ఏ చేతికైతే వాచీ ఉండదో, ఏ చేతి వేళ్లయితే ఉంగరాలను ధరించవో, ఏ చేతి పిడికిలైతే లాఘవంగా పిడిబాకును పట్టుకోగలదో, అత్యంత ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాయకుడిని ఆ పిడిబాకుతో ఏ చేౖయెతే శ్రద్ధగా, నెత్తురు చుక్క నేల రాలకుండా వెన్నుపోటు పొడవగ లదో, ఏ చేతి నైపుణ్యం వల్లనైతే ఎన్నికా–తొక్కా లేకుండా అధికారం వచ్చి ఒళ్లో రాలగలదో, ఏ చేతి మహత్యమైతే తమ చేతులను నిరంతరం తడుపుతూనే ఉంటుందని మీడియా సంస్థలు నిత్య స్తుతిస్తోత్రాలతో ప్రాతఃస్మరణ చేసుకుంటాయో.. అట్టి అరచేతి సాముద్రికమంతా త్వరలో లోక విదితం కానున్నదా? ఏ పేరు చెబితే నిప్పు కూడా సిగ్గుపడి పోతుందో, ఏ పేరు చెప్పగానే పప్పు చక్కగా ఉడుకుతుందో, ఏ పేరు చెబితే మేఘాలు వర్షించడం మాని కొయ్యబారి పోతాయో, ఎవరి పేరు చెబితే∙సీబీఐ కూడా హడలి పోయి ఆయనపై దర్యాప్తు చేసే సిబ్బంది తమ వద్దలేదని వినయంగా చేతులు ముడుచుకుంటుందో, ఎవరి పేరుపై నైతే ఒక్క ఫిర్యాదు న్యాయస్థానం గుమ్మం తొక్కినా... శాస్త్ర పారంగతులు రంగప్రవేశం చేసి ఆ వ్యాజ్యాన్ని న్యాయ ప్రాంగణం నుంచి తరిమి వేయగలరో, అట్టి పేరు.. ఈ భూప్రపంచం ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని అతిపెద్ద ఆర్థిక నేరం తాలూకు ఛార్జిషీటులో ఏ–వన్‌గా నమోదు కాబోతున్నదా?
సిగ్నల్స్ అందుతున్నాయి. అది టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. డొంక మొత్తాన్ని ఊపేయగల తీగ ఒకటి దొరికింది. మరికొన్ని రోజులపాటు చట్టం తన పని తాను చేసు కుంటూ వెళ్లినా, న్యాయదేవత నిబ్బరంగా తనకాళ్లపై తాను నిలబడినా, ధర్మదేవత కనీసం ఒక్క పాదంతోనైనా నడిచినా పై ప్రశ్నలకు సమాధానం ఔనని చెప్పక తప్పదు. గడిచిన వారం రోజులపాటు ఐటీ శాఖ అధికా రులు ఏపీ, తెలంగాణలో సోదాలు జరిపిన అనంతరం సీబీడీటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన దేశవ్యాపితంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శితో పాటు వారి సన్నిహితులైన వారి సంస్థల్లో ఐటీ సోదాలు జరిగినట్టు పత్రికా ప్రకటన స్పష్టం చేయడంతో పైకి కనిపిస్తున్న ఈ నీడలు ఎవరి జాడలన్న సంగతి సందేహాతీతంగా సమస్త ప్రజలకు అర్థమై పోయింది. ఆదాయపు పన్ను శాఖ ఇటీవలి కాలంలో వెలికితీసిన అతిపెద్ద అక్రమ రాకెట్ ఇది. బోగస్ సబ్ కాంట్రాక్టర్లను సృష్టించి, కేవలం కాగితాల మీదనే బోగస్ బిల్లులను తయారు చేసి మూడు చిన్న చిన్న ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారానే రూ. రెండువేల కోట్ల రూపాయలను ‘గమ్యస్థానానికి’ చేర్చిన వైనాన్ని ఐటీ అధికారులు బయట పెట్టారు. సదరు గమ్యస్థానం యజమానైన ‘బిగ్ బాస్’ ఎవరో అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఆ బిగ్ బాస్ అనుయాయులు మీడియా ముందు ఎంత అమాయ కత్వం నటించినా, ముక్కు చీదినా, నొసలు చిట్లించినా, కుక్కుటశాస్త్రాన్ని కోట్ చేసినా ఉపయోగపడలేదు. బిగ్ బాస్ బొమ్మ, ఆ పక్కన ఇంకో బుల్లి బాస్ బొమ్మ అద్దిరి పోయేలా కనిపిస్తున్నాయి.
ఐటీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడిం చిన వివరాల ప్రకారం మూడు ఇన్‌ఫ్రా కంపెనీలు సబ్‌కాంట్రాక్టర్ల పేరుతో, సప్లయర్ల పేరుతో డజన్ల కొద్ది డొల్ల కంపెనీలను స్పష్టించాయి. ఇవన్నీ కాగితం కంపె నీలే. వాస్తవంగా ఏదీ ఉండదు. వీటిలో చాలా కంపెనీల వార్షిక టర్నోవర్‌ను రూ. రెండు కోట్లకు లోపుగానే చూపె ట్టారు. అందువల్ల వీటికి అకౌంటు పుస్తకాల నిర్వహణ నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి డొల్ల కంపెనీలకు, డొల్ల కంపెనీల్లో ఒక దానికి మరొక దానికీ మధ్య అనేక అల్లిబిల్లి బదలాయిం పులను కాగితాలపై చూపెట్టారు. ఇవన్నీ ఉత్తు్తత్తివే. కానీ, ఉద్దేశించిన డబ్బు గమ్యస్థానానికి చేరడం ఒక్కటే సత్యం. ఈ గందరగోళం దారులన్నింటినీ కనిపెట్టడానికి కొంత సమయం కావాలి కనుక బిగ్‌బాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా నిలబెట్టడానికి ఆ మాత్రం ఆలస్యం తప్పదు. సాధార ణంగా కార్పొరేట్ సంస్థలూ, కాంట్రాక్టర్లు మనీ ల్యాండ రింగ్ కోసం అనుసరించే పద్ధతి ఇది. రూ. వంద కోట్ల ప్రజాధనంతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయం పొలిటికల్ బాస్ ప్రమేయంతో రెండొందల కోట్లకు పెరుగుతుంది. ఆ పెరిగిన వంద కోట్లు ఈ మార్గాన అంతిమంగా సదరు పొలిటికల్ బాస్ అడ్రస్‌కు చేరుతుంది. ఆ విధంగానే ఇక్కడ రెండువేల కోట్ల రూపాయలు ‘గమ్యస్థానం’ చేరు కున్నాయని ఆదాయపు పన్ను శాఖ పత్రికా ప్రకటన సారాంశం. ఈ డబ్బుతో విదేశీ లావాదేవీలు కూడా జరిగాయని ఐటీ శాఖ వివరించింది. ఈ మొత్తం సైకిల్‌లో ఆదాయపు పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్, జీఎస్టీ ఎగవేత తదితర నేరాలకు సంబంధిత సంస్థలు పాల్ప డ్డాయి. బహుశా మిగిలిన శాఖల అధికారులు కూడా త్వరలో రంగంలోకి దిగుతారు.
రెండు వేల కోట్లకు సంబంధించిన లూటీ విషయా లనే ఐటీ శాఖ అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఇటు వంటివే మరికొన్ని లావాదేవీలపై అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. వీరి చర్చల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఒక పెద్ద కంపెనీ నుంచి డొల్ల కంపెనీల ద్వారా దారిమళ్లిన రూ. 1,200 కోట్ల వ్యవహారం కూడా నిర్ధారణ అయింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపడుతున్న సంస్థ నుంచి 250 కోట్లు మళ్లించారనీ, బిగ్‌బాస్ సన్నిహితుడూ, మాజీ పార్టీ సహచరుడైన వ్యక్తి కంపెనీ నుంచీ, ఇప్పటికీ సన్నిహి తంగా వుంటూ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు దక్కించుకున్న వ్యక్తి కంపెనీ నుంచీ కలిపి రూ.350 కోట్లు మళ్లించారనీ కర్ణాకర్ణి సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో కంపెనీ నుంచి జరిగిన సందేహాస్పద లావాదేవీలను కూడా ఐటీ శాఖ గుర్తించినట్టు తెలుస్తున్నది. సోలార్ కంపెనీల నుంచి బిగ్‌బాస్ కుటుంబ సన్నిహితుని కంపెనీ లోకి రూ.200 కోట్లు ప్రవహించిన విషయం కూడా నిర్ధారణ అయినట్టు తెలుస్తున్నది. ఈ వివరాలన్నీ కొద్ది కాలంలో అధికారికంగా వెలువడే అవకాశం వుందని రాజ కీయ వర్గాల్లో చలామణీ అవుతున్న మాట.
పైన చెప్పుకున్న వివరాలన్నీ మచ్చుకు మాత్రమే. ఇప్పటిదాకా కనిపించింది తోకే. పూర్తి ఆకారం ఇంకా బయటకు రావలసి ఉన్నది. దొరికింది తీగే. డొంకంతా కదలవలసి ఉన్నది. 2014 నుంచి 2019 వరకు మధ్య కాలంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యవహారాన్ని పరిశీ లిస్తే చాలు జరిగిన దోపిడీ ఎంత భయానకంగా వుందో, ఎంత బీభత్సంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అధికా రంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం మినహా మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులన్నిటినీ రూ. 17,368 కోట్ల వ్యయంతో పూర్తిచేస్తామని ఆ పత్రంలో చెప్పుకొచ్చారు. ఆచరణలో జరిగిందేమిటి? పనులు చేస్తున్న కాంట్రా క్టర్లను బెదిరించి వెళ్లగొట్టారు. బెదరకపోతే 60సీ నిబం ధన పేరుతో వేటు వేశారు. ఆ తర్వాత ‘నిధుల పారుదల’ యజ్ఞం ప్రారంభమైంది. ఒక్కో ప్రాజెక్టుకూ, ఒక్కో ప్యాకే జీకి అంచనా వ్యయాన్ని ఇష్టారీతిన పెంచుకుంటూ.. పెంచుకుంటూ, లంకా దహనం కోసం హనుమంతుడు తన తోకను పెంచిన రికార్డును బద్దలుకొడుతూ రూ.96 వేల కోట్లకు చేర్చారు. ఎక్కడి 17 వేల కోట్లు? ఎక్కడి 96 వేల కోట్లు? ఇంచుమించు 550 శాతం. అందులో ఎంత డబ్బు దారిమళ్లి కేరాఫ్ అడ్రస్‌కు చేరుకున్నది? ఎవడబ్బ సొమ్ము అది? ఎక్కడ మూలుగుతున్నది?
ఏ దూర తీరాలకు చేరు కున్నది? కనిపెట్టవలసిన అవసరం లేదా? ఒక చెట్టు నాటిందీ లేదు, నీటిగుంట తీసిందీ లేదు. కానీ, నీరు – చెట్టు పేరుతో ఖర్చుచేసిన రూ.17 వేల కోట్ల ప్రజా ధనాన్ని మెక్కిన పందికొక్కులెక్కడివో ఆరా తీయవలసిన అవసరం లేదా? మన సొంతింటిని ఎంత బాగా కట్టు కున్నా చదరపు అడుగుకు రూ. రెండువేలు దాటదు. కానీ రాజధాని పనుల్లో తాత్కాలిక అవసరం కోసమే నిర్మించిన సచివాలయం పనులకు చదరపు అడుగుకు రూ. 12 వేలను కాంట్రాక్టర్‌కు సమర్పించారు. ప్రజాధనంపై బాధ్యత గలవారు అలా చేయగలరా? రాజధాని ప్రాంతంలో తెల్ల రేషన్‌కార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన నాలుగువేల ఎకరాలకు వెచ్చించిన వేల కోట్ల రూపాయలు ఎక్కడివి? ఇసుకను తవ్వేసుకొని, ఎర్రమట్టి అమ్మేసుకొని పోగేసిన డబ్బంతా ఏ ఖాతాలోకి ప్రవేశిం చింది? విశాఖ భూ కుంభకోణంలో మిగిలింది ఎంత? కార్పొరేట్ సంస్థలకు భూసంతర్పణ ఫలితంగా దక్కిన ముడుపుల విలువెంత? దేవాలయ భూముల్లో దోచే సిందెంత? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో దండుకున్న సొమ్ము కిమ్మత్తేమిటి? అది ఎక్కడుంది? చెప్పుకుంటూ పోతే ఒక అంతులేని దోపిడీ కథ ఇది. ఈ దోపిడీపై నాటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్నే ముద్రించవలసి వచ్చింది. ఆ లెక్కలన్నీ తేల్చవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.
సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట రాష్ట్ర రాజకీయాల్లో ఒక వ్యక్తి కీలక పాత్రధారిగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఆనాటి నుంచే రాజకీయాల్లో విలువలు దిగజారడం ప్రారంభమైంది. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారడం మొదలైంది. సంఘసేవకులు రాజకీయ సన్యాసం స్వీక రించి కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తడం ప్రారంభించారు. రాజ కీయ నాయకులు–మీడియా–కార్పొరేట్ సంస్థల అపవిత్ర కూటమి ఏర్పడింది. ప్రజా సమస్యలు పక్కదోవ పట్టాయి. ప్రపంచబ్యాంకు ప్రబోధమే వేదవాక్కుగా మారింది. వ్యవసాయం దండగైంది. వేలాదిమంది రైతుల ఆత్మహత్యల పరంపర మొదలైంది. కులవృత్తులు కుప్పకూలి జనం వలసబాట పట్టారు. పల్లెలు కన్నీరు పెట్టాయి. అవినీతి తాండవమాడింది. పేద–ధనిక అంత రాలు ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయాయి. గనులూ, వనులూ, చేలు చెరువులు, కొండలు, గుట్టలు సహా ప్రకృతి వనరులన్నీ దురాక్రమణల పాలయ్యాయి. ఆఖరి ఐదు సంవత్సరాల అధ్యాయం విధ్వంస పాలనకు విశ్వరూపంగా నిలిచింది. అవినీతి రోతపుట్టించే స్థితికి చేరింది. ఇక దోషిని బోనెక్కించక తప్పని పరిస్థితులు కమ్ముకొస్తున్నాయి. యముని మహిషపు లోహఘంటలు మబ్బు చాటున ఖణేల్‌మన్నాయి.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
బిగ్‌బాస్ దొరికాడు!
Published Sun, Feb 16 2020 4:14 AM | Last Updated on Sun, Feb 16 2020 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment