
దెబ్బలు తిన్న విద్యార్థులు వైష్ణవి, బాలకృష్ణ
రాయపర్తి: అటెండెన్స్ విషయంలో కోపంతో ఓ ఉపాధ్యాయురాలు ఇద్దరు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు శనివారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అంబటి దేవకి శుక్రవారం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హపావత్ వైష్ణవి, బాలకృష్ణలను తీవ్రంగా చితకబాదారు.
తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్కడికి చేరుకొని గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదేంటని ప్రశ్నించిన తోటి ఉపాధ్యాయులను సైతం దేవకి పరుష పదజాలంతో దూషించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో శనివారం పాఠశాల గేటుమూసి ఆందోళన చేశారు.
తమ పిల్లలను ఎందుకు కొట్టారని టీచర్‌ను నిలదీశారు. దీనిపై ఉపాధ్యాయురాలు దేవకిని వివరణ కోరగా అటెండెన్స్ తీసుకునే సమయంలో వైష్ణవి పేరు పిలవగా విద్యార్థిని తరగతి గదిలో ఉన్నా ఆబ్సెంట్ అని బాలకృష్ణ చెప్పాడని, దీంతో క్రమశిక్షణ కింద దండించానని తెలిపారు. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడితే ఒప్పు.. టీచర్‌గా తాను కొడితే తప్పా’అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment