మెదళ్లలోకి బుల్డోజర్లు! | Review On Fake Propaganda Spreading Yellow Media Andhra Pradesh By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

మెదళ్లలోకి బుల్డోజర్లు!

Published Sun, Apr 24 2022 12:52 AM | Last Updated on Tue, Aug 9 2022 10:44 PM

Review On Fake Propaganda Spreading Yellow Media Andhra Pradesh By Vardhelli Murali - Sakshi

భారత రాజకీయాల్లో ఉత్తరాదివారి ఆధిపత్యం ఉంటే ఉండవచ్చు గాక! కానీ, చాలా విషయాల్లో దక్షిణాది నాయకులతో పోలిస్తే ఔత్తరాహులు దిగదుడుపే. ఈమధ్య ఉత్తరాది పాలక నాయకులు కక్షలు తీర్చుకోవడానికి ఒక కొత్త ఆయుధాన్ని కనిపెట్టారు. దాని పేరు బుల్డోజర్‌. మార్కెట్లో రకరకాల బ్రాండ్ల పేరుతో చలామణీలో ఉన్న బుల్డోజర్లకు సరికొత్త ఉపయోగితా విలువను జోడించిన వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్‌ క్రెడిట్‌ కొట్టేశారు. ఇప్పుడు లక్నో నుంచి భోపాల్‌ మీదుగా సదరు బుల్డోజర్‌ ఢిల్లీకి చేరుకున్నది.

కక్షలు తీర్చుకోవడానికి ఈ బుల్డోజర్‌ అనేది చాలా మొరటైన ఆయుధం. ‘నేను కక్ష తీర్చుకుంటున్నాను చూడండహో’ అని చాటింపు వేస్తున్నట్టుగా రణగొణ ధ్వనులతో దాని ఊచకోత కొనసాగుతుంది. ఊరు ఊరంతా అక్కడ గుమికూడుతుంది. గళ్ల లుంగీ, గుబురు మీసం, బుగ్గన పులిపిరి, చేతిలో చాకుతో కనిపించే డ్రామా విలన్‌ లాంటి కర్కశమైన ఆయుధాన్ని ఒక సాధువు కనిపెట్టడమే ఆశ్చర్యం గొలిపే విషయం. ఢిల్లీలో ఆ భయంకర బుల్డోజర్‌ విలన్‌ను ఒక డెబ్బయ్‌ ఐదేళ్ల వృద్ధ కమ్యూనిస్టు మహిళ బృందా కారత్‌ ఎదిరించి నిలబడిన దృశ్యం దేశవ్యాప్తంగా భావోద్వేగాలను తట్టిలేపింది. రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లోని క్లైమాక్స్‌ సీన్‌ మాదిరిగా లక్షలాది గుండెల్లో ముద్రితమైపోయింది. పరమ కర్కోటకుడైన విలన్‌ ఊరి మీద పడి చిత్రహింసలు పెడుతుంటాడు. హీరో వాడిని ఎదిరిస్తాడు. ఇంతలో వర్షం పడుతుంది. గుమిగూడిన జనంలోంచి ఓ పిల్లాడు ‘అన్నా! చంపేయ్‌ వాణ్ణి’ అని గట్టిగా అరుస్తాడు. జనమంతా ‘చంపేయన్నా... చంపేయన్నా’ అని కోరస్‌ అందుకుంటారు. ఆ ఉత్తేజంలో హీరో నిజంగానే చంపేస్తాడు వాణ్ణి. ఇది హీరో గొప్పతనం కాదు. విలన్‌ గొప్పతనమే! మన బుల్డోజర్‌ ఆయుధానికి కూడా అటువంటి భస్మాసుర శక్తి ఉన్నట్టు కనిపిస్తున్నది.

దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్లో కూటమి ఆయుధాల ముందు, ఉత్తరాది బుల్డోజర్లు ఎందుకూ కొరగావు. కలష్నికోవ్‌ తుపాకుల ముందు అవి ఈటెలు, బల్లేల వంటివి. రాష్ట్ర రాజకీయాల్లో ఇరవై ఏడేళ్ల కింద పురుడుపోసుకున్న ఎల్లో కూటమి దినదిన ప్రవర్ధమానమై, షోడశ కౌటిల్య కళలు నేర్చిన ‘చంద్ర’బింబం మాదిరిగా వెలిగిపోతున్నది. ‘ Necessity is the mother of invention అంటారు. యూదులంతా కలిసి ఇజ్రాయెల్‌ పేరుతో ఒక చిన్న దేశంగా ఏర్పడ్డప్పుడు చుట్టూ ఉన్న అరబ్బు దేశాలను ఎదిరించి నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని కొత్త కొత్త ఆయుధాలను, నిఘా వ్యవస్థలను వారు కనిపెట్టవలసి వచ్చింది. మన ఎల్లో కూటమి సోదర సోదరీమణులకు కూడా యూదులంతటి చతురతను ప్రదర్శించవలసి వచ్చింది. ఆ కూటమి పుట్టిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగిన మాస్‌ లీడర్లను ఎదుర్కొని నిలబడవలసిన ఆగత్సం ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటున్న కేసీఆర్‌ను మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారిలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి బలమైన ప్రజానాయకులు. ఈ ముగ్గురికీ కామన్‌ విలన్‌గా నిలబడవలసిన చారిత్రక అవసరం ఎల్లో కూటమికి కలిగింది.

వెన్నుపోట్లు, గోబెల్స్‌ ప్రచారాలు, విషపూరిత కుట్రలు, కోట్లు దండుకొని ఓట్లు కొనుగోలు చేయడం, రాజ్యాంగ వ్యవస్థలను చెరపట్టడం, ఎమ్మెల్యేలను కొనేయడం వగైరా షోడశ కళలు ఎల్లో కూటమి ‘చంద్ర’బింబ కాంతులుగా మారాయి. తప్పుడు ప్రచారానికి గోబెల్స్‌ పేరు స్థిరపడిపోయింది కాబట్టి ఆ పేరు వాడుతున్నాము కానీ, మన ‘బాబెల్స్‌’ ప్రచారం ఎదుట గోబెల్స్‌ ప్రచారం కొనగోటితో సమానం. ఇరవై ఏడేళ్లుగా ఎల్లో కూటమి ప్రదర్శిస్తున్న గారడీ విద్యలన్నీ ప్రజలకు తెలిసినవే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని యమర్జెంట్‌గా కూల్చివేయవలసిన అవసరం ఎల్లో కూటమికి ఏర్పడినట్టున్నది. ఇప్పుడా కూటమి వేలాది బుల్డోజర్లను బయటకు వదిలింది. రోడ్ల మీదకు కాదు. జనం మెదళ్లలోకి! కంటికి కనిపించని ఈ బుల్డోజర్లు ఎకాయెకిన ప్రజల మెదళ్లలోకి దూసుకొని పోవాలి. అక్కడ మొలకెత్తే ఆలోచనల్ని తొక్కేయాలి. ఇంగితాన్ని తార్కిక శక్తిని కూల్చేయాలి. మెదడు పనిచేయవద్దు. తాము పంపించే డేటా స్టోరేజిలోంచే జ్ఞానాన్ని గ్రహించాలి. బుల్డోజర్లు వాటి పనిని మొదలుపెట్టాయి. డేటా స్టోరేజిలోకి ప్రతిరోజు కొత్త కొత్త కథలు చేరుతున్నాయి.
తాజాగా ‘ఆ విద్యుత్‌ ఆదానిదే’ అనే ఒక కథనాన్ని వదిలారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. రైతులకు 9 గంటల విద్యుత్‌ను సమకూర్చే ప్రయత్నాల్లో భాగంగా 7 వేల మెగావాట్లను ‘సెకీ’ నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. ‘ఎ’ అనేవాడు తన అవసరం కోసం స్టేట్‌ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నాడనుకుందాము. ఆ బ్యాంకులో ‘ఎ’ ఒక్కడే లోన్‌ తీసుకోడు. ‘బీ, సీ, డీ’ వగైరాలు చాలామంది తీసుకుంటారు. అట్లాగే ‘డబ్లు్య, ఎక్స్, వై, జడ్‌’ లాంటి వేలాదిమందికి ఆ బ్యాంకులో డిపాజిట్లు ఉంటాయి. ‘ఎక్స్‌’ అనేవాడికి బ్యాంకులో డిపాజిట్‌ ఉంది కనుక, ‘ఎ’ అనేవాడు లోన్‌ తీసుకున్నాడు కనుక ‘ఎ’ తీసుకున్న లోన్‌ ‘ఎక్స్‌’ దగ్గరే అనే వాదనను ఏమనాలి? ‘ఆ విద్యుత్‌ ఆదానిదే’ అనే వాదన కూడా అటువంటిదే! ‘సెకీ’ అనేది ‘ట్రిపుల్‌ ఎ’ రేటింగ్‌ ఉన్న ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ ఆదాని లాంటి అనేకమంది దగ్గర కొనుగోలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆ సంస్థ దగ్గర కొనుగోలు చేసింది. వినేవాళ్లను వెర్రవాళ్ల కింద జమకట్టి వినిపించే కథ కాదా ఇది?

శుక్రవారం నాడు ఒంగోలులో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద నిధులు జమచేసే కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ఆ సభకు హాజరయ్యారు. అంతకు ఒకరోజు ముందు ఎల్లో మీడియా ఒక పిట్టకథతో హడావిడి చేసింది. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ వారి ఒక భారీ పరిశ్రమ ప్రారంభం. ఆ కార్యక్రమానికి ప్రచారం రాకుండా ఈ పిట్టకథనే ఎల్లో మీడియా ఎక్కువ ఫోకస్‌ చేసింది. ఆ పిట్టకథ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకుడైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడైన వేముల శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి ఇరవయ్యో తేదీ రాత్రి తిరుపతికి బయల్దేరారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్‌సీ కార్పొరేషన్‌ ద్వారా శాంక్షన్‌ అయిన కారును అరువు తీసుకొని, ప్రైవేట్‌ డ్రైవర్‌ను పెట్టుకొని, ఆయన ప్రయాణమయ్యారు.

ఒంగోలు వచ్చేసరికి వారికి టిఫిన్‌ చేయాలనిపించింది. నేషనల్‌ హైవే మీద ధాబాలున్నప్పటికీ వారు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లి ఒంగోలు టౌన్‌లోనే టిఫిన్‌ చేయాలని భావించారు. టౌన్‌లో పార్క్‌ చేయగానే రవాణా శాఖ హోంగార్డు తిరుపాల్‌రెడ్డి కాగితాలు చూపించమని డ్రైవర్‌ను అడిగాడు. కారు ఫిట్‌నెస్‌ గడువు తీరినట్టు గమనించాడు. ఈ విషయాన్ని అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అడుసుమిల్లి సంధ్యతో చెప్పారు. ఆమె కారును సీజ్‌ చేయాలని ఆదేశించారు. కానీ డ్రైవర్‌తో మాత్రం సీఎం కాన్వాయ్‌ కోసం సీజ్‌ చేస్తున్నామని చెప్పారు. తిరుపతి యాత్రికుల లగేజీని వాళ్లకిచ్చేశారు. ఆ లగేజీతో వారు బస్టాండ్‌కు వెళ్తున్న దృశ్యాలనూ, ఆటో ఎక్కిన దృశ్యాలనూ ఆ రాత్రిపూట అక్కడ సిద్ధంగా ఉన్న ఎల్లో మీడియా కెమెరాలు షూట్‌ చేశాయి. ఈ కథలో ఉన్న కంతలను విజ్ఞులెవరైనా గమనించగలుగుతారు.

సాధారణంగా ముఖ్యమంత్రులు గానీ, ఆ స్థాయి వీఐపీలు గానీ పర్యటనలో ఉన్నప్పుడు భద్రతా కారణాలతో కొన్ని ట్రాఫిక్‌ నియంత్రణలు అమలులోకి తెస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ నిబంధనలుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోనైనా, మరే రాష్ట్రంలోనైనా ఉంటాయి. ఈ నియంత్రణలను భూతద్దంలో చూపెట్టి రాద్ధాంతం సృష్టించిన సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. అధికారం కోల్పోయినందుకు తెలుగుదేశం – ఎల్లో కూటమిలో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌లో ఉంది. అందుకు కారకుడైన జగన్‌మోహన్‌రెడ్డిపై పీకల దాకా కోపంతో ఆ శ్రేణులు ఊగిపోతున్నాయి. మొన్ననే ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తరఫున వందమందితో ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉన్నా మని హెచ్చరించారు. ఒకపక్క ఆత్మాహుతి దళాల ఏర్పాటు, మరోపక్క ముఖ్యమంత్రి భద్రతపై విమర్శలతో కూడిన క్యాంపె యిన్‌... ఇవన్నీ అనుమానాలకూ, ఆందోళనకూ తావివ్వడం లేదా? పోలీసు శాఖ వీటిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదా?

విజయవాడ ఆస్పత్రిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక అభాగ్య బాలిక అత్యాచారానికి గురైంది. ప్రభుత్వం వేగంగా స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలబడింది. ప్రతిపక్షం ఈ ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తప్పేమీ లేదు. ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉండదు. కానీ ఒక సైన్యం దండయాత్రగా వెళ్లినట్టు మందకు మంద ఆస్పత్రిలో దూరడమేమిటి? మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌పై దాడికి దిగడమేమిటి? ఈ సైన్యం సమక్షంలో సీనియర్‌ రాజకీయ వేత్తయిన చంద్రబాబు రెచ్చిపోయారు. ‘ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా రక్షణ ఉందా’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే బాధ్యత లేకుండా దుర్మార్గులను ఆడబిడ్డల మీదకు పంపించారు. ముఖ్యమంత్రికి పాలించే అర్హత ఉందా? శీలం విలువ తెలుసా? అంటూ చెలరేగిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉపదేశించిన సుభాషితాలిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘‘మనుషులకు భయం ఉండాలి. ఒక్కొక్కరికీ ఒక్కో పోలీసును పెట్టలేము. ప్రజలకు క్రమశిక్షణ, చట్టనిబద్ధత ఉండాల’’ని ప్రసంగించి, మీ చావు మీరు చావండని చేతులు దులుపుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా అచ్చం అపరిచితుడులాగా మాట్లాడటం ఎలా సాధ్యమవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీనియర్‌ రాజకీయవేత్త వ్యక్తిత్వానికి ఇదొక ఉదాహరణ.

సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారనీ, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారనీ, శ్రీలంక పరిస్థితి ఏర్పడబో తున్నదనీ రాయని రాతా లేదు, కూయని కూతా లేదు. స్వతంత్ర దేశమైన శ్రీలంకకూ, దేశంలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కూ సాపత్యమేమిటో? విదేశీమారకం కరిగిపోయి చెల్లింపులకు స్థోమత లేక దిగుమతులు ఆగిపోయి, ధరలు పెరిగాయి. జీవనాధారమైన టూరిజాన్ని కోవిడ్‌ దెబ్బకొట్టింది. తొందరపాటు వ్యవసాయ విధానాలతో దిగుబడులు మూడో వంతుకు పడిపోయాయి. ఇవన్నీ కలిసి శ్రీలంకను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ఇందులో ఏదైనా అంశం ఆంధ్రప్రదేశ్‌కు నప్పుతుందా? పైగా ఎల్లోకూటమి పాలిట స్వర్ణయుగం రోజుల్లో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోవిడ్‌ లాంటి ఇడుములు లేకుండా ఆదాయం నాలుగు పాదాల మీద రేసుగుర్రంలా పరుగెత్తుతున్న సమయాన జీఎస్‌డీపీలో అప్పుల స్థాయి 35 శాతం. ఇప్పుడు కాలాన్నీ, జీవనయానాన్నీ కోవిడ్‌ కాటేసినప్పటికీ, ఆదాయాలు పడిపోయి పెట్టవలసిన ఖర్చులు పెరిగినప్పటికీ జీఎస్‌డీపీలో 32.5 శాతానికే అప్పుల్ని పరిమితం చేయగలిగారు. ఆర్థిక నియంత్రణలో ఎవరు మెరుగు?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమంపై ఖర్చు పెడుతున్న మాట వాస్తవం. గతం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మాట కూడా నిక్కమే! అప్పుల పేరుతో, సంక్షోభాల సాకుతో పేదలను ఆదుకునే కార్యక్రమాలను ఆపేయమంటారా అని స్వయంగా ముఖ్యమంత్రే ఎదురుదాడి చేయడంతో ఎల్లో కూటమి బెంబేలెత్తింది. సర్దుబాటు ప్యూహాన్ని తయారు చేస్తున్నది. అసలు సంక్షేమం మీద జగన్‌మోహన్‌రెడ్డికి పేటెంటేమీ లేదనీ, ఆ కార్యక్రమాలన్నీ వేదాల్లోనే ఉన్నాయనీ కొత్త పాట పాడేందుకు సన్నాయిమేళాన్ని సిద్ధం చేస్తున్నది. సంక్షేమ కార్యక్రమాలకు బద్ధ విరోధినని స్వయంగా ప్రకటించుకున్న చంద్రబాబు హయాంలోని సంక్షేమంపై కొన్ని ధారావాహికలను ప్రచారం చేస్తారట!

ఎల్లో కూటమికి అర్థం కాని విషయం, ఆ మాటకొస్తే తటస్థులకూ, కొందరు మేధావులకు కూడా పూర్తిగా అవగాహన కాని విషయం ఒకటున్నది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కేవలం సంక్షేమం కాదు. సంక్షేమం ఒక భాగం మాత్రమే! సంక్షేమాన్నీ, అభివృద్ధినీ మిళితం చేసిన మానవీయ అభివృద్ధి మోడల్‌! దాన్నే కొందరు ‘సమ్మిళిత అభివృద్ధి’ అంటున్నారు. కొందరు ‘సమగ్ర అభివృద్ధి’ అంటు న్నారు. అభివృద్ధి అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమనుకునేవారికి ఈ కోణం అర్థం కాదు. సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని జాతులు, కులాలు, ప్రాంతాల ప్రజలందరూ సాధికారత సాధించడానికి అవసరమైన కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపొందించింది. ప్రజలందరూ సాధికార శక్తులుగా రూపొందిన నాడు ఆ సమాజం అభివృద్ధి క్రమంలో సహజం గానే అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పుడు అమలు చేస్తున్న సాధికారతా యజ్ఞంలో సంక్షేమం ఒక భాగం. రైతులూ, డ్వాక్రా మహిళలూ, నడివయసు మహిళలూ... ఇలా నిర్లక్ష్యానికి గురైన వర్గాలన్నీ ఆయా సమూహాల వారీగా సాధికారత సాధించడా నికీ, ఉమ్మడిగా అన్ని వర్గాల సాధికారతకు ఉపకరించే విధంగా విద్య, వైద్య మోడళ్లను ఈ ప్రభుత్వం డిజైన్‌ చేసింది. చిట్టచివరి ఇంటి గడప దాకా పరిపాలనను వికేంద్రీకరించడం కూడా సాధికారతలో భాగమే. ఈ మొత్తం సాధికారతా విశ్వరూపాన్ని వదిలేసి, సింపుల్‌గా ‘సంక్షేమం’ అనే ఒక్క మాటతోనే ఈ ప్రభుత్వాన్ని బ్రాండింగ్‌ చేయడం మహా పర్వతాన్ని మరు గుజ్జుగా చూపడమే అవుతుంది.

వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement