
కడప ఎడ్యుకేషన్: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేక సమస్యలతో సతమతమయ్యేవారు. విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేక చెట్లకింద, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు సరైన వసతులు లేక.. పాఠశాలకు ప్రహరీలు లేక దారుణంగా ఉండేది. ఇలాంటి దుస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమస్యలన్నింటికి స్వస్తి పలుకుతూ నాడు– నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో నేడు చిన్నారులు విరబూసిన నవ్వులతో అక్షరాలు నేర్పే పాఠశాల చెంతకు పరుగులు పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్తుకు పునాది పడే ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపుతున్నారు.
రెండవ విడత.. చకచక
ప్రభుత్వం జిల్లాలో రెండో విడత నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పనులు మొదలై పలుచోట్ల చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పనుల పూర్తికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో 1028 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 322.83 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను సత్వరం పూర్తి చేయించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, విశాలమైన తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.
రూ. 144.72 కోట్లతో నాడు– నేడు, అదనపు తరగతి గదులు
జిల్లావ్యాప్తంగా 18 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 69 ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తంగా 99 పాఠశాలల్లో కేవలం అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. 68 ప్రాథమిక పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ఉన్నత పాఠశాలల్లో నాడు నేడుతోపాటు అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఈ పనులకు రూ. 144.78 కోట్లు కేటాయించారు.
కేవలం నాడు – నేడు పనులకు
కేవలం నాడు – నేడుకు సంబంధించి జిల్లాలో 461 ప్రాథమిక పాఠశాలలకు, 38 ప్రాథమికోన్నత పాఠశాలకు, 63 హైస్కూల్స్ దీంతోపాటు మరో 203 అంగన్‌వాడీ కేంద్రాలకు కలుపుకుని రూ. 178.05 కోట్లను కేటాయించారు.
పనులను పారదర్శకంగా నిర్వహించాలి
నాడు– నేడు రెండవ విడత కింద చేపట్టనున్న పనులను చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా చేపట్టాలి. ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత లోపించకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు అదనపు తరగతులను నిర్మిస్తున్నాం. ఈ పనులను ఆగస్టు చివరినాటికి పూర్తి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.
– అంబవరం. ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి
8 పది రకాల సౌకర్యాల కల్పన
నాడు– నేడు మొదటి విడత పనులకు అదనంగా మరో పని చేర్చి రెండో విడతలో పది రకాల పనులను చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు, తాగునీటి వసతి మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి శుద్ధి పరికరాలను అమర్చనున్నారు. అన్ని తరగతి గదులకు ట్యూబ్‌లైట్లు, సిలింగ్‌ఫ్యాన్‌లు, బాలబాలికలకు విడివిడిగా నిరంతరం నీటి సౌకర్యంతో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు, బ్లాక్‌బోర్డు స్థానంలో గ్రీన్‌బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, తరగతి గదులకు పెయింటింగ్, పాఠశాల ఆవరణంలో గ్రానైట్ పనులు, ఉపాధిహామీ పథకంలో ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment