అసాధారణ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడక్కడ వరద ప్రమాద పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పంటలు నష్టపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి తీవ్రం. ప్రకృతి విపత్తుల నుంచి పౌరులకు భద్రత కల్పించడానికి, పంటల్ని కాపాడటానికి సంప్రదాయ విధానాలు పనికిరావడం లేదు. ప్రత్యేక ప్రణాళిక–చర్యలు అత్యవసరమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముందు జాగ్రత్తలు, సహాయక పనులు, నష్ట నివారణ–నష్టం అంచనా, విపత్తు అనంతర చర్యలు, నష్టపరిహారాలివ్వడం... ఇలా అన్నీ సమన్వయంతో చేపడితే గాని పౌర సమాజానికి విముక్తి లేదు. నిరుటి వర్షతీవ్రతకు నష్టపోయిన వారికి పరిహారాల చెల్లింపు కేసును విచారిస్తూ, కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంద లించింది.
‘మా బాధ్యత కాదు’ అంటే ఎలా? అని కేంద్ర వ్యవసాయ శాఖను తప్పుబట్టింది. తదు పరి విచారణ బుధవారం జరుగనుంది. ఇవి ప్రకృతిపరమైన సాధారణ వర్షాలు కావని, ‘వాతావ రణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) ఫలితంగా తలెత్తిన అసాధారణ పరిణామాలని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి, ఈ సంవత్సరం జూన్‌లో కురిసిన వర్షాలే ఇందుకొక సంకేతం! ఇవేం అనూహ్యంగా కురుస్తున్న ఆకస్మిక వర్షాలు కాదు. రాగల ఆరు మాసాల పరిస్థితుల్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగానే చెప్పింది. ప్రతి తుఫాను, అల్పపీడనం గురించి సమా చారం తగినంత ముందే వెల్లడిస్తోంది. అల్పపీడనానికి ఉపరితల ద్రోణి తోడవడం వల్ల ఇప్పుడు వర్షతీవ్రత ఎక్కువైంది. ప్రభుత్వాల వైపు నుంచి ముందస్తు పక్కా ప్రణాళిక, సన్నద్దత లేకపోవడం లోపమే! జిల్లాలకు జిల్లాలే నీట మునిగి, పెద్దఎత్తున పంట, ఆస్తుల నష్టాలు చోటుచేసుకుంటు న్నాయి.
ఉత్తర తెలంగాణ అయిదు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు (రెడ్ అలర్ట్)జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, ఇతర తీర జిల్లాల్లో వర్షం ఎక్కువ పడింది. కాకినాడ, పరిసరాల్లో సోమవారం కొన్ని గంటల్లోనే 12 సెంటిమీటర్ల వర్షం కురిసి హడలెత్తించింది. వరంగల్ పరిధి నడికుడలో ఏకంగా 38.8 సె.మీ వర్షం కురిసింది. లోగడ రోజంతా కురిసిన వర్షం, ఇప్పుడు గంట లోనే పడిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల భూతాపోన్నతి పెరిగి, అతి వేడి వల్ల అల్పపీడనాలు పెరుగుతున్నాయి. అవి ఎక్కడున్న తేమను, గాలుల్ని లాఘవంగా లాగుతున్నాయి. ఫలితంగా జరిగే ‘మేఘ విచ్ఛిత్తి‘ (క్లౌడ్ బరస్ట్) కుంభవృష్టికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఇప్పటికే నిండి, భూగర్భజల మట్టాలు పైకి చేరాయి. భూమి తడిగా ఉంది. అందుకే, చిన్న వర్షం వచ్చినా నదులు, వాగులు, వంకలు, చెరు వులు పొంగి పారే పరిస్థితి. వరదల వల్ల భూక్షయం, భూసార క్షయం జరుగుతోంది. మరోపక్క గ్రామాలకు గ్రామాలు నీట మునగటం వల్ల పనులుండవు. కరోనాతో దెబ్బతిన్న దిన కూలీ కుటుంబాలకు ఇది అదనపు కష్టం! ఒక్కసారిగా వేడి–తడి వాతావరణ మార్పుల వల్ల వైరస్ క్రియాశీలంగా మారి, జబ్బులు ప్రబలే ప్రమాదం ఉంది. పైగా కరోనా కాలం అయినందున పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. వైద్య వ్యవస్థల్ని సర్కారు సమాయత్తపరచాలి. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే, అందుకు అవసరమైన వ్యవస్థ, వనరులున్నాయా? అన్నది పెద్ద ప్రశ్న! సిరిసిల్లాతో సహా పాత కరీనంగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారించారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీయెంయే)తో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం నెరపాల్సిన సందర్భమిది. విపత్తు ఎదుర్కొ నేలా, ఎవరికి వారు భద్రతా చర్యల్ని పాటించే ‘పౌరరక్షణ’లో ప్రజలందరికీ శిక్షణ ఇప్పించాల్సి ఉండింది. కానీ, అదెందుకో సవ్యంగా జరుగటం లేదు. మొత్తంగా ఇది ఒకరోజు వ్యవహారం కాదు. శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణకు ఓ వ్యూహ రచన ఉండాలి. ఐఎండీ క్యాలెండర్ ప్రకారం... ముందస్తు చర్యలు, వార్నింగ్ తర్వాత ఆపత్కాలం అనుసరించాల్సిన వ్యూహం, విపత్తు వేళ నిర్దిష్ట సహాయక చర్యలు, అనంతర దిద్దుబాటు కార్యక్రమాలు, నష్టం శాస్త్రీయ అంచనా–నష్టపరిహార చర్యలు, భవిష్యత్తులో విపత్తు తీవ్రత నివారణకు ప్రణాళిక.... ఇలా షట్సూత్ర కార్యాచరణ ప్రభు త్వాలకు తక్షణావసరం.
అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్టాల్ని తగ్గించేందుకు పంటల వ్యూహం ఉండాలి. పరిస్థితుల్ని తట్టుకునే పంటల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. నష్టాల అంచనాకు శాస్త్రీయ విధానం పాటించాలి. వర్షాన్ని, వాతావరణాన్ని గణించే వ్యవస్థను మండలస్థాయి వరకు విస్తరించాలి. అన్నిస్థాయిల్లో పౌర భాగస్వామ్యంతో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్కలు మొరిగినట్టు రెండు, మూడు సీజన్లు దాటాక అధ్యయన బృందాలు రావటం, అప్పటికి పరిస్థితులు పూర్తిగా మారి ఉండటం, చాలా అశాస్త్రీయం! ఎమ్మెల్యేలో, మరో రాజకీయ నాయకులో పంటనష్టాల్ని అంచనా వేయడం తప్పు. ఏపీ అనుసరిస్తున్న ఉచిత పంటల భీమా, సీఎం నిర్దేశించినట్టు... కనీసం తదుపరి సీజన్ నాటికి పరిహారం అందే వ్యవస్థ ఎంతో ఆదర్శం. దీన్ని దేశమంతటికీ విస్తరించాలి. వాతావరణ మార్పుతో తలెత్తిన కొత్త సమస్యలకు సరి కొత్త సమాధానాలు, పరిష్కారాలు వెతుక్కుంటేనే ప్రకృతి విపత్తుల నుంచి పౌర సమాజానికి రక్ష!
Comments
Please login to add a commentAdd a comment