
రాజుగారి గది కాదు 'బడి'
నగర నడిబొడ్డులో బూత్ బంగళా!
పొద్దుగూకితే దెయ్యంలా అరుపులు, కేకలు
అన్నిరకాల నేరగాళ్లకు అడ్డాగా మున్సిపల్ పాఠశాల
ఉపయోగంలోకి తేవడంలో విఫలమవుతున్న కార్పొరేషన్అధికారులు
‘మనుషుల అవయవాలతో వ్యాపారం చేసే ముఠా పాడుబడిన భవనాన్ని ఆక్రమిస్తుంది. ఆ భవనంలో దెయ్యం ఉందని, ఇటువైపు వస్తే చంపేస్తుందని భయపెడుతుంటారు. ఆ రహస్యాన్ని ఇద్దరు వ్యక్తులు ఛేదిస్తారు’ ఇదీ ఇటీవల విడుదలైన ‘రాజుగారిగది’ సినిమా కథ. అచ్చం అలాంటి తరహాలోనే నగరంలోని మున్సిపల్ పాఠశాలను కొందరు నేరగాళ్లు ఆవాసంగా చేసుకున్నారు. ఆడ దెయ్యంలా అరుస్తూ అటువైపు వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరబడినట్టే. నగరంలోని రైల్వేస్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలోనే..
తిరుపతి : నిరుపేద విద్యార్థులకు విద్యనందించాలన్న ఉన్నతాశయంతో 1992లో అప్పటి మున్సిపల్ ప్రత్యేకాధికారి బి.వెంకటరామయ్య ఐఏఎస్ చేతుల మీదుగా రైల్వేస్టేషన్ సమీపంలో తిరుపతి పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆరు గదులతో నిర్మించిన ఈ భవనాన్ని అదే ఏడాది జూలై 20న అప్పటి తిరుపతి ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యనభ్యసించారని చెబుతున్న టీపీపీఎం పాఠశాలకు అనుబంధంగా నిర్మించిన ఈ భవనం నగరంలోని నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది.
నేరగాళ్లకు అడ్డా..
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పక్కనే టీపీపీఎం(టంగుటూరి ప్రకాశం పంతులు) ఉన్నత పాఠశాల ఉంది. పదేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను హైస్కూల్‌కు అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా మారింది. దీన్ని ఉపయోగించుకోవడంలో కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. ఇదే అదునుగా భవనాన్ని అన్నిరకాల నేరగాళ్లు ఆవాసంగా మార్చుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నేరం చేసి ఇక్కడ తలదాచుకోవడం పరిపాటిగా మారుతోంది.
రైల్వే స్టేషన్‌కు ఎదురుగా విష్ణు నివాసంలో వసతి పొందేందుకు వచ్చే యాత్రికులు ఇటువైపు వెళ్లేందుకు హడలిపోతున్నారు. చీకటి పడితే పాఠశాల భవనంలో అసాంఘిక కార్యక్రమా లు చోటుచేసుకుంటున్నాయి. తరగతి గదుల్లో ఎక్కడ చూసినా కండోమ్స్, తాగిపడేసిన ఖాళీ మద్యం సీసాలు, కాల్చిన సిగరె ట్ ముక్కలు దర్శనమిస్తున్నాయి. ఎవరైనా కొత్తవారు అటుగా వెళితే ఆడ గొంతుతో దెయ్యలా అరుస్తూ భయపెడుతున్నారు. ఫలితంగా ఈ భవనంలో ఏదో దెయ్యం ఉందంటూ మున్సిపల్ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
కళ్ల ముందే శిథిలమవుతోంది..
నేరగాళ్లు, అల్లరిమూకలకు అడ్డాగా మారిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుతోంది. ఇప్పటికే ప్రహరీ గోడ ధ్వంసమయింది. ఇనుప గేట్లను తొలగించి పాతసామాన్ల అంగడిలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. తలుపులు, కిటికీలను పెకలించేశారు.
అవునా.. నాకు తెలియదే!
మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పాఠశాల భవనం విద్యార్థుల కోసం నిర్మించారు. ప్రస్తుతం అందులోని విద్యార్థులను మరో భవనంలోకి తరలించినట్లు తెలుసు. అది నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న విషయమే నాకు తెలియదు. ఈ విషయం కమిషనర్‌ను అడగాలి.
- శ్రీదేవి, అదనపు కమిషనర్, కార్పొరేషన్