govt high school
-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
కేసీఆర్ తర్వాత నేనే నంబర్ వన్: మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్(పర్వతగిరి): ‘కేసీఆర్ తర్వాత రాజకీయాల్లో నేనే నంబర్–1.. నాకెవరూ సాటిలేరు’.. ఈ మాటన్నది ఎవరో కాదు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆయన ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987–88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి సమితి అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు టాస్ వేసి కాంగ్రెస్ వారు ఓడించారని తెలిపారు. అలా రెండు సందర్భాల్లో ఆ పార్టీ వారు కక్ష గట్టడంతో కసితో టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించానని తెలిపారు. -
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలు
రాయపర్తి: అటెండెన్స్ విషయంలో కోపంతో ఓ ఉపాధ్యాయురాలు ఇద్దరు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు శనివారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అంబటి దేవకి శుక్రవారం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హపావత్ వైష్ణవి, బాలకృష్ణలను తీవ్రంగా చితకబాదారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్కడికి చేరుకొని గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదేంటని ప్రశ్నించిన తోటి ఉపాధ్యాయులను సైతం దేవకి పరుష పదజాలంతో దూషించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో శనివారం పాఠశాల గేటుమూసి ఆందోళన చేశారు. తమ పిల్లలను ఎందుకు కొట్టారని టీచర్‌ను నిలదీశారు. దీనిపై ఉపాధ్యాయురాలు దేవకిని వివరణ కోరగా అటెండెన్స్ తీసుకునే సమయంలో వైష్ణవి పేరు పిలవగా విద్యార్థిని తరగతి గదిలో ఉన్నా ఆబ్సెంట్ అని బాలకృష్ణ చెప్పాడని, దీంతో క్రమశిక్షణ కింద దండించానని తెలిపారు. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడితే ఒప్పు.. టీచర్‌గా తాను కొడితే తప్పా’అని ప్రశ్నించారు. -
ఐదుగురు విద్యార్థులు.. ఆరుగురు ఉపాధ్యాయులు!
గోదావరిఖని: ఆ పాఠశాలలో చదివేది ఐదుగురు విద్యార్థులు.. చదువు చెప్పేది మాత్రం ఆరుగురు టీచర్లు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న పరిస్థితి ఇది. సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా ఈ గ్రామం పూర్తి కనుమరుగు కానుండటంతో చాలా మంది గ్రామస్తులు చుట్టు పక్కల గ్రామాలకు వలసవేళ్లారు. ఉన్న కొందరు పిల్లలనూ 5 కిలోమీటర్ల దూరంలోని చందనాపూర్ పాఠశాలలో చదివిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలకు వచ్చే వారే కరువయ్యారు. పిల్లలందరూ టీసీలు తీసుకెళ్లగా చివరకు ఐదుగురు విద్యార్థులే మిగిలారు. విద్యార్థుల సంఖ్య తగ్గిన విషయాన్ని కౌన్సెలింగ్‌లో పొందుపర్చక పోవడంతో వెబ్‌కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగింది. ఇందులో పాఠశాలకు ప్రభుత్వం ఆరుగురు టీచర్లను కేటాయించింది. బదిలీపై ఎంతో సంతోషంగా వచ్చిన టీచర్లలకు ఇక్కడి పరిస్థితి చూసి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. చివరకు టీచర్లంతా ఎంఈవో వద్దకు వెళ్లి బోధన కోసం వేరే పాఠశాలకు డిప్యూటేషన్ చేయాలని కోరడం కొసమెరుపు. -
‘విజ్ఞానా’నికి బూజు.!
వైరా : వంద అక్షరాల్లోని భావాన్ని ఒక్క చిత్రంలో చూపవచ్చు. వంద చిత్రాల సారాంశాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. విద్యాశాఖలో మేధావులు నమ్మే విలువైన మాటలివి. ఆ దిశగా సత్ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక బోధన.. చివరకు ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. అంతంత మాత్రం నిధులు, అందీ అందని ప్రయోగ పరికరాలు, నిధులు దున్వినియోగం వెరసీ విద్యార్థులకు సైన్స్ విద్య అందడం లేదు. మౌఖిక బోధనతోనే పాఠాలు చెప్పి సరిపెడుతున్నారు. దీంతో విలువైన విజ్ఞాన పరికరాలకు దుమ్ము పడుతోంది. సులువుగా అర్థమయ్యేలా.. నియోజకవర్గంలో మొత్తం 37 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వైరా మండలంలో 9, కొణిజర్ల మండలంలో 7, ఏన్కూరు మండలంలో 8, కారేపల్లి మండలంలో 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 6,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే వీలుగా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది. కొంతకాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికారాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశ్యం. అయతే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, ఆ నిధులతోనే మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో అసలు సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల కొనుగోలు చేసిన పరికారలు వాడక మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. నిధులున్నా పరికరాల్లేవ్.. 2009–10 విద్యాసంవత్సరం నుంచి 2018వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009–10లో ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున, 2010–11లో రూ.17,125 చొప్పున, 2011–12లో రూ. 15వేల చొప్పున సైన్స్ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 2008 నుంచి 2010 వరకు ఆర్వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఏటా లక్షలాది రూపాయిల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం దక్కడం లేదు. ప్రయోగాత్మక బోధన కరువు... విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. ప్రస్తుత కృత్యధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పదేళ్ల కిందట పాఠ్య పుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతోపాటు, ఆ విధంగా బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సైన్స్ పరికరాలతో విద్యాబోధన చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సైన్స్ పరికరాలతోనే విద్యాబోధన చేయాలి. మారిన పుస్తకాల్లోని అంశాలతో ప్రయోగాలు చేస్తే పాఠాలు బోధించే పరిస్థితి లేదు. ప్రతి పాఠశాలలో ప్రయోగశాల ద్వారా బోధన చేయాల్సిందే. – కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా -
సొమ్ము దాతది - సోకు మంత్రిది
-
అయినా .. తీరు మారలేదు!
ఓ విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు చెవుల వెంట కారిన రక్తం.. ఆస్పత్రికి తరలింపు ఈయనే గతంలో ఓ విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి ఆ కేసులో ఇప్పటికే ఒకసారి సస్పెన్షన్ వేటు పడినా మారని అయ్యవారి తీరు కొమ్మాలపాడు (సంతమాగులూరు) : ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లలను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ సారి అయ్యవారిపై సస్పెన్షన్ వేటు పడినా మార్పు రాలేదు. తాజాగా మరో విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టి తన బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నాడు. మూడేళ్ల క్రితం అద్దంకి మండలం మణికేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సురేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాళ్లావేళ్లాబడి రెండేళ్ల కిందట ఆయన సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు ఉర్దూ పాఠశాలలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆయన విధుల్లో చేరిన నాటి నుంచి ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులను రెండుసార్లు విచక్షణ రహితంగా కొట్టినా అధికారులు చూసీచూడనట్లు ఉన్నారు. మళ్లీ గురువారం ఉదయం 5వ తరగతి విద్యార్థి నహీమ్‌ను ఇష్టం వచ్చినట్లు బాదాడు. చెవుల వెంట రక్తం వచ్చిందని, వెంటనే ఆ విద్యార్థిని నరసరావుపేట వైద్యశాలకు తరలించినట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థిని హెచ్ఎం దగ్గరకు పిలిచాడు. ఓ రిజిస్టర్ ఇచ్చి సురేష్ మాస్టార్‌కు ఇవ్వాలని ఆదేశించాడు. హెచ్ఎం ఇచ్చిన రిజిస్టర్‌తో సదరు విద్యార్థి సురేష్ వద్దకు వెళ్లాడు. వెళ్లీవెళ్లగానే విద్యార్థిపై పిడుగుద్దులు కురిపించాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో నహీమ్ చెవుల నుంచి రక్తం వచ్చింది. ఇది సహించని తల్లిదండ్రులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. విచారించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తానని ఎంఈవో తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విషయం తెలిసి ఫొటో తీసేందుకు వెళ్లిన మీడియూ ప్రతినిధులపై సురేష్ మాస్టార్ చిందులు తొక్కడం గమనార్హం. -
రాజుగారి గది కాదు 'బడి'
నగర నడిబొడ్డులో బూత్ బంగళా! పొద్దుగూకితే దెయ్యంలా అరుపులు, కేకలు అన్నిరకాల నేరగాళ్లకు అడ్డాగా మున్సిపల్ పాఠశాల ఉపయోగంలోకి తేవడంలో విఫలమవుతున్న కార్పొరేషన్అధికారులు ‘మనుషుల అవయవాలతో వ్యాపారం చేసే ముఠా పాడుబడిన భవనాన్ని ఆక్రమిస్తుంది. ఆ భవనంలో దెయ్యం ఉందని, ఇటువైపు వస్తే చంపేస్తుందని భయపెడుతుంటారు. ఆ రహస్యాన్ని ఇద్దరు వ్యక్తులు ఛేదిస్తారు’ ఇదీ ఇటీవల విడుదలైన ‘రాజుగారిగది’ సినిమా కథ. అచ్చం అలాంటి తరహాలోనే నగరంలోని మున్సిపల్ పాఠశాలను కొందరు నేరగాళ్లు ఆవాసంగా చేసుకున్నారు. ఆడ దెయ్యంలా అరుస్తూ అటువైపు వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరబడినట్టే. నగరంలోని రైల్వేస్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలోనే.. తిరుపతి : నిరుపేద విద్యార్థులకు విద్యనందించాలన్న ఉన్నతాశయంతో 1992లో అప్పటి మున్సిపల్ ప్రత్యేకాధికారి బి.వెంకటరామయ్య ఐఏఎస్ చేతుల మీదుగా రైల్వేస్టేషన్ సమీపంలో తిరుపతి పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆరు గదులతో నిర్మించిన ఈ భవనాన్ని అదే ఏడాది జూలై 20న అప్పటి తిరుపతి ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యనభ్యసించారని చెబుతున్న టీపీపీఎం పాఠశాలకు అనుబంధంగా నిర్మించిన ఈ భవనం నగరంలోని నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. నేరగాళ్లకు అడ్డా.. మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పక్కనే టీపీపీఎం(టంగుటూరి ప్రకాశం పంతులు) ఉన్నత పాఠశాల ఉంది. పదేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను హైస్కూల్‌కు అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా మారింది. దీన్ని ఉపయోగించుకోవడంలో కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. ఇదే అదునుగా భవనాన్ని అన్నిరకాల నేరగాళ్లు ఆవాసంగా మార్చుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నేరం చేసి ఇక్కడ తలదాచుకోవడం పరిపాటిగా మారుతోంది. రైల్వే స్టేషన్‌కు ఎదురుగా విష్ణు నివాసంలో వసతి పొందేందుకు వచ్చే యాత్రికులు ఇటువైపు వెళ్లేందుకు హడలిపోతున్నారు. చీకటి పడితే పాఠశాల భవనంలో అసాంఘిక కార్యక్రమా లు చోటుచేసుకుంటున్నాయి. తరగతి గదుల్లో ఎక్కడ చూసినా కండోమ్స్, తాగిపడేసిన ఖాళీ మద్యం సీసాలు, కాల్చిన సిగరె ట్ ముక్కలు దర్శనమిస్తున్నాయి. ఎవరైనా కొత్తవారు అటుగా వెళితే ఆడ గొంతుతో దెయ్యలా అరుస్తూ భయపెడుతున్నారు. ఫలితంగా ఈ భవనంలో ఏదో దెయ్యం ఉందంటూ మున్సిపల్ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కళ్ల ముందే శిథిలమవుతోంది.. నేరగాళ్లు, అల్లరిమూకలకు అడ్డాగా మారిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుతోంది. ఇప్పటికే ప్రహరీ గోడ ధ్వంసమయింది. ఇనుప గేట్లను తొలగించి పాతసామాన్ల అంగడిలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. తలుపులు, కిటికీలను పెకలించేశారు. అవునా.. నాకు తెలియదే! మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పాఠశాల భవనం విద్యార్థుల కోసం నిర్మించారు. ప్రస్తుతం అందులోని విద్యార్థులను మరో భవనంలోకి తరలించినట్లు తెలుసు. అది నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న విషయమే నాకు తెలియదు. ఈ విషయం కమిషనర్‌ను అడగాలి. - శ్రీదేవి, అదనపు కమిషనర్, కార్పొరేషన్ -
విద్యార్థి పట్ల టీచర్ అమానుషం
9 ఏళ్ల విద్యార్థి పట్ల ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని నాలుగో తరగతి విద్యార్థి గురుచరణ్‌పై టీచర్ కర్రతో తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆ విద్యార్థి ఒళ్లంత గాయాలయ్యాయి. ఆ ఘటన తిరుపతిలోని మున్సిపల్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో ఆ సంఘటనపై సమాచారం అందుకున్న గురుచరణ్ తల్లితండ్రులు పాఠశాల చేరుకున్నారు. టీచర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల గేట్ వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిపై టీచర్ దాడిని ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో తాను టీచర్‌పై చర్యలు చేపడతానని హామీ ఇవ్వడంతో గురుచరణ్ తల్లితండ్రులు ఆందోళన విరమించారు.