గురువా.. ఇదేమి బుద్ధి..!
అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు మగపిల్లలతో ముక్కుచెంపలు వేయించడం, మోకాళ్ల మీద నిలబెట్టడం, గిచ్చడం, చున్నితో పుస్తకాలను చుట్టి విసరివేయడం, ఇంటర్‌నల్ మార్కులు వేయబోమని బెదిరిస్తున్నారని విద్యార్థినులు వివరించారు. ఇన్నాళ్లు ఓపికగా ఉన్న తాము వేధింపులు ఎక్కువవడంతో తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేస్తే తనపైనే ఫిర్యాదు చేస్తారా అని బెదిరించారన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి, ఆమె భర్త పోసా భాస్కర్ పాఠశాల వద్దకు చేరుకుని తెలుగు ఉపాధ్యాయుడు అన్నయ్యను చొక్కా పట్టుకుని నిలదీశారు.
విద్యార్థినులు ఏమైనా చేసుకుంటే దీనికి ఎవరు బాధ్యత వహరిస్తారని ప్రశ్నించారు. డీఈఓ శైలజకు కౌన్సిలర్ ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఉపాధ్యాయుడిపై దాడి చేసే పరిస్థితి నెలకొనడంతో ప్రధానోపాధ్యాయుడు శివప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. సోమవారం అన్నయ్య బదిలీ కౌన్సెలింగ్‌కు వెళతాడని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం చెప్పారు. అన్నయ్యపై జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్లు కొందరు చెప్పారు. తాను విద్యార్థినులతో ముక్కు చెంపలు వేయించడం తప్ప ఏమీ చేయలేదని అన్నయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ సావిత్రి పాఠశాలకు వెళ్లి.. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె పేర్కొన్నారు.