ఇక దేశంలో లాక్‌డౌన్ ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వరసగా రెండోరోజు సీఎంలతో జరిగిన వీడియో భేటీలో ప్రకటించగా, కరోనా వైరస్ మరింత పేట్రేగుతున్నదని వరసగా అయిదారు రోజులుగా వెలువడుతున్న గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా బయటపడే కేసుల సంఖ్య అపారంగా పెరగడమే కాదు...మరణాల రేటు కూడా జోరందుకుంది. ఈ కరోనా వైరస్ తీవ్రతకు ఎవరూ ఊహించని రీతిలో జగన్నాధ రథచక్రాలు కూడా ఆగిపోతున్నాయి. ఏటా దాదాపు 15 లక్షలమంది భక్తులతో జరిగే పూరీ రథయాత్రపై ఈ సమస్య కారణంగా సుప్రీంకోర్టు స్టే విధించింది. కరోనా ఇంతగా విరుచుకుపడుతున్న వేళ రథయాత్రకు అనుమతిస్తే పూరీ జగన్నాధుడు మనల్ని క్షమించండని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యానించడం గమనించదగ్గది. గురువారం బయటపడిన కరోనా కేసుల సంఖ్య 13,000 దాటింది. మొత్తంగా ఈ కేసుల సంఖ్య 3 లక్షల 67 వేలు పైమాటే. బుధవారం ఒక్కరోజే మృతుల సంఖ్య రెండువేలు దాటిపోవడం ఆందోళన కలిగించే అంశం.
ఈనెల 1న దేశంలో మరణాల రేటు 2.79 శాతం వుండగా అదిప్పుడు 3.37 శాతానికి పెరిగింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు ఈ జాతీయ సగటును మించిపోయింది. అది మహారాష్ట్రలో 4.88శాతం(ఇంతక్రితం 3.37 శాతం), ఢిల్లీ 4.11శాతం (ఇంతక్రితం 2.5శాతం). తమిళనాడులో కూడా మరణాల రేటు 0.79 శాతం నుంచి 1.09 శాతమైంది. ముంబై నగరంలో 3.2 శాతం నుంచి 5.25 శాతానికి పెరిగింది. కొత్తగా బయటపడిన కేసుల్లో 55 శాతం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులవే.
నిరంతరాయంగా పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి, వారిని వేరు చేయడం ఒక్కటే ఈ మహమ్మారిని అరికట్టడానికున్న ఏకైక మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లోనే చెప్పింది. కానీ మన దేశంలో కరోనా పరీక్షలు విస్తృతంగా సాగటం లేదు. కొన్ని రాష్ట్రాలు సొంత చొరవతో, బాధ్యతతో ఆ పని చేస్తున్నా చాలా రాష్ట్రాలు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) మార్గదర్శకాలు లేవన్న సాకు చూపి పరిమిత స్థాయిలోనే పరీక్షలు జరుపుతున్నాయి. అలాగే కరోనా లక్షణాలున్నా దాన్ని దాచిపెట్టి, పరీక్షలు చేయించుకోనివారుంటున్నారు. పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు వంటివాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా అది అరణ్యరోదనే అవుతోంది. దాంతో రోగ లక్షణాలు బయటపడనివారు యధేచ్ఛగా తిరుగుతూ అనేకమందికి అంటించడం, వారిద్వారా అది మరింతగా వ్యాపించడం తప్పదు. కనుకనే కేసుల తీవ్రత ఇంతగా వుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధిక సంఖ్యలో పరీక్షలు జరుపుతూ ముందంజలో వుంది. అది గత 24 గంటల్లో 13,923 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇంతవరకూ జరిపిన పరీక్షలు 6 లక్షల 12 వేలు దాటాయి. అది సగటున పదిలక్షలమంది జనాభాకు 11,468 పరీక్షలు జరుపుతూ రికార్డు నెలకొల్పింది.
ఢిల్లీలో కేంద్రానికీ, అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వానికీ మధ్య వున్న మొదటినుంచీ వున్న వైరం కరోనా వైరస్‌ను అరికట్టడంలో పెద్ద ప్రతిబంధకంగా మారింది. ఢిల్లీలో కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతున్న తీరు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. వచ్చే నెలాఖరునాటికి ఢిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులుంటాయని, 80,000 బెడ్‌లు అవసరం పడొచ్చని ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పటికే అంచనా వేశారు. ఒక దశలో ఢిల్లీలో వైద్య సేవలు కేవలం ఢిల్లీవాసులకేనని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంతో ఆ నిర్ణయం అమలు ఆగిపోయింది. పరిస్థితి పూర్తిగా చేయిదాటే స్థితి ఏర్పడబోతున్నదని అర్ధమయ్యాక సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు ఉమ్మడిగా కదలాలని నిర్ణయించాయి. బుధ, గురువారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేజ్రీవాల్, ఉన్నతాధికారులు కరోనా సంక్షోభంపై సమావేశం జరపడం మంచి పరిణామం. ఢిల్లీలో విస్తృతంగా...అంటే ఇప్పటికన్నా నాలుగు రెట్లు అధికంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాధిగ్రస్తులుగా గుర్తించినవారికి చికిత్స అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆదివారంనాటికి రోజుకు 4,000–4,500 పరీక్షలు నిర్వహించగా...అవి ఇప్పుడు బాగా పెరిగాయి. ముమ్మరంగా పరీక్షలు చేయడంవల్లే మహమ్మారి విస్తృతి ఎంతో తెలుస్తుంది. తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం వుంటుంది. తక్కువ సంఖ్యలో పరీక్షలు జరుపుతూ అంతా బాగుందనే తరహాలో వుండిపోవడం వల్ల అది సమసిపోదు సరికదా ఉన్నకొద్దీ మరింత జటిలమవుతుంది.
ఇంతగా విపత్తు ముంచుకొచ్చిన తరుణంలో కూడా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు ప్రభుత్వాలు నిర్దేశించిన ధరలు తమకు గిట్టుబాటుకావని భీష్మించుకున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకూ ప్రైవేటు ఆసుపత్రులది ఒకే మాట. ప్రభుత్వాల మాట విని చికిత్స కోసం వెళ్తున్న రోగులను అవి వెనక్కి పంపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులు అసలు కరోనా పరీక్షల జోలికే పోవడం లేదు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు తమకు సమ్మతం కాదని ప్రైవేటు లాబొరేటరీలు అంటున్నాయి. దశాబ్దాలుగా ప్రజారోగ్య రంగాన్ని ప్రభుత్వాలు విస్మరించిన ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడింది. చాలినంతమంది వైద్యులు, ఇతర సిబ్బంది లేక ప్రభుత్వాసుపత్రులు సతమతమవుతున్నాయి. ఇతరత్రా సదుపాయాల గురించి చెప్పనవసరమే లేదు. ఫలితంగా ఉన్న సిబ్బంది నిర్దిష్ట సమయంకన్నా అధికంగా పనిచేయాల్సి వస్తోంది. మొత్తం భారం వారిపైనే పడుతోంది. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ తరుణంలో కూడా ప్రభుత్వాలు సూచించినవిధంగా చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు మొరాయిస్తు న్నాయి. వైద్యం కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడక తప్పని స్థితి వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా అధికమని ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే వెల్లడించింది. ఇప్పుడు నేర్చిన గుణపాఠా లతో అయినా ప్రజారోగ్యరంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment