పసుపురంగు దేవతావస్త్రం! | Yellow Media Campaigned To Make Chandrababu CM Who Cheated NTR | Sakshi
Sakshi News home page

పసుపురంగు దేవతావస్త్రం!

Published Sun, Nov 27 2022 12:21 AM | Last Updated on Sun, Nov 27 2022 2:56 PM

Yellow Media Campaigned To Make Chandrababu CM Who Cheated NTR - Sakshi

రాజుగారి దేవతా వస్త్రాల కథ మనందరికీ తెలిసిన వృత్తాంతమే. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు డంబాచారం ఎక్కువ. అందరికంటే తానే గొప్పవాడని ప్రజలంతా నమ్మాలని అతనికి బలమైన కోరిక. ఒకసారి ఆయన కొలువుకు వచ్చిన ఒక పరదేశి మన రాజుగారికి ఒక వింత విషయం చెబుతాడు. ‘రాజా! నాకు కొంత బంగారం, వెండి ఇప్పించండి. వాటితో నేను అద్భుతమైన దేవతా వస్త్రాలను జరీ అంచుతో తయారు చేస్తాను. అటువంటి వస్త్రాలను ధరించడానికి తమరు మాత్రమే యోగ్యులు. అయితే అవి తెలివైన వారికి మాత్రమే కనిపిస్తాయ’ని నమ్మబలుకుతాడు. దేవతా వస్త్రాలను ధరించే అవకాశం తనకే వస్తుందన్న ఆత్రంతో రాజుగారు సదరు పరదేశీకి కావలసి నంత బంగారాన్నీ, వెండినీ ఇప్పించాడు.

కొన్నాళ్ల తర్వాత పరదేశి రాజుగారి దగ్గరకొచ్చి ‘రాజా! ఇదిగో వస్త్రాలు. ధరించండం’టాడు. దుస్తులు కనిపించడం లేదంటే తననందరూ తెలివితక్కువ వాడనుకుంటారన్న భయంతో రాజుగారు ‘వాటిని’ ధరించినట్టు నటిస్తాడు. అందరూ వింతగా చూస్తారే తప్ప ఎవరూ కనిపించడం లేదని చెప్పరు. తన రాజ్యంలో తెలివితక్కువ వాళ్లను గుర్తించాలన్న కోరికతో అవే ‘వస్త్రాలతో’ రాజుగారు రథం మీద కూర్చుని ఊరేగింపుగా బయల్దేరుతారు.

వీధుల్లో గుమికూడిన జనం గుడ్లప్పగించి చూస్తారే తప్ప ఎవరూ మాట్లాడరు. నిజం చెబితే తెలివితక్కువ ముద్ర పడుతుందన్న భయంతో నటిస్తుంటారు. ఈ గొడవలేమీ తెలియని ఒక చిన్న పిల్లాడు మాత్రం పిల్లి మెడలో గంట కడతాడు. ‘రాజుగారికి బట్టల్లేవోచ్‌... పప్పు షేమ్‌’ అని అరుస్తాడు. జనంలో సంచలనం మొదలవుతుంది. నిజమే... రాజుగారికి బట్టల్లేవు. ఏమైందీయనకు అనుకుంటూ అందరూ నవ్వడం మొదలుపెడతారు. రాజుగారికి విషయం అర్థమవుతుంది. పరాభవ భారంతో మందిరానికి వెళ్లిపోతాడు.

క్రీస్తుశకం 1995. యువ నామ సంవత్సరం శ్రావణ మాసంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక అంతఃపుర కుట్ర జరిగింది. ఎల్లో మీడియాకు గ్యాంగ్‌ లీడర్‌గా లబ్ధప్రతిష్ఠులైన రామోజీరావు పౌరోహిత్యానికి పూనుకోగా చంద్రబాబు నాయుడు ఓ పచ్చల పిడిబాకును పూజించి, దాన్ని ఎన్టీ రామారావు వెన్నులో దించడం, ఆయన్ను సింహాసనంపైనుంచి తోసేయడం జగమెరిగిన గబ్బు వ్యవహారం.

ఆ గబ్బును కప్పేయ డానికి అదేరోజు నుంచి ఎల్లో మీడియా చంద్రబాబు చేత దేవతా వస్త్రాన్ని ధరింపజేయడం మొదలుపెట్టింది. ఆ దేవతా వస్త్రం పేరు – ‘అభివృద్ధి’. కథలోని రాజుకు దేవతా వస్త్రం వెనుక ఉన్న మోసం గురించి తెలియదు. ఇక్కడ ఆ వస్త్రాన్ని కప్పించుకున్న కథానాయకుడూ, కప్పిన కథా రచయితలూ మోసంలో భాగస్వాములే!

అభివృద్ధి దేవతా వస్త్రాన్ని ఎల్లో మీడియా ఎంతగా ప్రచారంలో పెట్టిందంటే... ఎవరూ కూడా బుర్రను ఉపయో గించి ‘ఏదీ... కనపడదే’ అని గట్టిగా అడగలేనంతగా! ‘చూడూ... మా చూపుడు వేలు వైపే చూడు... మరోవైపు చూడకూ’ అన్న చందంగా ఎల్లో మీడియా నాటి తెలుగు పాఠక మహాశయులకు దిశానిర్దేశం చేసింది. ఒకవేళ ఎవరైనా ధైర్యంచేసి ఆ దేవతా వస్త్రాన్ని తదేకంగా చూసి ఉంటే అరివీర భయంకర నిజరూప దర్శనంతో మూర్ఛ రోగానికి లోనయ్యే వారు. తెలుగు ప్రజల కోసం ఎల్లో మీడియా ఒక కొత్త డిక్షనరీని తయారుచేసింది. అందులో అభివృద్ధి అనే మాటకు చంద్రబాబు అనే అర్థాన్ని తగిలించింది.

‘అన్న అడుగేస్తే అభివృద్ధి, అన్న మడతేస్తే అభివృద్ధి’ అనే బృందగానాన్ని జనంలోకి వదిలింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ హయాం లోనే శంకుస్థాపన చేసిన సైబర్‌ టవర్‌ భవనాన్ని అనివార్యంగా కట్టాల్సి వచ్చింది. ఆ కట్టడాన్ని రెండేళ్లు ఆలస్యం చేసి, ఈలోగా తనవాళ్ల చేత చుట్టుపక్కల భూములన్నీ కారుచౌకగా కొనిపిం చారు. అమరావతి స్కెచ్‌కు హైటెక్‌ సిటీ మినియేచర్‌ అన్న మాట. సొంత మనుషుల చేత ఆ ప్రాంతంలో వెంచర్లు వేయిం చారే తప్ప మౌలిక వసతుల కల్పనపై పదేళ్ల దూరదృష్టిని కూడా ఆయన ప్రదర్శించలేదు. పదేళ్లు నిండకుండానే అక్కడ రోడ్లను విస్తరింపజేయాల్సి వచ్చిందంటేనే వారి విజన్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈమాత్రం ఘనకార్యానికే బాబును ఐటీ యుగకర్తగా ఎల్లో మీడియా కీర్తించడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌కు వస్తే అది బాబు ఘనతేనని ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్షుడంతటోడు హైదరాబాద్‌కు రావడ మేమిటి... బాబుగారి తావీజు మహిమ కాకపోతే... ఈతరహా ప్రజాభిప్రాయాన్ని వండి వార్చింది. ఆ కాలంలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కనిపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు పేరునే ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమై పూర్తయిన ఔటర్‌ రింగ్‌రోడ్డు, షంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులను కూడా బాబు ఖాతాలోనే వేసుకున్నారు. మరీ ఘోరమేమిటంటే కేసీఆర్‌ పట్టాలెక్కించిన మెట్రో ప్రాజెక్టు కూడా బాబు మెదడుకు పుట్టిన బిడ్డేనని చెబుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లలో వాస్తవానికి ఏం జరిగింది? సగం జనాభాను అక్కున చేర్చుకునే వ్యవసాయరంగం కుదేలైంది. పంటచేలలో మృత్యు కంకులు పాలు పోసుకున్నాయి. సస్య క్షేత్రం శ్మశానమైంది. వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసు కున్నారు. కులవృత్తులు కూలిపోయాయి. వందలాదిమంది నేతన్నలు బలవన్మరణాన్ని ఆశ్రయించారు.

పేద బిడ్డలు చదు వుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు పాడుబడ్డాయి. లక్షలాది జనం వలసబాట పట్టారు. పల్లెలు బీళ్లయ్యాయి. ఇదీ నాటి సామాజిక నిజరూపం. దీనిపై ఎల్లోమీడియా ‘అభివృద్ధి’ అనే అంగవస్త్రాన్ని కప్పింది. ప్రచారం చేసింది. ప్రజలు నమ్మ లేదు. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. అలిపిరి దాడి సాకుతో సానుభూతి డ్రామా నడిపినా జనం కనికరించలేదు.

మళ్లీ ఇప్పుడు ఆ దేవతా వస్త్రం చంద్రబాబుకు అవసర మైంది. ఎల్లో మీడియా ఇప్పుడు మరోసారి ఆ దేవతా వస్త్రాన్ని జనానికి చూపెట్టే ప్రయత్నం మొదలైంది. ఈసారి ఆయన అధికారంలోకి రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే తప్ప ఆయన కాదట! ఎల్లో మీడియా ప్రజలను బెదిరించడం మొదలుపెట్టింది. సంకేతాన్ని గ్రహించిన చంద్రబాబు కూడా బెదిరిస్తున్నారు. ‘నేను గెలవకపోతే మీకే నష్టమ’ని ప్రజల్నే దబాయిస్తున్నారు. ప్రజలు ఏరకంగా నష్టపోతారన్న ప్రశ్నకు అభివృద్ధి ఆగిపోతుందనేది వారి జవాబు. అసలు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రశ్నకు వారి దగ్గర నుంచి వచ్చే సమాధానం పిట్టలదొర సంభాషణకు సరితూగుతుంది.

పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ నేర్పారట! సెల్‌ఫోన్‌ ఇండియాకు రావడానికి ఆయనే కారణమట! ఆయన లేకపోతే సెల్‌ఫోన్లను హిమాలయ పర్వతాలు అడ్డగించేవట! సానియా మీర్జాను టెన్నిస్‌లో ప్రోత్సహించిందీ, సత్య నాదెళ్లకు కంప్యూటర్‌లో ఆసక్తి కలిగించిందీ ఆయనేనని స్వయంగా వారే ప్రచారం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారం భించిన గ్రామ సచివాలయాలు కూడా తన ఐడియాయేనని ఈమధ్యనే చంద్రబాబు ఓ న్యూక్లియర్‌ మిసైల్‌ను జనం మీదకు వదిలారు.

సచివాలయాలను ప్రారంభించినప్పుడు అదో పనికిరాని కార్యక్రమమని తానే దుమ్మెత్తి పోసిన వైనాన్ని ఆయన మరిచిపోయారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి ఈ వ్యవస్థను పరిశీలించి ప్రశంసిస్తుండటంతో బాబు బాణీ మారింది. ఇంకో రెండు మూడేళ్ల తర్వాత సచివాలయాలను, ఆర్బీకే కేంద్రాలను, వలంటీర్‌ వ్యవస్థను, ఫ్యామిలీ డాక్టర్‌ను, ‘నాడు–నేడు’ కార్యక్రమాలనూ ఎల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేయకపోతే ఆశ్చర్యపడవలసిందే!

‘అభివృద్ధి’ అంటే ఏమిటనే ప్రశ్నకు ఈ ముఠా స్పష్టమైన సమాధానం ఎప్పుడూ చెప్పదు. అభివృద్ధి అనగా చంద్రబాబు అంతే! జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల కాలంలోనే (రెండేళ్లు కరోనా) ప్రభుత్వరంగంలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిం చారు. అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తిచేసుకొని వచ్చే యేడు తరగతులను ప్రారంభించబోతున్నాయి.

చంద్రబాబు పధ్నాలుగేళ్ల కాలంలో కట్టిన మెడికల్‌ కాలేజీ ఒక్కటి కూడా లేదు. 30 వేల కోట్ల ఖర్చుతో జగన్‌ ప్రభుత్వం నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రేవు పట్టణాలను, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. పధ్నాలుగేళ్ల బాబు పరిపాలనలో నిర్మించిన పోర్టు ఏమైనా ఉన్నదా? ఫిషింగ్‌ హార్బర్‌ ఒక్కటైనా ఉన్నదా? మత్స్యకారులు గుజరాత్‌ లాంటి దూరతీరాలకు వెళ్లి దోపిడీకి గురికావడమే కదా చంద్రబాబు హయాంలో జరిగింది.

భారీ పరిశ్రమలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు కలిసి ఈ మూడు న్నరేళ్లలో కల్పించిన ఉద్యోగాలు 2,35,000. చంద్రబాబు మొన్నటి ఐదేళ్లలో ఇందులో సగం ఉద్యోగాలను కూడా పారి శ్రామికరంగంలో కల్పించలేదు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో సగటున ఏటా 11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఈ మూడు న్నరేళ్లలో సగటున ఏటా 13 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కోవిడ్‌ విజృంభించిన కాలం కూడా ఇదేనని గమనంలో ఉంచు కోవాలి. ఇవి కాకి లెక్కలు కావు, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ అఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ గణాంకాల ఆధారంగా చెబుతున్నవి.

ఇక ప్రభుత్వరంగంలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన మొత్తం నియామకాలు 34 వేలు. ఈ మూడు న్నరేళ్లలో ప్రభుత్వం చేసిన రెగ్యులర్‌ నియామకాలే 1,55,000. వీటికి అదనంగా 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వో ద్యోగులుగా మార్చడం జరిగింది. అదనంగా 38 వేల కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 1,10,000 మందిని నియమించారు.

గౌరవ వేతనంపై నియమితులైన 2,60,000 మంది వలంటీర్లు వీరికి అదనం. ఎక్కడైనా పోలిక ఉన్నదా? ఈ లెక్కలేవీ చంద్రబాబు పార్టీకీ, మీడియాకూ అవ సరం లేదు. లెక్కల్లోకి పోతే బొక్కబోర్లా పడతామని తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు అనే నిర్వచనం చెప్పడం, దాన్ని బ్రాండింగ్‌ చేయడం, అమ్ముకోవడం, ‘జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న’ అనే భజన గీతాన్ని పాడు కోవడం! ఎదుటి పక్షం మీద గోబెల్స్‌ ప్రచారం. అంతే! అదే వారి ఎజెండా! 

అభివృద్ధి అంటే ఏమిటి? కొందరు కోటీశ్వరులు శత కోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు కావడమా? బహుళ అంత స్తుల భవనాలు లేవడమా? ఇది కాదు అభివృద్ధి నిర్వచనమని ఇప్పుడు విజ్ఞులందరూ చెబుతున్నారు. ఈ భూమి, భూమిపై ఉన్న గాలి, నీరు, వెలుతురు, చెట్టూ పుట్ట గుట్ట అన్నిటిపై సమస్త మానవాళితో పాటు జీవరాశి యావత్తు కూడా హక్కుదారులే. ఈతరం జీవులే కాదు, రానున్న వేలవేల తరాలకూ ఈ భూమాత ఆశ్రయం కల్పించవలసి ఉన్నది. అందువలన పర్యావరణ హితమైన అభివృద్ధి నమూ నాను ఎంచుకోవలసి ఉన్నది. అభివృద్ధి కూడా సమ్మిళిత అభివృద్ధి కావాలి.

సమాజ పరిణామ క్రమంలో వెనకబడిన జనసమూహా లన్నీ సాధికారతను సంతరించుకోవాలి. వారి శక్తి మేరకు పని దొరకాలి. అవసరం మేరకు భుక్తి దొరకాలి. ఈ భూగ్రహం అంద రికీ ఉమ్మడి గృహం కావాలి. ఈ సదాశయం తోనే ఐక్యరాజ్య సమితి వారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) పేరుతో ఒక ఆచరణీయ కార్యక్రమాన్ని 17 అంశాలతో ప్రతిపాదించారు. 2030లోగా అన్ని దేశాలూ ఈ లక్ష్యాలను సాధించాలని సూచిం చారు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకూ – మన రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని అంశాలతో సాపత్యం కుదురుతుంది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దిక్సూచిగా ఎంచు కుంటూ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. బడ్జెట్‌లకు ప్రేరణగా నిలుస్తున్న ‘నవ రత్నాల’ కార్యక్రమం గానీ, విద్యా రంగంలో, వైద్యరంగంలో, వ్యవసాయంలో తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ, ఇంటి గడపకు చేరుకుంటున్న పరిపాలనా, రాజకీయ సంస్కర ణలు గానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలవైపు పడుతున్న అడుగులే! ఈ అడుగుజాడల్లో బురదను కూర్చడానికి బాబు సమేత ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నది. వారి అభివృద్ధి లక్ష్యం ఒక్కటే – 30 వేల ఎకరాల్లో తలపెట్టిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ పునః ప్రారంభం కావడం!

వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement