
ఏడాది వ్యవధిలో వరసగా మూడోసారి ఎన్నికలు వచ్చినా ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్ ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టమైన తీర్పునివ్వలేకపోయారు. అమెరికా ఆశీస్సులతో వెస్ట్ బ్యాంక్ భూభాగంలోని మెజారిటీ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి పథకరచన చేసిన ప్రధాని నెతన్యాహూ ఆశలకు ఈ ఎన్నికలు గండికొట్టాయి. అధికారికంగా ఈ నెల 10న ఫలితాలు ప్రకటించాల్సివున్నా 120 స్థానాలుండే కెన్సె ట్‌లో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద పక్షం లికుడ్ పార్టీకి అంచనాకు తగ్గట్టు సీట్లు రాలేదు. ఆ పార్టీకి గత ఎన్నికలకన్నా నాలుగు అదనంగా లభించి అది 36 సీట్ల దగ్గరే ఆగిపోగా, బెన్నీ గాంట్జ్ ఆధ్వర్యంలోని ప్రత్యర్థి పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీకి 33 స్థానాలొచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదల్చుకున్న పక్షానికి పార్లమెంటులో ఉండాల్సిన కనీస స్థానాలు 61. నిరుడు ఏప్రిల్‌లో ఒకసారి, సెప్టెంబర్‌లో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు నెతన్యాహూ ఏదోవిధంగా అధికారంలో కొనసా గారు.
కానీ ఈసారి అది అంత తేలిగ్గా అందే అవకాశం కనబడటం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇప్పుడు కూడా మెజారిటీ పక్ష నేతగా నెతన్యాహూకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం అందుతుంది. అయితే ప్రత్యర్థి పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీ చేతులు కలిపితేనే సుస్థిర ప్రభుత్వం స్థాపించే అవకాశం వుంది. కానీ ఆ రెండు పార్టీలూ దగ్గరయ్యే అవకాశం లేదు. ఇతర మితవాద పక్షాలైన షాస్, యమినా, తోరా జుడాయిజంవంటివాటితో నెతన్యాహూ కూటమి ఏర్పరిచినా, కనీస మెజారిటీకి మూడు స్థానాలు తక్కువే వుంటాయి. ఏతావాతా ఆయన ప్రభుత్వం దినదిన గండం గానే గడపాలి. నెతన్యాహూ పార్టీకి సొంతంగా 58 స్థానాలొస్తాయని విశ్లేషకులు జోస్యం చెప్పారు. తోటి మితవాద పక్షాలను కూడగట్టి సునాయాసంగా సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని నెతన్యాహూ నమ్మారు.
కానీ చివరకు ఆయనకు నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల ప్రచారంలో ఎప్పటిలాగే నెతన్యాహూ పాలస్తీనాకు వ్యతిరేకంగా నిప్పులు కక్కారు. ‘ఇంకెంత... మరో రెండు నెలల్లో వెస్ట్‌బ్యాంకు ప్రాంతాన్ని విలీనం చేసుకోవడం ఖాయమ’ని ప్రక టించారు. ఆయన మాత్రమే కాదు...ఆయన ప్రత్యర్థి గాంట్జ్ కూడా వెస్ట్‌బ్యాంక్ విషయంలో అదే రక మైన అభిప్రాయంతో వున్నారు. కానీ ఆయన కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేరు. ఈ సంగతలా వుంచి నెతన్యాహూ పాలనపై ఇజ్రాయెల్ ప్రజానీకంలో వ్యతిరేకత పాలు అధి కంగానే ఉన్నదని తాజా ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. దేశ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని తీర్చడంలో విఫలమవుతూ వస్తున్న నెతన్యాహూ జాత్యహంకార పోకడలనే ఆశ్రయిస్తున్నారు.
ఆ పోకడల పర్యవసానంగా లికుడ్ పార్టీకి మిగిలిన పక్షాలకంటే అధిక స్థానాలు లభిస్తున్నాయి. అధికా రమూ దక్కుతోంది. కానీ వేరే పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పర్చక తప్పడం లేదు. ఇంత కుముందు రెండు ఎన్నికల సమయంలోనూ నెతన్యాహూపై అవినీతి ఆరోపణలు మాత్రమే వస్తే, ఈసారి ఆ ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి కేసులు కూడా దాఖలు చేశారు. నెత న్యాహూ, ఆయన భార్య అక్రమంగా బహుమతులు స్వీకరించారని, అధిక సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక యజమానితో లాలూచీపడి అందులో తనకు బాగా ప్రచారం ఇచ్చేట్టు చేసుకన్నారని, దానికి ప్రతిఫలంగా దాని ప్రత్యర్థి పత్రిక దెబ్బతినేవిధంగా చట్టం తీసుకొచ్చారని, ఒక వెబ్‌సైట్‌లో తనకు అనుకూల వార్తలు రాయించుకుని, దాన్ని నిర్వహిస్తున్న టెలికాం సంస్థకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆ ఆరోపణల సారాంశం. అంచం ఆరోపణలు రుజువైతే నెతన్యాహూకు గరిష్టంగా పదేళ్లు శిక్షపడుతుంది. అలాగే విశ్వాసఘాతుకానికి సంబంధించిన ఆరోపణల్లో మూడేళ్లు శిక్ష పడే అవకాశంవుంది. కనుకనే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో నెగ్గి అధికారంలోకొచ్చినా నెతన్యాహూకు అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యేది.
ఈ దఫా ఎన్నికల ప్రచారంలో వెస్ట్‌బ్యాంక్‌తో పాటు నెతన్యాహూ ఈ అవినీతి ఆరోపణలపైనే కేంద్రీకరించారు. తనకు అధికారం దక్కకుండా చేయడానికే ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కానీ ఆయన మాటల్ని జనం విశ్వసించలేదని చెప్పడానికి ఎన్నికల ఫలితాలే రుజువు. ఈ ఆరోపణలపై న్యాయ స్థానాల్లో విచారణ మొదలు కావాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఆరోపణలు రుజువై శిక్ష పడినా, ఆఖరి అప్పీల్‌లో వ్యతిరేకంగా తీర్పు వచ్చేంతవరకూ అధికారంలో కొనసాగడానికి అడ్డంకు లేమీ ఉండవు. కానీ ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు అధికారంలోకొచ్చిన వెంటనే చట్టసవరణకు పూనుకొని ప్రధాని పదవిలో వుండేవారికి ప్రాసిక్యూషన్ బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని నెతన్యాహూ గట్టిగా కోరుకున్నారు.
ఇప్పుడు అధికారం రావడం, దాన్ని నిలబెట్టు కోవడం పెద్ద సమస్యగా మారింది. తోటి మితవాద పక్షాలు కూటమిలో చేరినా, ఈ సవరణకు అంగీకరిస్తాయా అన్న సందేహం అందరిలో వుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పుడు నెలకొన్న రాజకీయ అనిశ్చితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది వేచి చూడాలి. ఈసారి నెతన్యాహూ కెన్సెట్‌లో విశ్వాస పరీక్ష నెగ్గలేకపోతే నాలుగో దఫా ఎన్నికలు అనివార్యమవుతాయి. అందుకు అన్ని పార్టీల ఎంపీలూ వ్యతిరేకంగా వున్నారని అంటున్నారు. కనుక పార్టీలకు అతీతంగా కొందరు నెతన్యాహూకు మద్దతిచ్చే అవకాశం లేకపోలేదు. ఆయనే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచి, వెస్ట్‌బ్యాంకు భూభాగం కబ్జాకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్–పాలస్తీనా ఘర్షణలు ప్రమాదకర స్థాయికి చేరతాయి. ఆ ప్రాంత పాలస్తీనా వాసులకు గూడు కరువవుతుంది. తనను తాను ప్రాసిక్యూషన్‌నుంచి మినహాయించుకుంటూ చట్ట సవరణకు నెతన్యాహూ పూనుకుంటే అది ఆ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తుంది. మొత్తానికి ఇజ్రాయెల్ ఇప్పుడొక సంధి దశలో పడింది. దాన్నుంచి అది క్షేమంగా బయటపడుతుందా లేక మరో నిరంకుశ నేత ఆగమనానికి దారితీస్తుందా అన్నది చూడాలి.