి హెడ్ రాష్ట్రపతి.
సభలను సమావేశానికి పిలిచే అధి కారం, అవసరమైతే రద్దు చేసే హక్కు ఆయనకు వుంది. అలాగే ఎల్లో మీడియా హెడ్ చంద్రబాబు. ఈ గ్రూప్‌లో అంతర్భాగంగా ఉన్న మీడియా సంస్థలను వాటి కష్టనష్టాల్లో కనిపెట్టుకొని వుండే బాధ్యత చంద్రబాబు తన భుజం మీద వేసుకున్నారు. ఎల్లో మీడియా–చంద్రబాబుల మధ్య పెనవేసుకున్న రామ్‌కో సిమెంట్ బంధం పాతికేళ్లుగా కొనసాగుతున్నది. ఎన్టీఆర్ ప్రచ్ఛన్న హత్యతో ప్రారంభమైన టీమ్‌వర్క్ అనేక రాజకీయ, ప్రజాస్వామిక విలువలను మంటగలుపుతూ నేటికీ కొనసాగుతున్నది. ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయాన ‘అసత్య హరిశ్చంద్ర’ నాటకాన్ని రోజుకు ఐదు ఆటల చొప్పున ఎల్లో వేదికల న్నిటిపై విరామం లేకుండా ప్రదర్శిస్తూ జనానికి విసుగు పుట్టిస్తు న్నారు. ‘రాష్ట్రంలో కరోనా విజృంభణ’, ‘ఒక్కరోజే 80 కేసులు’.. ‘కోరలు చాస్తున్న కరోనా’, ‘కరోనా పడగ’ తరహా శీర్షికలతో ఎల్లో పత్రికల్లో తొలుత బ్యానర్ స్టోరీ వస్తుంది. అబ్బో... దేశంలో ఎక్కడా లేనంత వ్యాప్తి ఏపీలోనే ఉందా? అనే భ్రాంతి కల్పించే విధంగా ఆ కథనాన్ని వండివారుస్తారు.
వెంటనే టీవీ చానళ్లలో ఎల్లో బృందం చేరిపోతుంది. కరోనాను నియంత్రించ డంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎల్లో సిండికేట్ అధ్యక్షులు రంగప్రవేశం చేస్తారు. ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. తాను కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్, రైలిం జిన్ దగ్గర ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయక పోవడం కారణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదే శ్‌లోనే కరోనా వైరస్ విస్తరిస్తున్నదని ఆరోపించడంతో ముగి స్తారు. ఆ వెంటనే వారి అనుబంధం సోషల్ మీడియా విభాగం చెలరేగిపోతుంది. ఆయనే ఉంటేనా?... ఆయనే ఉంటేనా? అనే శీర్షికలతో డజన్ల కొద్దీ్ద వీడియోలు స్వైర విహారం చేస్తాయి.
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే ఖడ్గంతో దోమలను చిత్రవధ చేసి చంపేసిన ఖడ్గ తిక్కన. రెయిన్‌గన్ చేతబూని కరువు రక్కసిని రాష్ట్రం పొలిమేరలు దాటేలా తరిమికొట్టిన మేజర్ చంద్రకాంత్. బస్సులో కూర్చొని మంత్రాలు పఠిస్తూ హుద్‌హుద్ తుపాన్‌ను పారద్రోలిన బ్రహ్మర్షి విశ్వామిత్ర... ఆయన ఉంటేనా?... ఈ తరహా కంటెంటుతో ఆ వీడియోలను దట్టిస్తున్నారు. వ్యవస్థీకృతంగా పథకం ప్రకారం జరుగుతున్న ఈ క్యాంపెయిన్ వెనుకనున్న ఉద్దేశం స్పష్టం. కరోనాపై సమ ర్థంగా పోరాడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌కు లభి స్తున్న ఇమేజ్‌పై మసిపూయడం, వీలైతే కొంచెం నెగెటివ్ షేడ్‌ను అద్దడం.
ఏపీలోనే వ్యాప్తి తక్కువ
ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరి శీలిస్తే పెద్ద రాష్ట్రాలన్నిటికంటే ఏపీలోనే కరోనా వ్యాప్తి తక్కు వగా ఉందనే విషయం తేటతెల్లమవుతుంది. ఏపీలో శనివారం వరకు ఉన్న సమాచారం ప్రకారం 61,266 మందికి నిర్ధారణ పరీ క్షలు చేశారు. వీరిలో 1,016 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అంటే పరీక్షించిన వారిలో 1.66 శాతం మందికి మాత్రమే వైరస్ సోకినట్టు తేలింది. బిహార్, ఒడిశా మినహా మిగిలిన పెద్ద రాష్ట్రా లన్నింటితో పోల్చినా ఏపీలోనే వైరస్ వ్యాప్తి తక్కువగా కన బడుతున్నది. మధ్యప్రదేశ్‌లో 7 శాతం, మహారాష్ట్రలో 7.15 శాతం, గుజరాత్‌లో 6.1 శాతం, తెలంగాణలో 5 శాతం, బెంగా ల్‌లో 6.4 శాతం వ్యాప్తి కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా కరోనా నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించిన రాష్ట్రంగా మీడియాలో ఎక్కువ ప్రచారాన్ని అందుకున్న కేరళలో కూడా 2.1 శాతం జనాభాకు వైరస్ వ్యాప్తి జరిగినట్టు తేలుతున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ వ్యాప్తి కేరళ కంటే తక్కువ. తమిళనాడు (2.75) కంటే కూడా ఏపీలోనే తక్కువ. కర్ణాటక మాత్రం ఏపీతో సమా నంగా వుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనం లోకి తీసుకోవాలి. నిర్ధారణ పరీక్షలు ఎంత ఎక్కువ పెరిగితే పాజిటివ్ కేసుల శాతం అంత కచ్చితంగా తేలుతుంది. జనాభా దామాషా ప్రకారం బిహార్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ పరీక్షలు జరిగాయి.
ఆ లెక్కన ఈ రాష్ట్రాల కంటే కూడా మెరుగైన స్థితిలోనే ఉన్నట్టు అర్థం చేసు కోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 676 మండలాలు వుంటే 561 మండలాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. కేవలం 115 మండలాల్లో మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి. ఈ మండ లాల్లోనే 196 క్లస్టర్లుగా కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జరిగిన నిర్ధారణ పరీక్షలన్నీ అత్యధికంగా ఈ 115 మండలాలకే పరిమితం. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకొని చూపినప్పుడు ఇప్పుడు తేలిన పాజిటివ్ కేసుల సంఖ్య బహు స్వల్పం. ఈ ఒక్క మెతుకు చాలదా? తెలుగుదేశం, దాని అనుబంధ కూటమి చేస్తున్న అసత్య ప్రచారకాండలో పస ఎంతో తేల్చడానికి. ఇటువంటి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా ఎన్డీటీవీ ఒక కథనాన్ని ప్రసారం చేస్తూ వైరస్ నియంత్రణలో ఏపీ అగ్రస్థానంలో ఉందనీ, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్ణాటక ఉన్నాయని చెప్ప డాన్ని కూడా తెలుగుదేశం కూటమి జీర్ణించుకోలేకపోయింది. ఆ చానల్‌పై దుమ్మెత్తిపోసింది. విశాఖపట్నానికి రాజధానిని తర లించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది కనుకనే అక్కడ కేసుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారనేది మరొక ఆరోపణ. మరి కర్నూలుకు జ్యుడీషియల్ రాజధాని తరలిస్తామన్నారు కదా, అక్క డెందుకు ఎక్కువ కేసులు చూపుతున్నారంటే సమాధానం లేదు. సంక్షోభం వేళ సహకార హస్తాన్ని సాచే బదులు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల ఇప్పటికే సర్వత్రా ఏహ్యభావం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి గురించి మరింత వివరంగా చర్చించడం దండగ.
జాన్ భీ... జహా... భీ
మొదటి లాక్‌డౌన్ సమయం పూర్తవడానికి ముందు ప్రధాని మోదీ సీఎంలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగానే జాన్ భీ... జహా భీ అనే పిలుపునిచ్చారు. అంటే జీవితం నిలబడాలి. ప్రపంచం నడవాలి అని దాని అర్థం. సగం జనాభాకు పైగా కాయకష్టాన్ని అమ్ముకొని బతికే దేశానికి ఒక్కసారిగా తాళం వేస్తే దాని దుష్ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు అందరి గమనంలోకి వస్తున్నది. ప్రతి వృత్తికీ, ప్రతి వ్యాపారానికీ, ప్రతి పరిశ్రమకూ తనదైన ఒక చెయిన్ ఉంటుంది. ఆ చెయిన్‌లో ఆర్థిక, శ్రామిక, మేధస్సుల కలబోత ఉంటుంది. చెయిన్ తెగితే లక్షలాది మంది జీవనాధా రాలు తెగిపోతాయి. అందుకే జీవనచక్రం తిరగడం ప్రారంభం కావాలి. కరోనా నియంత్రణను కట్టుదిట్టంగా అమలుచేస్తూ మరోపక్క ఆర్థిక రథం ఆగిపోకుండా సమన్వయం చేసుకుంటున్న కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ప్రముఖంగా ఉన్నది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనితీరు తెలుగుదేశం దాని మిత్రుల శిబిరాల్లో కలవరం కలిగిస్తున్నది. గంటల తరబడి సాగే కాలక్షేపం సమీక్షలు లేవు, ఆటోబయోగ్రఫీ వినిపించడానికి రోజు వారీ మీడియా సమావేశాలు లేవు, వ్యక్తిగత ప్రచార యావ అసలే లేదు. క్షేత్ర స్థాయి సమాచారంపై పూర్తి అవగాహనతో చకచకా సాగే సమీక్షలు, తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలు జరిగేలా పూర్తిస్థాయి నియంత్రణ. తమ ఊహలకందని విధంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిని ఢీ కొట్టాలంటే గోబెల్స్ దారి తప్ప గత్యంతరం లేదన్న నిర్ణయానికి విపక్ష శిబిరం వచ్చిందని దాని చేష్టలే చెపుతున్నాయి.
ఒకపక్క వారసత్వంగా లభించిన ఆర్థిక ఇబ్బందులనూ, నిరర్ధక రుణభారాన్ని తట్టుకుంటూనే, ఉన్న ఆదాయాన్ని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఇప్పటికే రెండుసార్లు ఉచిత రేషన్‌ను ప్రభుత్వం అందజేసింది. పేద కుటుంబాలన్నింటికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. పింఛన్‌ల పంపిణీ ఒక్కరోజు కూడా ఆలస్యం కాలేదు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారం భించారు. ఉపాధి హామీ పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రైతు పండించిన పంటలకు ధరలపై ప్రత్యేక దృష్టి సారించారు. టమాటా రైతులు పది పైసలకు కిలో అమ్ముకోలేక రోడ్ల మీద పారబోసే దృశ్యాలు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా కనిపించేవి. ఈ సంక్షోభ సమయంలో కూడా అటువంటి దృశ్యాలు కనిపించలేదు.
ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేసే నిర్ణయాన్ని తీసుకుని అమలుచేస్తున్నారు. హార్టికల్చర్, ఆక్వా సహా మొత్తం వ్యవసాయ మార్కెట్లపై ముఖ్యమంత్రి ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోపక్క గ్రీన్‌జోన్ మండలాల్లో సాధారణ కార్యక్రమాలు నెమ్మది నెమ్మ దిగా ప్రారంభమవుతున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిస్థాయిలో చెల్లించారు. మరోపక్క కరోనా విజృం భణ ఎనభైశాతం మండలాలున్న భౌగోళిక ప్రాంతాన్ని ఇప్పటికీ తాకకుండా కట్టడి చేశారు. కరోనా వైరస్ తాకలేదు కానీ పొలి టికల్ వైరస్ మాత్రం ఎల్లో మీడియా ద్వారా అన్ని ప్రాంతాలనూ తాకుతు న్నది. ఈ వైశాఖ మాసం ఎండల్లో అన్నిరకాల వైరస్‌లు నశించి వచ్చే జ్యేష్ఠమాసపు తొలకరి చినుకులతో ఉత్సాహభరిత జీవితం మళ్లీ చిగురించాలన్నదే ప్రజలందరి ఆకాంక్ష.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment