ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం | Editorial On New Law To Curb Air Pollution | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం

Published Tue, Oct 27 2020 1:07 AM | Last Updated on Tue, Oct 27 2020 1:09 AM

Editorial On New Law To Curb Air Pollution - Sakshi

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈమధ్య కాలుష్యం గురించి ప్రస్తావిస్తూ భారత్‌ను రోత దేశమని వ్యాఖ్యానించిందుకు కొందరు నొచ్చుకుని వుండొచ్చుగానీ మన దేశంలో కాలుష్యం తీవ్రత చాలా చాలా ఎక్కువగా వుంది. గత బుధవారం విడుదలైన 2019కి సంబంధించిన వాయుకాలుష్యం గణాంకాలు గుబులు పుట్టిస్తాయి. నిరుడు కేవలం వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4,76,000మంది నెలలోపు వయసున్న పిల్లలు మరణిస్తే అందులో 1,16,000మంది భారత్‌కు చెందినవారని ఆ నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా(67,900మంది), పాకిస్తాన్‌ (56,500మంది), ఇథియోపియా(22,900మంది) వున్నాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు సమగ్రమైన చట్టం తీసుకురాబోతున్నామని సోమవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీ హర్షించదగ్గది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టం కాపీని నాలుగు రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని కూడా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హామీ ఇచ్చారు.

వాస్తవానికి ఢిల్లీ పరిసరాల్లో వున్న రాష్ట్రాలు వాయు కాలుష్య నివారణకు, ముఖ్యంగా అక్కడ పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షించి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ఈనెల 16న ఉత్తర్వులిచ్చింది. కేంద్రం ఇచ్చిన తాజా హామీతో ఆ కమిటీని ప్రస్తుతానికి నిలిపివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాలుష్యం కార ణంగా పౌరుల ప్రాణాలకు కలుగుతున్న ముప్పు అసాధారణమైనది.  వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం గాలిలో వుండే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం2.5) ప్రతి ఘనపు మీటరులోనూ 25 మైక్రోగ్రాములు మించకూడదు. దీని ప్రాతిపదికగా వాయు నాణ్యత సూచీ ఏ ప్రాంతంలో ఎలా వుందన్నది లెక్కేస్తారు. సాధారణంగా ఈ సూచీలో ఏ ప్రాంతమైనా 300 పాయింట్లు మించిందంటే అది ‘రెడ్‌ జోన్‌’లో వున్నట్టు లెక్క. మన దేశ రాజధాని నగరం ఈ పరిమితిని చాన్నాళ్లక్రితమే దాటింది. అంటే అక్కడి వాతావరణంలో పీఎం 2.5 కణాలు ఒక ఘనపు మీటర్‌లో 300 మైక్రో గ్రాములను మించిపోయాయి. వుండాల్సినదానికన్నా ఇది 12 రెట్లు ఎక్కువ! 

వాయు కాలుష్యం వల్ల  మొత్తం 87 రకాల వ్యాధులబారిన పడే అవకాశం వున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో హెచ్చరించింది. గర్భిణులు కలుషిత వాయువు పీల్చడంవల్ల గర్భంలో వుండే పిండంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండానే శిశు జననం, ఆ శిశువులు తక్కువ బరువుండటం, వారి ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం వంటి సమస్యలు తప్పవు. ఇక ఇంచు మించు అన్ని వయసులవారూ శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా, గుండెపోటు, కేన్సర్, మధు మేహం, రక్తంలో గడ్డలు ఏర్పడటం తదితర వ్యాధులబారిన పడే ప్రమాదం వుంటుంది. తాజాగా హార్వర్డ్‌ యూనివర్సిటీ వెలువరించిన  నివేదిక ప్రకారం వాయు కాలుష్యానికీ, కరోనా మరణాల తీవ్రతకూ సంబంధం వున్నదని వెల్లడైంది. వాతావరణంలో కేవలం ఒక మైక్రో గ్రాము కాలుష్యం పెరిగితే కరోనా వ్యాధిగ్రస్తుల్లో మరణాల సంఖ్య పెరుగుతుందని ఒక అంచనా.

కరోనా వ్యాధివల్ల దెబ్బతినేది ప్రధానంగా ఊపిరితిత్తులు గనుక వాయు కాలుష్యంతో అవి మరింత పాడయ్యే ప్రమాదం వుంటుంది. వాయు కాలుష్యం వల్ల మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 5.2 ఏళ్లు తగ్గుతోందని షికాగో విశ్వవిద్యాలయ ఇంధన విధాన సంస్థ (ఎపిక్‌) నివేదిక అంచనా వేసింది. ఢిల్లీలో ఇప్పుడున్న కాలుష్య స్థాయినిబట్టి చూస్తే ఈ ఆయుర్దాయం 9.4 ఏళ్లు తగ్గుతుందని ఆ నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్‌ వుంది. అక్కడ 8.6 ఏళ్ల ఆయుర్దాయం తగ్గుతోంది. మొత్తంమీద ఉత్తరాది రాష్ట్రాల్లోని 25 కోట్లమంది ఈ వాయు కాలుష్యం కారణంగా వివిధ వ్యాధుల బారినపడి తమ ఆయుర్దాయంకన్నా ఎనిమిదేళ్లముందే జీవితం నుంచి నిష్క్రమిస్తున్నారు.

మన దేశ జనాభాలో 84 శాతంమంది వాయు కాలుష్యం అధికంగా వుండే ప్రాంతా ల్లోనే జీవనం సాగిస్తున్నా రని, వారిలో సగంమంది కాలుష్య సంబంధ వ్యాధులబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్లక్రితం తెలిపింది. ఈ వ్యాధులు మన ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. జనం తమ సంపాదనలో అధిక భాగం ఆరోగ్యంపై ఖర్చుపెట్టాల్సివస్తోంది. అంతేగాక శ్రమించే సామర్థ్యాన్ని ఆ వ్యాధులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పర్యవసానంగా ఉత్పాదకత ఆమేరకు తగ్గు తోంది. ప్రపంచబ్యాంకు ప్రకారం మన జీడీపీలో 8.5 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తోంది. 

కనుకనే వాయు కాలుష్యంపై సమగ్రమైన చట్టం తీసుకురావడం అత్యవసరం. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతాల వాయు కాలుష్యానికి కేవలం పంట వ్యర్థాలను తగలబెట్టడం ఒక్కటే కారణం కాదు. అది దాదాపు 19 శాతం కాలుష్యానికి కారణమవుతోంది. రహదార్లపై లేచే ధూళి కణాల వాటా కాలుష్యంలో 36–66 శాతం మధ్య వుంటున్నదని గణాంకాలు వివరిస్తున్నాయి. కనుక కేవలం పంట వ్యర్థాలను తగలబెట్టడం ఒక్కటే మొత్తం కాలుష్యానికి కారణమని భావించరాదు. పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటు రైతులతో మాన్పించడానికి సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం కొన్ని సూచనలు చేసింది. వారికి ప్రోత్సాహకాలివ్వాలని సూచించింది. కానీ పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లు ఆ పని చేసిన దాఖలా లేదు.  కేసులతో, చట్టాలతో రైతుల్ని బెదిరించి దారికి తీసుకురావడం అసాధ్యం.

రైతులు సరే... వాహనకాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం వగైరాల విషయంలో ఏం చేస్తారు? ముందుచూపులేని అభివృద్ధి విధానాలు మనల్ని ఈ ప్రమాదపుటంచులకు నెట్టాయి. పరిశ్రమలు, వాహనాలు వదిలే ఉద్గారాల్లోని  నైట్రేట్‌లు, సల్ఫేట్‌లు, కాడ్మియం, పాదరసంవంటివి మనిషి ఊపిరి తిత్తుల్లోకి జొరబడి చడీచప్పుడు లేకుండా ప్రాణాలు తోడేస్తున్నాయి. కాలుష్య నివారణ చట్టం ముసాయిదాను ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో వుంచుకొని రూపొందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement