Criminal procedure code
-
Indonesia: వివాహానికి ముందే శృంగారమా? అయితే..
జకార్తా: చాలా దేశాల్లో డేటింగ్, పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం లాంటి వ్యవహారాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే.. ఇస్లాం దేశమైన ఇండోనేషియా.. అలాంటివి సహించడం కుదరని అంటోంది. వివాహానికి ముందే శృంగారాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్‌ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటే శిక్షించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్‌ను త్వరలో జరగోబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుందట. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నా.. లేకుంటే వివాహేతర సంబంధం కొనసాగించినా?.. ఏడాదిపాటు కారాగార శిక్ష విధించాలని, అదే విధంగా జరిమానా కూడా విధించాలని సదరు డ్రాఫ్ట్ పేర్కొంది. అయితే.. ఇది అమలు కావాలంటే ఒకటి వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త.. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. అలాగే.. వివాహం కాకముందు శృంగారంలో గనుక పాల్గొంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభం కాకముందు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ఈ డ్రాఫ్ట్ వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ప్రజావ్యతిరేకతతో ఇంతకాలం ఇది అమలుకు నోచుకోలేదు. ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా ఉన్న ఇండోనేషియాలో.. మహిళలను, మైనారిటీలను, ఎల్జీబీటీక్యూలను అణగదొక్కేందుకు వందల సంఖ్యలో నియంత్రణ చట్టాలు అమలు అవుతున్నాయి. ఇక కొత్తగా రాబోయే క్రిమినల్ కోడ్.. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా వర్తించనుంది. అయితే ఇది టూరిజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో తీసుకొచ్చిన నేరస్థుల గుర్తింపు చట్టం స్థానంలో అంతకంటే మించి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బిల్లు తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందింది. నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాదముద్రలు వంటివాటిని భద్రపర్చే అధికారాలను ఇది నేరదర్యాప్తు అధికారులకు దఖలు పర్చింది. ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్సరాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడుతుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. పైగా పార్లమెంటులో ఈ బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చి ఆమోదం పొందిన పద్ధతి మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసు కొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించ డానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. వలస పాలనా బిల్లు కంటే ప్రమాదకరం ఇప్పుడు 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మార్చి నెల చివరలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు ప్రకటిత లక్ష్యం ఏమిటంటే, గత శతాబ్ది కాలం పైగా రూపొం దుతూ వచ్చిన నూతన కొలతలు, గుర్తింపు పద్ధతులను లెక్కలోకి తీసుకోవడం ద్వారా చట్టాన్ని మరింతగా మెరుగుపర్చడమే. ఈ క్రమానికి తుదిరూపం ఇవ్వడానికి, ఈ బిల్లులో వేలి ముద్రలు, పాద ముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు, ఐరిస్, రెటీనా స్కాన్లు, శారీరక, జీవపరమైన నమూనాలు, వాటి విశ్లేషణలు, ప్రవర్తనాప రమైన లక్షణాలతోపాటు సంతకాలు, చేతి రాత లేదా ఇతర పరీక్షలను కూడా పొందుపరుస్తున్నారు. కొలతల జాబితాలో వీటన్నింటినీ చేరుస్తున్నారు. అయితే ఈ బిల్లు ఇంతటితో ఆగిపోలేదు. శరీరం నుంచి ఏ కొలతలు తీసుకోవచ్చు అనే శాస్త్రీయ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని మెరుగుపర్చడంతో సంబంధం లేని మరో మూడు లక్షణాలు కూడా ఈ చట్టంలో మనకు కనిపిస్తాయి. వ్యక్తుల గోప్యతను లెక్కచేయని బిల్లు మొదటిది, ముందస్తు నిర్బంధ చట్టాల కింద నిర్బంధంలోకి తీసు కున్న ప్రజలతో సహా ఏ ఇతర నేరాల కింద అరెస్టు చేసిన ప్రజలకైనా సరే... వర్తించే విధంగా ఇది చట్టాల పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటికైతే భారతదేశంలో అరెస్టు చేసే తమ అధికారాన్ని పోలీసులు దుర్విని యోగం చేయడం, ముందస్తు నిర్బంధ చట్టాలను మరింతంగా దుర్వి నియోగపర్చడం గురించి మనందరికీ బాగా తెలుసు. దురదృష్ట వశాత్తూ, ఈ బిల్లు ఏ తప్పూ చేయని, దోషులుగా నిర్ధారణ కాని వ్యక్తుల గోప్యతను ప్రభుత్వం చేతుల్లో పెడుతోంది. రెండు, ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్స రాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి చనిపోయేంతవరకు అతడి వివరాలు పోలీసుల వద్ద ఉంటా యన్నమాట. ఏదేమైనా ఒక నేరచర్యలో శిక్షకు గురైన వ్యక్తులందరి పట్ల వివక్షారహిత అన్వయం విషయంలో ఈ బిల్లు పరిధులు దాటు తోంది. పైగా వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడు తుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. మూడు, ఈ బిల్లు వ్యక్తిగత డేటాను ఎలాంటి లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీతోనైనా పంచుకునేందుకు, అందజేసేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరోకి అనుమతిస్తోంది. ‘ప్రయోజన పరిమితి’కి చెందిన సూత్రంతో సహా డేటా పరిరక్షణకు చెందిన ఉత్తమ విధానా లన్నింటికీ ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంటోంది. ఉదాహరణకు, డేటా సేకరణ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన డేటాను ఆ పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప మరే ఇతర ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించకూడదు. నేర దర్యాప్తు, నేర విచారణ అనేవి సాధారణంగా అనిశ్చితంగానే ఉంటాయి. అన్ని రకాల నేర విచారణకు వ్యక్తిగత డేటా అవసరం ఉండదు. కొన్ని కేసుల్లో మాత్రమే విభిన్న వ్యక్తిగత డేటాలను కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. పౌరులపై హద్దులు మీరిన నిఘా కాబట్టి, మరోసారి ఈ బిల్లులోని ప్రధాన సమస్య ఏమిటంటే, ఎలాంటి ఆంతరం చూపని దాని స్వభావమే. ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి వ్యక్తిగత డేటా సేకరణ అవసరమైన చోట నేర వర్గీకరణ లను జాగ్రత్తగా వేరుచేసి చూడవలసిన అవసరం తప్పనిసరి. అలా వేరుచేసి చూడకపోతే వ్యక్తిగత డేటా గోప్యతను వంచించినట్లే అవు తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేరçస్థుల రూపాలను కొలిచే టెక్నిక్‌లు గత శతాబ్ద కాలంగా ఏర్పడుతూ వచ్చాయి కాబట్టి నేరస్థులకు సంబంధించిన ప్రకటన, హేతువులను సరిగ్గా నోట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లు విస్మరిస్తున్నది ఏమి టంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం తన పౌరులపై అత్యంత అధికంగా నిఘా పెట్టే అధికారాలను కలిగి ఉంది. కాబట్టే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని అత్యంత కఠి నంగా క్రమబద్ధీకరించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఫొటోగ్రాఫులతో, వేలిముద్రలతోనే చక్కగా నిఘా పెట్టగలుగుతున్నప్పుడు, వాటికి ఇప్పుడు రెటీనా స్కాన్లు, బయోలాజికల్ శాంపిల్స్ (డీఎన్ఏ కూడా దీంట్లో భాగమే), చివరకు ప్రవర్తనాపరమైన లక్షణాలను తీసుకోవడం కూడా చేస్తున్న ప్పుడు ప్రభుత్వానికి ఉండే అధికారం ఇంకా విస్తరిస్తుంది. పైగా అలాంటి డేటా పరిరక్షణ చర్యలు కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో, మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేమిటంటే, డేటా పరిరక్షణ గురించి భారత్ ప్రకటించి అయిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశం డేటా పరిరక్షణ చట్టాన్ని కలిగిలేదు. ఇది చట్టరూపం దాల్చి ఉంటే వ్యక్తిగత డేటా ఉపయోగంలోని పరిమితులను స్పష్టంగా నిర్దేశించి ఉండేది. అలాగే వ్యక్తిగత డేటాను దుర్వినియోగపర్చే విధానాలను నిరోధించడానికి తగిన పరిష్కార యంత్రాంగాలను కూడా ఏర్పర్చి ఉండేది. డేటా పరిరక్షణ చట్టం లేక పోవడం అనేది క్రమబద్ధీకరణ లేని న్యాయ పరిధిని మాత్రమే అందు బాటులో ఉంచుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే, క్రిమినల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ బిల్ వంటి చట్టాల ద్వారా ప్రభుత్వ నిఘా అధికారం ఎలాంటి తనిఖీలు లేకుండా విస్తరిస్తూనే ఉంటుంది. ఇంత తొందర దేనికి? చివరగా, పార్లమెంటులో బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చిన పద్ధతి ఆందోళన కలిగిస్తోంది. ఇది మన ప్రజాస్వామ్యంలో చట్టాల రూప కల్పన విషయంలో పెరుగుతున్న సాధారణ అంశమనే చెప్పాలి. ఈ బిల్లును ముందస్తుగా ప్రజల్లో చర్చకు పెట్టలేదు. ప్రజలు తమ అభి ప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’ విషయంలో బిల్లు సైలెంటుగా ఉండిపోయిందన్న వాస్తవంలోనే ఇది ప్రతిఫలించింది. వాస్తవానికి ప్రభుత్వ నిఘా అధి కార పరిధిని విస్తరించాల్సిన అవసరం గురించి ఇది పేర్కొనాల్సి ఉండింది. ప్రజా చర్చలో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తేవారు. అందుకే ఈ బిల్లును అసలు ప్రజా సంప్రదింపుల్లో భాగం చేశారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ అన్ని కారణాల వల్ల, ఈ కొత్త బిల్లు గురించి తీవ్రమైన ఆందో ళన కలుగుతోంది. మరింత ప్రజాస్వామికమైన, సమ్మిశ్రితమైన ప్రక్రియ ఈ భయాలన్నింటికీ పరిష్కారంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియకు ఎలాంటి ఆస్కారం లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడమే విచారకరం. -గౌతమ్ భాటియా వ్యాసకర్త ఢిల్లీకి చెందిన న్యాయవాది (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జవాబుదారీతనం ఏదీ?
నేరగాళ్లను సత్వరం పట్టుకునేందుకు, నేరాలను సమర్థంగా అరికడుతుందని చెబుతూ మొన్న సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేర శిక్షాస్మృతి(గుర్తింపు) బిల్లుకు సహజం గానే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ బిల్లు రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను బేఖాతరు చేస్తున్నదని విపక్షాలు ఆరోపించడంతో బిల్లు ప్రవేశానికి ఓటింగ్ నిర్వహించాల్సివచ్చింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది గనుక బిల్లు సభాప్రవేశం చేసింది. సమాజంలో నేరాలు పెరుగుతూ పోవడం, నేరగాళ్లు తప్పించుకు తిరగడం ఆందోళనకరమే. అందులో సందేహం లేదు. దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు కఠిన చట్టాలు అవసరమే కావొచ్చు. కానీ తగిన చట్టాలు లేకనే పరిస్థితులు దిగజారుతున్నాయని ఎవరైనా భావిస్తే పొరపాటు. దర్యాప్తు విభాగాల పని తీరు నాసిరకంగా ఉండటం, ఆ విభాగాలపై రాజకీయ పరమైన ఒత్తిళ్లుండటం అందుకు కారణాలు. మరోపక్క చట్టాల ప్రకటిత లక్ష్యాలను గాలికొదిలి ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడానికి, సత్వరం నేరాల గుట్టు వెలికితీయడానికి తాజా బిల్లులో నిబంధనలు రూపొందించామని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే అమల్లో ఉన్న 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చే బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు చట్టసభల్లో ప్రభుత్వాలు చేసే గంభీరమైన ఉపన్యాసాలకూ, ఆ బిల్లుల్లో పొందుపరిచే వాస్తవాంశాలకూ తరచుగా సంబంధం ఉండదు. చట్టాలు దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నా మని ప్రతిసారీ ప్రభుత్వాలు చెబుతాయి. ఈ విషయంలో ఈ దేశ పౌరులకు కావలసినంత అనుభవం ఉంది. ఇందిరాగాంధీ హయాంలో 1980లో వచ్చిన జాతీయ భద్రతా చట్టం(నాసా), 1985లో రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం(టాడా), 2002లో వాజపేయి హయాంలో ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం(పోటా) ఇందుకు ఉదాహరణలు. టాడా దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు రావడంతో దాన్ని పునరుద్ధరించరాదని 1995లో అప్పటి పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. 2004లో యూపీఏ సర్కారు పోటా చట్టాన్ని రద్దు చేసింది. వీటిన్నిటికన్నా ముందే 1967లో ఇందిర ప్రభుత్వం తీసు కొచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) 2012లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం, ఆ తర్వాత 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో మరింత పదును తేలి ప్రస్తుతం అమలవుతోంది. ఈ చట్టాలన్నీ నేరగాళ్లని భావించినవారిని దీర్ఘకాలం జైళ్లలో ఉంచేందుకు తోడ్పడ్డాయి. వేలాదిమంది అమాయకులు జైళ్ల పాలయ్యారని విమర్శలు వెల్లువెత్తగా, కఠినశిక్షల మాట అటుంచి అత్యధిక కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. రాజకీయ అసమ్మతిని అణచి వేసేందుకూ, ప్రజలను భయపెట్టేందుకూ ప్రభుత్వాలు ఈ చట్టాలు తెస్తున్నాయని బిల్లులపై చర్చ జరిగినప్పుడల్లా విపక్షాలు విమర్శించేవి. 1967లో యూఏపీఏపై వాజపేయి విమర్శ ఇక్కడ ప్రస్తావనార్హం. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన గుప్పెడుమంది ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని ఆయన విమర్శించారు. భీమా కోరెగావ్ కేసులో అదే చట్టంకింద అరెస్టయి మూడేళ్లుగా జైళ్లలో మగ్గు తున్న మేధావులు, రచయితల పరిస్థితి చూస్తే చట్టాల అమలు ఎలా ఉంటున్నదో అర్థమవుతుంది. నేర శిక్షాస్మృతి బిల్లు చట్టమైతే శిక్షపడిన ఖైదీలనుంచి మాత్రమేకాక అరెస్టయినవారి నుంచి, ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నవారి నుంచి, ‘ఇతరుల నుంచి’ భౌతిక, జీవసంబంధ నమూ నాలు సేకరించవచ్చు. ‘ఇతరుల’ కింద ఎవరినైనా చేర్చవచ్చు. అంటే లాకప్‌లోకి వెళ్లాల్సివచ్చిన ప్రతి ఒక్కరి నుంచీ నమూనాలు సేకరించే అధికారం ప్రభుత్వాలకు దఖలు పడుతుంది. ఈ ‘నమూనాల’ పరిధిలోకొచ్చేవి ఏమిటన్న వివరణ లేదు. ప్రస్తుత చట్టంలో వేలి ముద్రలు, కాలి ముద్రలు మాత్రమే తీసుకోవచ్చు. ఆ నిబంధన కూడా శిక్ష పడినవారికే వర్తిస్తుంది. జీవసంబంధ నమూనాలంటే రక్తం, జుట్టు, డీఎన్ఏ, ఐరిస్ వగైరాలు ఏమైనా ఉండొచ్చు. పైగా ఈ సేకరణకు ప్రస్తుతం మేజిస్ట్రేట్ అనుమతి అవసరం అవుతుండగా... తాజా బిల్లు చట్టమైతే రాష్ట్ర ప్రభుత్వాధి కారి అనుమతి సరిపోతుంది. ఏం సేకరించాలో హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి నిర్ణయిస్తారు. సేకరణను ప్రతిఘటిస్తే మూడునెలల జైలుశిక్షను ప్రతిపాదించారు. న్యాయవ్యవస్థ అదుపూ, అజ మాయిషీ ఉన్న చట్టాలే దుర్వినియోగమవుతున్న ఉదంతాలు కోకొల్లలుగా కనబడుతుండగా... ఆమాత్రం రక్షణ కూడా లేని చట్టాలు చివరకు ఎటు దారితీస్తాయో సులభంగా గ్రహించవచ్చు. పైగా సేకరించిన నమూనాలు దుర్వినియోగం కావన్న గ్యారెంటీ ఏమీ లేదు. అసలు మైనర్ల నుంచి ఇలా సేకరించవచ్చునా అన్న వివరణ లేదు. మన దేశంలో డేటా పరిరక్షణ గాల్లో దీపంగా ఉన్న వర్త మానంలో సేకరించిన నమూనాలు దారి తప్పితే? జవాబుదారీతనం నిర్ణయించకుండా, బాధ్యులకు శిక్షేమిటో చెప్పకుండా వదిలేస్తే పౌరుల గోప్యత ఏం కావాలి? వారికి లభించే ఉపశమన మేమిటి? నేరాలను అరికట్టాల్సిందే. సమాజంలో అశాంతి సృష్టించే శక్తుల ఆటకట్టాల్సిందే. కానీ ఆ పేరు మీద తీసుకొచ్చే చట్టాల్లో స్పష్టత లోపిస్తే, ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేకుంటే అది అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు శరాఘాతమవుతుంది. -
సెక్షన్ 164: అక్కడ చెబితే... అంతా నిజమేనా?
కొద్ది రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాలలో పనికట్టుకొని సెక్షన్ 164, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 మీద విస్తృత చర్చలు నడుపుతున్నారు. ప్రజలలో తప్పుడు అపోహలు కలిగిస్తూ రాజకీయ దురుద్దేశంతో కొందరి వ్యక్తిత్వ హననం చేయడానికి పాటుపడుతున్నారు. సెక్షన్ 164(1) అనేది నేర ఒప్పుదల, రికార్డు చేసే ప్రక్రియ: ఈ ప్రక్రియలో, జుడిషియల్ మేజిస్ట్రేట్ తన పరిధిలో ఉన్న లేక తన పరిధిలో లేని నిందితుడిని దర్యాప్తు అధికారి అభ్యర్థన మేరకు, నేర ఒప్పుకోలు, ఇతర కథనాలను రికార్డు చేస్తారు. దీనిని రికార్డు చేసేటపుడు, మేజిస్ట్రేట్, నిందితుడిని సవివరంగా నేరం ఒప్పుకోవాల్సిన ఆగత్యం లేదని, తాను ఇస్తున్న ప్రకటన అతడికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని లె లుపుతారు. ఆ మేరకు మేజిస్ట్రేట్ తన సంతకంతో స్టేట్మెంట్ను ముగిస్తారు. అయితే, కొన్ని మీడియాలలో వస్తున్న కథనాలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. సెక్షన్ 164లో పేర్కొన్నది అంతా వాస్తవ మని, దీనిని కోర్టులు వాస్తవ సాక్ష్యంగా పరిగణిస్తాయని చెబుతూ కావాలని కొందరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి, అత్యధిక కేసుల్లో 164 స్టేట్మెంట్లో పేర్కొన్నది నిజం కాదని, వాస్తవాలకు దూరంగా ఉంటుందని, కేసును తప్పుదారి పట్టించడానికి ఇచ్చినదిగా కూడా రుజువైంది. దీనికి ఉదాహరణ– ఆయేషా మీరా కేసులో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత, ముద్దాయి సత్యంబాబు తాను చెల్లి పెండ్లి కోసం ఆర్థిక సహాయం పొంది తప్పుడు నేరం ఒప్పుకోలు ఇచ్చినట్లు గౌరవ హైకోర్టు అప్పీలులో మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రుజువై, సత్యంబాబు నిర్దోషిగా బయటకి వచ్చారు. కాబట్టి, నిందితుడు అబద్ధాలు, అవాస్తవాలను రికార్డు చేసే అవకాశాలుంటాయి. సెషన్స్ కోర్టుల్లో రుజువైంది. సెక్షన్ 164 స్టేట్మెంట్ని కోర్టులలో తారుమారు కాని, మార్పు/ సవరణకు వీలు లేని సాక్ష్యంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నో కేసులలో అప్రూవర్‌గా మారిన నిందితుడి స్టేట్మెంట్ సత్య నిరూపణకు విరుద్ధంగా ఉంటున్నాయి. సెక్షన్ 164(1) అనేది స్వచ్ఛందంగా నిందితుడి నేర ఒప్పుకోలు లేదా అప్రూవర్‌గా మారిన నిందితుడు, మేజిస్ట్రేట్ ముందు ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా, పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇచ్చే స్టేట్మెంట్, ఇది పూర్తి వాస్తవ సాక్ష్యం అయిపోదు. అంతేకాని, మీడియా మాధ్యమాల్లో ఇటువంటి క్రిమినల్ ట్రయల్ చేయడం చట్టపరంగా నేరం. పైగా సమాజానికి చాలా ప్రమాదకరం. - పొనకా జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి -
క్రైమ్ మాన్యువల్ అప్డేట్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ క్రైమ్ మాన్యువల్‌లోని ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(ఎస్వోపీ) అప్డేట్ చేయనుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా ఈ సవరణలు చేపట్టనుంది. ఇందుకోసం సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా నేతృత్వంలో ఓ బృందం గత 10 నెలలుగా పనిచేస్తోందని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్రైమ్ మాన్యువల్‌కు సంబంధించి కొత్త విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కొత్త చట్టాలు రావడం, సైబర్ నేరాలు అధికం కావడం, పలు కేసులకు సంబంధించి విదేశీ విచారణ సంస్థలు సాయం కోరుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సవరణలు చేపడుతున్నామని వెల్లడించారు. -
ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి స్పష్టీకరణ * కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా విచారణ జరగాల్సింది ఇక్కడే * ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీస్స్టేషన్లు ఉండవు సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరంపై తమ వద్ద ఉన్న ఆధారాలతో సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద ఎవరినైనా విచారించే విశేషాధికారాలు ఏసీబీకి ఉన్నాయని మాజీ డీజీపీ, బీజేపీ నేత వి.దినేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించి ఆధారాలుంటే ఆయనకూ నోటీసులివ్వొచ్చన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ ్యంలో దినేష్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. ⇒ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు ఏసీబీ స్టింగ్ ఆపరే షన్ నిర్వహించింది. దీనికి ఆడియో విజువల్ సాక్ష్యాలున్నాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుగుతోంది. ఏసీబీ దర్యాప్తులో నిందితులుగా భావించిన వారెవరికైనా, సీఎంకైనా నోటీసులు జారీచేసే అధికారాన్ని సీఆర్పీసీ కల్పిస్తోంది. దీనికి ఎవరి అనుమతులూ అక్కర్లేదు. ⇒గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పనిచేసే పౌరుడు. రెండు రాష్ట్రాల గవర్నర్‌గా ఆయనకు రెండు ప్రాంతాల ప్రజలూ ముఖ్యమే. పక్షపాతంగా వ్యవహరిస్తారని నేననుకోను. రెండు రాష్ట్రాల వివాదంలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోదు. గవర్నర్‌కే బాధ్యతను అప్పగిస్తుంది. ⇒ కేసీఆర్‌పై ఏపీలో కేసులు నమోదైనా.. ట్యాపింగ్ హైదరాబాద్లోజరిగిందంటున్నప్పుడు విచారణా ఇక్కడే జరగాలి. ఇక్కడ కేసులు పెడితే న్యాయం జరగదని ఏపీ ప్రభుత్వం భావిస్తే గవర్నర్ ఈ అంశాన్ని కోర్టుకే అప్పగిస్తారు. హైదరాబాద్ టీ సర్కార్, పోలీసుల పరిధిలో ఉంది. ఇక్కడ వేరే రాష్ట్రాలకు చెందిన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం సరికాదు. ⇒ సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు నష్టం కలిగించే విధంగా టీ సర్కార్, పోలీసులు వ్యవహరిస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. కానీ మొత్తం శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్లడం అనేది కాదు. కేవలం రాష్ట్రపతి పాలనలో మాత్రమే రాష్ట్ర శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ పర్యవేక్షిస్తారు. -
అరెస్టు ఇక అంత సులువుకాదు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు ‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ)’పై సదస్సు సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కొత్తగా తీసుకువచ్చిన సెక్షన్ 41(ఏ) సవరణతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడం ఇకపై అంత సులువు కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు చెప్పారు. ఈ సవరణ దుర్వినియోగం కాకుండా నిలువరించే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయని న్యాయవాదులకు ఉద్భోదించారు. ‘ఇంపాక్ట్ ఆఫ్ సెక్షన్ 41(ఏ) సీఆర్పీసీ’ అంశంపై న్యాయవాద పరిషత్ ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సును జస్టిస్ శివశంకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరెస్ట్ అనేది న్యాయపరమైన అవసరాల కోసమేననే విషయం చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తిని అరెస్టు చేయాల్సి వస్తే సరైన కారణాలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని తెలిపారు. పోలీస్ అధికారి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించాక ఆ వ్యక్తి వల్ల మరో నేరం జరగకుండా నియంత్రించాల్సిన పరిస్థితి ఉంటేనే అరెస్ట్ చేయాలన్నారు. ఏడేళ్లకు మించని శిక్ష పడే కేసుల్లో అరెస్ట్‌కు ముందు తప్పనిసరిగా నోటీసు జారీ చేయాలన్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. ఓ ప్రేమోన్మాది నుంచి కుటుంబ సభ్యులను ర క్షించేందుకు ఒక తండ్రి చేసిన ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందేనన్నారు. అప్పా డెరైక్టర్ డాక్టర్ ఎం.మాలకొండ య్య మాట్లాడుతూ.. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా తొందరపాటుతో అరెస్ట్‌లు చేయవద్దని మాజీ డీజీపీలు అరవిందరావు, హెచ్‌జె దొర ఆనాడే సర్క్యులర్లు జారీచేశారని చెప్పారు. అయితే.. కొన్నిచోట్ల పొరపాట్లు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సదస్సులో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సిటీ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, హరీశ్ తదిరులు పాల్గొన్నారు. -
కేసులు పెట్టారు.. చార్జిషీట్లు మరిచారు..
జనగామ టౌన్, న్యూస్‌లైన్ : హత్యలు.. లైంగికదాడుఉల.. దొంగతనాలు చేసిన నిందితులను పట్టుకుని విచారణ అనంతరం పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్లు కోర్టులో దాఖలు చేస్తారు. ఆ తర్వాతే నిర్ణీత సమయంలో కోర్టుకు చట్టప్రకారం హాజరుపరుస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఐదేళ్లుగా జనగామ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మాత్రం వివిధ కేసుల్లో పట్టుబడ్డ నిందితులకు మాత్రం చార్జీషీట్లు వేయడం లేదు. చట్టం తమ పరిధిలోకి రాదన్న విధం గా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిందితులు ఏళ్ల తరబడి తమ హక్కులను కోల్పోయి ముద్దాయిలుగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం పట్టుకున్న అక్రమ మద్యం, గుడుంబా రవాణా చేసిన నిందితులకు సీఆర్పీసీ-167 క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ప్రకారం 60 రోజుల్లో చార్జీషీట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా చార్జీషీట్లు వేయడం లేద న్న వి ష యం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే, ముద్దాయిలు వారి హక్కులను కొల్పోయి సమాజంలో ఏళ్ల తరబడి నిందితులుగానే ముద్రపడి ఉంటున్నారు. పట్టుబడిన వారిలో విద్యార్హతలు ఉన్న ముద్దాయిలపై కేసులు ఉండడంతో వారు ఉద్యోగాలకు సైతం దూరమవుతున్నారని తెలిసింది. ఇదీ కేసుల పరంపర.. గుడుంబా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం... 2009-10లో 195 కేసులను నమోదు చేసిన పోలీసులు 262 మందిని, 2010-11లో 245 కేసుల్లో 405 మందిని, 2011-12లో 269 కేసుల్లో 422 మందిని, 2012-13లో 272 కేసుల్లో 424 మందిని, 2013-14లో (ఆగస్టు వరకు) 120 కేసుల్లో 192 మందిని అరెస్టు చేశారు. ఇక వైన్స్‌షాపులు, అక్రమ మద్యం సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం.. ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులు ఇలా ఉన్నాయి. 2009-10లో కేవలం ఒకేఒక కేసు నమోదు కాగా అందులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. 2010-11లో 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు.2011-12లో 16 కేసుల్లో 20 మంది, 2012-13లో 43 కేసుల్లో 43 మంది, 2013 ఆగస్టు వరకు 8 కేసుల్లో 9 మంది అరెస్టయ్యూరు. ఐదేళ్లుగా సెక్షన్ 7(ఏ)ఆర్/డబ్ల్యూ/ఈ ఏపీపీ యాక్ట్ -1995 ప్రకారం.. మొత్తం 1081 కేసులకుగాను 1705 మందిని అరెస్టు చేయగా, సెక్షన్ 34(ఏ) ఏపీఈ యాక్ట్, 1968 ప్రకారం 76 కేసుల్లో 83 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా చార్జీషీట్లు వేయకపోవడం గమనార్హం. జాతీయ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోలేకపోయిన అధికారులు నవంబర్ 23న జనగామ కోర్టులో కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు వినియోగించుకోలేకపోయూరు. తరచూ స్టేషన్ అధికారుల బదీలీలు, పలువురి ఉద్యోగ విరమణల వల్లే కేసులను దర్యాప్తు చేయలేకపోయూమని చెబుతుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చట్ట ప్రకారం ముద్దాయిలను కోర్టులో ప్రవేశపెట్టి.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పకుండా వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.