శిఖండి యుద్ధం! | Vardelli Murali Article On Ongoing Affairs In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శిఖండి యుద్ధం!

Published Sun, Feb 7 2021 12:00 AM | Last Updated on Sun, Feb 7 2021 11:37 AM

Vardelli Murali Article On Ongoing Affairs In Andhra Pradesh - Sakshi

చెట్టుకు కాసిన కుక్కమూతి పిందె గురించి కాదు, ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి మాట్లాడుకోవాలి. భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించిన శిఖండి గురించి కాదు, ఆ శిఖండి వెనుక దాక్కొని బాణంవదిలినవాడి ‘వీరత్వం’ గురించి మాట్లాడు కోవాలి. ‘ఏక్‌ దిన్‌ కా హీరో’ సైంధవుడి ‘పరాక్రమం’ ముఖ్యం కాదు. ఆ సైంధవుడిని పావుగా వాడుకొని పంతం నెగ్గించుకున్న ద్రోణాచార్యుడి కపటత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అడవి జంతువులు పంటచేలలో చొరబడితే ఏమవుతుంది? ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలు పరిధులు దాటి చెలరేగితే అదే జరుగుతుంది. అదే జరుగుతున్నది కూడా. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలను రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ జరుగుతున్న ఘర్షణగా చిత్రిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఈ దురభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నవారు కొంద రైతే, యథాలాపంగా, మీడియా రిపోర్టుల ఆధారంగా నిర్ధార ణకు వస్తున్నవాళ్లు కొంతమంది. దురభిప్రాయాన్ని ప్రచారంలో పెడుతున్న వారెవరో తేలిగ్గా ఊహించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడి యాగా ప్రచారంలో ఉన్న ఆ పార్టీ అనుబంధ సంస్థలు, చంద్ర బాబుకు అవసరమైనప్పుడల్లా టోకున మద్దతు తెలిపే కొన్ని మిత్రపక్షాలు, ఇతర పార్టీల్లో మారువేషాల్లో ఉన్న స్లీపర్‌సెల్స్‌... వగైరాలు ఈ రాజ్యాంగ ‘వివాదం’ పట్ల ప్రస్తుతానికి కలత చెంది నట్లు కనిపిస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారెవరైనా, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వాస్తవ దృశ్యం కనిపిస్తుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై రాజ్యాంగ వ్యవస్థ ముసుగులో జరు గుతున్న ఒక శత్రుదాడి కనిపిస్తుంది. ఆ దాడిని నిర్దేశిస్తూ, నియంత్రిస్తున్న ఒక క్షుద్ర రాజకీయ కనికట్టు విద్య కనిపిస్తుంది. మచ్చుకు నాలుగైదు దృష్టాంతాలను గుర్తుకు చేసుకుందాం.

గత మార్చి నెలలో జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ మధ్యలో హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికే నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. ఎన్నికలను నిర్వహించ డానికి గానీ, వాయిదా వేయడానికి గానీ ప్రభుత్వంతో, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ ధర్మాన్ని, సంప్రదాయాన్ని అతిక్రమించారు. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపెట్టారు. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏ దశలో ఎన్నికలను వాయిదా వేస్తున్నారో అదే దశ నుంచి తిరిగి ప్రారంభిస్తానని ఆ సందర్భంగా కమిషనర్‌ మీడియా సమక్షంలో ప్రకటించారు. తిరిగి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టి పంచా యతీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.తానే చెప్పిన మాట ప్రకారం నామినేషన్ల ఘట్టం దగ్గర ఆగి పోయిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను వదిలేసి పంచాయి తీలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ పంచాయతీలకు జరిగే ఎన్నికలు పార్టీ రహితమని తెలిసినప్పటికీ, ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ఆనవాయితీ అని తెలిసినప్పటికీ ఒక వితండ వాదాన్ని లేవదీసి ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదొక దుష్ట సంప్రదాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పంచాయతీల పరిధిలో లేని అనేక అంశాలపై మేనిఫెస్టోలో వాగ్దానాలు గుప్పించారు. లక్షల సంఖ్యలో ఆ మేనిఫెస్టో కాగితాలను పంపిణీ చేశారు. దీనిపై వైసీపీ అభ్యంతరం చెప్పింది. కమిషనర్‌ దీనిపై వెంటనే స్పందిం చలేదు. చంద్రబాబు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ పెట్టి కర పత్రాలు ఇంటింటికీ చేరాయని నిర్ధారణ చేసుకున్నరోజు సాయంత్రానికి కమిషనర్‌ స్పందించారు. మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. ఆ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే సదరు మేనిఫెస్టో కరపత్రం అప్పటికే ఇంటింటికీ చేరిపోయింది. కొంతమందైనా చదివి ఉంటారు. ఎలా రద్దు చేస్తారు? ఇంటింటికీ వెళ్లి ఎలా వెనక్కు తెస్తారు? చదివిన వాళ్ల మస్తిష్కంలోంచి ఎలా వెలికి తీస్తారు? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏ దశ లోనూ ఎన్నికల కమిషన్‌ సంప్రదింపులు జరిపిన దాఖలా ల్లేవు. కానీ మంత్రి ఏదో సందర్భంలో మాట్లాడిన మాటల వల్ల ఎన్ని కల ప్రక్రియకు భంగం కలగబోతున్నదని ఎన్నికల కమిషనర్‌ భావించారు. అలా భావించడమే తడవుగా మంత్రిపై ఆంక్షలు విధించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నంత కాలం పంచాయతీరాజ్‌ మంత్రి ఇంట్లోనే కూర్చోవాలట. మీడియాతో కూడా మాట్లాడకూడదట. మంత్రి వ్యాఖ్యలు అంత ప్రమాద కరమైనవని కమిషనర్‌ భావించినప్పుడు ముందుగా ఒక నోటీస్‌ ఇవ్వాలి కదా! ఆయన వివరణ కోరాలి కదా! అవేమీ లేకుండానే ఒక సీనియర్‌ మంత్రిపై ఆంక్షలు విధించడ మేమిటి? స్వయంగా ఎన్నికల కమిషన్‌ తప్పు పట్టిన టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది చంద్రబాబు. విడుదల చేయడమే కాదు, దాన్ని ఇంటింటికీ చేర్చి గట్టిగా ప్రచారం చేయాలని కూడా కార్యకర్తలకు పిలుపుని చ్చారు. మరి చంద్రబాబు మీద చర్యలేవి? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఎంత సీనియరో పెద్దిరెడ్డి కూడా అంతే సీనియర్‌. చంద్రబాబుకు ఒక న్యాయం, పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఎలా కుదురుతుంది? 

రెండు వారాలు వెనక్కు పోదాం. సీనియర్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల మీద ఆరో పణలు చేస్తూ ఎన్నికల కమిషనర్‌ గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. తమపై లేఖ రాయడమే కాక, దాన్ని మీడియాకు లీక్‌ చేయ డాన్ని, ఉద్దేశపూర్వకంగా తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిం చడమేనని మంత్రులు భావించారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు. దానిపై విచారణ జరగనున్నది. ఇప్పుడు తప్పు చేసినట్టు రుజు వైన చంద్రబాబుపై ఏ చర్యా లేకుండా, పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, అదీ.. ఎటువంటి నోటీసు లేకుండా విధించడం ప్రజలకు ఏ సందేశాన్నిస్తుంది? ప్రివిలేజ్‌ కమిటీ విచారణకు ఇది ప్రతీకారమని జనం భావిస్తే అది తప్పెలా అవుతుంది? తర్వాత వరుసలో బొత్స సత్యనారాయణ కూడా ఉంటారా?

ఎన్నికల కమిషనర్‌ మొన్న ఆవిష్కరించిన ఈ–వాచ్‌ అనే యాప్‌ కూడా తీవ్రంగా విమర్శలపాలైంది. ఈ యాప్‌ రూప కల్పన, నిర్వహణ విషయాల్లో ఏమాత్రం పారదర్శకత లేని కారణంగా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే హక్కుల కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ యాప్‌ను గురించిన సమాచారం అందజేయాలని ఎన్నికల కమి షన్‌ను అభ్యర్థించారు. అందుకు కమిషన్‌ సమ్మతించలేదు. దాంతో ఆ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకొని వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సీ–విజిల్‌’, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘నిఘా’ యాప్‌లు ఉండగా కొత్త యాప్‌ అవసరమేమిటని పిటిషనర్‌ ప్రశ్నించారు. ఏ యాప్‌కైనా ఏపీటీఎస్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) నుంచి ధ్రువీ కరణ పత్రం తప్పనిసరి. కానీ, ఆ ధ్రువీకరణ లేకుండానే ఈ యాప్‌ను ఆవిష్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఏపీటీఎస్‌ఎల్‌ నుంచి ఆడిట్‌ సెక్యూ రిటీ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు సూచిం చింది. ఈలోగా 9వ తేదీ వరకు యాప్‌ను వినియోగించరాదని ఆదేశించింది. ఏపీటీఎస్‌ఎల్‌ పరిశీలనలో యాప్‌ వెనుకనున్న మాయలఫకీరు చిలక బండారం బయటపడవలసి ఉన్నది.

రేషన్‌ సరుకులను ప్రజల ఇంటికి చేర్చే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఇది కొన్ని జిల్లాల్లో అమలవుతున్నది. మిగిలిన జిల్లాల్లో ఈనెల ఒకటిన ప్రారంభం కావలసింది. దీన్ని కూడా ఎన్నికల కమిషనర్‌ అడ్డుకో వాలనుకున్నారు. కమిషనర్‌ నిర్ణయాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది. పేదల ఆహార కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరి కాదని అభిప్రాయపడింది. ఐదు రోజుల్లో పునఃపరిశీలన చేయాలని కోరింది. గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన స్పందించారు. వాహనాల రంగుల్ని, ముఖ్యమంత్రి బొమ్మను తొలగించి తనకు చూపెట్టాలనీ, తాను సంతృప్తి చెందిన తర్వాత మిగిలిన అన్ని వాహనాల రంగులు తొలగించి అప్పుడు పథ కాన్ని ప్రారంభించుకోవచ్చునని సెలవిచ్చారు. అయినా పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి చిత్రాన్ని తొల గించవలసిన అవసరం ఏమిటని కానీ, ఎప్పుడో ప్రారంభమైన పథకంపై ఇప్పుడు ఆంక్షలేమిటని కానీ ఆయన్ను అడగరాదు. ఆయన సమాధానం చెప్పరు.

సాక్షాత్తూ, ఒక ముఖ్యమంత్రిపై ప్రత్యర్థులు కూడా వాడ కూడని భాషలో విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసు కోవడం, దాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్‌ చేయడం, మంత్రుల మీద, సలహాదారుల మీద ఆరోపణలు చేస్తూ గవ ర్నర్‌కు లేఖ రాయడం, లీక్‌ చేయడం, మంత్రులపై ఆంక్షలు విధించడం, ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలనుకోవడం, సంక్షేమ పథకాలను అడ్డుకోవడం... ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేత ఆదేశిస్తారు ఈ నిమ్మగడ్డ పాటిస్తాడు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. స్వతంత్రంగా వ్యవహ రించవలసిన ఎన్నికల సంఘాన్ని ఒక పార్టీ అధినేతకు తాకట్టు పెట్టి ఆయన ఆదేశాల మేరకు పరిధులు దాటి చెలరేగితే బహుశా బాస్‌కు కొంత ఊరట కలుగుతుందేమో. ఎన్నికల్లో దారుణ పరాభవం ఫలితంగా గాయపడ్డ అహానికి ఈ చర్యలు కొంత సాంత్వననిస్తాయేమో! వియత్నాం వంటి చిన్న దేశంలో సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంలో అమెరికా అవమానకరంగా ఓడిపోయిన తర్వాత అమెరికా జాత్యహంకారుల అహం బాగా దెబ్బతిన్నది. వారి అహాన్ని చల్లార్చడానికి అప్పట్లో రాంబో అనే సినిమా వచ్చింది. సల్వెస్టర్‌ స్టలోన్‌ ఒక్కడే బాణాలతోవెళ్లి వియత్నాంలో వీరవిహారం చేస్తాడు. ఈ సినిమా దెబ్బతిన్న వారి అహాన్ని కొంత చల్లార్చింది. చంద్రబాబు, లోకేశ్‌ బాబులు తమ పాలిటి సల్వెస్టర్‌ స్టలోన్‌ను రాజ్యాంగ వ్యవస్థల్లో చూడాలను కోవడం ఒక అమానుషమైన ఆలోచన.

ఒక రాజ్యాంగ వ్యవస్థ తానే సర్వాధికారినని, తన పరిధులు దాటి కూడా వ్యవహారం చేయవచ్చనీ భావిస్తే అది చెల్లదని మన దేశ చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. అందుకు మన దేశ రాజ్యాంగం కూడా అంగీకరించదు. ముగ్గురు ఎంపీల సభ్యత్వా లను రద్దుచేస్తూ లోక్‌సభ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసు కోవడానికి ప్రయత్నించిన సుప్రీంకోర్టునే అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ ధిక్కరించారు. సోమనాథ్‌ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు న్యాయ వాదిగా పనిచేశారు. పదిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, రాజ్యాంగ నిష్ణాతు నిగా, మేధావిగా వాసికెక్కారు. పార్లమెంట్‌ వ్యవ హారాల్లో తలదూర్చే బదులు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టండని సర్వోన్నత న్యాయస్థానానికి సలహా కూడా ఇచ్చారు. రాజ్యాంగంలోని అధికరణం 105 ప్రకారం సభలో సభ్యుడు వేసిన ఓటును ప్రశ్నించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. సభ్యులు తమ ఓటు ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే అధికారం లేదని ఛటర్జీ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర శాసనసభ అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను జైల్లో పెట్టిన ఉదంతం ఉండనే ఉన్నది. ఏ వ్యక్తయినా, వ్యవస్థయినా పరి ధులు దాటి రెచ్చిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.

పాత్రధారులు మూల్యం చెల్లిస్తారు సరే! మరి సూత్ర ధారుల సంగతి? ఇప్పుడు మాట్లాడవలసింది సూత్రధారుల మనోగతం గురించే. ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే మన సూత్రధారులు ఏదోరకంగా మళ్లీ గద్దెనెక్కాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఎందుకు కూలదోసే కుట్రలు రచిస్తున్నారు? అమరావతి భూకుంభకోణంమీద విచారణ జరక్కుండా ఎందుకు వ్యూహాలు పన్నుతున్నారు? సమాధుల్లోంచి పిశాచాలను లేపినట్టుగా స్లీపర్‌ సెల్స్‌ను నిద్రలేపి ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటు న్నారు? యజ్ఞవాటికల మీద రక్తమాంసాలు వెదజల్లే అసురుల మాదిరిగా ప్రజా పాలనకు విఘ్నాలు సృష్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ అంశాల మీద జరగాలి చర్చ.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement