ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి 66 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. అందులో 65 మంది కలిసి నూటా పదిహేనేళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు. వారి సగటు పదవీకాలం సుమారు ఏడాదిన్నర! ఇందులో నౌరోజీ మొదలుకొని గాంధీ, బోస్, నెహ్రూ, ఇందిర వంటి ఉద్దండులున్నారు. ఒక్క సోనియా గాంధీ మాత్రమే ఆ పదవిలో ఇరవై రెండేళ్లపాటు ఉన్నారు. ఇంకా కొనసాగుతున్నారు. ఆమె పదవీకాలంలో పదేళ్లపాటు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ప్రధాని పదవిని చేపట్ట నప్పటికీ యూపీఏ కూటమి ఛైర్‌పర్సన్ హోదాలో అప్పుడామే సర్వం సహాధికార సామ్రాజ్ఞిలా చలామణీ అయ్యారు. ప్రపంచం లోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆమె పేరును కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది.
పేరుకు మన్మోహన్‌సింగ్ ప్రధాని. పరిపాలనకు సంబంధిం చిన తుపాకీ ఆయన భుజం మీదనే ఉండేది. ట్రిగ్గర్ మాత్రం సోనియాగాంధీ చేతిలో ఉండేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అంతే! వివాదాస్పదమైన, కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తుపాకీ మోతీలాల్ ఓరా భుజం మీదనో, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఆంథోనీల భుజాల మీదనో ఉండేది. ట్రిగ్గర్ మాత్రం అధినేత్రి చేతిలోనే! అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష బీజేపీ జనంలో విస్తృత ప్రచారం చేసింది. ఆ ప్రచారం ఆసరా తోనే అది అధికారంలోకి రాగలిగింది. అప్పటి పరిణామాల్లో ఒకటైన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక ఆస్తుల బదలాయింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా ఈ నెలలోనే వేర్వేరు తేదీలలో విచారణకు హాజరవ్వాలని సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
సోనియాగాంధీ కుటుంబ సభ్యులు ‘నేషనల్ హెరాల్డ్’ ఆస్తులను ఆక్రమించుకున్న విధానం అవినీతి పురాణాల్లోని ఒక అత్యంత కళాత్మకమైన కావ్యం. స్వాతంత్య్రోద్యమ కాలంలో పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ చొరవతో 1938లో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. పత్రిక స్థాపన, నిర్వహణల కోసం 1937లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) అనే పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఐదు వేలమంది స్వాతంత్య్ర సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఇంగ్లిష్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌తోపాటు ఒక హిందీ పత్రిక (నవజీవన్)నూ, ఉర్దూ (ఖౌమీ ఆవాజ్) పత్రికనూ ఏజెఎల్ ప్రారంభించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలాకాలం వరకూ ఈ పత్రికలు లాభాల్లోనే నడిచాయి. క్రమంగా ఆదరణ కోల్పోయి, 2008 నాటికి 90 కోట్ల రూపాయల అప్పు పోగుపడిందన్న నెపంతో మూసివేశారు. అప్పటికి ఈ సంస్థకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు ఐదువేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి.
పత్రికల ప్రచురణ ఆగిపోయిన రెండేళ్లకు అదే కార్యాలయం అడ్రస్ (హెరాల్డ్ హౌస్)తో ఒక కొత్త కంపెనీ పుట్టుకొచ్చింది. దానిపేరు ‘యంగ్ ఇండియన్’. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ డైరెక్టర్లు. వారి వాటా 76 శాతం. మిగిలిన 24 శాతం కుటుంబ విధేయులైన మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ల పేరిట ఉన్నది. ఈ కంపెనీ ఏర్పడిన తర్వాత జరి గిన ముఖ్య విషయమేమిటంటే – ఏజెఎల్ సంస్థ తాను అప్పు పడిన 90 కోట్లను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సదరు మొత్తాన్ని వడ్డీ లేకుండా తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాం«ధీ. కోశాధికారి మోతీలాల్ ఓరా. మరి ఈ 90 కోట్లను ఏజెఎల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబట్టుకునేదెలా? అందుకోసం ఆ రికవరీ హక్కును రూ.50 లక్షలకు ‘యంగ్ ఇండియన్’కు అమ్మివేసింది. ఈ 50 లక్షలను కూడా డాటెక్స్ అనే కంపెనీ దగ్గర యంగ్ ఇండియన్ ‘అప్పు’గా తీసుకొని కాంగ్రెస్‌కు చెల్లించింది. ఇక్కడితో కాంగ్రెస్ కథ ఖతం. 90 కోట్లకు 50 లక్షలతో సరి! ఇక ఏజెఎల్ కథ. 90 కోట్ల అప్పును తీర్చే పరిస్థితి లేదు కనుక ఏజెఎల్ షేర్లను ‘యంగ్ ఇండియన్’కు బదలాయించడానికి అంగీకారం కుదిరింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెఎల్ దగ్గర 90 కోట్ల రుణాన్ని వసూలు చేసుకునే కాంట్రాక్టు కోసం ‘యంగ్ ఇండియన్’ తరఫున దాని డైరెక్టర్లలో ఒకరైన మోతీలాల్ ఓరా ప్రతిపాదన పంపించారు. ఇందుకు అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని కోశాధికారి మోతీలాల్ ఓరా సంతకం చేశారు. ఏజెఎల్‌కు ఎమ్‌డీ కూడా మోతీలాల్ ఓరానే! కనుక ‘యంగ్ ఇండియన్’కు ఏజెఎల్ షేర్లను బదలాయించే ఒప్పందంపై ఏజెఎల్ తరఫున మోతీలాల్ ఓరా సంతకం చేశారు. కుటుంబ విధేయుడైన ఓరా త్రిపాత్రాభినయంతో మూడు సంతకాలు చేసి ఐదువేల కోట్ల విలువైన స్వాతంత్య్ర సమరయోధుల ఆస్తిని సోనియా కుటుంబం చేతిలో పెట్టారు. ఈ వ్యవహారమంతా 2011లో పూర్తయింది. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే సోనియా కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు పంపించింది. కాకతాళీయమే కావచ్చు కానీ నోటీసులు అందుకున్న మర్నాడే సోనియా, ప్రియాంకలకు కరోనా కూడా వచ్చింది. కానీ, వారైతే నోటీసుల్లో పేర్కొన్న తేదీల ప్రకారమే ఈడీ ముందు హాజరు కావడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ కరోనా భయంతో ఈడీ వాళ్లేమైనా వాయిదా వేసుకుంటారేమో చూడాలి.
ఐదువేల కోట్ల విలువైన ఆస్తుల్ని కైంకర్యం చేసిన 2010–2011 కాలంలోనే ‘రాచకుటుంబం’ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది సరిగ్గా ద్విపాత్రాభినయం లాంటి ఉదంతం. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కంచుకోటలా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఎనిమిదేళ్లపాటు కేంద్రంలో, పదేళ్లపాటు రాష్ట్రంలో అధికార వియోగాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ను రెండుచోట్లా గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ కుటుంబం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం చూపెట్టిన ‘కృతజ్ఞత’కు మచ్చుతునక లాంటి ఆపరేషన్! ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత జనాదరణ పొందిన నాయకుడు వైఎస్సార్. ఆయన హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలు షాక్‌కు గురయ్యారు. వందలాది మంది గుండె పగిలి చనిపోయారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ పరిణా మాలు తీవ్రంగా కలచివేశాయి.
వైఎస్సార్ ప్రమాదానికి గురైన నల్లకాలువ దగ్గర జరిగిన సంస్మరణ సభలో జగన్ ఉద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారందరూ తన ఆత్మబంధువులేనని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులం దరినీ వారి ఇళ్లవద్దకే వెళ్లి పరామర్శిస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అప్పటికే వైఎస్ ప్రజాదరణ పట్ల అసూయ నిండిన అధిష్ఠానం మెదళ్లలో కొందరు కాంగ్రెస్ పెద్దలు ఆజ్యం పోశారు. ఓదార్పు యాత్రను ఆపేయాలని జగన్ మోహన్‌రెడ్డిని అధిష్ఠానం ఆదేశించింది. ఆయన స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన దేవతను అభ్యర్థించారు.
ఇచ్చిన మాట తప్పడం పాడికాదని విన్నవించారు. అధిష్ఠానం మనసు కరగలేదు. ‘మా మాట వినకుంటే కష్టాలపాలవుతావ’ని కూడా హెచ్చరించింది. ఈ విషయాన్ని నాటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్‌ఛార్జి గులామ్ నబీ ఆజాద్ స్వయంగా ఒక బహిరంగ సభలోనే తదనంతర కాలంలో వెల్లడించారు. తాము చెప్పినట్టు వింటే కేంద్రమంత్రిని చేస్తామనీ, కొంతకాలం తర్వాత ముఖ్య మంత్రిని కూడా చేస్తామనీ చెప్పినా ఆయన వినలేదనీ, తన మార్గాన్నే ఎంచుకున్నారనీ ఆజాద్ చెప్పారు. నిజమే, జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడాలనే బాటనే ఎంచు కున్నారు.
ధిక్కారమున్ సైతునా... అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రంగానే స్పందించింది. 2010 నవంబర్‌లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఒక తెల్ల కాగితంపై లేఖ రాశారు. తేదీ కూడా వేయలేదు. ఒక ఆంగ్లపత్రిక కథనాన్ని మాత్రమే జత చేశారు. కోర్టు ఆ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగ ణించింది. ప్రతివాదులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తదితరు లకు నోటీసులు జారీచేసింది. ఈ లేఖ రాసినందుకు ప్రతి ఫలంగా శంకర్రావుకు రెండు వారాలు తిరిగేసరికే మంత్రిపదవి లభించింది. మంత్రి హోదాలో మరొకసారి ఆయన హైకోర్టుకు లేఖ రాశారు. 333 పేజీల డాక్యుమెంటును దానికి జతచేశారు. సోనియాగాంధీ ఆదేశంతోనే ఈ పిటీషన్ వేశానని మీడియా ముందే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయ కులు ఎర్రంనాయుడు, అశోక గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరో పిటీషన్ వేశారు.
ఇది శంకర్రావు వేసిన పిటీషన్‌కు దాదాపు కార్బన్ కాపీ! అంటే రెండూ ఒకరే తయారు చేశారు. ఈ కోర్టు వ్యవహారాన్ని రెండు పార్టీలూ కలిసి జాయింట్‌గా నడిపించాయి. వీరి పిటిషన్లపై ప్రాథమిక విచారణ జరిపి నివే దిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ కక్రూ సీబీఐని ఆదేశించారు. రెండు వారాల్లోనే సీబీఐ సీల్డ్‌కవర్‌లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వెల్లడి చేయకుండానే దర్యాప్తు చేపట్టాలని సీబీఐని జస్టిస్ కక్రూ ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత ఆరు నెలలపాటు సీబీఐ – ఎల్లో మీడియాలు సంయుక్తంగా రోజుకో కథనాన్ని చిలువలు పలువలు చేర్చి ప్రచారంలో పెట్టాయి. 2012 మే 27న జగన్ మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పదవీ విరమణ చేసిన జస్టిస్ కక్రూను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి వరించింది.
ఇంతకూ వారు జగన్‌మోహన్‌రెడ్డి మీద పెట్టిన కేసేమిటి? క్విడ్ ప్రోకో! అంటే వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రయోజనాలు పొందిన పారిశ్రామికవేత్తలు జగన్ మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగం. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో లేరు. రాజకీయాల్లోనూ లేరు. అప్పటికే బెంగుళూరులో ఆయనొక విజయవంతమైన యువ వ్యాపారవేత్త. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌గాంధీ హోదా లేకుండానే ప్రభుత్వంలో చక్రం తిప్పినట్టు వైఎస్ జగన్ తిప్పలేదు.
మొన్నటి చంద్రబాబు ప్రభుత్వంలోకి దొడ్డిదారిన ప్రవేశించిన లోకేశ్ బాబు ప్రభుత్వంపై పెత్తనం చేసినట్టు వైఎస్ జగన్ చేయలేదు. అసలాయన ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉండలేదు. రాష్ట్ర రాజధానిలోనే లేరు. ఆయన ప్రారంభించిన మీడియా, సిమెంటు కంపెనీల్లో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. వారు కేవలం వైఎస్ జగన్ కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టలేదు. ఇతర కంపెనీల్లోనూ పెట్టారు. వైఎస్సార్ ప్రభుత్వంలో రాయితీలు పొందినవారందరూ పెట్ట లేదు. వందలాది మంది రాయితీలు పొందినవారున్నారు. వారిలో ఐదారుగురు మాత్రమే వైఎస్ జగన్ కంపెనీల్లో వాటాదారులు. అట్లా్లగే ఏ రాయితీలూ పొందనివారు కూడా ఉన్నారు.
బంజారాహిల్స్‌లో ఆంక్షలను సడలించి ఫైవ్‌స్టార్ హోటల్‌కు అనుమతులిచ్చినందుకు గాను పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడులు పెట్టారని క్విడ్ ప్రోకో అభియోగం. అదే ప్రాంతంలో పార్క్ హయత్ సహా మరో ఐదు ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. వారెవరికీ వైఎస్ జగన్ కంపెనీల్లో వాటాలు లేవు. కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటిని కేటాయించినందుకు దాని అధిపతి శ్రీనివాసన్‌పై క్విడ్ ప్రోకో పెట్టారు. వైఎస్ హయాంలో 16 సిమెంట్ పరిశ్రమలకు అటువంటి కేటాయింపులు జరి గాయి. వారెవరూ ఈ ‘క్వ్రిడ్ ప్రోకో’లో లేరు. జడ్చర్ల సమీపం లోని ఫార్మా ఎస్‌ఈజెడ్‌లో భూమి కేటాయించారంటూ హెటిరో, అరబిందోలపై క్విడ్ ప్రోకో. అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే వారికి నచ్చ చెప్పి భూములు కేటాయించింది. వారు సొంత నిధులతో అక్కడ అభివృద్ధి చేసిన తర్వాత పలువురు అక్కడ పరిశ్రమలు స్థాపించారు. వాళ్లెవరూ వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టలేదు. గృహ నిర్మాణానికి శ్యాంప్రసాద్‌రెడ్డికి భూముల కేటాయింపుపై కూడా క్విడ్ ప్రోకో. ఈ రకంగా భూములు పొందినవారిలో అప్పటి టీడీపీ నేత నామా నాగేశ్వర రావు సహా అనేకమంది ఉన్నారు. వారెవరూ జగన్ కంపె నీల్లో వాటాలు కొనలేదు.
విజయవంతమైన వ్యాపారవేత్తగా వైఎస్ జగన్ తన కొత్త పరిశ్రమలను కూడా పక్కా బిజినెస్ మోడల్స్‌గా రూపుదిద్దారు. తెలుగు మీడియా ప్రపంచం మొత్తం ‘ఒకవైపే చూడు, రెండోవైపు చూడకు’ అన్నట్టుగా నడిచే రోజులవి. ఈ అసత్య వార్తలకు మరోవైపున ఏముందో చూడాలన్న ఆసక్తి జనంలో ఏర్పడిన సమయం. నాణేనికి మరోవైపు అనే స్ఫూర్తితో వచ్చిన ‘సాక్షి’ సూపర్ హిట్టయ్యింది. అప్పటి నంబర్ వన్ పత్రిక కంటే ఎక్కువ సర్క్యులేషన్‌తో ప్రారంభమయింది. జగన్ మోహన్‌రెడ్డి బిజినెస్ ఆలోచన తప్పుకాదని నిరూపించింది. అదే వరసలో భారతి సిమెంట్స్ పరిశ్రమ కూడా ఘన విజయం సాధించింది. వ్యాపారవేత్తలు లాభాల కోసమే ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడ లాభాలొస్తాయో అంచనా వేసే శక్తి ఆ వ్యాపారవేత్తలకుంటుంది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారెవరూ కోర్టుకెళ్లలేదు. క్విడ్ ప్రోకో ఫిర్యాదు చేయలేదు. అయినా ఇంత గ్రంథం నడిచింది.
స్వాతంత్య్ర సమరయోధుల సొమ్మును కైంకర్యం చేస్తూ ఢిల్లీలో అవినీతికి పాల్పడుతున్న కాలంలోనే ఇక్కడ లేని అవినీతిని శూన్యంలోంచి సృష్టించి, బ్రహ్మరాక్షసిగా చిత్రించిన గారడీ ప్రదర్శన చేయడం వింతల్లోకెల్ల వింత. ఈ వింతకు తానే ఇంధనమై మండించినవారు– చంద్రబాబునాయుడు, ఆయన యెల్లో ముఠా. వాస్తవానికి చంద్రబాబునాయుడి మీద వచ్చి నన్ని ఆరోపణలు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి పైనా రాలేదు. ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ ‘తెహల్కా డాట్‌కామ్’ 2001లోనే చంద్రబాబంతటి అవినీతి రాజకీయవేత్త ఎవరూ లేరని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయవేత్త బాబేనని ‘తెహల్కా’ ప్రకటించింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో వందలాది ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 300 ఎకరాలు, ఒడిషాలో వంద ఎకరాలు, బెంగుళూరు సమీ పంలో 45 ఎకరాలున్నాయని 2001లోనే ‘తెహల్కా’ చెప్పింది.
చంద్రబాబు మీద ఉన్న ఆరోపణలకు రెండు వేల పైచిలుకు పేజీల డాక్యుమెంట్లను సాక్ష్యంగా జతచేస్తూ 2011లోనే వైఎస్ విజయమ్మ 110 పేజీల పిటీషన్‌ను హైకోర్టులో వేశారు. ఏలేరు నుంచి ఎంఐజీ కుంభకోణం దాకా డజన్లకొద్దీ స్కామ్‌లకు ఆధారాలను ఆమె సమర్పించారు. విచారణ ఎందుకు జరగ లేదన్నది వేరే విషయం. ఆయన తొమ్మిదేళ్ల పాలన ఒక ఎత్తయితే దానికి వందరెట్ల ఎత్తు చివరి ఐదేళ్ల పాలన. ఈ కాలంలో దేశంలోనే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. రాజధాని భూసమీకరణ పేరిట లక్ష కోట్ల దందాకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
లింగమనేని గ్రూప్, రామకృష్ణ హౌసింగ్‌లకు చెందిన వెయ్యి ఎకరాలను సమీకరణ నుంచి తప్పించి లబ్ధి పొందారనేందుకు ఆధారాలు వెల్లడయ్యాయి. స్విస్ ఛాలెంజ్ పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారు. హుద్‌హుద్ తుపాన్‌ను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ రోడ్లపై బస్సులో కూర్చు న్నారు. అదే సమయంలో తుపానులో గల్లంతయ్యాయని లక్ష ఎకరాల భూరికార్డులను ట్యాంపర్ చేశారు. విలువ ఎన్ని వేల కోట్లో అంచనా వేయలేము. బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబం కబ్జా చేసిన వెయ్యి కోట్ల భూమిని రాజముద్ర వేసి కట్నంగా సమర్పించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్‌గా మార్చు కున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే వాపోయారు. ఈ ఒక్క ప్రాజెక్టులోనే 20 వేల కోట్లు దండుకున్నారని వార్తలొచ్చాయి. సదావర్తి సత్రం భూముల్లో వెయ్యి కోట్లకు కన్నం వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమవుతుంది.
రెండు అవినీతి తిమింగలాలు కలిసికట్టుగా నడిపిన కథ ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్నే మార్చేసింది. దొంగే... ‘దొంగా దొంగా’ అని అరిచాడన్న సామెతకు ఇంతకంటే మంచి ఉదాహ రణ ఉండదు. తన అవినీతిపై విచారణ గానీ, దర్యాప్తు గానీ జరగకుండా చూసుకోవడంలోనే చంద్రబాబు తెలివితేటలన్నీ ఉన్నాయి. విచారణ జరగకుండానే తాను నిప్పునని చెప్పు కోవడం ఆయన ప్రత్యేకత. అగ్నిపరీక్షకు సిద్ధపడితే కాలిపోతా నని ఆయనకు పక్కాగా తెలుసు. అందుకే విచారణకు సిద్ధ పడరు. కానీ ఎల్లకాలం తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు. సోనియాగాంధీ అధికారిక నివాసమైన టెన్ జన్‌పథ్ అందుకు సాక్ష్యం. అక్కడ ట్రిగ్గర్ నొక్కిన ఫలితంగా తుపాకీ గొట్టాల నుంచి వెలువడిన గంధక ధూమం ఇంకా గాలిలో ఆవరించి ఉన్నది. ఆ పొగలు ఇంకెన్ని కథలు చెబుతాయో!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment