బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరోనా వ్యాక్సిన్‌కు ‘రాజకీయ వైరస్’ అంటింది మొదలు దానిచుట్టూ రాజకీయాలు షికారు చేస్తున్నాయి. తాజాగా మన దేశంలో అనుమతులు లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు కూడా ఆ సమస్యలో చిక్కుకున్న జాడలు కనబడుతున్నాయి. తగిన డేటా లేకుండా కోవాగ్జిన్‌కు ఎలా అనుమతించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే... కోవిషీల్డ్‌కు సైతం మన దేశం డేటాకాక, వేరే దేశాలకు సంబంధించిన డేటా మాత్రమే వుందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పైగా కోవిషీల్డ్‌తోపాటు పారాసిటమాల్ కూడా ఇవ్వాల్సివుంటుందన్న సూచన వారికి సంతృప్తికలిగించటం లేదు. గత ఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడ్డాక అది దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ స్వైరవిహారం చేసింది.
ఇంతవరకూ మొత్తంగా కోటి 3 లక్షల మందికిపైగా దాని బారినపడగా, 1,49,756 మంది మరణించారు. ఇలాంటి సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతులు లభించాయన్న వార్త అందరికీ ఉప శమనం కలిగించాలి. హర్షామోదాలు వ్యక్తం కావాలి. కానీ అందుకు భిన్నమైన స్పందనలు వినబడ్డాయి. ఈ వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది కాగా... ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకుని పూణేలోని సీరం సంస్థ కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. పాత కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. ఈలోగా అది సరికొత్త వేషంతో అందరిలో భయాందోళనలు కలిగిస్తోంది. దాని తీవ్రత ఎంతో, అది కలగజేయగల నష్టమేమిటో ఇంకా పూర్తిగా నిర్ధారణకాని సమయంలో వివాదం రేగటం ఆందోళనకరమే.
అందరూ టీకాలు తీసుకుంటే వైరస్ పీడ త్వరలో సమసిపోతుందన్న ఆశ వుంటుంది. అదే సమయంలో ఆ వైరస్ వల్ల కరోనా బెడద మాయంకావటం మాట అటుంచి దుష్పరిణామాలేవీ కలగవు కదా అన్న సందేహాలుంటాయి. వ్యాక్సిన్లు అన్నివిధాలా సురక్షితమైనవని, భద్రమైనవని నిపుణులు నిర్ధారించుకున్నాకే సాధారణంగా వాటికి అనుమతులు లభిస్తాయి. దానికితోడు రాజకీయ నాయకులు సైతం స్వయంగా ఆ టీకాలు తీసుకుంటే జనంలో మరింత విశ్వాసం పెరుగు తుంది. జరగాల్సింది ఇది కాగా... అందుకు భిన్నమైన రీతిలో పలువురిలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తు తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లనూ ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ వాడొచ్చునని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆదివారం ప్రకటించింది.
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) నిపుణుల సంఘం సిఫార్సు ఆధారంగా ఈ అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తక్షణావసరమే. అలాగని వ్యాక్సిన్ల సమ ర్థతకు సంబంధించిన డేటా అందుబాటులో వుంచకుండా అనుమతులివ్వటం వల్ల జనంలో అయోమయం ఏర్పడుతుంది. ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ అంటూ అనుమ తులివ్వటం వల్ల వాటిని నిర్ణయించేదెవరన్న సమస్య తలెత్తుతుంది. దానికితోడు వైద్యులు ప్రధానంగా కోవిషీల్డ్ టీకానే ఇస్తారని, అది పనిచేయకపోతే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మాత్రమే కోవాగ్జిన్‌ను ఉపయో గిస్తారని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి... దాన్ని నిర్ణయించేదెవరువంటి ప్రశ్నలన్నీ సహజం గానే తలెత్తాయి. తమ టీకాను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమేనని చెప్పటం కోవాగ్జిన్ ఉత్పత్తి దారైన భారత్ బయోటెక్‌కు ఆగ్రహం కలిగించింది. ఇక దీనిపై రాజకీయ రగడ సరేసరి.
భారత్ బయోటెక్‌తోసహా మన ఫార్మసీ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్నాయి. ప్రాణావసర ఔషధాలను చవగ్గా ఉత్పత్తి చేయగలగటం వాటి సుగుణాల్లో ఒకటి. బ్రిటన్ గత నెల 3న అనుమతులిచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ సంగతే చూస్తే అది బాగా ఖరీదైనది. పైగా దాన్ని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే పంపిణీ చేయటం, టీకా వేయటం కూడా పూర్తి చేయాలి. అందుకు ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు సమకూర్చుకోవాలి. కానీ కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుకు విరుద్ధం. వాటిని 2–8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా ధర కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఇవి స్వాగతించదగ్గ అంశాలే అయినా టీకాతో ముప్పు వుండబోదన్న హామీయే కీలకమైనది. ఈ రెండూ 110 శాతం సురక్షితమైనవని డీసీజీఐ సోమాని చెబుతున్నారు. బాధ్యతాయుత స్థానంలో వున్న ఆయనకు ఆ రెండు వ్యాక్సిన్‌లూ అంత విశ్వాసం కలగజేశాయంటే సంతోషించాల్సిందే. కానీ ఆ విశ్వాసానికి ప్రాతిపదికగా వున్న డేటాను కూడా విడుదల చేసివుంటే ఇన్ని సమస్యలు తలెత్తేవి కాదు.
అందుబాటులో వున్న సమాచారాన్నిబట్టి కోవిషీల్డ్ నిబంధనల ప్రకారం మూడు దశల ప్రయోగాలనూ పూర్తి చేసుకోగా, కోవాగ్జిన్ నిర్వహించిన మూడో దశ ప్రయోగ ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడాల్సివుంది. ఇంతవరకూ రెండు వ్యాక్సిన్లకూ సంబంధించి క్లినికల్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అంటే ఎంపికచేసినవారికి టీకాలందించి, వారిని వైద్యుల నిశిత పర్యవేక్షణలో వుంచి పరిశీలించే ప్రక్రియ. ఇలా ఇచ్చే టీకాల సామర్థ్యాన్ని నిర్ణయించేదెవరన్న ప్రశ్న వస్తుంది. అందుకనుసరించే ప్రోటోకాల్ ఏమిటో, ఆ ప్రోటోకాల్‌కు తగినట్టే ఫలితాలున్నాయని తేల్చేదెవరో తెలిస్తే తప్ప ఈ క్లినికల్ ప్రయోగాల ఫలితాలను విశ్వసించటం కష్టమే. వాస్తవానికి మన దేశంలో మాత్రమే కాదు...బ్రిటన్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించినప్పుడూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తాయి. తగినంత సమయం తీసుకుని నిశితంగా పరీక్షించకుండా జనంలోకి వదిల్తే దుష్పరిణామాలకు దారితీస్తుందని ఫైజర్ మాజీ సైంటిస్టు మైకేల్ ఈడెన్ హెచ్చరించారు. కనుకే ఎలాంటి అనుమ తులైనా పారదర్శకంగా వున్నప్పుడే ప్రజానీకం సాదరంగా ఆహ్వానించగలుగుతుంది. అప్పుడే కరోనా వంటి ప్రమాదకర వ్యాధులను శాశ్వతంగా తరమగలం.
Comments
Please login to add a commentAdd a comment