వరసగా రెండోసారి సైతం మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షాలకు అందలం దక్కడం ఖాయమని ఫలితాలు చెబుతున్నా విజేతలైనవారికి పూర్తి సంతృప్తి మిగల్చకుండా ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమికి సులభంగానే అధికారం దక్కే అవకాశం ఉన్నా, దాని మెజారిటీ గతంతో పోలిస్తే తగ్గింది. హరియాణాలో బీజేపీ ఏకైక మెజారిటీ పక్షంగా మాత్రమే అవతరించింది. అక్కడ పది సీట్లు గెలిచిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల మద్దతు పొందడం దానికి తప్పనిసరి. అక్కడే తామే సర్కారు ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోయిన బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల ఫలితాలూ కాస్త నిరాశ కలిగించకమానవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే గెలుపెవరిదో చాలామంది సులభంగా అంచనా వేశారు. ఎందు కంటే విపక్షం పెద్దగా ప్రతిఘటించని ఎన్నికలివి. ఎప్పటిలాగే మీడియా కూడా ప్రజలనాడి పట్టుకోవ డంలో పెద్దగా సఫలం కాలేకపోయిందని ఫలితాలు చాటుతున్నాయి.
మహారాష్ట్రలో గడిచిన అయి దేళ్లూ కూటమిలో జూనియర్ భాగస్వామిగా కొనసాగిన శివసేనను ఈసారి బీజేపీ పట్టించుకోక తప్పనిస్థితి ఏర్పడింది. అధికారం పంచుకోవడం ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ ప్రాతిపదికనే ఉంటుందని శివసేన చీఫ్ ఉధవ్ ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడం లేదా మంత్రి పదవుల్ని చెరిసగం తీసుకోవడం తప్పనిసరన్నది ఆయన ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ సారాంశం. ఈ ఫలితాలు బీజేపీ కళ్లు తెరిపించగలవని నమ్ముతున్నట్టు ఠాక్రే చేసిన వ్యాఖ్య రానున్నకాలంలో రెండు పార్టీల మధ్యా ఎటువంటి సంబంధాలుంటాయో తేటతెల్లం చేస్తోంది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వ పటిమను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో తమ కూటమి ఎటూ విజయదుందుభి మోగించబోవడం లేదని తెలిసినా ఆయన పోరాటాన్ని ఆప లేదు. 78 ఏళ్ల వయసులో ఆయన రాష్ట్రాన్నంతా చుట్టుముట్టారు. అనేక బహిరంగసభల్లో మాట్లా డారు. కనుకనే కాంగ్రెస్‌కు జూనియర్ భాగస్వామిగా ఉన్న పార్టీని పెద్ద పార్టీగా మార్చారు. ఈ ఎన్ని కల్లో అది అది 50కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ 40 దరిదాపుల్లో సర్దుకోక తప్పని స్థితిలో పడింది. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడ్డ శివాజీ వంశస్తుణ్ణి ఓడించి ఎన్‌సీపీ సత్తా చాటడం ఆ పార్టీ పనితీరుకు నిదర్శనం.
క్రితం సారి అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి. 2014 అక్టోబర్‌లో జరిగిన ఆ ఎన్నికలు కాంగ్రెస్ మూలాల్ని పెకలించివేశాయి. అంతక్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారోద్యమ సారథిగా ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ సాగించిన ప్రచారోద్యమం తాలుకు ప్రకంపనలు ఆ అసెంబ్లీ ఎన్నికలనాటికీ కొనసాగి మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్‌సీపీ కూటమిని కకావికలు చేసింది. వరసగా రెండు దశాబ్దాలపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఆ కూటమి మోదీ ప్రచారధాటికి కుప్ప కూలింది. హరియాణా కథ కూడా అదే. అక్కడ వరసగా దశాబ్దంపాటు ఏలి మూడోసారి కూడా తనదే విజయమని కలలుగంటున్న కాంగ్రెస్‌ను బీజేపీ ఖంగుతినిపించింది. కానీ అయిదేళ్లు గడిచే సరికి పరిస్థితి అంత ఏకపక్షంగా ఏం లేదని తేటతెల్లమైంది.
ఎన్నికలు ముంగిట్లోకొచ్చేసరికి కాంగ్రెస్ కళాకాంతులు కోల్పోయింది. మహారాష్ట్రలో దిగ్గజ నేతలనుకున్నవారు కాషాయ దారి పట్టగా పార్టీలో మిగిలినవారు అనాథలను తలపించారు. పరస్పర కలహాల్లో మునిగితేలారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసలు ప్రచారం జోలికే రాకపోగా, ఆమె కుమారుడు రాహుల్ మొక్కుబడిగా బహిరంగసభలు నిర్వహించారు. మహారాష్ట్ర, హరియా ణాల్లో మొత్తంగా ఆయన ఏడు సభలకు మించి పాల్గొన్నదిలేదు. అందుకు భిన్నంగా మోదీ రెండు రాష్ట్రాల్లోనూ 25 ప్రచారసభల్లో ప్రసంగించారు. ఈ ఎన్నికల ప్రచారంలో 370 అధికరణ రద్దు మోత మోగింది. దానికితోడు సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అభివృద్ధి చర్యలు బీజేపీకి ధీమా ఇచ్చాయి. పైనుంచి కిందివరకూ ఆ పార్టీలో అందరూ ఏకోన్ము ఖంగా పనిచేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం పుంజుకోవడంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌నుంచి వలస పోయాయి. ఆ పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణం అదే. హరియాణా విషయానికొస్తే అక్కడ బీజేపీకి దాదాపు ఎదురులేదన్నంత స్థాయిలో ప్రచారం సాగింది. విపక్ష కాంగ్రెస్ అంతఃకలహాల్లో మునిగి తేలింది. ఒకే ఒక బహిరంగసభలో సోనియా ప్రసంగిస్తారని ప్రకటించినా చివరి నిమిషంలో అది కాస్తా రద్దయింది.
హరియాణాలో రెండుసార్లు సీఎంగా పనిచేసి, పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టగల సత్తా ఉన్న భూపిందర్ సింగ్ హూడాకు కాంగ్రెస్‌లో అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. రాహుల్ ఏలుబడిలో అశోక్ తన్వార్‌కు ప్రాధాన్యం పెరిగింది. సోనియా తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సరికి హరియాణా కాంగ్రెస్ రెండు పక్షాలుగా చీలిపోయింది. గత నెలలో తన్వార్‌ను తప్పించి కేంద్ర మాజీ మంత్రి కుమారి షెల్జాకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలప్పగించి, హూడాను ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు. అంతవరకూ అలిగి కూర్చుని వేరే తోవ చూసు కుంటానన్న హూడా మళ్లీ చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో 30 స్థానాలు దాటుతున్నాయంటే అది ఆయన ఘనతే. ఉప ఎన్నికలు జరిగిన 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెల్చుకుని అగ్రభాగంలో ఉన్నా విపక్షాలు చెప్పుకోదగ్గ విజయాలే సాధించాయి. యూపీలో తిరిగి సమాజ్‌వాదీ పార్టీ పుంజుకున్న ఆనవాళ్లు కనబడ్డాయి. బిహార్‌లో జేడీ(యూ) చిన్నబోయింది. అక్కడ నాలుగు ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కింది ఒక్కటే. ఆర్జేడీకి రెండు లభించాయి. ఎంఐఎం సైతం ఒక సీటు గెల్చుకోవడం విశేషం. మొత్తానికి అధికార పక్షాలు పూర్తి భరోసాతో ఉండటానికి వీల్లే దని ఈ ఎన్నికల ఫలితాలద్వారా దేశవ్యాప్తంగా ఓటర్లు తేటతెల్లం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment