చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే.
ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు
మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు.
వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే....
గర్వపడుతున్నా..
నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను.
– పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి
కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి
నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు.
–పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment