ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం! | Vardelli Murali Article On AP Government Welfare Schemes | Sakshi
Sakshi News home page

ఒక అద్భుతం... ఓ ఆశ్చర్యం!

Published Sun, Dec 27 2020 12:00 AM | Last Updated on Sun, Dec 27 2020 2:51 AM

Vardelli Murali Article On AP Government Welfare Schemes - Sakshi

విశ్వరహస్య పేటిక గుట్టుమట్లు తెలిసిన రెండే రెండు శక్తులు టైమ్‌ అండ్‌ స్పేస్‌. ఆ రెండు శక్తులపై అదుపు సాధించడం ఇప్పటిదాకా మనిషికి సాధ్యం కానే లేదు. అందుబాటులో ఉన్న జ్ఞానం మేరకు అవి ఆదిమధ్యాంత రహితాలు. అందువలన కాలమూ, స్థలమూ అనే ఆ శక్తులు మనకు దైవ సమానాలు. కాలయానం ఒక అనంతగమనం. ఆ గమనంలో రెండువేల ఇరవై అనే సంవత్సరం ఒక లిప్తపాటు. మానవాళి చేసిన తప్పిదాలకు గాను ఆ లిప్తపాటు కాలం విధించిన శిక్ష మనకు ఓ పదేళ్ల జైలుశిక్షతో సమానం. ఎందుకంటే, రెండువేల ఇరవైలో మన ఆర్థిక రంగానికి కోవిడ్‌ చేసిన గాయం మరో పదేళ్లపాటు బాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు గనుక. ఒక్క మన దేశంలోనే లక్షలకొలది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. చిరు వ్యాపారులు చితికిపోయారు. ఆతిథ్య నిర్మాణ రంగాలు కుదేలైనాయి. కోట్లాదిమంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పో యారు. వారంతా యుద్ధంలో ఓడిపోయి గాయపడిన సైనికుల మాదిరిగా కనిపించారు. నెత్తురోడే పాదాలతో నడక పందెంలో పాల్గొంటున్నట్టుగా నడిచారు. వారి తిరోగమన యాత్ర నెలల తరబడి సాగింది.

కోవిడ్‌ నామ సంవత్సరంగా పరిణమించిన రెండువేల ఇరవై మన జీవన గమనాలను కూడా దారి మళ్లించింది. విద్యారంగం ఆన్‌లైన్‌గా మారింది. లేదా అటకెక్కింది. ఉద్యోగాల్లో కొన్ని ఆన్‌లైన్‌కే పరిమితమైపోయాయి. చెప్పుకుంటూపోతే చాలా మార్పులను మోసుకొచ్చింది ఈ సంవత్సరం. ఏడాది పొడవునా నెత్తుటి మరకల్ని చేసినప్పటికీ, పోతూపోతూ కొన్ని మెరుపుల్ని కూడా వెలిగించింది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక ఆశ్చర్యం మొలకెత్తింది. అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో, ఆశ్చర్యం ఢిల్లీ సరిహద్దుల్లో.

క్రిస్మస్‌ పర్వదినం, వైకుంఠ ఏకాదశి జమిలిగా వచ్చిన డిసెంబర్‌ 25వ తేదీనాడు 30 లక్షల మందికి పైగా మహిళలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలను ప్రదానం చేయడాన్ని ప్రారంభించారు. రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇంత స్వల్పకాలంలో ఇన్ని లక్షలమందికి ఇళ్ల పట్టాలివ్వడమే ఒక ప్రపంచ రికార్డు. ఆ రికార్డుకు మించి ఇక్కడొక విప్లవాత్మక పరిణామం చోటుచేసుకున్నది. ఆ పట్టాలన్నీ మహిళల పేరుమీదనే ప్రదానం చేయడం ఆ పరిణామం. మరో మూడేళ్లలో వారందరికీ నయాపైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వ బోతున్నది. మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘నా అక్క చెల్లెమ్మలు’ అంటూ ఆప్యాయంగా సంబోధిస్తారు. ‘అనగనగా ఒక అన్నయ్య, తాను తోబుట్టువులుగా భావించే 30 లక్షలమందికి వారి లైఫ్‌టైమ్‌ కలల్ని నెరవేర్చే కానుకల్ని ఆడబిడ్డ కట్నంగా ఏకకాలంలో సమకూర్చాడు...’ అని భవిష్యత్తులో తరతరాలు ఈ వృత్తాంతాన్ని కథలుగా చెప్పుకునేంత కీలక పరిణామం ఇది.

సమాన హక్కుల కోసం, ఆస్తిలో వాటా కోసం, సమానమైన పనికి పురుషులతో సమానంగా జీతం కోసం, బండెడు ఇంటి చాకిరీకి కనీస గుర్తింపు కోసం, ఆత్మగౌరవం కోసం మహిళలు పడుతున్న తపన ఏనాటిది? ఆ తపన క్రియాశీలక ఉద్యమ రూపం దాల్చి కూడా ఆరు దశాబ్దాలు కావస్తున్నది. ఈ ఆరు దశాబ్దాల ప్రస్థానంలో మహిళలకు లభించిన అతిపెద్ద విజయం ఇదే. ఆస్తిని సమకూర్చడం మాత్రమే కాదు. ఆ ఆస్తి దానవిక్రయాది సమస్త హక్కులతో భుక్తమైనప్పుడే నిజమైన ఆస్తిగా పరిగణన పొందుతుందని ముఖ్యమంత్రి భావించారు. అందుకోసం పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లనే ఆడపడుచులకు అందజేసేలా ప్రణాళికను తయారు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం అమలైతే ముఖ్యమంత్రికి మంచి పేరొస్తుందన్న ఒకే ఒక దుగ్ధతో తెలుగుదేశం పార్టీ అధినేత కోర్టుల్లో కుంటిసాకులతో పిటిషన్లు వేయించారు.

కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని చూడకుండా సాకుల ఆధారంగా స్టేలు ఇవ్వడం ఒక విషాదం. అయినప్పటికీ న్యాయస్థానాల్లో పోరాడి పక్కా రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను అందజేస్తామని, ఈలోగా అక్కచెల్లెమ్మలకు డి–పట్టాలను అందజేయడాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక పెద్ద సందడి. గొప్ప పండుగ సందడి. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై సంక్రాంతి సీజన్‌ వరకు రెండు వారాలపాటు ఇళ్ల పండుగ కొనసాగబోతున్నది. వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరుతో రూపొందుతున్న ఈ ఇళ్లు నిజానికి కాలనీలు మాత్రమే కాదు.. కొత్త ఊళ్లు. ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయడమే కాదు, ఇళ్లను నిర్మించి ఇవ్వడం, మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతో కల్పించడం ద్వారా 17,005 కొత్త ఊళ్లనే జగన్‌ ప్రభుత్వం నిర్మించబోతున్నది.

రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కలిపి ఇప్పటికే ఉన్న గ్రామాల సంఖ్య 17,128. అంతకు సమానమైన సంఖ్యలో కొత్త గ్రామాల నిర్మాణాన్ని ప్రభుత్వం తలకెత్తు కున్నది. ఏ దేశ చరిత్రలోనైనా ఈ రికార్డు నభూతో నభవిష్యతి. ఈ కొత్త గ్రామాల్లో ఇళ్లన్నీ మహిళల పేర్ల మీదనే ఉంటాయి కనుక రాష్ట్రంలోని సగం గ్రామాలకు మహిళలే మహరాణులన్నమాట. ‘గృహిణి’ అనే మాటకు సార్థకత చేకూరనున్నది. కొత్త ఊళ్లలో జనాభా ప్రాతిపదికన ఇరవైకి పైగా మునిసిపాలిటీల స్థాయిని అందుకునే అవకాశం ఉన్నది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, మౌలిక వసతులన్నీ సమకూరిన తర్వాత మరో నాలుగేళ్లలో ఇళ్ల మార్కెట్‌ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరగబోతున్నది. ఒక్కో ఇల్లు హీనపక్షం ఎనిమిది నుంచి పదిలక్షల కిమ్మత్తు చేయవచ్చు. అంటే ఇప్పుడు నిర్మించబోతున్న ఊళ్లు పూర్తయ్యేసరికి మూడు లక్షల కోట్ల విలువ చేస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన అక్కచెల్లె మ్మలకు ఆడపడుచు లాంఛనంగా అందజేస్తున్న కానుక ఖరీదు అక్షరాల త్రీ ట్రిలియన్‌ రూపీస్‌!

ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం తన కల అని డాక్టర్‌ రాజశేఖరరెడ్డి గారు అనేవారు. రాబోయే కొద్దికాలంలోనే సుమారు పది లక్షల ఖరీదు చేసే ఇళ్లకు యజమానులుగా 30 లక్షలమంది మహిళలు ‘మిలియనీర్లు’ కాబోతున్నారు. ఇంటి యాజమాన్యంతోపాటు పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో కూడా తల్లులదే కీలకపాత్ర కాబోతున్నది. అమ్మఒడి పథకం మహిళలకు ఈ ప్రివిలేజ్‌ను కల్పించింది. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం నామినేటెడ్‌ గౌరవ పదవుల్లోనూ, నామినేషన్‌పై చేసే కాంట్రాక్టు పనుల్లోనూ 50 శాతం మహిళల హక్కుగా చట్టబద్ధం చేశారు. తాగుబోతు భర్తల ఆగడాల నుంచి విముక్తి చేయడంకోసం మద్య నియంత్రణ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. మహిళలపై పోకిరీల ఆగడాలకు ముకుతాడు వేయడానికి దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టాన్ని తీసుకొని వచ్చారు.

45 నుంచి 60 యేళ్ల మధ్య వయసున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ ఆసరా కింద ఏటా 18,750 రూపాయలను నాలుగేళ్లపాటు ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలు బ్యాంకులకు బకాయిపడిన 27 వేల కోట్ల రూపాయలను దశలవారీగా జగన్‌ ప్రభుత్వం సంఘాలకు చెల్లిస్తున్నది. ఫలితంగా 8 లక్షల 71 వేల డ్వాక్రా సంఘాలు ప్రయోజనం పొందాయి. సున్నా వడ్డీ పథకం కింద కూడా జగన్‌ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. ఈ ప్రోత్సాహాల కారణంగానే పొదుపు ఉద్యమంలో ఏపీ డ్వాక్రా సంఘాలు దేశంలోనే అగ్రభాగాన నిలబడ్డాయని నాబార్డ్‌ నివేదిక చాటిచెప్పింది. మహిళా సాధికారత కోసం జరిగే కృషిలో నిస్సందేహంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉన్నది. ఇక ఏపీ మహిళాలోకం నిండైన ఆత్మ విశ్వాసంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించవచ్చు.

ఢిల్లీ సరిహద్దులను పంజాబ్‌ రైతులు దిగ్బంధం చేయడం ప్రారంభించి నెలరోజులు దాటింది. వారికి క్రమంగా హరి యాణా, పశ్చిమ యూపీ రైతులు కూడా తోడయ్యారు. సహజంగానే రాజకీయ పక్షాలు కూడా ప్రవేశించాయి. ఢిల్లీ నుంచి హరియాణాకు, రాజస్తాన్‌కు, యూపీకి దారితీసే రహదారులు నెలరోజులుగా ఆందోళనకారుల అధీనంలోనే ఉన్నాయి. ఏడెనిమిది క్యాంపులుగా రైతులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంపాటు ఆందోళన కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లనూ వారు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు చట్టాలను బేషరతుగా రద్దుచేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధానంగా రెండు అంశాల్లో పంజాబ్‌ రైతులు భయ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టాల ఫలితంగా భవిష్యత్తులో కనీస మద్దతు ధర రద్దవుతుందని మొదటి భయం. మండీ (మార్కెట్‌) వ్యవస్థ అంతరించి కార్పొరేట్‌ కంపెనీల పెత్తనం పెరుగుతుందని రెండో భయం. ఈ రెండూ కచ్చితంగా కొనసాగుతాయని ప్రభుత్వం గట్టిగా హామీ ఇచ్చింది.

అయినా రైతులు నమ్మడం లేదు. ఇందుకు కారణం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడమేనని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇక్కడ చర్చ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల్లోని గుణదోషాల గురించి కానీ, రైతుల కోర్కెల్లోని ఉచితానుచితాల గురించి కానీ కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత అంతటి బలమైన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది. ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యమై, నిస్తేజమైన స్థితిలో ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో బలమైన కేంద్ర సర్కార్‌ను లెక్క చేయకుండా రైతాంగం తెగించి శాంతియుత సమరానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ తెగింపు ఈ దేశ ప్రజాస్వామ్య పునాదుల మీద నమ్మకాన్ని కలిగిస్తున్నది. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తు మీద ఆశను ఎర్రకోటపై ఎగురుతున్న జాతీయ పతాకమంత ఎత్తున నిలబెడుతున్నది.

ప్రతిపక్షం కునారిల్లినంతమాత్రాన ప్రశ్నించే గొంతుక మూగబోదనే సింహకంఠనాదం ఆ రైతుల నినాదాల్లో ప్రతిధ్వనిస్తున్నది. ఈ దేశంలో అత్యధిక జనాభాకు ఆశ్రయం కల్పిస్తూ కూడా నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నది వ్యవసాయ రంగమేనని అందరూ అంగీకరిస్తారు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా లేదని కూడా అంగీకరిస్తారు. అయినా రైతులు ఆందోళనకు దిగడం చాలా అరుదు. ‘‘అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు...’’ ఏమవు తుంది? అజాతశత్రువు ఇప్పుడు అలిగాడు. ఫలితం... ఎదురులేదనుకున్న మోదీ సర్కార్‌ మోకాళ్లపై కూర్చుని రైతులను బతిమిలాడుతున్నది. బుజ్జగిస్తున్నది. ఈ ఆందోళనకు ఒక అర్థవంతమైన ముగింపు తక్షణ అవసరం. ముగింపు ఎలా ఉన్నా ప్రశ్నించే గొంతుక జీవించే ఉంటుందన్న ఒక్క ఆశ చాలు... కొత్త సంవత్సరాన్ని స్వేచ్ఛగా శ్వాసించడానికి!
వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement