ఫార్టీ ఇయర్స్‌ ఇక్కడ! | Chandrababu Naidu Face Trolling On 23 MLA Seats In Social Media | Sakshi
Sakshi News home page

ఫార్టీ ఇయర్స్‌ ఇక్కడ!

Published Sun, Aug 16 2020 12:33 AM | Last Updated on Sun, Aug 16 2020 4:30 AM

Chandrababu Naidu Face Trolling On 23 MLA Seats In Social Media - Sakshi

తథాస్తు దేవతలుంటారట!
పూర్వకాలం నుంచి మనవాళ్లకు అదొక నమ్మకం. నమ్మకానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండకపోవచ్చు. కానీ, యాదృచ్ఛికంగా సంభవించే కొన్ని పరిణామాలు ఇటువంటి నమ్మకాలకు బలం చేకూర్చుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు కలలు కనేవారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నించారు.  ప్రతిపక్షం తరఫున పనిచేసే వేలాదిమంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించారు. నాయకులనూ వదిలిపెట్టలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు డబ్బు, పదవులను ఎరగా వేసి 23 ఎమ్మెల్యే చేపల్ని, మూడు ఎంపీ చేపల్ని పట్టుకున్నారు. ఆ తదుపరి ఎన్నికల్లో చిత్రంగా తెలుగుదేశం పార్టీకి అన్నే సీట్లు వచ్చాయి. చంద్రబాబు చేసిన పనిని తథాస్తు దేవతలు కనిపెట్టి, ఎన్నికల్లో అవే సీట్లను ప్రసా దించారని కావలసినంత వ్యంగ్య వినోదం సోషల్‌ మీడియాను దున్నేసింది. ఆ నెంబర్లతో ఇప్పటికీ చంద్రబాబునూ, తెలుగు దేశం పార్టీనీ ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు.

గడిచిన రెండు మూడేళ్లుగా రాజకీయ రంగంలో ప్రచారం లోకి వచ్చిన మాట ‘ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్‌ అయిన డైలాగుల్లో ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడా’ అనేది ఒకటి. ‘ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అనే రాజకీయ పదబంధానికి ఈ డైలాగే ప్రేరణ. ఇందుకు అవకాశం కల్పించిన వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు. దేశంలో అందరికంటే సీనియర్‌ రాజకీయవేత్త తానేనని ఆ రోజుల్లో బాబు పదేపదే చెప్పుకునేవారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కంటే ముందుగా తానే ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకోవాలనే దుగ్ధ ఆయనకు బలంగా ఉండేది. కానీ, అలా చెప్పలేకపోయేవారు. సీనియర్‌ మోస్ట్, ఫార్టీ ఇయర్స్‌ అనే మాటలతో సరిపెట్టి అవసరం ఉన్నా లేకపోయినా వాటిని ప్రయోగిస్తూ ఉండేవారు. సహజంగానే సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు దొరికిపోయి ‘ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అనే మాట వ్యాప్తిలోకి వచ్చింది. ‘తథాస్తు’ ఫలమో, యధాలాపమో తెలి యదు కానీ, ఈ ఫార్టీ ఇయర్స్‌ అనే మాట తెలుగుదేశం పార్టీ చరిత్రలో, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కాబోతున్నది. 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షులుగా ఈమధ్యనే సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌ రాష్ట్ర శ్రేణులతో మాట్లా డారు. అప్పుడాయన చేసిన ఒక కామెంట్‌కు అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉన్నదని, భారతీయ జనతా పార్టీ ఆ ఖాళీని పూరించడానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఇదేదో రాజకీయ పార్టీల నేతలు తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చేసే రొటీన్‌ ప్రసంగం వంటిది కాదు. ఒక కచ్చితమైన అంచనాతోనే రామ్‌ మాధవ్‌ ఆ కామెంట్‌ చేశారు. ఔను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఒక క్లియర్‌ వేకెన్సీ. ఈ మాట చెప్పడానికి చాలా సాక్ష్యాలున్నాయి. అందులో మచ్చుకు ఒకటి: ఇండియా టుడే అనే జాతీయ వార్తా చానల్‌ కార్వీ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, ప్రధాని, ముఖ్యమంత్రులపై ప్రజల అభిప్రాయాన్ని ఈ సర్వే మదింపు చేసింది. ఫలితాలను ఈవారమే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా కేవలం 14 నెలల అనుభవం మాత్రమే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు జాతీయ స్థాయిలో మూడో స్థానం లభించింది. మొదటిస్థానం లభించిన ఆదిత్యనాథ్‌ దేశ జనాభాలో 16 శాతం కంటే ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి. పైపెచ్చు ఈ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడు. కేజ్రీవాల్‌ది రెండో స్థానం. ఆయన దేశ రాజధాని ప్రాంతమున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. జాతీయ మీడియాలో ఆయన కనిపించని రోజు దాదాపుగా ఉండదు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తి. ఆరేడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోస్థా నంలో రావడం పెద్దగా విశేషమనిపించలేదు.

దేశ జనాభాలో నాలుగు శాతం మాత్రమే నివసించే రాష్ట్రానికి ఏడాది కాలంగా మాత్రమే నాయకత్వం వహిస్తూ, జాతీయ మీడియాలో ఏనాడూ కనిపించని వైఎస్‌ జగన్‌కు జాతీయ స్థాయి మూడో ర్యాంకు విశేషమే. ఈ సర్వేలో కీలకమైన భాగం ఇది కాదు. వారి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ప్రజలిచ్చిన మార్కులు ప్రధానం. ఇందులో నెంబర్‌ వన్‌ స్థానాన్ని వైఎస్‌ జగన్‌ భారీ తేడాతో దక్కించుకున్నారు. 87 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయన పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎప్పుడైనా విన్నామా ఈ స్థాయి పాపులారిటీ?. గడిచిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను 99 శాతం కచ్చితత్వంతో అంచనా వేసిన ఇండియా టుడే చానల్‌ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగిందని గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉన్నదని నిరూ పించడం కోసం ఈ ఉదాహరణలన్నీ పేర్కొనవలసినంత అవసరం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో, జాతీయ కార్యవర్గాల్లో సభ్యులుగా ఉన్నవారిలో తొంభై శాతం మంది గడిచిన ఏడాదికాలంగా జనజీవన స్రవంతిలో కనిపించలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిటో. పార్టీ‡ అధినేత నేటికి నూటా యాభై రోజులుగా హైదరాబాద్‌లోని స్వగృ హంలో ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఆయన వారసుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు కూడా డిటో. రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు మినహా ఇవాళ ఆంధ్రప్ర దేశ్‌లో ఏ మనిషిని పలకరించి అడిగినా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందనే చెబుతాడు.

ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అనే మాటకూ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ క్షీణ దశకూ, తథాస్తు దేవతలకు మధ్య ఎటువంటి లింకూ లేదు. కానీ, ఆ పార్టీ కథ నాలుగు దశాబ్దాల కథగా మిగిలి పోనున్నదేమో అన్న సందేహం కలుగుతున్నది. 1982 మార్చి 29న ఆ పార్టీ పుట్టింది. మరో ఏడాదిన్నరకు నలభయ్యేళ్లు నిండుతాయి. పార్టీ ప్రస్తుత క్షీణదశ ఇలానే కొనసాగితే అప్పటికీ ఏ స్థితిలో ఉంటుందో చెప్పలేము. ఏ పార్టీ అయినా దుకాణం మూసేసినట్టుగా వెంటనే మూతబడకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ప్రాధాన్యత కోల్పోయి రెండు దశాబ్దాలు దాటింది. అయినా కార్యాలయాలు, కార్యవర్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2014 నాటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమైంది. అయినా, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు, కొందరు అధికార ప్రతినిధులు అప్పుడప్పుడూ వినబడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇంగువ కట్టిన గుడ్డలాగా మరికొంతకాలం వాసన వేస్తుండవచ్చు. కానీ, రాష్ట్ర రాజకీయ యవనికపై దాని క్రియాశీల పాత్ర ఎన్నాళ్లు కొనసాగుతుంద న్నదే ప్రశ్న. క్షేత్రస్థాయి వాస్తవికతను నిశితంగా గమనించే వారి దృష్టిలో ఆ పార్టీ క్రియాశీల పాత్ర నలభయ్యేళ్ల మార్కును దాటకపోవచ్చు. అక్షరాలా ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అన్నమాట. చంద్రబాబు రాజకీయ అరంగేట్రం 1978లో చంద్రగిరి శాసన సభ్యునిగా జరిగింది. 1980లో టంగుటూరి అంజయ్య 60 మందితో జెంబోజెట్‌ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబుకు చోటు దక్కింది. అది చూసి ఎన్టీ రామారావు తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. అప్పుడే చంద్ర బాబు రాష్ట్ర ప్రజల దృష్టిలో పడ్డారు. అలా పడి నలభయ్యేళ్లు కావస్తున్నది. నలభయ్యేళ్ల కింద ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రభ తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన తర్వాత పూర్తిగా కొడిగట్టింది. ఇక ముసురుకొస్తున్న చీకట్లను ఎంతకాలం ఆపగలరో చూడాలి. తెలుగుదేశం పార్టీ భావి సమ్రాట్‌ లోకేశ్‌ బాబు సంగతి? తెలుగుదేశం, చంద్ర బాబుల ఎపిసోడ్‌ల తర్వాత ప్రత్యేకంగా లోకేశ్‌ ఎపిసోడ్‌ ఏముంటుంది? వడ్ల గింజలో బియ్యం గింజ. ఆ బియ్యం గింజకు కూడా మరో రెండేళ్లలో నలభయ్యేళ్లు నిండుతాయి. ఆయన రాజకీయాల్లో ఉంటారా? వ్యాపారాలు చేసుకుంటారా అనేది అప్పటికి తేలిపోవచ్చు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్న ఆయుక్షీణత లక్షణాలకు కారణాలు ఏమిటి? ఎన్టీఆర్‌ నిష్క్రమణ తర్వాత ఎన్నడూ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేంత బలమైన పార్టీగా తెలుగుదేశం లేదు. చంద్రబాబు జమానా అంతా మీడియా సహకారం, ఎత్తులు – పొత్తులతోనే నెట్టుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చివరి ఐదేళ్ల పాలన చంద్రబాబు నాయ కత్వ వైఫల్యాన్ని స్వార్థపూరిత ఆలోచనా ధోరణిని, దోపిడీ ఎజెం డాను ఎత్తిచూపింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది. వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనతో సహజంగానే చంద్రబాబు పరి పాలనను పోల్చి చూసుకుంటారు. ఈ పోలిక ఫలితంగా చంద్రబాబు నాయుడి ప్రతిష్ట, తెలుగుదేశం పలుకుబడి పూర్తిగా చతికిలబడింది. ఇద్దరు నాయకులను పోల్చి చూడవలసి వచ్చినప్పుడు జనం ప్రధానంగా మూడు అంశాలపై బేరీజు వేస్తారు. 1. విశ్వసనీయత, 2. సమర్థ నాయకత్వం, 3. దూరదృష్టి. ఈ మూడు అంశాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందు విపక్ష నేత చంద్రబాబు ఏమాత్రం నిలబడలేరు. రాజకీయ రంగంలో మొగ్గతొడిగిన తొలిరోజుల్లోనే పెను విషాదాన్ని గుండెలో దాచు కుని ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఢిల్లీ సింహాసనాన్ని సైతం ధిక్కరించి కోరి కష్టాలను కౌగిలించుకున్న వ్యక్తిత్వం జగన్‌ది. విశ్వసనీయత అనే మాటకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆయన. సొంత కూతురునిచ్చి వివాహం చేసి, చేరదీసి ప్రభు త్వంలో భాగస్వామిని చేసిన∙మామగారిని అధికార దాహంతో వెన్నుపోటు పొడిచిన వంచన కథ చంద్రబాబుది. నమ్మక ద్రోహానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన.

సంక్షోభాలను దృఢచిత్తంతో ఎదుర్కోగలగడం సమర్థ నాయకత్వ లక్షణానికి గీటురాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే కరోనా పెనుసంక్షోభం చుట్టుముట్టినప్పటికీ ఏమాత్రం తొట్రుపాటు లేకుండా కనబరిచిన పాలనా దక్షత దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులను వైఎస్‌ జగన్‌కు సంపాదించిపెట్టింది. తొలిరోజుల్లోనే కరోనాకు భయపడొద్దనీ, ధైర్యంతో ఎదుర్కుందామనీ, దానితో సహజీవనం చేయడానికి అలవాటుపడాలనీ ప్రజలను సమాయత్తం చేసి దేశంలోనే టార్చ్‌ బేరర్‌గా నిలబడిన తీరును చంద్రబాబు పబ్లిసిటీ చిట్కాలతో జనం పోల్చి చూసుకున్నారు. పెద్దఎత్తున నిర్ధారణ పరీక్షలు నిర్వ హించడం ద్వారా పాజిటివ్‌ కేసులను ఐసోలేట్‌ చేస్తూపోవడమే సరైన మార్గమని ఇప్పుడు అనేకమంది నిపుణులు చెబుతు న్నారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా వెరవ కుండా నమ్మిన బాటలోనే పయనించడానికి గుండెదిటవు కావాలి. ముళ్లున్నా, రాళ్లున్నా గమ్యం చేర్చే మార్గంలోనే నడిచే వాడు నడిపించేవాడే నాయకుడు. వైఎస్‌ జగన్‌లోని ఆ నాయ కత్వ లక్షణం ఇప్పుడు దేశానికి వెల్లడైంది. ప్రత్యేక హోదా అడి గితే కేంద్రానికి ఎక్కడ కోపం వస్తుందోనని జడుసుకొని ముఖ్య మంత్రి హోదాలో మనకు ప్యాకేజీ చాలని చెప్పుకొచ్చిన బేల తనం ఎక్కడ? ఎగురుతున్న జాతీయ జెండా ఎదుట నిలబడి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ పదేపదే అడుగుతూనే ఉంటామని బహిరంగంగా కుండబద్దలు కొట్టిన ధీరత్వం ఎక్కడ?

నాయకునికి ఉండవలసిన దూరదృష్టి లేదా విజన్‌ విష యంలోనూ ఇద్దరి మధ్యనా హస్తిమశకాంతరం కనబడు తున్నది. చంద్రబాబుది గ్రాఫిక్‌ విజన్‌. చివరి ఐదేళ్ల పాలన ఇదే నిరూపించింది. జగన్‌ది గ్రాస్‌రూట్స్‌ విజన్‌. ఒక్క ఏడాది పాలనే ఈ సంగతిని చాటిచెప్పింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఒక మునిగిపోతున్న పడవ. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా వుంది. వాంటెడ్‌ అపోజిషన్‌/

muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement