తోడేళ్ల సత్యాగ్రహం!! | Vardelli Murali Article On Concept Of 3 Capitals For AP | Sakshi
Sakshi News home page

తోడేళ్ల సత్యాగ్రహం!!

Published Sun, Dec 29 2019 2:11 AM | Last Updated on Sun, Dec 29 2019 7:33 AM

Vardelli Murali Article On Concept Of 3 Capitals For AP - Sakshi

‘ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధయితే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అని చలం చేసిన వ్యాఖ్యానం తెలుగు సాహిత్యంలో ఒక నానుడిగా నిలిచిపోయింది. సరిగ్గా ఇటువంటి సందర్భమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయా లను కుదిపేస్తున్నది. అభివృద్ధి వికేంద్రీకరణకు తోడుగా పాలనా వికేంద్రీకరణ కూడా అవసరమన్న ఆలోచనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించగానే ‘కొంతమంది’కి కాళ్లకింద భూమి కదిలి నట్టు అనిపించడం మొదలైంది. 

ఇలా కదులుతున్న భూమి సుమారు నాలుగున్నరవేల ఎకరాలని ఇప్పటి దాకా తేలింది. గట్టిగా విచారణ జరిగితే ఈ భూమి పరిమాణం మరికొంచెం పెరగొచ్చు. అయితే ఈ ‘కొంత మంది’ చేస్తున్న ప్రచారం భిన్నంగా ఉంది. నాలుగువేల ఎకరాలూ, ముప్ఫయ్‌ నాలుగువేల ఎకరాలూ కాదు, ఈ భూకంపం ధాటికి యావదాంధ్రదేశం కంపిస్తున్నది. ఇంకా చెప్పాలంటే భారతదేశమే కదిలిపోతున్నదని చెప్పడానికీ, చెప్పించడానికీ ఈ పది రోజుల్లో చేయని ప్రయత్నం లేదు. విసరని రాయి లేదు.

ముందుగా కులం కార్డును ప్రయోగించారు. అమరావతి చుట్టుపట్ల ప్రాంతాల్లో బలంగా వున్న సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కులం మీద కక్షతో వ్యవహరిస్తున్నారనీ, ఒక సామాజికవర్గమంతా ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితిని సృష్టించారని ఆక్రోశం వెళ్ల గక్కారు. కానీ, పెద్దగా స్పందన కనబడలేదు. రాజధా నికి భూములిచ్చిన ఆ 29 గ్రామాల్లోని కొంతమంది రైతులు ధర్నాలకు కూర్చోవడం మినహా పక్కనే వున్న విజయవాడలోగానీ, గుంటూరులోగానీ ప్రజలెవరూ వీధుల్లోకి రాలేదు. 

సీఎం ఆలోచనను తప్పుపట్టనూ లేదు. దీంతో కంగుతిన్న సదరు ‘కొంతమంది’ మరికొన్ని మాయాపాచికలను ప్రయోగించడం మొదలుపెట్టారు. రాష్ట్రంపై అవగాహన లేని ఢిల్లీ ‘మేధావులను’, కొన్ని అద్దె మైకులను రంగంలోకి దించారు. అసలు ఈ ‘కొంత మంది’ ముఠా ఏమిటో ఆ ముఠాకూ కులం కార్డుకూ ఉన్న సంబంధం ఏమిటో ముందుగా పరిశీలిద్దాం.

కృష్ణా డెల్టా చుట్టూ ఆవరించి వున్న ప్రస్తుత కృష్ణా, గుంటూరు జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భాగాన్ని కలిపి పూర్వం కమ్మనాడుగా పిలిచేవారు. ఇక్ష్వా కుల కాలం నాటికే ఈ పేరు వ్యాప్తిలోకి వచ్చిందని చరిత్ర చెబుతున్నది. ఈ రెండున్నర జిల్లాల పరిధిలో నివసించిన వారందరినీ కమ్మవారుగా పిలిచేవారనీ, వారే కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల్లో సైనికు లుగా, సేనాపతులుగా పనిచేసి దక్షిణదేశమంతటా విస్త రించి కమ్మకులం వారుగా స్థిరపడ్డారనే వాదన వుంది. 

ఓరుగల్లు కేంద్రంగా ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని పరి పాలించిన ముసునూరి కాపయనాయకుడి కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేసిన కాలం వరకు, సుమారు ఆరు శతాబ్దాలపాటు అందుబాటులో ఉన్న కమ్మవారి చరిత్ర ప్రగతిశీలమైన ప్రస్థానంగానే పరిగణించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూత్రాన్ని నమ్ముకొని ఎదిగారు. శ్రమ, తెలివితేటలు పెట్టుబడులుగా అన్ని జీవన రంగా లకు క్రమంగా విస్తరించారు. జాతీయోద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమాల్లో వీరి పాత్ర గణనీయంగానే ఉన్నది. 

ముఖ్యంగా హేతువాద ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమాలకు వెన్నెముకలుగా వీరు నిలిచారు. ఈ రెండు ఉద్యమాల ప్రభావం వీరిపై బలంగా ఉన్నందువలన మెజారిటీ కమ్మవారు అభ్యుదయ వాదులుగా, సామా జిక మార్పులను స్వాగతించేవారుగా స్థిరపడినారు. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి సంస్కర్తలు, చండ్ర, మాకినేని, మోటూరి, వేములపల్లి వంటి ఆదర్శ కమ్యూనిస్టులు ఎన్జీరంగా వంటి జాతీయ నాయకులు, వెల గపూడి, ముళ్లపూడి, కెఎల్‌ఎన్‌ ప్రసాద్‌ తదితర పారి శ్రామిక కుటుంబాలు, ఎన్టీఆర్, అక్కినేని వంటి నటశిఖ  రాలు, నార్ల, ఏబీకే తదితర పాత్రికేయ దిగ్గజాలు వారి    వారి రంగాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

ఎన్టీఆర్‌ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎనభయ్యో దశకం చివరి రోజుల నుంచి పరిస్థితులు మారడం ప్రారంభమైంది. చంద్రబాబు జమానా మొదలైన దగ్గర నుంచి ఈ మార్పులు వేగం పుంజుకొని తెలుగుదేశం పార్టీలో, కమ్మవారిలో నడమంత్రపు శ్రీమంతుల ప్రాబల్యం పెరిగింది. స్వయానా చంద్రబాబు నాయకత్వంలోనే, రాజకీయవేత్తలు, మీడియా ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, విద్యావ్యాపారవేత్తలు, వైద్యవ్యాపారవే త్తలు, కొందరు సినీరంగం వారితో కూడిన ఒక అన ధికార సిండికేట్‌ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. 

ఈ సిండి కేట్‌ ముఠాలో కోర్‌ గ్రూప్‌గా కమ్మవారే ఉన్నప్పటికీ, కొంతమంది ఇతరులకు కూడా ప్రవేశం లభించింది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే తొలి నాటి ఆదర్శం స్థానంలో ఎలాగైనా సంపాదించు అనే కొత్త సూత్రం తెరపైకి వచ్చింది. డబ్బుతో దేన్నయినా కొనవచ్చు అనేది ఈ ముఠా మౌలిక సిద్ధాంతం వీరికి పెత్తనం లభించిన దగ్గరనుంచే ఓట్లను కొనుగోలు చేయడం, ప్రజాస్వామిక వ్యవస్థలను దిగజార్చడం, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించడం తెలుగునాట ప్రారంభ మైంది. ఈ నయాధోరణి మిగిలిన నాయకులు, కార్య కర్తల శ్రేణుల్లోకి ప్రవేశించింది. అభ్యుదయ భావాల స్థానంలో వారి మెదళ్లలో ఆధిపత్య భావజాలం ప్రవేశిం చింది. 

ఒంటినిండా అహంభావం రుద్దుకున్నారు. రెండు న్నర జిల్లాల ఆధిపత్య ధోరణులకు నిరసనగానే తొంభయ్యో దశకంలో తెలంగాణ ఉద్యమం ప్రారం భమైన యథార్థాన్ని ఇక్కడ గుర్తుతెచ్చుకోవాలి. రెండు న్నర జిల్లాల పట్ల వ్యతిరేకత క్రమంగా ఆంధ్ర వ్యతిరేక తగా మారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైంది. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ఆధిపత్యపు ఆగడాలు మరీ శృతిమిం చినట్టు మొన్నటి ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కమ్మనాడుగా భావించే రెండున్నర జిల్లాల్లోని 40 అసెంబ్లీ సీట్లలో చచ్చీచెడి నాలుగు సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. 

నడమంత్రపు సిరి ముఠా కారణంగానే మిగతా సామాజిక వర్గాల నుంచి తాము వేరుపడిపోతు న్నామన్న గ్రహింపు ఎన్నికల తర్వాత సాధారణ కమ్మ వారిలో వచ్చిందని చెబుతున్నారు. అందుకనే ‘కొంతమంది’ ముఠా సభ్యులు చేసిన ‘భూకంప’ బాధిత ఆక్రందనను వారు పట్టించుకోలే దని, కులం కార్డు ఫలితమివ్వక పోవడంతో ఈ ముఠా ఇతర ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు.

తాజాగా శేఖర్‌గుప్తా అనే ఒక సీనియర్‌ ఇంగ్లీష్‌ పాత్రికేయుని వీడియో స్టోరీని ప్రచారంలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు శేఖర్‌ గుప్తా అవగాహనా రాహిత్యాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. తూర్పుతీరంలో ఒక మహానగరం అవసరం అంటాడు. ఇప్పటికే అక్కడ అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నాన్ని విస్మరించి గ్రీన్‌ఫీల్డ్‌ నగరం కావాలంటాడు. చండీగఢ్‌ తర్వాత మరో గ్రీన్‌ఫీల్డ్‌ నగరం రాలేదని వాపోతాడు. దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్‌ రెండు ముక్కలై పెద్దముక్క పాకిస్తాన్‌లోకి వెళ్లింది. దాంతోపాటు లాహోర్‌ మహానగరం కూడా పాకిస్తాన్‌కు వెళ్లింది. 

ఇండియాలో మిగిలిన పంజాబ్‌ రాజధాని అవసరాలను తీర్చడానికి 1952లో చండీగఢ్‌ను నిర్మించారు. లాహోర్‌ లేని లోటును చండీగఢ్‌ తీర్చగలిగిందా? ఉమ్మడి పంజా బ్‌లో (ప్రస్తుత హర్యానా) జన్మించిన శేఖర్‌ గుప్తా పుర్రెలో ఈ ప్రశ్న మొలకెత్తలేదా? మరో వందేళ్లకు కూడా లాహోర్‌ వంటి మహానగరంగా చండీగఢ్‌ తయారు కాలేదు. లాహోర్‌ను పక్కనబెడదాం. పంజాబ్‌ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చే ప్రజలకు పంజాబ్‌లోని లూథియానా నగరం కల్పించగలిగినంత ఉపాధి అవకా శాలను కూడా కల్పించలేని స్థితిలో చండీగఢ్‌ వున్నది. అటువంటప్పుడు మన గ్రీన్‌ఫీల్డ్‌ అమరావతి ఎన్ని వందల యేళ్లకు మహా నగరం అవుతుంది? 

మూడు రాజధానుల ప్రకటన చూస్తుంటే ‘తుగ్లక్‌ డబుల్‌ కెఫీన్‌తో 20 కప్పుల కాఫీ తాగి తీసుకున్న నిర్ణయంలా’ ఉందని అక్కసుతో కూడిన వ్యాఖ్యానం చేశాడు. ఇటువంటి వాక్యాలు రాయాలంటే నాలుగు పెగ్గులైనా వేసి ఉండాలి, లేదా ఎవరైనా రాసిచ్చినదైనా చదివి ఉండాలి. ఇటువంటి ప్రీ ఫ్యాబ్రి కేటెడ్‌ రచనలు ఇకముందు మరిన్ని వెల్లువెత్తవచ్చు. ప్రజల వివేకం మీద మన నడమంత్రపు సిరి ముఠాకు చిన్నచూపు కనుక ఇటు వంటి ప్రయత్నాలను కొన సాగిస్తూనే వుంటారు.

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న ప్రచారం నిజానికి వాస్తవ దూరం. శాసనసభ అక్కడే వుంటుంది. దాని సిబ్బంది అక్కడే ఉంటుంది. మంత్రులూ, ఎమ్మెల్యే క్వార్టర్లు అక్కడే వుంటాయి. హైకోర్టు కర్నూలుకు వెళుతుంది. సెక్రటేరియట్, ముఖ్య మంత్రి కార్యాలయం విశాఖ వెళ్తాయి. అంటే అమరా వతి గ్రాండ్‌ డిజైన్‌లోంచి ఐదారువేల మంది పనిచేసే వ్యవస్థలను మాత్రమే ఇప్పుడు తగ్గించారు. ఆ వ్యవస్థ లకు బదులుగా మెడికల్, ఎడ్యుకేషనల్‌ హబ్‌లను అమ రావతికి కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. 

శుక్ర వారం నాడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రాధ మ్యాలపై కీలకమైన చర్చ జరిగినట్టు తెలిసింది. మానవ వనరుల అభివృద్ధిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే సంకల్పించింది. నాడు – నేడు కార్యక్రమం పేరుతో పాఠశాలలు, వైద్యశాలల అభి వృద్ధికి 26 వేల కోట్లు ఖర్చు చేయవలసి వుంది. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే కార్యక్రమానికి 60 వేల కోట్లు ఖర్చు చేయవలసి వుంటుంది. వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజె క్టులు పూర్తికావడానికి మరో 25 వేల కోట్లు కావాలి. రైతు భరోసా, అమ్మ ఒడి, సామాజిక పెన్షన్లు, తాగునీటి సర ఫరా గ్రిడ్‌ మొదలైన పథకాలకు భారీగా నిధులు అవస రమవుతాయి. 

ఈ నేపథ్యంలో ఒక్క రాజధాని నగరం మీద ఎకాఎకిన ఒక లక్షా పదివేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అసాధ్యం. బాబు తొలి ఐదేళ్లలో ఖర్చు పెట్టినట్టు కేవలం ఐదారువేల కోట్లను మాత్రమే మరో ఐదేళ్లలో ఖర్చుచేసే వెసులుబాటు వుంటుంది. ఈ లెక్కన వందేళ్లకుగానీ అమరావతికి ఒక రూపం ఏర్పడదు. అదే పదివేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ నగరం మౌలిక వస తులు భారీగా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇంగి తంతో కూడిన నిర్ణయం తీసుకోకపోతే మన పరిస్థితి ‘న ఘర్‌కా.. న ఘాట్‌కా’ చందంగా తయారవుతుందని సమావేశంలో సీఎం కామెంట్‌ చేసినట్టు సమాచారం.

జిఎన్‌ రావు కమిటీ నివేదికలో సూచించినట్టుగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించినట్లయితే, ముఖ్యమంత్రి పీఠం అక్కడే వుంటే, ఆయనే స్వయంగా నగర అభివృద్ధిని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాలకు, ఇండో–చైనా దేశాలకు, దూర ప్రాచ్య దేశాలకు భారతీయ గేట్‌వేగా ఉండగల లొకేషన్, నగరం తలాపున దేశంలో ఏ నగరానికి అందు బాటులో లేనన్ని ఖనిజ నిక్షేపాలు ఉన్న కారణంగా రానున్న ఐదు పదేళ్లలోనే ఆంధ్రరాష్ట్ర గ్రోత్‌ ఇంజన్‌గా నిలబడగల అర్హతను సాధించి, ఆ తర్వాతి కాలంలో దేశంలోని అగ్రశ్రేణి నగరాల సరసన చేరగల అన్ని అర్హతలూ విశాఖ నగరానికి ఉన్నాయి.
-వర్ధెల్లి మురళి

muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement