బావురుమంటున్న బడులు | Vardelli Murali Editorial On Mana Badi Nadu Nedu | Sakshi
Sakshi News home page

బావురుమంటున్న బడులు

Published Tue, Mar 10 2020 12:17 AM | Last Updated on Tue, Mar 10 2020 12:17 AM

Vardelli Murali Editorial On Mana Badi Nadu Nedu - Sakshi

మన బడుల స్థితిగతులు బాగోలేవని మరోసారి తేటతెల్లమయింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగావున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం గతవారం సమర్పించిన నివేదిక సర్కారీ బడుల తీరేమిటో కుండ బద్దలు కొట్టింది. దేశంలోని 40 శాతానికిపైగా బడులకు ఆట స్థలాలు, విద్యుత్‌ సదుపాయంవంటివి లేవని అది తేల్చి చెప్పింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలాడుకునే సదుపాయం వుంటేనే వారు భవిష్యత్తులో అన్నివిధాలా ఎదుగుతారన్నది విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాట. పిన్న వయసులో ఆటలాడే అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేయడమే కాదు... మున్ముందు వారిని మంచి క్రీడాకారు లుగా తీర్చిదిద్దుతుంది.

అన్నిటా చురుగ్గా వుంచుతుంది. క్రమశిక్షణ నేర్పుతుంది. పిల్లల్లో సమష్టి తత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. ఆరోగ్యకరమైన పోటీని అలవాటు చేస్తుంది. ఎదిగాక ఏ రంగంలోనైనా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సొంతం చేస్తుంది. దేశ జనాభాలో సగానికిపైగా పాతికేళ్లలోపువారే. వీరంతా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకుంటున్నవారు. వీరే మరో పదిపదిహేనేళ్లలో వివిధ రంగాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించాల్సి వుంటుంది. కానీ ప్రామాణికమైన చదువు అందించడం మాట అటుంచి, కనీసం ఆటలాడుకోవడానికి గుప్పెడు స్థలం కూడా చూపలేని దుస్థితి వుంటే అంతకన్నా దారుణం మరేమైనా వుంటుందా? క్రీడా వికాసానికి దూరంగా వుండే పిల్లలు చదువుల్లోనూ వెనకబడతారు. తగినంత చొరవ కొరవడి అనంతరకాలంలో మెరుగైన ఉద్యోగావకాశాలకు కూడా దూరమవుతారు. 

ఆరేళ్ల నుంచి పద్దెనిమిదేళ్లలోపుండే పిల్లల చదువుకు పాఠశాల విద్యా విభాగం పూచీ పడు తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ విభాగానికి ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 59,845 కోట్లు కేటాయించింది. ఆ శాఖకు మొత్తంగా కేటాయించిన రూ. 99,312 కోట్లలో ఇది 60 శాతం. చెప్పుకోవడానికిది ఘనంగా వుంటుంది. కానీ ఆ విభాగం అడిగిన మొత్తం రూ. 82,570 కోట్లలో కేటాయించిన మొత్తం కేవలం 27శాతం మాత్రమేనంటే విచారం కలుగుతుంది. ఇంకా విషాదమేమంటే నిరుటి బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే ఈసారి పెరిగింది 5.9 శాతం మాత్రమే. బడుల్లో ఆట స్థలాలు లేకపోవడం పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి ఎలా ఆటంకమవుతుందో ఏడెనిమిదేళ్లక్రితం క్రికెట్‌ క్రీడా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చెప్పాడు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాడు.

క్రికెట్‌ ఆటలో ప్రవేశించి పదహారేళ్ల వయసులోనే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లలో ఆడి, అనంతర కాలంలో భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించిన సచిన్‌ తన ఎదుగుదలకు చిన్ననాడు చదువుకున్న బడిలోని ఆట స్థలమే దోహదపడిందని వివరించాడు. కానీ ఆ నివేదికను పట్టించుకున్నవారేరి? ఆటల్లో అంతర్జాతీయ పోటీలు జరిగినప్పుడల్లా మన దేశం నగుబాటు పాలవుతోంది. క్రికెట్, టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ వంటి వేర్వేరు క్రీడాంశాల్లో దిగ్గజాలు లేరని కాదు. కానీ ఇంత పెద్ద జనాభా వున్న దేశానికి ఆ సంఖ్య చాలదు. ఇంచుమించు ప్రతి ఈవెంటులోనూ నువ్వా నేనా అన్నట్టు పోరాడి పతకాలను సొంతం చేసుకునే చైనా... ఆటలపై ఎంత శ్రద్ధ పెడుతు న్నదో తెలిస్తే అబ్బురపడతాం. చిన్నతనంలోనే పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి, వారిని సానబట్టేందుకు అక్కడ నిరంతరాయంగా ప్రణాళికాబద్ధమైన కృషి సాగుతూంటుంది. 

పార్లమెంటరీ స్థాయీ సంఘం ఒక్క క్రీడా స్థలాల విషయంలో మాత్రమే కాదు... విద్యుత్, లాబొరేటరీలు, లైబ్రరీలు వంటి ఇతర మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయడంపైనా నిశితంగా విమర్శించింది. తరగతి గదుల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటు, లైబ్రరీల నిర్వహణ వంటి అంశాల్లో సర్కారీ బడులు వెనకబడివుంటున్నాయని తెలిపింది. 2019–20లో 2,613 ప్రాజెక్టులకు అనుమతినిస్తే, అందులో మొదటి తొమ్మిది నెలల్లో పూర్తయినవి కేవలం మూడు మాత్రమేనని ఎత్తిచూపింది. చాలా పాఠశాలలకు ప్రహారీ గోడల్లేవని, ఇది పిల్లల భద్రతకు, ఆ బడులకు సంబం ధించిన ఆస్తికి చేటు తెస్తుందని హెచ్చరించింది. స్థాయీ సంఘం ఓ మంచి సూచన చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ బడుల ప్రహారి గోడల నిర్మాణం చేయిస్తే మంచిదని ప్రతిపాదిం చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ప్రస్తావించాలి.

ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టారు. గత నవంబర్‌లో ‘మన బడి నాడు–నేడు’ అనే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో తొలి దశలో 50 మండలాల్లోని 1059 బడుల్ని గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే పనులు ప్రారంభించారు. మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, అదనపు తరగతి గదుల నిర్మాణం, బ్లాక్‌బోర్డుల ఏర్పాటు, ప్రహారీల నిర్మాణంవంటివి ఇందులో వున్నాయి. ఈ బడులు గతంలో ఎలావున్నాయి... వసతులు కల్పించాక ఎలా మారాయి అన్న సంగతి తెలిసేలా ఫొటోలు కూడా తీయించాలని నిర్ణయించారు.

వసతుల కల్పనకు రూ. 1,500 కోట్లు కేటాయించారు. ఇలాంటి పట్టుదలను ప్రదర్శిస్తే అన్ని రాష్ట్రాల సర్కారీ బడుల్లోనూ మెరుగైన వసతులు ఏర్పడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుకు కేరళ, తమిళనాడు, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నాయి. ప్రైవేటు బడులు క్రీడాస్థలాలు ఉన్నట్టు చూపితేనే వాటికి గుర్తింపు కొనసాగించే నిబంధన అమల్లోవుంది. కానీ సర్కారీ బడుల విషయంలో ఇలాంటివి పాటించడం లేదని తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. కనీసం ఇప్పటికైనా శ్రద్ధ పెడితే సర్కారీ బడుల్లో చదివే పిల్లలు కూడా అన్నివిధాలా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement