బీజేపీతో పొత్తు కోసం తహతహ.. ఎల్లో మీడియాకు నిద్ర కరువైందా? ఎందుకీ ఫేక్‌ న్యూస్‌ | TDP Media Management Over Modi Chandrababu Meet And Joining NDA | Sakshi
Sakshi News home page

ఆ భయంతోనే చంద్రబాబు, లోకేష్‌తో మోదీ, షా భేటీ అంటూ ఎల్లో మీడియా బిల్డప్‌ వార్తలు

Published Thu, Sep 1 2022 12:55 PM | Last Updated on Thu, Sep 1 2022 3:27 PM

TDP Media Management Over Modi Chandrababu Meet And Joining NDA - Sakshi

( ఫైల్‌ ఫోటో )

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో... తాను రాష్ట్రానికి సీఈఓ అని చెప్పుకునేవారు. ఎవరినైనా మేనేజ్‌ చేస్తారని కూడా పేరు పొందారు. ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులోని పాత ఆలోచనలు, పాత బుద్ధులు మాత్రం పోలేదు. తనకు సింగిల్‌గా గెలిచే సత్తా లేదని కూడా మరోసారి రుజువు చేసుకుంటున్నారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. దానికనుగుణంగా తనకు అనుకూలమైన మీడియాలో వార్తలు వండించుకుంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన రోజు.. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో నారా లోకేష్ రహస్యంగా సమావేశమయ్యారట. ఇది నిజం. మీరు నమ్మాల్సిందే. ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త ఇది. అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినపుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కంటే ముందుగా చంద్రబాబుతో భేటీ అయ్యారట... అదీ రామోజీ ఫిల్మ్ సిటీలో.. ఇది కూడా మీరు నమ్మాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు.

అయితే అమిత్‌ షాతో ఢిల్లీలో లోకేష్‌ భేటీ, హైదరాబాద్‌లో చంద్రబాబు భేటీలు రహస్యంగా జరిగాయంట. ఢిల్లీలో అందరితో పాటు రెండు మూడు నిమిషాలు మాట్లాడినందుకే పచ్చ మీడియా టాం టాం చేసింది. బీజేపీతో తెలుగుదేశానికి పొత్తు కుదిరిందన్న రేంజ్‌లో హడావుడి చేశాయి. చంద్రబాబు, లోకేష్‌లతో అమిత్‌ షా రహస్యంగా చర్చలు జరపాల్సిన అవసరం ఏముంటుంది? రహస్యంగా సమావేశమైనట్లు తెలిసిందని వార్తలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? 

మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరిగి వెళ్లే సమయంలో శంషాబాద్‌లోని హోటల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవడం తెలుగుదేశానికి, పచ్చ మీడియాకు మింగుడు పడటంలేదు. జూనియర్‌ను అవసరానికి వాడుకుని తర్వాత పక్కకు నెట్టేసిన చంద్రబాబుతో దశాబ్దానికి పైగా జూనియర్‌ దూరంగానే ఉంటున్నారు. అటువంటి సినీ నటుడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కలవడమా? ఇదే టీడీపీకి, ఎల్లో మీడియాకు కంపరంగా ఉంది.

అందుకే ఢిల్లీలో మోదీ ఏకాంతంగా చంద్రబాబుతో మాట్లాడారంటూ కథనాలు వండారు. సమావేశానికి హాజరైన అందరినీ పలకరించినట్లుగానే చంద్రబాబును మోదీ పలకరించారు. దీనికే ఎల్లో మీడియా చంకలు గుద్దుకుంటూ వార్తలు వండి వార్చేసింది. ఇంకేముంది పసుపు, కాషాయం కలిసిపోయాయన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చారు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. అందుకే రహస్య భేటీల వార్తలు తయారు చేయించుకుంటున్నది తెలుగుదేశం. 

1995లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏనాడూ ఒంటరిగా గెలిచిన ఉదంతమే లేదు. వామపక్షాలతోనో..బీజేపీతోనో పొత్తు పెట్టుకునే ఆయన అధికారంలోకి వచ్చారు. ఒంటరిగా పోటీ చేసినపుడు ఓటమి చెందారు. సింగిల్‌గా గెలిచే సత్తా లేదు గనుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే అటు బీజేపీ, ఇటు జనసేన మద్దతు అవసరమని గ్రహించారు. అయితే టీడీపీని కలుపుకుందామంటున్న జనసేననే కమలనాథులు దూరం పెడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో తమకు పరాయివాడైన, కుటుంబానికి, పార్టీకి దూరంగా ఉంచుతున్న జూనియర్‌తో అమిత్‌ షా భేటీ కావడంతో అటు చంద్రబాబుకు, ఇటు ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. అందుకే తమతో కూడా అమిత్‌షా భేటీ అయినట్లుగా వార్తలు రాయించుకుంటున్నారు. అసలు చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని ఆ పార్టీ వారే చెప్పకుంటున్నారు. అందుకే అనేక చోట్ల చంద్రబాబు వెళ్లినపుడు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు, లోకేష్‌కు మరింత భయం పట్టుకుంది.

బీజేపీ తమతో పొత్తుకు రెడీగా ఉందని, తమతో రహస్యంగా ముఖ్య నేతలు సమావేశమయ్యారని వార్తలు రాయించుకోవడంలో టీడీపీకి, ఎల్లో మీడియాకు రెండు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం ఎంతగా తహతహలాడుతున్నదో అర్థమవుతోంది. అదే సమయంలో పచ్చ పార్టీని, కాషాయ పార్టీని కలపడానికి ఎల్లో మీడియా ఎంతగా తాపత్రయపడుతున్నదో తెలియచేస్తోంది.  కాగా, పీఎం నరేంద్ర మోదీని చంద్రబాబు కలవడంపై  రిపబ్లిక్‌ కూడా ఆర్టికల్‌ రాసింది. తాజా పరిణామాల నేపథ్యంలో చివరికి తాను ఇచ్చిన వార్తలు నిజం కాలేదంటూ రిపబ్లిక్ కూడా ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. 

ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సింహం సింగిల్‌గా వస్తుందని ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రకటించారు. కానీ తాను సింగిల్‌గా వస్తే గెలవలేనని నిర్థారణకు వచ్చిన చంద్రబాబు బీజేపీతో అంటకాగేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం కూడా ఇక్కడ స్సష్టమవుతోంది. అయితే ఈ ప్రచారాలపై బీజేపీ నేతలు స్పందించారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్‌ వార్తలని కొట్టిపడేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement