
తీరు మారకుండా పేరు మారితే చేసిన పాపం కడుక్కుపోతుందా? ఇది సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్‌బుక్’కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న! సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో దాని అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. కానీ, ఆయన కొత్త అవతారంతో వస్తూ.. పాత విమర్శల్ని పాతరేయ చూస్తున్నారు. గుర్రుగా తనవైపు నిఘా కళ్లతో చూస్తున్న అంతర్జాతీయ సమాజం దృష్టిని ఏమార్చాలనుకుంటున్నారు. మనుషుల్ని సామాజికంగా కలుపుతూ అద్భుతాలు సృష్టించే ఓ మహత్తర వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫేస్‌బుక్ నేతృత్వంలో ఇప్పుడున్న ‘ఫేస్‌బుక్’ ‘వాట్సాప్’ ‘ఇన్‌స్టగ్రామ్’ వేదికలు, ఆ పేర్లతోనే ప్రస్తుతం ‘మెటా వర్స్’గా పేరుమార్చుకునే మాతృసంస్థ ఛత్రఛాయలో డిసెంబరు 1 నుంచి పనిచేస్తాయి.
నేటి యువతరం భవిష్యత్ ఆశలు, అంచనాల్ని పరిగణనలోకి తీసుకొని నిజమనిపించే కృత్రిమ ప్రపంచం సృష్టి ఆ ప్రకటన సారం! యువతకు ఉద్యోగ అవకాశాల ఆశ చూపిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులో పదివేల మంది ఇంజనీర్లు ఒక్క ఐరోపాలోనే పనిచేస్తారని చెప్పారు. సరే, అంతమంది సాంకేతిక నిపుణుల్ని వాడుకుంటూ, వివాదస్పదమౌతున్న తన ప్రస్తుత వేదికల్లోని ‘విషయాన్ని’ ముందు సంస్కరించు కొని, అటుపై కొత్త వేదిక కడితే బాగుంటుందని సామాజిక వేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలంటు న్నారు.
పలు దేశాల స్థానిక భాషలకు చెందిన నిపుణులు వారి వేదికల్లో లేక, నిర్వహణ–నియంత్రణ లోపించి అవాంఛనీయ సమాచారం జనబాహుళ్యంలోకి విచ్ఛలవిడిగా వస్తోందనేది! ఇదంతా బహి రంగ రహస్యమవడంతోనే అమెరికాలో ఆదరణ తగ్గిందని, దాంతో ఇతర ప్రాంతాలకు విస్తరించే పథకాల్ని యాజమాన్యం రచించి, అమలుచేస్తోందనేది ఘాటైన విమర్శ. స్వీయ లాభార్జనకే పెద్ద పీటవేస్తూ, సమాజంలోకి తప్పుడు సమాచారం వరదలై పారుతున్నా, ద్వేష భావాల్ని రేపే విష యాలు పరివ్యాప్తమౌతున్నా... ఫేస్‌బుక్ యాజమాన్యం ఉపేక్షించడాన్ని యావత్ ప్రపంచం తప్పు బడుతోంది. ఇవి యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరుగుతున్నవి కావని..తెలిసి నిర్వాహ కులు కళ్లు మూసుకుంటే, కొన్నిమార్లు పనిగట్టుకొని ‘నిర్వహిస్తే’ జరుగుతున్న అనర్థాలని బయటకు వెల్లడైన ఫేస్‌బుక్ అంతర్గత పత్రాలే చెబుతున్నాయి.
ప్రపంచమే నివ్వెరపోయింది! తమ వేదికల నుంచి వచ్చే ‘విషయం’ ముఖ్యంగా పిల్లలు, కౌమారంలోని వారిపై విపరీత దుష్పభావం చూపు తోందని తెలిసినా ఫేస్‌బుక్ నిర్వహకులు పట్టించుకోకపోవడాన్ని విశ్వ సమాజం తప్పుబడుతోంది. ఆయా వేదికల నిర్వహణ, వాటి నుంచి వస్తున్న సమాచారం, దాని ప్రభావాలపై నిరంతర నిఘా ఉండాలని, తనిఖీలు జరగాలని, స్థానిక చట్టాల్ని ఉల్లంఘించినపుడు తగు చర్యలుండాలని ప్రపంచం నలువైపులా ఒత్తిళ్లు పెరిగాయి.
ఈ సంక్షోభ సమయంలోనే జుకెర్‌బర్గ్ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. నిజమనిపించే కృత్రిమ ప్రపంచాన్ని, ఇప్పుడున్నట్టు తెరపైన చూడటం కాకుండా... ఇకపై ఎవరికి వారు నేరుగా అందులోకి ప్రవేశించి–పాల్గొనే వ్యవస్థను తాజా మెటావర్స్ కింద ఆవిష్కరించనున్నారు. రియాలిటీ హెడ్ సెట్స్, రియాలిటీ కళ్లజోళ్లు, స్మార్ట్‌ఫోన్లు, ఆప్‌లు... ఇలా పలు సాంకేతిక ప్రక్రియల్ని సమీకృతం చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మెటావర్స్ అంటే, ఫేస్‌బుక్ ట్వీట్ ప్రకారం... ‘ఇప్పుడు సాధ్యమయ్యే దానికి మించి, సామాజిక సంబంధాల నూతన శకం.
ప్రపంచ ప్రజలే ఉమ్మడిగా ఏర్పరచుకొని, ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనగలిగే ప్రాజెక్టు. కృత్రిమంగానే అయినా పరస్పరం కలుసుకోవడం, నేర్చుకోవడం, కంటెంట్‌ను ఉత్పత్తి చేయడం, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని సృష్టించుకోవడం, ఆడుకోవడం... వంటివన్నీ ఇక్కడ సాధ్యమవుతాయి’. రానున్న దశాబ్ద కాలంలోనే వందకోట్ల మందికి మెటావర్స్ చేరువవుతుందనే విశ్వాసాన్ని జుకెర్‌బర్గ్ వ్యక్తం చేస్తున్నారు.
‘సామాజిక మాధ్యమ వేదికగానే మాకు పేరున్నా, నిజానికి మనుషుల్ని సామాజికంగా కలిపే అత్యున్నత సాంకే తికతను అందించే గుణం మా డీఎన్‌ఏలోనే ఉంది’ అని ఆయన సగర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, సామాజిక కార్యకర్తలడిగే పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలివ్వాల్సి ఉంటుంది. బాధ్య తతో, పారదర్శకంగా ఇచ్చే సమాధానాన్ని బట్టే, ప్రపంచం మెటావర్స్‌ని చూస్తుంది.
వాస్తవాలు అంగీకరించడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఫేస్‌బుక్ ముందుకు రావాలి. ఈ వివాదాస్పద వేదికల నుంచి జరిగే తప్పిదాలన్నీ ఉద్దేశపూర్వకం అనడానికి లేదు. కొన్నిసార్లు కృత్రిమ మేథా సాంకేతికతను వాడే క్రమంలో, ఆల్గోరిథమ్స్‌ని సమగ్రంగా వాడకపోవడం, వాడిన పుడు అవీ, స్థానిక భాషాపదాల్ని, పదబంధాల్ని సరైన అర్థంలో, అన్వయంలో గుర్తించకపోవడం వంటివి తప్పిదాలకు కారణమవుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో మతపరమైన సున్నితాంశాల్లో చిక్కులొచ్చాయి. ఫేస్‌బుక్ వేదికని వాడి, పనిమనుషుల విక్రయాలు–రవాణా జరగటం విమర్శలకు కారణమైంది.
భారత్‌లోనూ ఫేస్‌బుక్ వేదిక నుంచి వచ్చే సమాచారంతో మతపరంగా, రాజకీ యంగా సమస్యలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో నిర్వాహకుల ‘చేతివాటం’ కూడా ఉన్నట్టు వెల్లడైన అంతర్గత పత్రాల్లో తేలింది. లోగడ ఫేస్‌బుక్‌లో పనిచేసి, ప్రజావేగుగా మారిన ఫ్రాన్సెస్ హెగెన్ కథనం, జర్మనీ వేదికగా పనిచేసిన పరిశోధనా సంస్థ చేసిన వెల్లడి ప్రకారం... ఫేస్‌బుక్ చేతులు స్వచ్ఛంగా లేవు. తీరు మారకుండా పేరు మాత్రమే మారితే, కొత్త ప్రాజెక్టులోనూ పాత సమస్య పునరావృతం ఖాయం! ఈ సత్యాన్ని జుకెర్‌బర్గ్ ఎంత వేగంగా గ్రహిస్తే అంత మంచిది!