
జార్ఖండ్ ఎన్నికల సందడి ముగిసి అక్కడ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. 70 స్థానాలున్న అసెంబ్లీకి వచ్చే నెల 8న ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు మరో మూడు రోజులకు వెలువడతాయి. కాంగ్రెస్, బీజేపీలు తప్ప మరో పార్టీకి అవకాశం లేదను కుంటున్న తరుణంలో 2013లో ఊహించని విధంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆవిర్భవించి, చూస్తుండగానే చకచకా ఎదిగి అధికారాన్ని అందిపుచ్చుకునే స్థాయికి చేరు కుంది. ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆ పార్టీ 28 స్థానాలు గెల్చు కుంది. బీజేపీ–అకాలీ కూటమి ఆ ఎన్నికల్లో కనీసంగా రావాల్సిన 36 స్థానాలు గెల్చుకోలేక 32 దగ్గర ఆగిపోయింది. పర్యవసానంగా 8 స్థానాలొచ్చిన కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తామని ముందుకు రావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, రెండునెలలు కూడా తిరగకుండానే రాజీనామా చేయాల్సివచ్చింది.
వెళ్తూ వెళ్తూ అసెంబ్లీ రద్దుకు ఆయన ప్రభుత్వం చేసిన సిఫార్సును లెఫ్టినెంట్ గవర్నర్ ఖాతరు చేయలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత 2014 నవంబర్‌లో అసెంబ్లీ రద్దయి, ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆప్ 67 స్థానాలు గెల్చుకుంది. అంటే మొత్తం స్థానాల్లో 95.7 శాతం ఆ పార్టీకే వచ్చాయి. పోలైన ఓట్లలో 54.3 శాతం ఆ పార్టీవే. మిగిలిన మూడు స్థానాలూ బీజేపీకి దక్కగా, కాంగ్రెస్ పూర్తిగా నేలమట్టమయింది. అంతకు కొన్ని నెలలముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలూ కైవసం చేసుకున్న బీజేపీకి ఇది పెద్ద షాక్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఇదే తరహాలో ఏడు స్థానాలూ బీజేపీ ఖాతాలో పడ్డాయి. కనుకనే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ జాగ్రత్తగా అడుగులేయాల్సివుంటుంది.
భారీ మెజారిటీ రావడం వల్ల ఏర్పడిన భరోసా కావొచ్చు లేదా పార్టీలో అందరినీ కలుపుకొని పోయేంత అనుభవం లేకపోవడం వల్ల కావొచ్చు...పార్టీని స్థాపించినప్పుడు తనకు అండగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌వంటివారిని కేజ్రీవాల్ దూరం చేసుకున్నారు. పార్టీలో అంత ర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, తన నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదని కేజ్రీవాల్ కోరు కుంటున్నారని వారిద్దరూ ఆరోపించారు. ఆప్‌లో కీలకపాత్ర పోషించిన మరికొందరు నేతలు సైతం ఆ తర్వాతకాలంలో నిష్క్రమించారు. మరోపక్క ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌తో వివిధ సందర్భాల్లో ఆయనకు తగాదాలు బయల్దేరాయి. అంతకుముందున్న నజీబ్ జంగ్‌తో, ఆ తర్వాత అనిల్ బైజాల్‌తో అధికార పరిధులపై వివాదాలు తప్పలేదు. సివిల్ సర్వీస్ అధికారులు ఎవరి నియంత్రణలో వుండా లన్నది ఒక సమయంలో పెను వివాదంగా మారడం, కేజ్రీవాల్ సమక్షంలో తనపై ఇద్దరు ఆప్ ఎమ్మె ల్యేలు దాడిచేశారంటూ సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోపణ చేయడం, అందులో కేజ్రీ వాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియా సహా 11మంది ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం... దాడికి నిరసనగా ఐఏఎస్ అధికారులు సహాయనిరాకరణకు దిగడం వంటివి ఆప్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. వీటన్నిటి వెనకా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హస్తమున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరిగిన ఉద్య మాల్లో, సభల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఇందువల్ల తమ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని 2017లో ఢిల్లీ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు తెలిసొచ్చింది. ఆ మూడు కార్పొరేషన్లలోనూ వరసగా మూడో దఫా కూడా బీజేపీయే గెలిచింది. పైగా అన్నిచోట్లా బీజేపీకి మూడింట రెండువంతుల మెజారిటీ లభించింది. 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ ఓట్ల శాతం సగానికి పడిపోగా, బీజేపీ ఏడు శాతం మేర ఓట్లు పెంచుకుంది. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెడితే తప్ప జనం మెప్పు పొందడం అసాధ్యమని కేజ్రీవాల్ ప్రభుత్వం గ్రహించింది.
ఆ తర్వాత అది అమలు చేసిన అనేక పథకాలు అందరి ప్రశంసలూ పొందాయి. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. ఢిల్లీ పాఠశాలల్లో 20,000 తరగతి గదుల నిర్మాణం, 400 బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు, నిర్దిష్టమైన యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించేవారికి దాన్ని ఉచితంగా అందించడం, ఉచిత వైఫై వంటివి ఆప్ ప్రభు త్వానికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఢిల్లీ బడ్జెట్‌లో 26 శాతాన్ని... అంటే 13,997 కోట్ల రూపా యలను విద్యకు కేటాయించారు. ఆర్థికంగా వెనకబడినవారికి పన్నెండో తరగతి వరకూ ఉచిత విద్య అందించారు. వీటి ఫలితాలు నేరుగా కనబడుతున్నాయి. బస్తీ క్లినిక్‌లు కూడా మంచి ఫలితాలి చ్చాయి. అయితే వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ జాంలు వగైరా అంశాల్లో ఆప్ ప్రభుత్వం సంజా యిషీ ఇచ్చుకోవాల్సిన స్థితిలోనేవుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సహజంగానే స్థానిక సమస్యలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి కాబట్టి ఆ అంశాల్లో ఎక్కడెక్కడ ఆప్ ప్రభుత్వం విఫలమైందో బీజేపీ, కాంగ్రెస్‌లు ఎత్తి చూపాల్సివుంటుంది. అందులో అవి ఏమేరకు విజయం సాధిస్తే ఆ మేరకు ఆప్ ఓటు బ్యాంకును దెబ్బతీయగలుగుతాయి.
జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి వున్న పేరు ప్రతిష్టలు మాత్రమే ఢిల్లీలో బీజేపీకి ఓట్లు రాబట్టలేవు. ఆ సంగతి 2015లోనే బీజేపీ అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. అప్పట్లో తమ సీఎం అభ్యర్థి ఎవరో చివరి వరకూ బీజేపీ చెప్పలేక పోయింది. ఆఖరి నిమిషంలో వచ్చిన కిరణ్ బేడీ పార్టీకి శిరోభారంగానే మారారు. ఈసారి వీట న్నిటినీ బీజేపీ ఎలా సరిదిద్దుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల మాదిరే ఢిల్లీలోనూ జవసత్వాలు లేక నీరసించివుంది. అది ఆప్, బీజేపీల్లో ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చగలదో, ఏమేరకు సీట్లు తెచ్చుకుంటుందో ప్రచారపర్వం ఊపందుకున్నాక తేలుతుంది. ప్రజా ప్రాధాన్య అంశాలు చర్చ కొచ్చి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించాలి.