జవాబుదారీతనం ఏదీ? | Criminal Procedure Identification Bill 2022 Editorial Vardelli Murali | Sakshi
Sakshi News home page

జవాబుదారీతనం ఏదీ?

Published Fri, Apr 1 2022 12:47 AM | Last Updated on Fri, Apr 1 2022 12:47 AM

Criminal Procedure Identification Bill 2022 Editorial Vardelli Murali - Sakshi

ఫైల్‌ ఫొటో

నేరగాళ్లను సత్వరం పట్టుకునేందుకు, నేరాలను సమర్థంగా అరికడుతుందని చెబుతూ మొన్న సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేర శిక్షాస్మృతి(గుర్తింపు) బిల్లుకు సహజం గానే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ బిల్లు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను బేఖాతరు చేస్తున్నదని విపక్షాలు ఆరోపించడంతో బిల్లు ప్రవేశానికి ఓటింగ్‌ నిర్వహించాల్సివచ్చింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది గనుక బిల్లు సభాప్రవేశం చేసింది.

సమాజంలో నేరాలు పెరుగుతూ పోవడం, నేరగాళ్లు తప్పించుకు తిరగడం ఆందోళనకరమే. అందులో సందేహం లేదు. దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు కఠిన చట్టాలు అవసరమే కావొచ్చు. కానీ తగిన చట్టాలు లేకనే పరిస్థితులు దిగజారుతున్నాయని ఎవరైనా భావిస్తే పొరపాటు. దర్యాప్తు విభాగాల పని తీరు నాసిరకంగా ఉండటం, ఆ విభాగాలపై రాజకీయ పరమైన ఒత్తిళ్లుండటం అందుకు కారణాలు. మరోపక్క చట్టాల ప్రకటిత లక్ష్యాలను గాలికొదిలి ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు.

నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడానికి, సత్వరం నేరాల గుట్టు వెలికితీయడానికి తాజా బిల్లులో నిబంధనలు రూపొందించామని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే అమల్లో ఉన్న 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చే బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చట్టసభల్లో ప్రభుత్వాలు చేసే గంభీరమైన ఉపన్యాసాలకూ, ఆ బిల్లుల్లో పొందుపరిచే వాస్తవాంశాలకూ తరచుగా సంబంధం ఉండదు. చట్టాలు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నా మని ప్రతిసారీ ప్రభుత్వాలు చెబుతాయి.

ఈ విషయంలో ఈ దేశ పౌరులకు కావలసినంత అనుభవం ఉంది. ఇందిరాగాంధీ హయాంలో 1980లో వచ్చిన జాతీయ భద్రతా చట్టం(నాసా), 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం(టాడా), 2002లో వాజపేయి హయాంలో ఎన్‌డీఏ సర్కారు తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం(పోటా) ఇందుకు ఉదాహరణలు. టాడా దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు రావడంతో దాన్ని పునరుద్ధరించరాదని 1995లో అప్పటి పీవీ ప్రభుత్వం నిర్ణయించింది.

2004లో యూపీఏ సర్కారు పోటా చట్టాన్ని రద్దు చేసింది. వీటిన్నిటికన్నా ముందే 1967లో ఇందిర ప్రభుత్వం తీసు కొచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) 2012లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో మరింత పదును తేలి ప్రస్తుతం అమలవుతోంది. ఈ చట్టాలన్నీ నేరగాళ్లని భావించినవారిని దీర్ఘకాలం జైళ్లలో ఉంచేందుకు తోడ్పడ్డాయి.

వేలాదిమంది అమాయకులు జైళ్ల పాలయ్యారని విమర్శలు వెల్లువెత్తగా, కఠినశిక్షల మాట అటుంచి అత్యధిక కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. రాజకీయ అసమ్మతిని అణచి వేసేందుకూ, ప్రజలను భయపెట్టేందుకూ ప్రభుత్వాలు ఈ చట్టాలు తెస్తున్నాయని బిల్లులపై చర్చ జరిగినప్పుడల్లా విపక్షాలు విమర్శించేవి. 1967లో యూఏపీఏపై వాజపేయి విమర్శ ఇక్కడ ప్రస్తావనార్హం. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన గుప్పెడుమంది ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. భీమా కోరెగావ్‌ కేసులో అదే చట్టంకింద అరెస్టయి మూడేళ్లుగా జైళ్లలో మగ్గు తున్న మేధావులు, రచయితల పరిస్థితి చూస్తే చట్టాల అమలు ఎలా ఉంటున్నదో అర్థమవుతుంది.

నేర శిక్షాస్మృతి బిల్లు చట్టమైతే శిక్షపడిన ఖైదీలనుంచి మాత్రమేకాక అరెస్టయినవారి నుంచి, ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నవారి నుంచి, ‘ఇతరుల నుంచి’ భౌతిక, జీవసంబంధ నమూ నాలు సేకరించవచ్చు. ‘ఇతరుల’ కింద ఎవరినైనా చేర్చవచ్చు. అంటే లాకప్‌లోకి వెళ్లాల్సివచ్చిన ప్రతి ఒక్కరి నుంచీ నమూనాలు సేకరించే అధికారం ప్రభుత్వాలకు దఖలు పడుతుంది. ఈ ‘నమూనాల’ పరిధిలోకొచ్చేవి ఏమిటన్న వివరణ లేదు. ప్రస్తుత చట్టంలో వేలి ముద్రలు, కాలి ముద్రలు మాత్రమే తీసుకోవచ్చు.

ఆ నిబంధన కూడా శిక్ష పడినవారికే వర్తిస్తుంది. జీవసంబంధ నమూనాలంటే రక్తం, జుట్టు, డీఎన్‌ఏ, ఐరిస్‌ వగైరాలు ఏమైనా ఉండొచ్చు. పైగా ఈ సేకరణకు ప్రస్తుతం మేజిస్ట్రేట్‌ అనుమతి అవసరం అవుతుండగా... తాజా బిల్లు చట్టమైతే రాష్ట్ర ప్రభుత్వాధి కారి అనుమతి సరిపోతుంది. ఏం సేకరించాలో హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి అధికారి నిర్ణయిస్తారు. సేకరణను ప్రతిఘటిస్తే మూడునెలల జైలుశిక్షను ప్రతిపాదించారు. న్యాయవ్యవస్థ అదుపూ, అజ మాయిషీ ఉన్న చట్టాలే దుర్వినియోగమవుతున్న ఉదంతాలు కోకొల్లలుగా కనబడుతుండగా... ఆమాత్రం రక్షణ కూడా లేని చట్టాలు చివరకు ఎటు దారితీస్తాయో సులభంగా గ్రహించవచ్చు.

పైగా సేకరించిన నమూనాలు దుర్వినియోగం కావన్న గ్యారెంటీ ఏమీ లేదు. అసలు మైనర్ల నుంచి ఇలా సేకరించవచ్చునా అన్న వివరణ లేదు. మన దేశంలో డేటా పరిరక్షణ గాల్లో దీపంగా ఉన్న వర్త మానంలో సేకరించిన నమూనాలు దారి తప్పితే? జవాబుదారీతనం నిర్ణయించకుండా, బాధ్యులకు శిక్షేమిటో చెప్పకుండా వదిలేస్తే పౌరుల గోప్యత ఏం కావాలి? వారికి లభించే ఉపశమన  మేమిటి? నేరాలను అరికట్టాల్సిందే. సమాజంలో అశాంతి సృష్టించే శక్తుల ఆటకట్టాల్సిందే. కానీ ఆ పేరు మీద తీసుకొచ్చే చట్టాల్లో స్పష్టత లోపిస్తే, ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేకుంటే అది అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు శరాఘాతమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement