ఆశయాల నడుమ సంఘర్షణ సహజం. సిద్ధాంతాల నడుమ వైరుద్ధ్యాలు సహజం. ఈ వైరుద్ధ్యాల్లోంచే, సంఘర్షణలోంచే సత్యం ప్రభవిస్తుందని నమ్ముతారు. అందుకే వికాస ప్రియులందరూ భిన్న ఆశయాలను స్వాగతిస్తారు. విభిన్నమైన ఆలోచనల స్వేచ్ఛా ప్రసా రానికి కిటికీలు తెరుస్తారు. జగమెరిగిన మావో జెడాంగ్ సుభాషితాన్ని కూడా మరోసారి ప్రస్తావించవచ్చు. నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీ పడాలన్నారు మావో. ఈ భావ సంఘర్షణ కాలక్రమంలో రకరకాల పరిణామాలకు లోనై ఉండవచ్చు. ఎన్నెన్నో సరికొత్త ఛాయలను ఆవిష్కరించి ఉండవచ్చు. నేటి ఆంధ్రప్రదేశ్‌లో అది కొందరి ఆశలకు, కోట్లాదిమంది ఆకాంక్ష లకు మధ్యన ఏర్పడిన ఘర్షణగా మారింది. ఇక్కడ ప్రధాన రాజకీయ భూమికగా మారిన ఇతివృత్తం కూడా ఇదే. కొందరి ఆశ – ట్రెజర్ హంట్ అనే మృగయా వినోదం. కోట్లమంది ఆకాంక్ష –ఎంపవర్‌మెంట్‌తో సమకూరే ఆత్మగౌరవం.
ఈ ట్రెజర్ హంట్ (నిధుల వేట) అనేది ఎంత అమాన వీయమైనదో, ఎంత నేరపూరితమైనదో, ఎంత క్రూరముఖీ నమైనదో మనకు తెలియని విషయం కాదు. ‘మెకన్నాస్ గోల్డ్’ నుంచి ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ వరకు ఎన్నెన్నో సినిమాలు ఆ కర్కశ స్వభావాన్ని మనకు తెరపరిచాయి. నవలల్లో, కథల్లో కూడా చదివి వుండవచ్చు. విని ఉండవచ్చు. ఇక్కడున్న ట్రెజర్ హంట్ ముఠా కార్యస్థానం రాజకీయం కనుక, ప్రజల ఓట్లతోనే పబ్బం గడుస్తుంది కనుక దూసే కత్తులు మెత్తగా, పువ్వుల గుత్తుల్లా ఉంటాయి. మోముల్లో క్రౌర్యానికి బదులు మోసపూరితమైన నవ్వులుంటాయి. కానీ స్వభావం నేరపూరితమే. లక్ష్యం స్వార్థమే. అప్పుడప్పుడూ ఈ వ్యాఘ్రం తగిలించుకున్న గోముఖం ముఖోటా జారిపోతూనే ఉంటుంది. కప్పుకున్న మేక తోలు చెదిరిపోతూనే ఉంటుంది. సాధికారత కోరుకుంటున్న బలహీన వర్గాలపై ఛీత్కారాలు బహిరంగమవుతూనే ఉంటాయి.
ఈ చర్చలో ముఖోటాలకూ, ముసుగులకూ తావు లేదు. ఆ ట్రెజర్ హంట్ ముఠా తెలుగుదేశం పార్టీ, దాని అనుంగు ఎల్లో కూటమే. ఇది ఆరోపణ కాదు. విభజిత రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండగా ఆ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలు, ప్రతిపక్షంగా ఈ మూడున్నరేళ్లలో చేపట్టిన కార్యక్రమాల విశ్లేషణ అనంతరమే ఈ నిర్ధారణ. తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానాలు, కార్యక్రమాలు తెలిసినవే కనుక సొంతంగా విశ్లేషించడానికి ఎవరైనా పూనుకోవచ్చు. సత్యాన్ని నిర్ధారించుకోవచ్చు. పరంపరగా వస్తున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అరకొరగా అమలు చేయడం తప్ప పేదవర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. రాజధాని పేరుతో అమరావతి పలవరింత, కమీషన్ల కోసం పోలవరాన్ని పట్టాలు తప్పించడం మినహా మరో మహత్కార్యం తెలుగుదేశం పార్టీ ఖాతాలో లేదు. ఈ రెండూ ట్రెజర్ హంట్‌లో భాగం కావడమే అవి చేసుకున్న మహద్భాగ్యం.
ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర నిధులతో కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలి. కేంద్రమే నిర్మిస్తే తమకు కమీషన్లు ముట్టవు కదా అనే దుగ్ధ తెలుగుదేశం అధినేతలకు ఏర్పడింది. అప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా ఉన్నారు కనుక ఆ పలుకుబడిని వాడుకొని నిర్మాణ కార్యక్రమాన్ని తామే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు. తమ పార్టీ ఎంపీ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదని తెలిసినా కమీషన్ల కక్కుర్తితో లక్ష్యపెట్టలేదు. చేతగాని సంస్థ బిల్లులెత్తుకోవడమే తప్ప పనులు చేయకుండా కాలయాపన చేసింది. పుణ్యకాలం గడిచిపోతున్న నేపథ్యంలో పట్టిసీమ పేరుతో ఎత్తిపోతల పథకాన్ని రంగంలోకి తెచ్చారు. పోలవరానికి దిగువ నుంచి నీళ్లు ఎత్తి ప్రధాన ప్రాజెక్టు కుడి కాల్వలో పోసే పథకం. ఈ పోలవరం కుడి కాలువ 90 శాతం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయింది. పోలవరం పూర్తయితే ఈ ఎత్తిపోతల ఆరో వేలు అవుతుంది. అయినా 1900 కోట్లు దీని మీద తగలేయడమంటే, సదరు ఔదార్యం వెనుకనున్న మతలబు కమీషన్లేనన్న విషయం సామాన్యుడికి కూడా అర్థమైంది. అలాగే ఎడమ కాలువ గట్టుమీద 1900 కోట్లతో పురుషో త్తమపట్నం ఎత్తిపోతలను తలకెత్తుకున్నారు. ఈ 3800 కోట్లు ప్రధాన ప్రాజెక్టుపై ఖర్చు చేసి ఉంటే కథ వేరుగా ఉండేది.
ప్రధాన ప్రాజెక్టులో ఇంకో ఘనకార్యముంది. కాలూ చెయ్యి కదిలించలేకపోయిన సొంత పార్టీ కాంట్రాక్టర్‌ను తప్పించి మరో అస్మదీయ సంస్థను రంగంలోకి దించారు. ప్రాజెక్టుల ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన డ్యామ్ కట్టే ప్రదేశానికి ఎగువన... దిగువన మట్టి కట్టలు (కాఫర్ డ్యామ్) కట్టి, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ గుండా ప్రవాహాన్ని మళ్లించిన తర్వాతనే ప్రధాన డ్యామ్‌కు పునాది వేయాలి. ఈ పునాదినే డయాఫ్రమ్ వాల్ అంటారు. మట్టి కట్టలు కడితే కమీషన్లేం గిట్టు బాటవుతాయి. అందుకని ఎగువ కాఫర్ డ్యామ్‌ను కొంత మేరకు కట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. 2019లో వరదలు వచ్చి నప్పుడు మట్టి కట్ట గ్యాప్‌లోంచే మొత్తం ప్రవాహం వెళ్లాల్సి రావడంతో ఉరవడి పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దాంతో కథ మొదటికి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసినప్పటికీ డయాఫ్రమ్ వాల్ సంగతి తేలవలసి ఉన్నది. ‘చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద’ అనే సామెత తెలుగుదేశం పార్టీ వ్యవహారానికి అతికినట్టు సరిపోతుంది. ట్రెజర్ హంట్ వ్యామోహంలో పడి ప్రాజెక్టు పనిని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చిపారేసింది. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం మొన్న ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను ఎల్లో మీడియా కవర్ చేసిన తీరును చూస్తే చాలు, ట్రెజర్ హంట్ ముఠా అమరావతి విషయంలో ఎంత ఆకలితో ఉన్నదో, ఎంత ఆత్రంతో ఉన్నదో అర్థమవుతుంది. అమరా వతే రాజధానిగా కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు, రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని తేల్చినట్టు పత్రికల్లో, ఛానళ్లలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. కేంద్రం ఆ మాట ఎక్కడా అనలేదు. అందులో కేంద్రం ప్రస్తావించిన అంశాలు ఇవి. 1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, సెక్షన్ 5 ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజ ధానిగా ఉంటుంది. 2. సెక్షన్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజ ధానిని సూచించడానికి నిపుణుల కమిటీని నియమించాలి. ఆమేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ను నియమించడం, ఆ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. కమిటీ ఇచ్చిన నివేదికను తదుపరి చర్యల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగింది. 4. సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో వసతుల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయవలసి ఉన్నది. ఇందుకోసం 2500 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి అందజేసింది. 5. 2020లో రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను తీసుకొచ్చింది. సీఆర్‌డీఏ (తొలగింపు) చట్టంతోపాటు వికేంద్రీకరణ – అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టాలను రాష్ట్రం చేసింది. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉంటాయి. ఈ వ్యవహా రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపలేదు, కనుక పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలతో కేంద్రానికి సంబంధం లేదని మాత్రమే అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించినదిగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నది. పార్లమెంట్ సభ్యులు గతంలో అడిగిన ప్రశ్నలకు కూడా ఇదే వైఖరితో సమాధానాలు ఇచ్చింది. అఫిడవిట్‌ను పరిశీలిస్తే కూడా అదే అంశం స్పష్టమవుతుంది. చట్టం ప్రకారం కేంద్రం నిపుణుల కమిటీని వేసిందనీ, ఆ నివేదికను రాష్ట్రానికి పంపించిందనీ పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసిందనే చెప్పారు తప్ప నిపుణుల కమిటీ సిఫారసులకు భిన్నంగా రాజధానిని ఎంపిక చేయడాన్ని కూడా ఎత్తిచూపలేదు. ఎందుకంటే మొదటినుంచీ కేంద్రం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంగానే పరిగణిస్తున్నది కనుక! రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన 2500 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 600 కోట్లతో అద్భుతంగా నిర్మించిన తెలంగాణా కొత్త సచివాలయం కళ్లెదుట కనిపిస్తుంటే అంత డబ్బును బాబు ఏం చేసి ఉంటాడనే ప్రశ్న మెదులుతూనే ఉంటుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఒక కీలకమైన అంశం. తద్వారా పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఆమేరకు ప్రజల సాధికారత పెరుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, రాజధాని గుర్తింపు కోసం వేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఈ అంశాలను ప్రస్తావించాయి. వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యా మన్న అభిప్రాయంతో ఉన్నారని విభజనకు ముందే శ్రీకృష్ణ కమిషన్ గుర్తించింది. పరిపాలనను వీలైనంతమేరకు వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కొత్తగా రాజధాని నిర్మాణానికి (గ్రీన్‌ఫీల్డ్) పూనుకోవద్దనీ, రాజధాని కోసం పంట భూములను వాడుకోవద్దనీ, విజయవాడ – గుంటూరు నగరాల మధ్యన అసలే వద్దని నిపుణుల కమిటీ సూచించింది. ఈ మూడు కీలక సూచనలనూ చంద్రబాబు ప్రభుత్వం నగ్నంగా ఉల్లంఘించింది.
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడానికి కూడా చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు. అది నిపుణుల కమిటీ కాదు. నారాయణ రిటైర్డ్ న్యాయమూర్తో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారో కాదు. పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణుడో, ఆర్థికవేత్తో కాదు. విద్యను వ్యాపారంగా దిగజార్చిన బేహారుల్లో ముఖ్యుడు. ‘ఆకలితో చావనైనా చస్తాను గానీ సరస్వతీ దేవిని అంగట్లో పెట్టన’ని ప్రతిన చేసి, అమ్మవారి కాటుక కంటి నీరు తుడిచిన పోతన పుట్టిన తెలుగు నేలపై చదువుకు ఖరీదు కట్టి తూకం వేసిన వారిలో అగ్రగణ్యుడు నారాయణ. అటువంటి నారాయణతో కమిటీ వేయడమంటే అది అక్షరాలా ట్రెజర్ హంట్ కాకుంటే మరేముంటుంది? అదే నిజమని ఆచరణలో తేలిపోయింది. బినామీ పేర్లతో వేలాది ఎకరాల సమీకరణ వెనుకనున్న రహస్యం, సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న అభివృద్ధి ఒప్పందాల వెనుకనున్న లోగుట్టు లక్షలకోట్ల కుంభకోణంగా అంచనా వేస్తున్నారు. అరవైమంది ఆందోళనకారులు ఆధార్ కార్డులను చూపలేక చేతు లెత్తేయడంతో అమరావతి రైతుల ఉద్యమం బినామీల ఉద్యమంగా తేలిపోయింది. ఈ మూడున్నరేళ్లలో అమరావతి ట్రెజర్ హంట్ కోసం ఆందోళన చేయడం, అడ్డుగా ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం, ఆడిపోసుకోవడం, విష ప్రచారాలు ఎక్కు పెట్టడం తప్ప ఎల్లో కూటమి చేసిన ఘన కార్యాలేమీ లేవు.
ఇందుకు పూర్తి భిన్నంగా పేద ప్రజల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం నిలబడింది. పరిపాలనా వికేంద్రీకరణను అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్లి పేదవాడి ఇంటి తలుపు తట్టింది. ధనికుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాన్ని పేద పిల్లలకూ కలుగజేసింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతా లలోని కడగొట్టు వ్యక్తికి కూడా ఆరోగ్య హక్కును కల్పించి, ప్రజారోగ్య విప్లవ పతకాన్ని ఎగురవేసింది. చిన్నరైతు కూడా తలెత్తుకొని నిల బడగలిగేలా చేయందిస్తున్నది. మహిళా సాధికారత కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతంగా ఫలాలనందిస్తున్నాయి. పేద ప్రజల సాధికారత ఈ మూడున్నరేళ్లలో ఉద్యమ రూపం దాల్చింది. పేద ప్రజల ఎంపవర్‌మెంట్‌కూ – పెత్తందార్ల ట్రెజర్ హంట్‌కూ పొత్తు పొసగదు. యుద్ధం జరగవలసిందే. అదే జరుగుతున్నది. పెత్తందార్లది స్వార్థపూరిత యుద్ధం. పేద ప్రజలది న్యాయమైన పోరాటం. న్యాయమే గెలవాలి. గెలుస్తుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment