
జనతంత్రం
చర్చలు జరగాలి. నడుస్తున్న కాలం కదలికలపై చర్చలు జరగాలి. మానవ వికాస గమనంలో వర్తమాన కర్తవ్యాలపై విస్తృతమైన చర్చలే జరగాలి. నూరు పువ్వులు పూయాలి. వెయ్యి వాదాలు తలపడాలి. కొత్త వర్ణాలు విచ్చుకోవాలి. సరికొత్త సుగంధాలు వ్యాపించాలి. చర్చల్లో ఉదయించే నూతన భావాలు దారులు చూపే కాంతి దీపాలు కావాలి. ముఖ్యంగా, ఊహించని సవాళ్లు వణికిస్తున్నప్పుడు, శ్వాసించే ఊపిరి సహకరించనప్పుడు తప్పనిసరిగా చర్చలు జరగాలి.
ఆరోగ్యకరమైన చర్చలకు కూడా గత కొన్నేళ్లుగా ప్రమాదకరమైన వైరస్‌లు సోకుతున్న విపరీత పరిణామాలను మనం ఎదుర్కోవలసి వస్తున్నది. కరోనా తరహా వైరస్‌లు మానవ శరీరాలపై దాడులు చేస్తుంటే, ఈ చర్చల వైరస్‌లు మనసుపైనా ఆలోచనలపైనా దాడులు చేస్తున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనబడుతున్నది. దేశ కాల పరిస్థితులకు అనుగుణమైన, అవసరమైన ఎజెండాపై జరగవలసిన చర్చలను, కొంతమంది స్వార్థపూరిత అవసరాలతో కూడిన ఎజెండా వైపు దారి మళ్లించడమే ఈ వైరస్ లక్షణం. ఇది డిబేట్ డైవర్షన్ వైరస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం, భాగ స్వామ్య ప్రతిపక్షం, మారు వేషాల్లో ఉన్న ప్రతిపక్షం, మిలిటెంట్ –కమ్– పేమెంట్ ప్రతిపక్షం, పేపర్ మీడియా ప్రతిపక్షం, టీవీ మీడియా ప్రతిపక్షం, సోషల్ మీడియా ప్రతిపక్షం సంయుక్తంగా డీడీ వైరస్‌ను వ్యాపింపజేసే పనిలో తలమునకలై ఉన్నాయి.
ఇప్పుడు చర్చ జరగవలసిన ప్రధానాంశాలేమిటి? అందులో ముఖ్యమైనది కరోనా మహమ్మారి కాదా? ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న చర్యలపై కాదా? ఒక్క వైరస్ ధాటికి చేతులెత్తేస్తున్న మన ప్రజారోగ్య వ్యవస్థ దౌర్బల్యానికి గత పాలకుల పాత్ర ఎంతో చర్చించవలసిన అవసరం లేదా? అందరిలోకీ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని బోనెక్కించవలసిన అంశంపై చర్చ జరగనవసరం లేదా? ఈ రాష్ట్రంలో పదిమంది ముఖ్య మంత్రులు–ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, సంజీవయ్య, పీవీ నర్సింహారావు, అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల, నాదెండ్ల, నేదురుమల్లి, రోశయ్య– కలిసి ఎంతకాలం పాలించారో, అంతకంటే పిసరంత ఎక్కువ కాలమే ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మన ప్రజారోగ్య వ్యవస్థను ఏస్థాయిలో నిర్వీర్యం చేశారో చర్చకు రాగూడదా? పైగా ఇప్పుడు ఆయనే ప్రతిపక్ష నేత కనుక ఆ చర్చ ఔచిత్యం మరింత ఎక్కువ లేదా?
భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనంత దీక్షతో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నది వాస్తవం కాదా? తాజా మహమ్మారి భూగోళంపై ఇంకా పురుడుపోసుకోక ముందే, నాడు– నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ వైద్య వ్యవస్థకు జవసత్వాలను సమకూర్చడం మొదలుపెట్టిన దూరదృష్టి నిజం కాదా? ఇది కదా ఇప్పుడు చర్చ జరగవలసిన ముఖ్య విషయం. ప్రజలకు ఎమర్జెన్సీ సేవలకోసం ఒకేసారి వెయ్యి అంబులెన్స్‌లను ప్రవేశపెట్టిన చారిత్రక ఘట్టం ఇతర రాష్ట్రాల్లో ప్రశంసలు పొందినా, ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కినట్టు? కొన్ని మీడియా సంస్థల దృష్టిలో ప్రముఖ వార్తగా గుర్తింపునకు నోచుకోలేదెందుకు? ఏ రాష్ట్రం లోనూ ఎప్పుడూ జరగని విధంగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీలను ప్రకటించి, స్థల సేకరణ కూడా పూర్తిచేసిన ప్రభుత్వం చిత్త శుద్ధిపై అభినందనపూర్వక చర్చలు జరగకపోవడం వెనుక ఉన్న గండికోట రహస్యం ఏమిటి? రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ప్రతిపక్ష బృందం– మీడియా, జనాభాలో అత్యధిక శాతం మందికి పరీక్షలు చేసిన నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కిందనే అంశాన్ని ఎందుకు దాస్తున్నట్టు? పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న క్లస్టర్లలోనే 90 శాతం పరీక్షలు జరుగుతున్నాయనీ, ఫలితంగానే ఎక్కువ కేసులు వస్తున్నాయనీ, అయినప్పటికీ వ్యాప్తిని అరికట్టడంలో ఇదే సరైన విధానమని వైద్యనిపుణులు చెబుతున్న మాటలను ఎందుకు మరుగునపెడుతున్నారు?
భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే విద్యారంగంలో విప్ల వాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న విషయంపై మూగ నోము ఇంకెంతకాలం పాటిస్తారు? ఒక్క ఏడాదికాలంలో 15 వేల ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలతో ముస్తాబై సగర్వంగా తలెత్తుకుని నిలబడిన వైనం కనబడకపోవడం వెనుక కారణమేమై ఉంటుంది? ఇంగ్లిష్ మాధ్యమంపై అలజడి సృష్టించడానికి ప్రయత్నించి, జనాగ్రహానికి భయపడి తోకముడిచిన సంగతి నిజంకాదా? ప్రతిష్టాత్మకమైన అమ్మఒడి పథకం పత్రికల పతాక శీర్షికలకెందుకు ఎక్కలేదు? టీవీ చర్చా వేదికల నెందుకు ఆక్రమించలేదు? ప్రతిపక్ష రాజకీయ నేతలు ఎందుకు హర్షం ప్రకటించలేదు?
యావద్దేశం దృష్టిని ఆకర్షించిన గ్రామ సచివాలయాలు, ప్రపంచం కొనియాడిన వలంటీర్ల వ్యవస్థ కూడా ఎందువలన మీడియా ప్రచారాల్లో అగ్రాసనాన్ని అందుకోలేదు? ఈ ప్రశ్నల న్నింటికీ ఒక్కటే సమాధానం. ఈ రాష్ట్ర ప్రతిపక్షనేత ఉరఫ్ 14 యేళ్లు ముఖ్యమంత్రి ఉరఫ్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత తన పార్టీతోపాటు, ఇతర పార్టీలోని కొందరు ముఖ్యులతో, మెజారిటీ మీడియా సంస్థలతో, రాజ్యాంగ వ్యవస్థల్లోని కొందరు వ్యక్తులతో ఒక అప్రకటిత, అపవిత్ర కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమి సాయంతో ప్రజావసరాల నుంచి తన అవసరాల వైపు చర్చలను దారి మళ్లించడం ఒక వ్యూహంగా ఆయన మార్చుకున్నారు. ఇప్పుడూ అదే ఆట ఆడుతున్నారు.
ఆటలో భాగంగానే వారి ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి విజ్ఞాపనపత్రం ఇస్తుంది. అధినాయకుడు గవర్నర్‌కు లేఖ రాస్తారు. న్యాయస్థానాల్లో డజన్లకొద్దీ పిటిషన్లు దాఖలవుతాయి. కూటమి పత్రికలు రోజూ బ్యానర్లు కడతాయి. అదే అంశాలతో అస్మదీయ చానళ్లు రచ్చబండలు నిర్వహిస్తాయి. ఎజెండా మళ్లింపు పథకంలో భాగంగా ఇప్పుడు వారు సంధిస్తున్న విషయాలు: వైఎస్ జగన్ పరిపాలనలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. బీసీ నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కుర్చీ వేయకుండా ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతు న్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డునే అరిగిపోయే దాకా కూటమి భాగస్వాములంతా ఇప్పుడు ప్లే చేస్తున్నారు.
సిగ్గుపడటం, మొహమాటపడటం రాజకీయాల్లో పనికిరావనేది తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసించే సూత్రాల్లో ఒకటి. అందుకే ఏమాత్రం సిగ్గుపడకుండా వైఎస్ జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రచారం మొదలు పెట్టింది. రమణారెడ్డికి రావణబ్రహ్మ వేషం నప్పుతుందా? మేక తోలు కప్పుకుంటే పులి శాకాహారిగా మారుతుందా? తెలుగు దేశం పార్టీ దళితుల తరపున వకాల్తా పుచ్చుకుంటే ఎవరైనా నమ్ముతారా? అయినా సరే, ప్రధానాంశాలపై నుంచి చర్చను దారి మళ్లించడమే తమ లక్ష్యం కనుక గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ పాటను వారు పాడుతూనే ఉంటారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లో తమ పార్టీ నాయకు లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించేది. హఠాత్తుగా బీసీ వర్గాలు గుర్తుకురావడంతో టీడీపీ ట్యూన్ మార్చింది. తమ పార్టీ బీసీ నేతలను ప్రభుత్వం అణచివేస్తున్నదనే ప్రచారాన్ని అందుకున్నది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీకి వెన్నుదన్నుగా బీసీలే నిలబడ్డారు. రాజకీయ రంగంలో బీసీ నాయకత్వం ఎదగడానికి కూడా ఎన్టీ రామారావు దోహదం చేసిన ఫలితంగా చాలా కాలంపాటు ఆ పార్టీకి బీసీలు ఓటు బ్యాంకుగా నిలబడ్డారు. చంద్రబాబు హయాంలో ఆ నాయకత్వానికి అవమానాలే మిగి లాయి. బీసీల శ్రేయస్సుకోసం ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం మినహా బాబు చేసింది కూడా ఏమీ లేదు. చివరిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ న్యాయవాదులు జడ్జీలుగా పనికిరారంటూ కొలీ జియానికి రాసిన లేఖ కలకలం సృష్టించింది. మొన్నటి ఎన్నికల్లో మెజారిటీ బీసీలు మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి వ్యతి రేకంగా ఓటేశారు. ఏడాది పాలనలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. ఇప్పుడు గేమ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. సానుభూతికోసం బీసీ నేతల అణచివేత బాణాన్ని టీడీపీ బయటకు తీసింది. అవినీతికి పాల్పడినట్టు గట్టి ఆధారాలున్న నేతల ద్వారా సానుభూతి కొల్లగొట్టాలనుకోవడం భ్రమేనని తెలిసినా, తెలుగుదేశం పార్టీ ఈ జూదం ఆడకుండా ఉండదు.
పాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించింది. దాంతో కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తన పదవిని కోల్పోయారు. ఆ కుర్చీపై నిమ్మగడ్డను మళ్లీ కూర్చోబెట్టడం పార్టీ కార్యక్రమం కింద తెలుగుదేశం చేపట్టింది. అంతకుముందే నిమ్మగడ్డ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసిన కమిషనర్ స్వతంత్రంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడిచారు. అంతేకాకుండా ఫక్తు తెలుగుదేశం కార్యకర్త స్థాయిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కేంద్ర హోం శాఖకు ఒక లేఖను రాశారు. తానే ఆ లేఖ రాసినట్టు స్వయంగా ప్రకటించారు. బీజేపీ వేషాల్లో ఉన్న చంద్రబాబు కోర్ గ్రూప్ సభ్యులతో హోటల్ పార్క్ హయత్‌లో మంతనాలు జరిపి కెమెరాకు చిక్కారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల కమిషనర్ కుర్చీ మీద కూర్చోబెట్టకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే భావించాలని టీడీపీ దబాయిస్తున్నది.
రాజధాని వికేంద్రీకరణ వ్యవహారాన్ని చంద్రబాబు కోర్ గ్రూప్ జీవన్మరణ సమస్య అన్నట్టుగా భావిస్తున్నది. హైదరాబాద్ అనుభవం దృష్ట్యా అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం తగదని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం నియ మించిన శివరామకృష్ణన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే ఈ నిర్ణయం ఉన్నది. రాజధాని వికేంద్రీకరణ మాట వినడంతోనే చంద్రబాబు కోర్ కమిటీ భూకంపం వచ్చినట్టుగా తల్లడిల్లింది. రాజధాని పేరుతో జరిగిన భూసేకరణలో భారీ అవినీతి జరిగిందని మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా అప్పటి ప్రతిపక్షం వైసీపీ అభివర్ణించింది. ఇప్పుడు జరుగుతున్న సీఐడీ విచారణలో సైతం ఇందుకు బలం చేకూర్చే విషయాలు బయటపడుతున్నాయి. పైకి మాత్రం బినామీ రైతుల చేత ప్రాయోజిత ఆందోళన కార్య క్రమాన్ని తెరపైకి తెచ్చినప్పటికీ, ఈ విషయంలో చావోరేవో అన్నట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తున్నది.
ఇది చూస్తుంటే అనంత పద్మనాభస్వామి దేవాలయంలో నాగబంధ రహస్యం లాంటిదేదో ఇక్కడా ఉన్నట్టే అనుమానం కలుగుతున్నది. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ ఢిల్లీలో బీజేపీ వేషాల్లో ఉన్న టీడీపీ కోర్ కమిటీ సభ్యులు చెమటోడ్చి పనిచేస్తున్నారు. బీజేపీ పెద్దల వద్దకు ఎక్కే గడప.. దిగే గడప అన్నట్టుగా సాగుతున్నది వారి లాబీయింగ్. ఆ పెద్దల ముందు వీరి ప్రతిపాదనలు వింటే ఔరా అనిపించక మానదు. టీడీపీ మళ్లీ బీజేపీ కూటమిలో చేరుతుందనీ, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ–పార్లమెంట్ స్థానాల్లో బీజేపీయే మెజారిటీ స్థానాలు తీసుకుని టీడీపీని జూనియర్ భాగస్వామిగా చేసుకున్నా ఫర్వా లేదనీ, కానీ రాజధాని విభజన జరక్కుండా చూడాలని ఆ ప్రతి పాదనల సారాంశమట. చంద్రబాబు ‘విశ్వసనీయత’ బాగా తెలి సిన బీజేపీ నాయకులు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రతిపక్షం ఏమాత్రం పుంజుకుందో చూద్దామని ఓ సర్వే నిర్వహించారట. అంతకుముందు ఎన్నికల్లో దాదాపు 40 శాతం ఓట్లు సాధించిన టీడీపీ ఈ సర్వేలో 12 శాతం ఓట్లు కోల్పోయిందట. ఆ కోల్పోయిన ఓట్లన్నీ గుండుగుత్తగా వైసీపీ ఖాతాలో పడ్డాయట. ఈ సంగతి బీజేపీ నేతలకు పక్కాగా తెలుసు. అయినా టీడీపీ తన ప్రయత్నాలను విరమించడం లేదు – గ్రామఫోన్ రికార్డుల గోలనూ ఆపడం లేదు.
muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి