- ఓ విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
- చెవుల వెంట కారిన రక్తం.. ఆస్పత్రికి తరలింపు
- ఈయనే గతంలో ఓ విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి
- ఆ కేసులో ఇప్పటికే ఒకసారి సస్పెన్షన్ వేటు పడినా మారని అయ్యవారి తీరు
కొమ్మాలపాడు (సంతమాగులూరు) : ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లలను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ సారి అయ్యవారిపై సస్పెన్షన్ వేటు పడినా మార్పు రాలేదు. తాజాగా మరో విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టి తన బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నాడు. మూడేళ్ల క్రితం అద్దంకి మండలం మణికేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు సురేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
కాళ్లావేళ్లాబడి రెండేళ్ల కిందట ఆయన సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు ఉర్దూ పాఠశాలలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆయన విధుల్లో చేరిన నాటి నుంచి ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులను రెండుసార్లు విచక్షణ రహితంగా కొట్టినా అధికారులు చూసీచూడనట్లు ఉన్నారు. మళ్లీ గురువారం ఉదయం 5వ తరగతి విద్యార్థి నహీమ్‌ను ఇష్టం వచ్చినట్లు బాదాడు. చెవుల వెంట రక్తం వచ్చిందని, వెంటనే ఆ విద్యార్థిని నరసరావుపేట వైద్యశాలకు తరలించినట్లు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు.
పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థిని హెచ్‌ఎం దగ్గరకు పిలిచాడు. ఓ రిజిస్టర్ ఇచ్చి సురేష్ మాస్టార్‌కు ఇవ్వాలని ఆదేశించాడు. హెచ్‌ఎం ఇచ్చిన రిజిస్టర్‌తో సదరు విద్యార్థి సురేష్ వద్దకు వెళ్లాడు. వెళ్లీవెళ్లగానే విద్యార్థిపై పిడుగుద్దులు కురిపించాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో నహీమ్ చెవుల నుంచి రక్తం వచ్చింది. ఇది సహించని తల్లిదండ్రులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. విచారించి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తానని ఎంఈవో తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విషయం తెలిసి ఫొటో తీసేందుకు వెళ్లిన మీడియూ ప్రతినిధులపై సురేష్ మాస్టార్ చిందులు తొక్కడం గమనార్హం.