అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి? | Vardelli Murali Guest Column On Maoist Ganapathy | Sakshi
Sakshi News home page

‘గణపతి’ నిమజ్జనం!

Published Sun, Sep 6 2020 12:23 AM | Last Updated on Sun, Sep 6 2020 8:01 AM

Vardelli Murali Guest Column On Maoist Ganapathy - Sakshi

గణపతి... భారత మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం దళపతిగా పనిచేసిన వ్యక్తి. ఆ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎల్లలు దాటించి జాతీయస్థాయి కల్పించిన వ్యూహకర్తల్లో ప్రథముడు. ప్రపంచంలో టాప్‌ టెన్‌ తిరుగుబాటు గెరిల్లా సైన్యాల్లో ఒకటైన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అటువంటి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్య కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోబోతున్నాడని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ఈ వార్తలను అధికారికంగా ఖండించింది. ప్రభుత్వాలు, పోలీసుల కుట్రలో భాగమే ఇటువంటి వార్తలని ఆ పార్టీ ఆరోపించింది. అసలీ గణపతి అవతారం నేపథ్యమేమిటి? ఈ అవతారంతో ప్రస్తుత సమాజానికి ఉపయోగం ఏదైనా ఉన్నదా? ఆయన లొంగిపోతే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం?. ఈ సందర్భంలో తలెత్తే ఇటువంటి సహజమైన సందేహాలు తీరాలంటే ఈ దేశంలో గడిచిన యాభయ్యేళ్లలో సంభవించిన కొన్ని పరిణామాలపై కనీసం ఒక విహంగ వీక్షణం అవసరం.

తన యవ్వన తేజస్సుతో సమస్త భూమండలాన్ని వెలిగించిన కాలం మన చరిత్రలో ఒకటుంది. అది ఒక దశాబ్దకాలం. ఇరవయ్యో శతాబ్దంలోని అరవయ్యో దశకం. ఐదు ఖండాల్లోని యువతరం సకల జీవన రంగాల్లోని సంప్రదాయ పోకడలపై ధిక్కారస్వరం వినిపించిన కాలం అది. బ్రిటన్‌ ఆ కాలాన్ని ‘స్వింగింగ్‌ సిక్ట్సీస్‌’ అని పిలిచింది. ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఉద్యమ తాకిడికి ఛార్లెస్‌ డిగాల్‌ ప్రభుత్వం గడగడలాడింది. యూరప్‌ అంతటికీ ఆ ఉద్యమం వ్యాపించింది. అమెరికాలో పౌరహక్కుల కోసం మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిచిన కాలం. ఆఫ్రికాలోని కాంగో నుంచి లాటిన్‌ అమెరికాలో బొలీవియా వరకు చేగువేరా విప్లవ శంఖారావాలు చేసిన కాలం. సంగీత ప్రపంచంలో ధిక్కార స్వరం బీటిల్స్‌. సంప్రదాయ జీవన విధానాలపై అభిశంసన, అవిశ్వాస ప్రకటనగా వెలుగులోకి వచ్చిన హిప్పీ సంస్కృతి ఈ కాలం వేసిన చిగుళ్లే. ఈ స్థాయిలో యువతరం కాలగమనాన్ని శాసించిన సందర్భం మరొకటి లేదు. అరవయ్యో దశకం ఉద్యమాల ప్రభావం ఆ తర్వాత దశాబ్దంలో కూడా కొనసాగింది. ప్రపంచమంతటా వీస్తున్న కొత్త గాలులు భారతదేశంలో కూడా వ్యాపించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రకరకాల సమస్యలపై విద్యార్థులు ఉద్యమించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని విద్యార్థులే నిర్మించి 350 మంది ప్రాణత్యాగం చేశారు. వీటితోపాటు గణపతి అవతారానికి దారితీసిన పూర్వరంగం కూడా సిద్ధమైంది.

ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీది వందేళ్ల చరిత్ర. 1920లో ఏర్పడింది. ఈ వందేళ్ల చరిత్రలో వ్యూహాత్మక తప్పిదాలు చేయడంలో తన రికార్డులను తనే అనేకసార్లు బద్దలుకొట్టుకున్నది. స్వాతంత్య్రం కోసం దేశ ప్రజలంతా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు దూరమైంది. ఆ తర్వాత కాలంలో నిజాం సంస్థానంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో, ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో ఉన్న పున్నప్రా – వాయిలార్‌ పోరాటాల ఫలితంగా కేరళలోను, ‘తెభాగా’ రైతు ఉద్యమం కారణంగా బెంగాల్‌లోనూ, బట్టల మిల్లుల కార్మికులను సమీకరించి బొంబాయిలోనూ ఆ పార్టీ నిలదొక్కుకోగలిగింది. భారత్‌కు మిత్రుడిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచిన చైనా మన దేశ భూభాగాలను దురాక్రమణ చేసిన సందర్భంలోనూ కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం చైనాకు మద్దతుగా మాట్లాడింది. వీళ్లందరినీ భారత ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్లంతా పార్టీని చీల్చి సీపీఎంగా ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్త తిరుగుబాటు గాలుల ప్రభావం సీపీఎంను నిలువునా చీల్చింది. బెంగాల్‌లో చారుమజుందార్, కానూ సన్యాల్‌ల నాయకత్వంలో నక్సల్బరీ విప్లవ పార్టీ ఆవిర్భవించింది.  వీళ్లు నక్సలైట్లుగా వాడుకలోకి వచ్చారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళంలో గిరిజన పోరాటాలు మొదలయ్యాయి. ఉస్మానియాలో జార్జిరెడ్డి అనే ఉద్యమ కెరటం ఎగసిపడింది. అతిచిన్న వయసులోనే ఆయన హత్యకు గురైనప్పటికీ, ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు విద్యార్థి ఉద్యమాలను జార్జిరెడ్డి నామస్మరణే శాసించింది. అనంతర కాలంలో వందలాదిమంది విద్యార్థులు నక్సల్స్‌ బలగాల్లో చేరిపోయారు. దేశవ్యాప్తంగా వందకు పైగా గ్రూపులుగా ఈ నక్సల్స్‌ చీలిపోయారు. అనేకమార్లు కూడికలు, తీసివేతలు జరిగిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌వార్‌ గ్రూప్, బిహార్‌లో పనిచేస్తున్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసీసీ) రెండు బలమైన గ్రూపులుగా నిలదొక్కుకున్నాయి. పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నిష్క్రమణ అనంతరం ఆ పార్టీ నాయకునిగా గణపతి ఎన్నికయ్యారు.

ఎమర్జెన్సీకి ముందు కరీంనగర్‌ జిల్లాలో స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణరావు, గ్రామసీమల్లో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విప్లవ కమ్యూనిస్టు పార్టీల పట్ల ఆకర్షితుడయ్యాడు. విద్యార్థులు, యువకులతో కలిసి గ్రామీణ పేదలను ఆర్గనైజ్‌ చేసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ పోరాటాలు ఎంత బలమైన ముద్ర వేశాయంటే 1978లో జరిగిన ‘జగిత్యాల జైత్రయాత్ర’ సభకు లక్షల సంఖ్యలో గ్రామీణ పేదలు హాజరయ్యేంతగా. ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలోని భూస్వాములంతా గ్రామాలను వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో కొంతకాలం పీపుల్స్‌వార్‌ సమాంతర పాలన నడిచింది. గణపతి నాయకత్వంలో మరింత మిలిటెంట్‌ సంస్థగా పీపుల్స్‌వార్‌ తయారైంది. నక్సల్స్‌ – పోలీసు ఎన్‌కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులతో దాదాపు దశాబ్దకాలంపాటు ఉత్తర తెలంగాణ పల్లెలు దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకంగా యాంటీ–నక్సల్స్‌ దళాలను ఏర్పాటు చేసుకుని చివరకు పోలీసులు పైచేయి సాధించారు. పీపుల్స్‌వార్‌ దళాలు గోదావరి నదిని దాటి దండకారణ్యం వైపు, బస్తర్‌ అడవులు, చంద్రాపూర్‌ అడవుల వైపు సాగిపోయాయి. ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి చొరవతో మరో బలమైన నక్సల్స్‌ పార్టీగా ఉన్న ఎంసీసీలో పీపుల్స్‌వార్‌ విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది.

ఈ ఐక్య పార్టీలోను కీలకమైన నాయకత్వ స్థానాలు పాత పీపుల్స్‌వార్‌ నేతలకే దక్కాయి. కార్యదర్శిగా గణపతి కొనసాగారు. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో కార్యదర్శి బాధ్యతల నుంచి గణపతి తప్పుకున్నారు. ఆ స్థానంలో మరో తెలుగువాడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీని బెంగాల్‌ దాకా విస్తరింపజేసిన వ్యూహకర్త కిషన్‌జీ అలియాస్‌ మల్లోజుల కోటేశ్వరరావు కూడా తెలుగువాడే. కరీంనగర్‌ జిల్లా స్వస్థలం. మూడున్నర దశాబ్దాలుగా పాతుకుపోయిన సీపీఎం సర్కార్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించిన నందిగ్రామ్‌ పోరాట రూపశిల్పి కిషన్‌జీ. తాను అధికారంలోకి రావడానికి పరోక్ష కారణమైన కిషన్‌జీని అనంతర కాలంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేసి చంపడం కొసమెరుపు. ప్రస్తుతం గంగాతీరం నుంచి గోదావరి తీరం వరకు విస్తరించిన బిహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణ, ఆం్ర«ధా సరిహద్దుల వరకు మావోయిస్టు పార్టీ ప్రభావం కనబడుతున్నది.

ఇప్పుడు దేశంలో ఎన్ని కమ్యూనిస్టు గ్రూపులు పనిచేస్తున్నప్పటికీ మూడు మాత్రమే ప్రధానమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో పనిచేస్తూ, ఎన్నికల్లో పాల్గొంటున్న సీపీఐ, సీపీఎం, సాయుధ పోరాట మార్గాన్ని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ. అజ్ఞాతంలో పనిచేసే రెండు సాయుధ పార్టీలు విలీనం కాగలిగాయి కానీ, రెండు ఎన్నికల పార్టీలు మాత్రం విలీనం కాలేకపోయాయి. ఇక్కడే బ్యాలెట్‌ కమ్యూనిస్టులపై బుల్లెట్‌ కమ్యూనిస్టులు ఒక పాయింట్‌ స్కోర్‌ చేశారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే ఆస్కారం లేని సోషలిస్టు సమాజ స్థాపన తమ లక్ష్యమని కమ్యూనిస్టులందరూ చెప్పుకుంటారు. అందువలన అణచివేతకు గురయ్యే పీడితవర్గాల ప్రజలు ఈ పార్టీలకు ప్రధాన బలగంగా ఉండాలి. కానీ, నిరుపేద వర్గాలైన దళితులూ, గిరిజనులు, వెనుకబడిన కులాల ప్రజలు మొదలైన పునాది వర్గాల్లో బ్యాలెట్‌ కమ్యూనిస్టులు నామమాత్రపు ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మావోయిస్టు పార్టీ ప్రభావిత అటవీ ప్రాంతాల్లో కనీసం గిరిజన పునాదినైనా మావోయిస్టు పార్టీ కొంతమేరకు ఇంకా నిలబెట్టుకోగలిగింది. ఇక్కడ రెండో పాయింట్‌ను బుల్లెట్‌ కమ్యూనిస్టులు స్కోర్‌ చేశారు. దేశంలోని ఖనిజ సంపదలో 75 శాతం మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతంలోనే ఉంది.

మావోయిస్టులు లేకుంటే మైనింగ్‌ మాఫియా తమను అడవుల నుంచి గెంటివేస్తుందనే అభద్రతాభావం గిరిజనుల్లో నెలకొని ఉన్న కారణంగా మావోయిస్టుల ప్రభావం ఇంకా అంతో ఇంతో కొనసాగుతున్నది. అయితే మైదాన ప్రాంత పీడిత వర్గాల్లో వారి పలుకుబడి శూన్యం. పేదవర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలను గుర్తించడంలో, బలపరచడంలో సీపీఐ, సీపీఎంలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా పేదవర్గాల మద్దతును కోల్పోయి నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది. దళిత పోరాటాల వెనుక, వెనుకబడిన వర్గాల ఆకాంక్షల వెనుక, స్త్రీవాద ఉద్యమాల వెనుక, వెనుకబడిన ప్రాంతాల డిమాండ్‌ల వెనుక కమ్యూనిస్టులు గట్టిగా నిలబడలేకపోయారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో 50 వేలమంది పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వతలపెట్టిన ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ధనిక రైతుల పక్షాన ప్రస్తుతం మైదాన కమ్యూనిస్టులు నిలబడ్డారు. వారి భాషలోనే చెప్పాలంటే పీడితవర్గాలను వదిలేసి పెటీ బూర్జువా వర్గాల అధికార ప్రతినిధులుగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడింది.

భారత కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్రలో నక్సల్స్‌ దశ ప్రారంభమై యాభై ఏళ్లు దాటుతున్నది. ఈ యాభయ్యేళ్లలో ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి కారణంగా గతితార్కికవాదం, వర్గ పోరాటమూ, సాయుధ విప్లవం వంటి అంశాల ఔచిత్యం ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత కాలంలో వచ్చిన యూరో కమ్యూనిజం, న్యూలెఫ్ట్, లాటిన్‌ అమెరికా బ్రాండ్‌ సోషలిస్టు ఉద్యమాలు ఈ భావజాలం నుంచి బయటకు వచ్చాయి. యాభై ఏళ్ల కింద ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రారంభమైన మావోయిస్టు సేనలు చాలావరకు సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పాయి. భారత మావోయిస్టు పార్టీ కంటే పెద్దదయిన కొలంబియా ఎఫ్‌ఏఆర్‌సీ రెండేళ్ల కిందనే సాధారణ జనజీవితంలోకి వచ్చేసింది. ఇందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా దోహదపడింది.

పట్టుమని పదివేలమంది గెరిల్లాలు లేని మావోయిస్టులు అత్యంత బలోపేతమైన లక్షలాదిమంది సైనికుల బలం కలిగిన భారత ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేయడం అసంభవం. మైదాన ప్రాంతాల్లో పార్టీ పలుకుబడి పెరిగే అవకాశాలు మృగ్యం. ఇటువంటి పరిస్థితుల్లో కొలంబియా మాదిరిగా ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విలీనం కావడమే తెలివైన మార్గం. అయితే ఇందుకు ప్రభుత్వాల చిత్తశుద్ధి అవసరం. ప్రభుత్వాలకు మావోయిస్టులను వేటాడటమే లక్ష్యంగా ఉన్నంతకాలం ఈ పరిణామం సంభవించదు. ఈ దశలో గణపతి, మరికొందరు అగ్రనేతలు లొంగిపోతున్నారనే ప్రచారంపై మావోయిస్టుల అధికార ప్రకటనే నిజం కావచ్చు. అలాకాకుండా వేలాదిమంది సహచరులను వదిలేసి కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే లొంగిపోతే యాభయ్యేళ్ల విప్లవ పోరాటానికి విషాదకరమైన ముగింపుగానే భావించాలి.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement