సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమ యం వచ్చేసింది..! వారంలోనే రాష్ట్రంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి అందిన సంకేతాల మేరకు ఈ నెల 11న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఒక కీలకాధికారి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అయితే వ్యాక్సినేషన్‌కు సంబంధించి అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ టీకా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విష యం తెలి సిందే. ఇదిలా వుంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారులకు హైదరాబాద్‌లో రెండ్రోజుల శిక్షణను ప్రారంభిం చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
ముందుగా 10 లక్షల డోసులు...
రాష్ట్రానికి ముందుగా 10 లక్షల డోసుల కరోనా టీకాలు రానున్నాయి. మొదటి విడతలో వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వేసేందుకు కోవిషీల్డ్ టీకా రాష్ట్రానికి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ముందుగా రాష్ట్రంలో 2.88 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మాత్రమే టీకా వేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు గాంధీ ఆసుపత్రి వరకు అన్నిచోట్లా వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. మొదటి రోజు ప్రతి కేంద్రంలో 50 మందికి చొప్పున మాత్రమే టీకా వేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి ప్రతీ కేంద్రంలో 100 మందికి వేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుంది. వైద్య సిబ్బంది మొత్తానికి టీకా వేయడానికి రెండు వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు.
టీకా ఎవరెవరికి ఎప్పుడు వేస్తారో ప్రతీ ఒక్కరికీ ఒక టైం స్లాట్ కేటాయిస్తారు. ఉదాహరణకు రాహుల్ అనే డాక్టర్‌కు ఉదయం 9 గంటలకు టైం స్లాట్ ఇస్తే, శకుంతల అనే నర్సుకు ఉదయం 9.10 గంటల స్లాట్ టైం ఇస్తారు. ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కో సమయం కేటాయించి ఆ ప్రకారం వారి మొబైల్ ఫోన్లకు టైం స్లాట్ మెసేజ్‌లు పంపిస్తారు. ముందుగా వేచి ఉండే గది, తర్వాత టీకా గది, టీకా తీసుకున్నాక సైడ్ ఎఫెక్టŠస్‌ను పరిశీలించేందుకు అరగంట వేచి ఉండేలా మరో గది ఉంటాయి. ఆయా గదుల్లో ఎక్కువమంది గుమికూడకుండా ఉండేందుకే టైం స్లాట్లను పెడుతున్నారు.
వారంలో నాలుగు రోజులే
కరోనా వ్యాక్సిన్ వారానికి నాలుగు రోజులు మాత్రమే వేస్తారు. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ ఉండదని అధికారులు వెల్లడించారు. బుధ, శనివారాల్లో ఇతర టీకాల ప్రక్రియ నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో ఆ రెండు రోజులు విరామం ఇచ్చారు. ఇక ఆదివారం సెలవు ప్రకటించారు. టీకాను జాబితా ప్రకారం, ఇచ్చిన టైం స్లాట్ ప్రకారమే ఇస్తారు. టీకా లబ్దిదారులు గుర్తింపు కార్డు తీసుకొని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. దాన్ని సరిచూసుకున్న తర్వాతే టీకా వేస్తారు. ఒకవేళ ఎవరైనా వారికి కేటాయించిన రోజు రాకపోతే అటువంటి వారికి ప్రత్యేకంగా మరో రోజు కేటాయిస్తారు. అలాగే ఎవరైనా వేయించుకోకూడదని నిర్ణయించుకుంటే ఒత్తిడి చేయరు. అంటే టీకా వేసుకోవాలా వద్దా అనేది స్వచ్ఛందమేనని అధికారులు వెల్లడించారు.
రెండు వారాలు వైద్య సిబ్బందికి టీకా వేశాక... మూడు లేదా నాలుగో వారంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తామని అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూకు సంబంధించిన నిర్ణీత సిబ్బంది, పోలీసులు వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. వారి జాబితాను ఆయా శాఖలు తయారు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారికి టీకాలు వేస్తారు. 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడే వారికి ఎప్పుడు టీకా వేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే వారి జాబితా తయారు కాలేదు సరికదా కేంద్రం నుంచి కూడా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది వైద్య సిబ్బంది టీకా వేసుకునేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు.
1,200 కేంద్రాల్లో.. గురు, శుక్రవారాల్లో భారీ డ్రైరన్
వ్యాక్సినేషన్ ఎలా వేయాలో ట్రయల్స్ కోసం ఇప్పటికే రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఆరు చోట్ల డ్రైరన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మూడు చోట్ల, మహబూబ్‌నగర్‌లోనూ మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించారు. అయితే ఈ ఆరు చోట్ల డ్రైరన్ నిర్వహించగానే సరిపోదని, మిగిలిన ప్రాంతాల్లోని సిబ్బందిలో కొంత గందరగోళంఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా వచ్చే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో 1,200 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటే వ్యాక్సినేషన్ మొదలయ్యాక ప్రక్రియ సాఫీగా సాగిపోతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment