చివరి కాంగ్రెస్‌ మొఘల్‌? | Vardelli Murali Article On Role Of Congress In India | Sakshi
Sakshi News home page

చివరి కాంగ్రెస్‌ మొఘల్‌?

Published Sun, Oct 3 2021 12:19 AM | Last Updated on Sun, Oct 3 2021 12:37 AM

Vardelli Murali Article On Role Of Congress In India - Sakshi

చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌. పాపం, ఆయన పేరుకే చక్రవర్తి. పట్టుమని పదిమైళ్ల విస్తీర్ణం కూడా లేని షాజహానాబాద్‌ (పురానా ఢిల్లీ)కే ఆయన అధికారం పరిమిత మైంది. ఒకపక్క మరాఠాల దూకుడు, మరోపక్క ఈస్టిండియా కంపెనీ పెత్తనం. ఉర్దూ గజల్స్‌ రాసుకోవడం మినహా ఏ నిజ మైన అధికారం లేని పరిస్థితి ఆయనది. ‘న కిసీ కి ఆంఖ్‌ కా నూర్‌ హూ’ (నేను ఎవరి కంటి వెలుగునూ కాదు) అనే అద్భు తమైన గజల్‌తో తన నిస్సహాయతను అలంకరించుకున్నాడు.

మధ్యయుగ భారత చరిత్రలో మొఘల్‌ రాజు వంశం ఎంతటి జగత్‌ ప్రసిద్ధమో, ఆధునిక ప్రజాస్వామ్య భారతంలో కాంగ్రెస్‌ పాత్ర కూడా అంతటి ప్రభావవంతమైనది. డెబ్బయ్యేళ్ల భారత రిపబ్లిక్‌లో యాభయ్యేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. మరో ఇరవై సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర. అటువంటి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం నుంచి నెహ్రూ – గాంధీ కుటుం బాన్ని వేరు చేయడం ఇప్పటిదాకా సాధ్యం కాలేదు. ఈ సాధ్యం కాకపోవడమనే బలహీనతే ఆ పార్టీని ఇప్పుడొక రాచపుండులా కెలుకుతున్నది. ఈ పుండు మానదనీ, పార్టీ అవసాన దశకు చేరు కున్నదనీ సర్వేసర్వత్రా ఒక అభిప్రాయం ఇప్పుడు బలపడు తున్నది.

ఆ పార్టీకి ఇప్పుడు అధినేత ఎవరు? గత సాధారణ ఎన్ని కల్లో ఓడిపోయిన వెంటనే రాహుల్‌ కాడి పారేశారు. ఎవరెంత బతిమాలినా, బామాలినా అలకవీడలేదు. గత్యంతరం లేక మరోసారి సోనియా గాంధీయే అధ్యక్షురాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించుకున్నది. కానీ వాస్తవానికి పార్టీ దైనందిన కార్యక్రమా లన్నిటికీ ఆమె దూరంగా ఉంటున్నారట. కీలక నిర్ణయాలన్నీ రాహుల్‌గాంధీయే తీసుకుంటున్నారనీ, ఆయనకు కొంతమంది కన్సల్టెంట్లు, మార్కెటింగ్‌ నిపుణులు, సోదరి ప్రియాంక సహక రిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్‌ శ్రేణుల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది.

బాధ్యత లేని అధికారాన్ని కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌గాంధీయే చెలాయిస్తున్నారు. పంజాబ్‌ సంక్షోభం చల్లా రకముందే తలెత్తిన ఛత్తీస్‌గఢ్‌ తలనొప్పి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ ఢిల్లీకి వచ్చారు. ‘సోనియాజీ ఢిల్లీలో లేనట్టున్నారు’ అనే నర్మగర్భమైన కామెంట్‌ను చేశారట. ‘సోనియాగాంధీ పాత్ర ఏమీ లేదు, అంతా రాహుల్‌జీనే చూస్తు న్నార’నేది బఘేల్‌ కామెంట్‌కు తాత్పర్యమని చెప్పుకుంటు న్నారు. ఆఖరి మొఘల్‌కు నెత్తిన కిరీటం తప్ప చేతిలో అధికారం లేదు. ఈ కాంగ్రెస్‌ మొఘల్‌కు మకుటం లేదు గానీ మంత్ర దండం చేతిలోనే ఉన్నది.

‘గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన కాంగ్రెస్‌ పార్టీ వయసు నూట ముప్పయ్యారు. పార్టీల లెక్కల్లో మంచాన పడాల్సిన వయసేమీ కాదు. అమెరికా, ఐరోపాల్లో రెండొందల యేళ్లు దాటిన పార్టీలు కూడా నిండు యవ్వనంతో పరుగులు పెడుతున్నాయి. మరి మన కాంగ్రెస్‌కు ఎందుకు ఈ దుర్గతి? ప్రస్తుత పార్టీ నాయకత్వమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ అంతఃకలహాల నేపథ్యంలో కపిల్‌ సిబల్‌ ఒక ఆసక్తి కరమైన ప్రకటన చేశారు. ‘మేము జీ–ట్వంటీత్రీ (గ్రూప్‌ ఆఫ్‌ 23) నిజమే. కానీ, జీ–హుజూర్‌ 23 కాదని’ పార్టీ నాయకత్వా నికి పరోక్ష హెచ్చరికను పంపించారు. ఇంతమంది సీనియర్‌ నాయకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి నాయకత్వాన్ని అభిశంసిం చడం గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో రెండుసార్లు పార్టీ చీలిన సందర్భాలు ఇందుకు మినహాయింపు.

గత సంవత్సరం ఆగస్టులో ఇరవై మూడు మంది కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులు సోనియాగాంధీకి ఒక లేఖ రాశారు. వారిలో కొందరు కోర్‌ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగానే మీడియాకు కూడా లేఖ లీకయింది. పార్టీ నాయ కత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని వారు ఆ లేఖలో ప్రస్తావించారు. వరుస పరాజయాలను, పార్టీ ప్రభావం తగ్గిపోతున్న విషయాలను వారు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవలసిన అవస రాన్ని గుర్తించాలని వారు అధినేత్రికి సూచించారు. లేఖపై సంత కాలు చేసిన వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్‌ సిబల్, శశి థరూర్, ఆనంద్‌శర్మ తదితర 23 మంది సీనియర్లు ఉన్నారు.

ఈ లేఖ రాయడానికి కొన్ని నెలలు ముందుగానే కొందరు ముఖ్యనేతలు సోనియాగాంధీని కలిశారట. లేఖలో సంతకాలు చేయని ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఈ బృందంలో ఉన్నారు. రాహుల్‌గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవనీ, బలవంతంగా అతడి నాయకత్వాన్ని రుద్దితే కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయ మని ఆమెకు స్పష్టంగా చెప్పారట. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రారంభిస్తే గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకు రావచ్చునని కూడా ఆమెకు చెప్పారని వినికిడి.

అయితే పుత్ర ప్రేమ వలన ఆమె వీరి రాయబారాన్ని తిరస్కరించారు. పుత్రుని మనసులో ఏముందో ఆమెకు తెలుసు. ఓటమి బాధ్యత నుంచి దృష్టి మళ్లించడానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడే గానీ, దానికి శాశ్వతంగా దూరం కావడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కొంతకాలం పాటు ఇలా గడిపేస్తే, అధ్యక్ష పదవిని స్వీకరించవలసిందిగా తనపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ, జరిగిన పరిణామం ఆయన అంచనాకు యాంటీ క్లైమాక్స్‌.

‘జీ–23’ లేఖ బహిర్గతం కాగానే రాహుల్‌జీ ఆగ్రహోదగ్రుడయ్యాడట. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టా రని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయాలన్నీ కన్సల్టెంట్ల సహకారంతో తానే తీసుకోవడం మొదలుపెట్టారు. లేఖ రాసిన సీనియర్లను పూర్తిగా దూరం పెట్టారు. ఏ సమస్య ఎదురైనా కోర్‌ కమిటీ కూర్చొని చర్చించడం కాంగ్రెస్‌ పార్టీలో ఒక ఆనవాయి తీగా ఉండేది. 2004లో తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ప్రతి శుక్రవారం సాయంత్రం కోర్‌ కమిటీ సమావేశమై ముఖ్య విషయాలను చర్చించేది. పార్టీ అధ్యక్షురాలు, ప్రధాన మంత్రి సహా ఐదారుగురు ముఖ్యనేతలు ఈ కోర్‌ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. తుది నిర్ణయం పార్టీ అధినేత్రిదే అయినా, అది ఉమ్మడి నిర్ణయంగా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆ కోర్‌ కమిటీ ఊసేలేదు.

వేర్వేరు భాషలు, చరిత్రలు, సంస్కృతులు, భిన్నమైన సామాజిక జీవనాలతో కూడిన బహువిధమైన మన దేశం కాలక్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలిగింది. భార తీయత అనే ఏకత్వ సాధనకు ఎన్నో పరిణామాలు దోహద పడ్డాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది భారత జాతీయ కాంగ్రెస్‌. విరుద్ధ ప్రయోజనాలున్న శక్తులను ఉమ్మడి ప్రయోజనమైన స్వాతంత్య్ర సాధనకోసం ఏకతాటిపై నడిపిన అనుభవం కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నది. ఆ అనుభవమే స్వాతంత్య్రం తర్వాత కూడా జాతి నిర్మాణానికి దోహదపడింది. ఆ అనుభవమే కాంగ్రెస్‌ పార్టీని సుదీర్ఘకాలం పాటు దుర్భేద్యంగా నిలబెట్టగలి గింది. భారతదేశంలో ఎన్ని విరుద్ధ వర్గాలున్నాయో కాంగ్రెస్‌ పార్టీలో కూడా అన్ని వర్గాలుండేవి. వారితో నిరంతరం సంభా షించి, సమన్వయపరిచి, అసంతృప్తిని చల్లార్చే ఒక ఎకోసిస్ట మ్‌ను కాంగ్రెస్‌ పార్టీకి చరిత్ర బహూకరించింది. అతివాద – మితవాద భావజాల శక్తులను కూడా మిళితం చేసుకునే మధ్యే వాద మార్గం కాంగ్రెస్‌ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రధానాంశం.

సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా కాంగ్రెస్‌ ఎకోసిస్టమ్‌ బీటలు వారడం ప్రారంభమైంది. రాహుల్‌ చురుకైన పాత్ర పోషించడం ప్రారంభమైన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. శరద్‌ పవార్, మమతా బెనర్జీ, జగన్‌మోహన్‌ రెడ్డి వంటి బలమైన నాయకులను దూరం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ మూడు పెద్దరాష్ట్రాలను పోగొట్టుకున్నది. వరుసగా రెండు సార్లు యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విజయాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోషించిన పాత్రను కాంగ్రెస్‌ సరిగ్గా అర్థం చేసుకోలేక పోయింది. జనాకర్షణ గల ప్రాంతీయ నేతలను తక్కువ అంచనా వేసి కాంగ్రెస్‌ నాయకత్వం భారీ మూల్యం చెల్లించింది.

ఇప్పుడు ఆ పార్టీ ప్రభావం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. అదృష్టం కలిసివస్తే మొదటి స్థానం, లేదంటే రెండో స్థానమైనా దక్కించుకోగలిగిన రాష్ట్రాలు ఒక డజన్‌ కూడా లేవు. బలంగా ఉన్న పంజాబ్‌ను అపరిపక్వ రాజకీయ వ్యూహంతో కాల దన్నుకున్నారు. దళిత ముఖ్యమంత్రి ప్రయోగం కనీసం ఒక ఏడాది ముందు చేసి ఉంటే ఏమైనా ఫలితముండేదేమో! ఎన్నికలకు మూడు నెలల ముందు ఆయన చేయగలిగేది ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా గెలిపించిన తెలంగాణను ఒక ఊసర వెల్లి రాజకీయవేత్తకు ఫ్రాంచైజ్‌ కింద ఇచ్చేసినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ బండారం బయటపడితే అక్కడ భంగపాటు తప్పదు. ఇక మిగిలినవి కేరళ (కూటమి), కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అస్సాం మాత్రమే. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి ఉన్న లోక్‌సభ స్థానాలు 172. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యలో ఇది 31 శాతం మాత్రమే. ఇక్కడే కాంగ్రెస్‌ ప్రధాన పోటీదారుగా ఉంటుంది.

జాతీయ పార్టీకి తక్కువ, ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ పరిస్థితి వల్ల నష్ట పోయేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే కాదు. మొత్తం భారత ప్రజా స్వామ్య వ్యవస్థకే అది గుదిబండగా తయారైంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే, ప్రతిపక్షం లబ్ధిపొందడానికి కాంగ్రెస్‌ అడ్డంకిగా మారింది. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్నందువల్ల నరేంద్రమోదీ ప్రత్యామ్నా యాన్ని జనం కాంగ్రెస్‌లోనే వెతుకుతారు. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌గాంధీ నాయకుడు. రాహుల్‌ వర్సెస్‌ మోదీ పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి జ్యోతిష్యుడో, సెఫాలజిస్టో కావ లసిన అవసరం ఉండదు. ఎవరైనా చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా పక్కన పెట్టి మిగిలిన పార్టీలన్నీ ఏకం కావడం ఒక ప్రత్యామ్నాయం. గతంలో కేసీఆర్‌ చెప్పిన ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ వంటిదన్నమాట. మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు కన్పిస్తున్నారు. కానీ, కలగూరగంప ప్రాంతీయ పార్టీ లను జాతీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు అంగీకరించగలరా? ఆ ప్రభుత్వ సుస్థిరతపై నిశ్చింతగా ఉండగలరా?... చాలా కష్టం.

రాకెట్ల మాదిరిగా దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, ప్రజా సంపదను శ్రీమంతులకు దోచిపెట్టడం యథేచ్ఛగా సాగి పోతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం ఒక విదూషక పాత్రలో ఒరిగిపోవడం ఒక విషాదం. ఇప్పటికిప్పుడు ఒక సరైన ప్రత్యా మ్నాయం తయారు కావాలంటే ఉన్న మార్గాలు రెండు. ఒకటి: తెల్లారే సరికల్లా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ బలంగా విస్త రించాలి. ప్రస్తుత నాయకత్వాన్ని తొలగించి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. ఇది జరగాలంటే అల్లావుద్దీన్‌ దగ్గర్నుంచి అద్భుత దీపాన్ని అరువు తెచ్చుకోవాలి. ఇది అసాధ్యం. రెండు: జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పోగొట్టుకున్న ఎకోసిస్టమ్‌ను పునరుద్ధ రించుకుంటూ ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడాలి. అలా ఏర్పడా లంటే ఇప్పుడున్న కాంగ్రెస్‌ అదృశ్యం కావాలి. వైద్య రంగంలో ఇటువంటి సందర్భాలకోసం ‘మెర్సీ కిల్లింగ్‌’ అనే తరుణో పాయం ఉన్నది. చావలేక, బతకలేక, బతకడానికి హింస పడు తున్న రాజకీయ పార్టీలకు దీన్ని వర్తింపజేసే అవకాశాలు లేవు.

చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ నిస్సహా యుడైతే కావచ్చు కానీ గొప్ప దేశభక్తుడు. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ఊపిరిపోసినవాడిగా ఆయన పేరు నిలబడుతుంది. గొప్ప ఉర్దూ కవిగా కూడా ఆయన చిరస్థాయిగా నిలబడి పోతాడు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్‌ మనుగడ సాగించలేకపోతే చివరి కాంగ్రెస్‌ మొఘల్‌గా రాహుల్‌ గాంధీ ముద్రపడతారు. రాహుల్‌ దేశభక్తిని కూడా శంకించ వల సిన పనిలేదు. తాతముత్తాతల దగ్గర్నుంచీ దేశభక్తుల కుటుంబం వారిది. బహదూర్‌ షాకు కవిత్వ వ్యాపకమున్నట్టు రాహుల్‌కు ఏవైనా ఉన్నాయేమో పెద్దగా తెలియదు. కొన్ని ఉన్నా అవి జనా నికి పెద్దగా అర్థంకావు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఆవేశపూరి తంగా మాట్లాడి, ఆ వెంటనే తన ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయన్ని లేపి గట్టిగా ఆలింగనం చేసుకోవడం వంటి హాబీలు కొన్ని ఆయ నకు ఉన్నాయి. అయితే వాటి ప్రయోజనం ఏమిటి? పరమార్థ మేమిటి అనేవి సామాన్యులకు ఎప్పటికీ అర్థం కావు.


వర్ధెల్లి మురళి

vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement