
ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవకోటిలో మానవుడే మొనగాడని మనకొక గట్టి నమ్మకం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించామనీ, సమస్త విశ్వాన్ని పాదాక్రాంతం చేసుకోగల తెలివి తేటలు మానవజాతికి ఉన్నాయనుకునే వెర్రి విశ్వాసాన్ని కరోనా వైరస్ వెక్కిరిస్తున్నది. కంటికి కనిపించని ఒక సూక్ష్మప్రాణి. పూర్తి ప్రాణి కూడా కాదు. సగం ప్రాణే. ఒక డీఎన్‌ఏ పోగు. మనిషి జీవకణాల్లోకి దూరి, వాటిని నిర్వీర్యం చేస్తూ తనలాంటి పోగుల్ని వేల సంఖ్యలో పునరుత్పత్తి చేసుకుంటూ కబళించేస్తున్నది. ‘నా ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి వేలమంది పుట్టుకొస్తారన్న’ డైలాగ్ చందంగా మానవ శరీరాల్లో కరోనా చెలరేగిపోతున్నది. ఈ వైరస్ చైనా సరిహద్దులు దాటి గ్లోబలైజేషన్ ప్రారం భించగానే ఇరవయ్యేళ్ల సిరియా అంతర్యుద్ధం ఖామోష్ అన్నట్టుగా ఆగిపోయింది.
అమెరికాతో ఒప్పందం కుదు ర్చుకొని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి సన్నద్ధమైన తాలిబాన్‌లు మంత్రించినట్టుగా స్తంభించిపోయారు. ట్రంప్ ఎన్నికల సన్నాహాలు ఆపేసి ‘ఐసోలేషన్’ను ఆశ్ర యించాడు. అలవికాని అహంకారంతో ఆకాశం వైపు మాత్రమే చూసే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు గజగజ వణికి పోతూ మోకాళ్లపై వంగి కూర్చొని చేతులు జోడించి కరోనాను ప్రాధేయపడుతున్నాయి. జెఫ్ బిజోస్, బిల్ గేట్స్, అంబానీ, జుకర్ బర్గ్‌లు కూడా ఒక రిక్షావాలా, గని కార్మికుడూ, వ్యవసాయ కూలీలాగానే కరోనాను చూసి ఝడుసుకుంటున్నారు. సర్వత్రా షట్‌డౌన్, లాక్‌డౌన్. కాలిఫోర్నియాకు తాళం, ఊపిరి స్తంభించిన యూరప్, ఇండియాలో జనతా కర్ఫ్యూ.
ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెదొక దారి. ఆంధ్రప్రదే శ్‌లో ఎల్లో వైరస్‌గా ఇప్పటికే అపఖ్యాతిపాలై వున్న పొలిటికల్ వైరస్ కరోనాకు సమాంతరంగా చురుగ్గా కదులు తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా కరోనా వ్యాప్తిని బాగానే నియంత్రించగలిగింది కానీ, ఏపీ ఎల్లో వైరస్ మాత్రం హైదరాబాద్ మీదుగా ఢిల్లీ దాకా పాకింది. ప్రాథమికంగా ఇది పొలిటికల్ వైరస్ గానే ప్రారంభ మైనా, క్రమంగా రాజకీయ పార్టీలతో పాటు, మీడియా రంగంలోకి, రాజ్యాంగ వ్యవస్థల్లోకి చొరబడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి ప్రమాదకరంగా పరిణమిస్తు న్నది. ఎల్లో వైరస్ లక్షణాలున్న వారిని కూడా జనజీవన స్రవంతి నుంచి ఇప్పటికే ప్రజలు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచారు. అయినా సత్ఫలితాలు కనిపించడం లేదు. త్వరలో కొందరిని క్వారంటైన్ చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు.
ఎల్లో వైరస్ పాత నిర్వాకాలను కాస్సేపు పక్కనబెట్టి తాజాగా తలకెత్తుకున్న అఘాయిత్యాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి బాగా వివాదాస్పదమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేంత వరకు అంతా బాగానే వుంది. మార్చి 9వ తేదీ నాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు ప్రారంభ మయ్యాయి. 11 నుంచి 13 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నడిచింది. 11 నాడు ఎంపీటీసీ, జెడ్పీ టీసీలకు, 13వ తేదీ నాడు మునిసిపాలిటీలకు నామినే షన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరునెలలు ముందుగానే ఈ ఉగాది రోజున మహిళల పేరుతో దాదాపు 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం గడిచిన కొన్ని నెల లుగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది.
అదికూడా బహిరంగంగా, పారదర్శకంగా జరిగింది. లబ్ధిదారుల పేర్లను గ్రామ సచివాలయాల్లో నోటీస్ బోర్డుపై ఉంచారు. ఎంపిక కానివారు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి, అందులో అర్హతలున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించి, మరోసారి నోటీసు బోర్డుల్లోకి ఎక్కించారు. ఈరకంగా లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన వారెవరో ఊరందరికీ తెలుసు. కేవలం లాంఛనంగా ఉగాదినాడు వారికి పట్టాల ప్రదానం చేయవలసి ఉన్నది. తర్వాత వచ్చే నాలుగేళ్లలో వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించి ఇవ్వవలసి ఉన్నది. తీరా 14వ తేదీనాడు ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన తాఖీదు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా పూర్తయిన తర్వాత ఎన్ని స్థానాలు ఏకగ్రీవమైనాయో కూడా తెలిసి పోయిన తర్వాత హఠాత్తుగా పదిహేనో తేదీ ఆదివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ముందుగానే సిద్ధం చేసుకున్న నోట్‌ను చదివి వినిపించారు. ఇందులో మొదటి అంశం కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తేదీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ యథాతథంగా వుంటుందన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో వుంటుందన్నారు. నామి నేషన్ల సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా రెండు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, మరికొందరు అధికారు లనూ బదిలీ చేయడం రెండో అంశం.
ఈ ఆదేశాలను చూసిన వారికి సహజంగానే కొన్ని అనుమానాలు కలుగుతాయి. 1) కరోనా వైరస్ కారణంగానే ఎన్నికల వాయి దాకు నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే, ఆ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారు లతో గానీ, ఆరోగ్య శాఖ అధికారులతో గానీ ఎందుకు సమీక్షా సమావేశం నిర్వహించలేదు?. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్నను సంధించింది. 2) కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ మాత్రం కొనసాగుతుందని చెప్పడమేమిటి?. ప్రజాభి మానంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఎటు వంటి నిర్ణయమూ తీసుకోనీయకుండా నిరవధికంగా ఎలా నిరోధిస్తారు?. దీనివెనుక రాజకీయ కుట్ర దాగుం దని అధికార పక్షం ఆరోపిస్తున్నది. కుట్ర లేదని ఏ రకంగా సమర్థించగలరు? ఈ చర్యను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టి కోడ్ ఎత్తి వేయాలని ఆదేశించిందంటే అర్థం ఏమిటి?.
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా అల్లర్లు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తే ఎన్నికల సంఘం అదే రోజు ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే మరుసటి రోజు. పైగా ఏ ఎన్నికల్లోనైనా సర్వసాధారణంగానే జరిగే చెదురు మదురు ఘటనల కంటే తక్కువగా ఈసారి గొడవలు రికార్డయ్యాయి. అయినా కేవలం తెలుగుదేశం పార్టీ ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకొని ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసిన తర్వాత అధికారుల బదిలీకి ఆదేశించడం వెనుక కూడా ఏదో ‘రాజకీయం’ వుందని వైఎస్సార్‌సీపీ ఆరోపణ. కరోనా విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహ రించింది. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున విస్తరించిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన 12 వేల మందిని గుర్తించగలిగారు. వీరిలో 90 శాతం మందికి వైద్య పరీ క్షలను కూడా పూర్తి చేయించారు. అనుమానిత కేసులను వైద్యుల పర్యవేక్షణలో వుంచారు. మిగతా వారిని ఇల్లు దాటకుండా కట్టడి చేశారు.
ఎన్నికల కమిషనర్ వివాదాస్పద వాయిదా నిర్ణయం తర్వాత మూడు రోజులకు అంటే 18వ తేదీనాడు ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఎన్నడూ ఎక్కడా కనీవినీ ఎరు గని హైడ్రామా చోటు చేసుకున్నది. కేంద్రం హోంశాఖ కార్యదర్శిని సంబోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక మెయిల్ పంపించారనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన తీవ్ర ఆరోపణలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్‌లుగా వ్యవహరించే ఒక ఐదు చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లతో హడావుడి చేశాయి. టీడీపీకి తలగా, తోకగా వ్యవహరించే రెండు ప్రధాన పత్రికలు ఆ లేఖాంశాలను సంపూర్ణంగా కవర్ చేస్తూ బ్యానర్ స్టోరీగా వేశాయి. తల పత్రిక వార్త తోకలో ఈ వార్తను సదరు ఎన్నికల కమిషనర్ ధ్రువీకరించనే లేదని ఏకవాక్యాన్ని మురిపెంగా రాసుకు న్నది. ఆ రోజున ధ్రువీకరించని కమిషనర్ ఈరోజు దాకా ఖండించనూ లేదు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవీ, బాధ్యతా రహితమైనవి కూడా. వాడిన భాష అభ్యంతకరమైనదీ, జుగుప్సాకరమై నది కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి కలలోనైనా ఊహించలేని లేఖ అది.
రాష్ట్ర నాయకత్వానికి ఫ్యాక్షన్ నేపథ్యం వుందనీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అలవాటు వుందనీ, తనకు కేంద్రం రక్షణ కల్పించాలని ఆ లేఖలో రాశారు. దీనిపై కచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరణ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక ప్రజాదరణతో ఎన్నికైన ముఖ్యమంత్రిపై నిరాధారంగా చేసిన ఈ ఆరోపణ ఆయన పరువుప్రతిష్టలకు భంగకర మైనది. ఆయన వ్యక్తిత్వంపై జరిగిన ఘోరమైన హత్యా ప్రయత్నం లాంటిది.
పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నిక కావడంపై ఆయన ఆశ్చర్యాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు వీలైనంతవరకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితేనే మంచిదన్న ఉద్దేశంతో 73, 74 రాజ్యాంగ సవరణల్లోనే ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రత్యేకంగా చేర్చారు. ఇక రాజకీయంగా చూస్తే జెడ్‌పీ టీసీలు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం కావడం కూడా అంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. 1972 అసెంబ్లీ ఎన్నికలో మన రాష్ట్రంలోనే 17 శాసనసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరా గాంధీ ప్రభ వెలిగిపోతున్న తరుణంలో ఆ ఎన్నికలు జరిగాయి. బలహీన ప్రతిపక్షం చేతులెత్తేయ డంతో సహజంగానే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఏకగ్రీవ మయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే.
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా డ్రాకో నియన్ ఆర్డినెన్స్‌గా అభివర్ణించడాన్ని ఎలా అర్థం చేసు కోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇలా రెండు మూడు అంశాలే కాదు. లేఖ మొత్తం ఒక రాజకీయ పార్టీ చౌకబారు ఆరోపణలు చేసిన చందంగానే సాగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో నంబర్ టూగా చలామణి అవుతున్న యువనేత ఆధ్వ ర్యంలోనే ఆ లేఖ తయారైందని, ఆయన ఆదేశాల ప్రకా రమే ఆ లేఖను ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారంలో పెట్టిందని తెలుస్తున్నది. ఇటువంటి రాజకీయ జిత్తులకు రాజ్యాంగబద్ధ సంస్థ వేదిక కావడం అత్యంత ప్రమాద కరమైన పరిణామం. ఐఏఎస్ అధికారిగా పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ పదవిని తనకిచ్చిన చంద్రబాబు పట్ల కృతజ్ఞతతోనే ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహ రిస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది. అంతే కాకుండా ఆయన కుమార్తెకు ఆర్థికాభివృద్ధి మండలిలో ఒక కీలక పదవిని కూడా కట్టబెట్టారని తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా అమరావతి ప్రాంతంలోని ఐనవోలులో 500 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించిందట. గత ఏడాది మార్చి 13న ఆయన తన పేరు మీదనే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ ట్రిపుల్ బొనాంజా ఫలితంగానే ఇలాంటి అనారోగ్యకర సంప్రదాయం తలె త్తిందా? స్వయంగా ఆయన వివరణ ఇవ్వకపోతే జనం తప్పనిసరిగా ఔననే అనుకుంటారు.
దేశ ప్రజలందరికీ కలవరం కలిగిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వ వైద్యులకు, నర్సులకు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ సిబ్బందికి జేజేలు చెప్పాల్సిందే. విదేశాల్లో చిక్కుకొనిపోయిన వారిని చేరవేయడానికి శ్రమిస్తున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికీ అభినందనలు. సవాల్‌ను ఎదు ర్కొని తెగించి పోరాడుతున్న ప్రభుత్వ పారిశుద్ధ్య సిబ్బం దికి ప్రణామాలు. సంక్షోభ సమయంలో నిద్రాహారాలు మాని పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులకు, అధికారులకు, పోలీసులకు వందనం. ప్రభుత్వరంగ సంస్థలను కించప రిచే వారికీ, ప్రైవేటీకరణ ప్రవక్తలకూ ఈ సందర్భం ఓ గుణపాఠం కావాలి. సమాజ సమష్టి ప్రయోజనం కోసం పనిచేస్తున్న కర్మవీరుల సేవలకు కృతజ్ఞతగా ఈ రోజు సాయంత్రం చప్పట్లు కొడదామని ప్రధాని పిలుపుని చ్చారు. కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్ర పాపులర్ డైలాగ్ ‘ఆ చప్పట్లే కదరా... ఆకలిగొన్న కళాజీవికి పంచ భక్ష పరమాన్నాలు.’ ఆ విధంగానే ఆ చప్పట్లే అలసిపో యిన మన సేవా జీవులను సేదదీర్చేవి. చప్పట్లు కొడితే పోయేదేమీ లేదు మన చేతులకున్న ధూళి తప్ప. ఇరుగు వైరస్, పొరుగు వైరస్, ఇంట్లో వైరస్, కంట్లో వైరస్ పారి పోయేలా కొడదాం చప్పట్లు.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment