ఫైల్ ఫొటో
అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు ప్రాంతాల ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే ‘ఈశాన్యం’ నుంచి మరో మంచి కబురు వినబడింది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని చాలా ప్రాంతాల్లో ఉపసంహరించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావలసి ఉంది. అస్సాంలో మొత్తం 23 జిల్లాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించు కుంటున్నారు. గత డిసెంబర్‌లో సైన్యం ఒక వాహనంపై గురిచూసి కాల్పులు జరిపిన ఉదంతంలో 14 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయాక ఈ చట్టం అమలు నిలిపేయాలంటూ ఉద్యమించిన నాగాలాండ్‌లో మూడు జిల్లాల్లో పూర్తిగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా ఉపసంహరిస్తున్నారు.
తరచి చూస్తే ఇక్కడ 25 శాతం ప్రాంతం మాత్రమే ఆ చట్టం నుంచి విముక్తి పొందుతుంది. మణిపూర్‌లో ఆరు జిల్లాల్లో పాక్షికంగా తొలగిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలన్నీ ఈ చట్టం నీడలోనే ఉంటాయి. బయటినుంచి చూసేవారికి ఒక చట్టం అమలును పూర్తిగానో, పాక్షికంగానో తొలగించడం పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల పౌరులకు మాత్రం ఇది ఊహకందని అసాధారణ పరిణామం. వారికిది అరవైయ్యేళ్లుగా గుండెల మీది కుంపటి. హక్కుల సంఘాల నేతలు భిన్న సందర్భాల్లో చెప్పినట్టు ఈ చట్టం మృత్యువు పడగనీడ లాంటిది. ఆ పరిధిలో జీవించేవారు ఎవరైనా చిత్రహింసలు అనుభవించాల్సి రావొచ్చు.
ఏ పౌరుడి దగ్గరైనా ఆయుధాలున్నాయని లేదా మిలి టెంట్లు తలదాచుకుని ఉండొచ్చని సాయుధ దళాలకు ‘సహేతుక మైన సంశయం’ వస్తే వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ప్రమాదకర వ్యక్తిగా అనుమానిస్తే కాల్చి చంపొచ్చు. సైన్యా నికి మాత్రమే కాదు... ఆ మాదిరి విధులు నిర్వర్తించే పోలీసులకు సైతం ఈ అధికారాలన్నీ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణం నుంచి ఈ అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. అందుకే దీన్ని స్వాతంత్య్రానంతరం తీసు కొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా అభివర్ణిస్తారు.
కల్లోలిత ప్రాంతాల్లో నకిలీ ఎన్‌కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని తరచు ఆరోపణలు రివాజు. ఇదెంతవరకూ వచ్చిందంటే 2004లో మణిపూర్‌లో తంగజం మనోరమ చాను అనే మహిళను అరెస్టుచేసి చంపేశా రని ఆగ్రహించిన మహిళలు సైనికులు బస చేసిన భవనం ముందు వివస్త్రలుగా నిరసనకు దిగారు. ఈ చట్టం రద్దు కోసమే మణిపూర్‌కు చెందిన ఇరోం షర్మిల పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేశారు.
సుప్రీంకోర్టులో 2012లో బూటకపు ఎన్‌కౌంటర్లపై పిటిషన్ దాఖలైన తర్వాతే చట్టం ఎంత కఠినమైనదో దేశమంతటికీ అర్థమైందని చెప్పాలి. 1979 మే మొదలుకొని 2012 వరకూ జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్లలో తమ ఆప్తులు 1,528 మంది బలయ్యారని ఆ పిటిషన్ దాఖలు చేసిన వివిధ కుటుంబాలవారు ఆరోపించారు. వీరంతా మణిపూర్‌కు చెందినవారు. ఇందులో వాస్తవాలు నిర్ధారిం చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆరు ఉదంతాలను ఎంపికచేసి వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆ ఉదం తాల్లో మరణించినవారు అమాయకులేనని కమిషన్ నిర్ధారించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే సింగ్ అందులో సభ్యులు. సాయుధ దళాల చట్టంకింద విధులు నిర్వర్తిస్తుం డగా ఇవి చోటుచేసుకున్నాయి గనుక, తమపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయాలని 350 మంది జవాన్లు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శత్రువులని అనుమానం కలిగినంత మాత్రాన, ఆరోపణలొచ్చినంత మాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్టేనని 2016లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అధికారంలోకొచ్చాక చట్టాన్ని రద్దుచేస్తామని లేదా సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. చట్టం రద్దు తక్షణావసరమని కమిషన్ సిఫార్సు చేసింది. అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించినా సైన్యం కాదనడంతో యూపీఏ వెనకడుగేసింది.
తొలుత 2015లో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం ఈ చట్టం అమలు నిలిపేసి చరిత్ర సృష్టించగా, తాజాగా మూడు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాంతాల్లో చట్టం ఉపసంహరించి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాము ఉపసంహరించాలనుకుంటున్నా సైన్యం వినడం లేదని యూపీఏ ఏలుబడిలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం సిగ్గు విడిచి చెప్పడం ఎవరూ మరిచిపోరు.
సంకల్పశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని పక్షాలనూ ఒప్పించడం అసాధ్యమేమీ కాదని కేంద్రం నిరూపించింది. చట్టాన్ని పౌరులు గౌరవించాలంటే ఆ చట్టం పౌరులపట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్లా ప్రధాన మిలిటెంట్ బృందాల ప్రభావం మునుపటితో పోలిస్తే దాదాపు లేనట్టే.
పైగా అవన్నీ కేంద్రంతో భిన్న సందర్భాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి రెండు సంస్థలు ఉనికి చాటుకుంటున్నా వాటికి ప్రజాదరణ లేదు. ఈశాన్యంలో ఇతరచోట్లా, జమ్మూ, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సైతం సమీప భవిష్యత్తులో ఈ చట్టం రద్దుకు అనువైన పరిస్థితులు ఏర్పడ తాయనీ, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనీ ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment